Blogger Widgets

Tuesday, October 30, 2012

అట్ల తదియ

Tuesday, October 30, 2012అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్                                       ముద్దపప్పోయ్ -మూడట్లోయ్

అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు . 
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను.
కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా నామె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను.
కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో  నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో  పెండ్లి జరిగెను.
దీనికి వుద్యాపనము
అట్లతద్దెనాడు నోము నోచుకొని, పగటి వేళ భోజనము చేయక, నీరు త్రాగక, వుపవాసముండి, చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టి, విడిగా పదియట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు, కొంత డబ్బును, నల్లపూసలను, లక్క జోడును పదిమంది ముత్తైదువులకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు, భక్తి తప్పకుండిన ఫలము కలుగును.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers