Blogger Widgets

శనివారం, నవంబర్ 24, 2012

కార్తిక పురాణం 11వ రోజు

శనివారం, నవంబర్ 24, 2012

మంధరుడు - పురాణ మహిమఓ జనక మాహారాజా! ఈ కార్తీక మాస వ్రత మహాత్మ్యం గురించి ఎన్ని ఉదాహరణలు చెప్పినా తనివితీరదు. ఈ మాసములో విష్ణువును అవిసెపూలతో పూజిస్తే చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. విష్ణు పూజ తర్వాత పురాణపఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీనికొక ఇతిహాసము చెప్తాను. శ్రద్ధగా ఆలకించమమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.
పూర్వము కళింగ దేశమున మంధరుడను విప్రుడు ఉండేవాడు. అతను ఇతరుల ఇండ్లలో వంటలు చేస్తూ అక్కడే భోజనము చేస్తూ, మద్యపానీయాలకు అలవాటు పడ్డాడు. అంతే కాక తక్కువ జాతి వారితో స్నేహము వలన స్నాన, జప, దీపారాధన వంటి ఆచారాలను కూడా పాటించక దురాశాపరుడై ఉండెను. అతని భార్య మహా గుణవంతురాలు. శాంతిమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనా పతినే దైవముగా భావించి విసుక్కోక సకల ఉపచారాలను చేస్తూ, పతివ్రతా ధర్మమును పాటించసాగెను.
మంధరుడు ఇతరుల ఇండ్లలో వంటవానిగా పనిచేయుచున్ననూ, ఇల్లు గడవక చిన్న వ్యాపారాన్ని కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా పొట్టగడవక పోవడం వల్ల దొంగతనములు చేస్తూ, దారి కాచి బాటసారులను బాధించి వారి వద్ద ఉన్న డబ్బును, వస్తువులను అపహరించి జీవించసాగెను. ఒక రోజు ఓ బ్రాహ్మణుడు అడవిదారిన పోతున్నప్పుడు అతన్ని భయపెట్టి, కొట్టి అతని దగ్గరున్న డబ్బును లాక్కుంటున్నప్పుడు అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి డబ్బును చూడగానే వారిద్దరినీ చంపి ఆ డబ్బును మూటగట్టుకునెను. అంతలో దగ్గరలో ఉన్న గుహనుండి పులి వొకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకున్ని చంపుటకు ప్రయత్నించగా కిరాతకుడు దానిని చంపెను. కానీ ఆ పులి కూడా అతనిపై పంజా విసరడం వల్ల ఆ దెబ్బలకు చనిపోయెను. ఈ విధంగా ఒకే కాలమున నలుగురూ నాలుగు విధాలుగా మరణించినారు. ఆ నలుగురూ యమలోకములో అనేక శిక్షలు అనుభవిస్తూ, రక్తము గ్రక్కుచూ బాధపడుచుండిరి.
మంధరుడు చనిపోయిన దగ్గర నుండి అతని భార్య నిత్యమూ హరినామస్మరణ చేస్తూ భర్తను తలచుకొని దు:ఖించుచూ కాలము గడుపుచుండెను. కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆర్ఘ్యపాద్యాదులచే పూజించి 'స్వామీ! నేను దీనురాలను. నాకు భర్తగానీ, సంతతి గానీ లేరు. నేను సదా హరినామస్మరణ చేస్తూ జీవిస్తున్న దాన్ని. కాబట్టి నాకు మోక్షమార్గాన్ని ఉపదేశించమని ప్రార్థించెను.'
ఆమె వినయానికి, ఆచారానికి ఆ ఋషి సంతోషించి 'అమ్మా ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైన రోజు. ఈ రోజు వృధాగా పాడుచేసుకొనవద్దు. ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు. నేను నూనె తీసుకువస్తాను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రమ్మని చెప్పెను. దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు పొందవచ్చని చెప్పగానే ఆమె సంతోషముతో వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రము చేసి, గోమమయముచే అలికి ముగ్గులు పెట్టి, తానే స్వయంగా రెండు వత్తులను చేసి, ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారికల్లా ఆ రోజు రాత్రి ఆలయం దగ్గర జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను.
ఆమె కూడా ఆ రాత్రంతయూ పురాణము వినెను. ఆ రోజు నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచూ కొంతకాలానికి మరణించెను. ఆమె పుణ్యాత్మురాలు అగుటవల్ల విష్ణు దూతలు వచ్చి ఆమెను విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో కలిసి ఉండడం వల్ల కొంత దోషం వల్ల మార్గ మధ్యమమున యమలోకమునకు తీసుకొని పోయిరి. అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతున్న తన భర్తను చూసి 'ఓ విష్ణుదూతలారా! నా భర్తా, మరి ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. కాబట్టి నా యందు దయతలచి వారిని కాపడమని' వేడుకొనెను.
అంత విష్ణుదూతలు 'అమ్మా నీ భర్త బ్రాహ్మణుడైనప్పటికీ స్నాన, సంధ్యావందనాలు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే స్నేహితుడ్ని చంపి డబ్బు కాజేసెను. ఇక మూడవవాడు పులి. నాల్గవ వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై పుట్టినా అనేక అత్యాచారాలు చేసి, ద్వాదశి రోజున కూడా తైల లేపనము, మద్యమాంస భక్షణ చేసినాడు కావున పాపాత్ముడైనాడు. అందుకే ఈ నలుగురూ నరక బాధలు అనుభవిస్తున్నారని వారి చరిత్రలు చెప్పెను.'
అందుకామె చాలా విచారించి 'ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురుని కూడా రక్షించమని ప్రార్థించగా, అందుకు విష్ణు దూతలు అమ్మా కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును పులికి, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము విప్రునకు, ధారపోసినచో నీ భర్తతో పాటు వారికీ మోక్షము కలుగుతుందని చెప్పగా ఆమె అలానే ధారపోసెను. ఆ నలుగురూ ఆమె దగ్గరకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి'. కాబట్టి 'ఓ రాజా! కార్తీక మాసములో పురాణము వినుట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలమును పొందవచ్చునో తెలుసుకున్నావు' కదా అంటూ వశిష్ఠులవారు ఇలా చెప్పసాగిరి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)