Blogger Widgets

బుధవారం, నవంబర్ 28, 2012

కార్తీక పురాణం 15వ రోజు

బుధవారం, నవంబర్ 28, 2012


దీప ప్రజల్వనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో మనిషి రూపము పొందుట. అంత జనకమహారాజుతో వశిష్ఠ మహాముని - జనకా! కార్తీక మహాత్య్మను గురించి ఎంత చెప్పినా పూర్తి కాదు. కానీ ఇంకొక ఇతిహాసము చెప్తాను చక్కగా వినమనెను.
ఈ మాసములో హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవుల వద్ద దీపారాధన చేయుట, పురాణమును చదువుట, వినుట, సాయంత్రము దేవతా దర్శనములు చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమున బడి కొట్టుమిట్టాడుదురు. కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగుతుంది. శ్రీమన్నారాయణుని గంధముతో, పుష్పాలతో, అక్షతలతో పూజించి దూప, దీప నైవేధ్యాలను సమర్పిస్తే విశేష ఫలము పొందగలరు. ఈవిధంగా నెల రోజులు విడవక చేసినవారికి దేవదుందుభులు మోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీక శుద్ధ త్రయోదశి, చత్రుర్థశి, పూర్ణిమ రోజులలోనానై నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపారాధన చేయవలెను.
ఈ కార్తీక మాసములో ఆవుపాలు పితికినంత సేపు దీపం వెలిగేలా ఉంచితే మరు జన్మలో బ్రాహ్మణుడుగా జన్మించుదురు. ఇతరులు వెలిగించిన దీపాలను సరిగ్గా ఉంచినా, లేక ఆరిపోయిన దీపాలను వెలిగించినా అట్టి వారి సమస్త పాపములు తొలిగిపోవును. దీనికి ఒక కథ కలదు. శ్రద్ధగా వినమని వశిష్ఠులవారు ఇలా చెప్పసాగెను. సరస్వతీ నదీతీరమున శిథిలమైన దేవాలయం ఒకటి ఉంది. కర్మనిష్ఠుడనే దయగల యోగిపుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయూ అక్కడే ఉంటూ పురాణం చదవాలనే కోరికతో ఆ పాడుబడిన దేవాలయమును శుభ్రముగా చిమ్మి, నీళ్ళతో కడిగి, బొట్లు పెట్టి, ప్రక్క గ్రామానికి వెళ్ళి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులు వేసి, పన్నెండు దీపాలను వెలిగించి స్వామిని పూజిస్తూ, పురాణాన్ని చదువుతుండెను. ఈ విధంగా కార్తీక మాసము ప్రారంభం నుండి చేయసాగెను. ఒక రోజున ఒక ఎలుక ఆ దేవలయములో ప్రవేశించి, నలుమూలలా వెతికి, తినడానికి ఏమీ దొరక్కపోవడంతో అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని నోట కరచుకొని పక్కనున్న దీపము వద్ద ఆగెను. నోట్లో ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరోపోయిన వత్తి ఈ ఎలుక వల్ల వెలగడంతో దాని పాపాలు నశించి పుణ్యం కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపంలో నిలబడెను. ధ్యాన నిష్ఠలో ఉన్న యోగి పుంగవుడు, తన కన్నులు తెరచి చూడగా, పక్కనే ఉన్న మనిషిని చూసి ఓయీ! నీవు ఎవ్వరవు? ఎందుకు నిలబడ్డావు? అని ప్రశ్నించగా 'ఆర్యా! నేను మూషికమును. రాత్రి నేను ఆహారం కోసం ఈ దేవాలయములోకి ప్రవేశించగా ఇక్కడ కూడా ఏమీ తినడానికి దొరకనందున నెయ్యి వాసనలతో ఉండి ఆరిపోయిన వత్తిని తినాలన్న కోరికతో దాన్ని నోట కరచి పక్కనున్న దీపం చెంత నిలబడి ఉండగా, అదృష్టముకొద్దీ ఈ వద్ది వెలుగటచే నా పాపాలు నశించి పూర్వ జన్మమెత్తాను. కానీ ఓ మహానుభావా! నేను ఎందుకీ ఎలుక రూపంలో పుట్టాను - దానికి గల కారణమేమిటో వివరించమని' కోరెను.  అంత యోగీశ్వరుడు ఆశ్చర్యంతో తన దివ్యదృష్టిచే మొత్తం తెలుసుకుని 'ఓయీ! కిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచేవారు. నీవు జైనమతవంశానికి చెందిన వాడవు. నీవు కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయం చేస్తూ, డబ్బుమీద ఆశతో దేవ పూజలు, నిత్యకర్మలు మరచి, చెడు స్నేహాల వల్ల నిషిద్ధాన్నము తింటూ, మంచివాళ్ళను, యోగ్యులను నిందిస్తూ పరుల చెంత స్వార్త చింతన కలవాడవై ఆడపిల్లలను అమ్ముతూ దాని వల్ల సంపాదించిన సొమ్మును దాస్తూ, అన్ని ఆహారాపదార్థాలను తక్కువ ఖరీదుకు కొని తిరిగి వాటిని ఎక్కువ ధరకు అమ్ముతూ అలా సంపాదించిన డబ్బుతో నీవు తినక, ఇతరులకు ఇవ్వక ఆ ధనమును భూ స్థాపితము చేసి పిసినారివై బ్రతికావు. నీవు చనిపోయిన తర్వాత ఎలుక రూపంలో పుట్టి వెనుకటి జన్మ పాపాలను అనుభవిస్తున్నావు. నేడు భగవంతుని వద్ద ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందుకు పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు పూర్వజన్మ రూపాన్ని పొందావు. కాబట్టి నీవు నీ గ్రామానికి పోయి నీ పెరట్లో దాచిపెట్టిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతునిని పూజించి మోక్షమును పొందుము' అని నీతిబోధ చేసి పంపించెను.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)