Blogger Widgets

Saturday, November 17, 2012

కార్తీక పురాణము 4వ రోజు

Saturday, November 17, 2012వనభోజన మహిమ
ఓ జనకమహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలమునందు గాని, విష్ణ్వాలయము నందుగానీ శ్రీ భగవద్గీత గీతా పారాయణం తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి స్వర పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండివున్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యధోచితముగా పూచింజి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలయును. వీలునుబట్టి పురాణ కాలక్షేపము చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్టులువారు చెప్పిరి.
అది విని జనకరాజు మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకునికి నీచజన్మేల కలిగెను? దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా, వశిష్టులవారు ఈ విధముగా చెప్పనారంభించిరి.  రాజా! కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేశవర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక అతి గారాబముగా పెరుగుటవ వలన నీచసహవాసములు చేసి దురాచారపరుడై పెరుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, 'బిడ్డా! నీ దురాచారములకు అంతలేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచూ నేను నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుము' అని బోధించెను.
అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట ఒంటి మురికి పోవటకే కానీ వేరు కాదు! స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్థముతో పెడసరిగా సమాధానమిచ్చెను.  కుమారుని సమాధానము వుని తండ్రి 'ఓరి నీచుడా! కార్తీక ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు ఎలుక రూపములో బ్రతికెదువు గాక' అని కుమారునిని శపించెను.  ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై, భయపడి తండ్రి పాదములపై పడి 'తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాందకారములో పడి దైవమును, దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనము ఎపుడు, ఏ విధంగా కలుగునో తెలుపుమని' ప్రాధేయపడెను. అంతట తండ్రి 'బిడ్డా! నా శాపమును అనుభవించుచూ మూషికమువై పడివుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తినొందుదువు' అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికిపోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచూ, ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండెడివారు.  ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీ నదీ స్నానార్థం బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొఱ్ఱలో నివసించుచున్న మూషికము తినేందుకు ఏమైనా వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కి యుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు. వీరివద్ద ఉన్న ధనము, అపహరించవచ్చుననే తలంపుతో వారి వద్దకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి 'మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సుకు చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన, వివరింపుడు' అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు 'ఓయీ కిరాతకమా! మేము కావేరీ నదీ స్నానముకై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుని శ్రద్ధగా వినమని' చెప్పిరి.  అటుల కిరాతకుడు కార్తీకమహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము గుర్తుకు వచ్చినది. పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను.అటులనే ఆహారమునకై చెట్టు మొదల దాగివుండి పురాణమంతయూ విన్న ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపముపొంది 'మునివర్యా! ధన్యోస్మి. తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని' అని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలయును.

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers