Blogger Widgets

మంగళవారం, నవంబర్ 20, 2012

కార్తీక పురాణము 7వ రోజు

మంగళవారం, నవంబర్ 20, 2012


శ్రీ హరినామస్మరణ సర్వపలప్రదము:
వశిష్ఠుడు చెప్పిన విషయాలను విని 'మహానుభావా! మీరు చెప్పిన ధర్మములను శ్రద్ధగా విన్నాను. అందు ధర్మము బహు చిన్నదైనా పుణ్యము అధికంగా కలుగుతుంది. అదీ నదీ స్నానము, దీపదానము, పండుదానం, అన్నదానం, వస్త్రదానము వలన కలుగుతుందని చెబుతున్నారు. ఇట్టి చిన్న చిన్న ధర్మములవలన మోక్షము లభిస్తుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు నిర్వహిస్తే గానీ పాపములు తొలగవని మీవంటి శ్రేష్టులే చెప్పెను కదా. మరి మీరు ఇది సూక్ష్మములో మోక్షముగా చెబుతున్నందుకు నాకు ఎంతో ఆశ్చర్యము కలుగుతుంది. దుర్మార్గులు కొందరు ఆచారాలను పాటించక, వర్ణ సంకరులై మహా పాపములను చేసివారు ఇంత తేలికగా మోక్షాన్ని పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిదికాదా! కావున దీని మర్మమును తెలిపమని కోరెను.' వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి జనకమహారాజా! నీవు అడిగిన ప్రశ్న నిజమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అనే ధర్మాలు మూడు రకాలు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున సత్యమను గుణము పుట్టి ఫలమంతయును పరమేశ్వరునికి అర్పించి, మనస్సునందు ధర్మాన్ని పాటించిన ఆ ధర్మము ఎంతో మేలు చేస్తుంది. సాత్విక ధర్మము సమస్త పాపాలను తొలగించి పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖాలను సమకూర్చును.  ఉదాహరణకు తామ్రపర్ణి నది యందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షపు నీరు పడినచో ధగాధగా మెరిసి, ముత్యమగు విధంగా సాత్వికత వహించి, సాత్విక ధర్మాన్ని ఆచరించుచూ గంగా, యమునా, గోదావరి, కృష్ణానదుల పుష్కరాలు మొదలగున్న పుణ్యకాలాలలో దేవాలయాలలో వేదాలు పఠించి, సదాచారపరుడైన, గృహస్థుడైన బ్రాహ్మణునకు ఎంత చిన్న దానము చేసినా, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయాలలో జపతపాదుల్ని చేసినా విశేష ఫలాన్ని పొందుతారు. రాజస ధర్మమమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త ధర్మాలను వీడి చేసిన ధర్మం పునర్జన్మ హేతువై కష్టసుఖాలను కలిగిస్తుంది. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసో, తెలియకో ఏ చిన్న ధర్మాన్ని చేసినా గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అనగా పెద్ద కట్టెల గుట్టలో చిన్న మంట ఏర్పడినా మొత్తం భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామాన్ని తెలిసిగానీ, తెలియకగానీ తలచినచో వారి సకల పాపాలు పోయి ముక్తి పొందుతారు. దానికి ఓ చిన్న కధ కలదు.
అజామీళుని కథ:
పూర్వ కాలంలో కన్యాకుబ్జమను నగరంలో నాలుగు వేదాలు చదివిన ఓ బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి ఎంతో గుణవంతురాలైన హేమవతి అనే భార్య కలదు. ఆ దంపతులు ఎంతో ఆదర్శంగా నిలిచి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలానికి లేకలేక ఓ కుమారుడు జన్మించాడు. వారు అతడిని ఎంతో గారాభంగా పెంచుతూ అజామీళుడని పేరు పెట్టారు. ఆ బాలుడు పెరుగుతూ అతి గారాభం వల్ల పెద్దల మాటను కూడా వినక, చెడు స్నేహాలు చేస్తూ, చదువును నిర్లక్ష్యము చేసి, బ్రాహ్మణ ధర్మాలను పాటించక తిరుగుచుండెను.  కొంతకాలానికి యవ్వనము రాగా కామాంధుడై, మంచి చెడ్డలు మరచి యజ్ఞోపవీతమును వీడి, మద్యము తాగుచూ, ఒక ఎరుకల జాతి స్త్రీని మోహించి ఆమెతోనే కాపురం చేయుచుండెను. ఇంటికి కూడా పోకుండా ఆమె ఇంటనే భోజనం చేయుచుండెను. అతి గారాభం ఎలా చెడగొట్టిందో వింటివా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగం ఉన్నా చిన్ననాటి నుండి సక్రమంగా పెంచకపోతే ఈ విధంగానే జరుగుతుంది. కాబట్టి అజామీళుడు కులాన్ని వీడడంతో అతని బంధువులు అతడిని విడిచి పెట్టారు.  అందుకు అజామీళుడు కోపంతో వేట వలన పక్షులను, జంతువులను చంపుచూ కిరాతక వృత్తిలో జీవిస్తున్నాడు. ఒకరోజున ఈ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుచూ కాయలను కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనె పట్టును తీసుకోబోతుండగా కొమ్మ విరగడంతో ఆమె చనిపోయింది. అజామీళుడు ఆ స్త్రీపై పడి కొంత సేపు ఏడ్చి, తరువాత అక్కడే ఆమెను దహనం చేసి ఇంటికి వెళ్ళెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఓ కూతురు ఉంది. కొంత కాలానికి ఆ బాలిక పెరిగి పెద్దైనాక కామాంధకారముచే కన్ను మిన్ను కానక అజామీళుడు ఆ బాలికతో కాపురం చేయుచుండెను. వారికి ఇద్దరు కొడుకులు కూడా కలిగారు. ఆ ఇద్దరు పుట్టగానే చనిపోయారు. మరల ఆమె గర్భము ధరించి ఒక కొడుకును కన్నది. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచూ ఒక్క క్షణమైనా విడువక, ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకుని వెళ్తూ, నారాయణ, నారాయణ అని ప్రేమతో పెంచుకుంటున్నారు. కాని నారాయణ అని తలచినంతనే ఎటువంటి పాపాలైనా తొలగి పుణ్యాన్ని పొందవచ్చని వారికి తెలియదు. ఇలా కొంత కాలము జరిగిన తర్వాత అజామీళుడు అనారోగ్యంతో మంచం పట్టి చావుకు సిద్ధంగా ఉండెను.  ఒకనాడు భయంకర రూపాలతో, పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైనారు. వారిని చూచి అజామిళుడు భయంతో కొడుకుపై ఉన్న ప్రేమతో నారాయణా, నారాయణా అంటూ ప్రాణాలను వదిలెను. అజామిళుని నోట నారాయణా అన్న మాట వినగానే యమ భటులు గజగజ వణకసాగిరి.  అదే సమయానికి దివ్యమంగళాకారులు, శంకచక్ర గదాధారులైన శ్రీమన్నారాయణుని భటులు కూడా విమానంలో అక్కడకు వచ్చారు. ఓ యమ భటులారా వీడు మావాడు. మేము ఇతన్ని వైకుంఠమునకు తీసుకువెళ్తాం అని చెప్తూ అజామిళుడుని విమానమెక్కించి తీసుకొని పోవడానికి సిద్ధమవ్వగా, యమదూతలు అయ్యా! మీరు ఎవరు? అతడు దుర్మార్గుడు. ఇతన్ని నరలోకానికి తీసుకువెళ్ళడానికి మేము వచ్చాము. కాబట్టి మాకు వదలమని కోరగా, విష్ణుదూతలు ఇలా చెప్పసాగెను.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)