Blogger Widgets

ఆదివారం, డిసెంబర్ 23, 2012

హిందూ పవిత్రగ్రంధం భగవద్గీత పుట్టినరోజు.

ఆదివారం, డిసెంబర్ 23, 2012


గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు జరుపుకొంటారు.
ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు. ఈ ఉద్గ్రంథం మానవులకు లభించిన వరంగా భావించాలి. సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  
గీతా మహాత్మ్యం గురించి వరాహ పురాణమునందు ఇలా వుంది.
భూదేవి:  విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
విష్ణువు:  ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.  తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయువానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.  ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.  ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.  ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.  నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాసమందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.  గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది. సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.  ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును. గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు. గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.  ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును. ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,వారు ఇంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.  మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును. ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును పొందును. ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు. గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే. అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది. గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు. 
సూతుడు: శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
 ఆధునిక సైన్స్‌ యుగంలో కూడా గీతా సారానికి ప్రాధాన్యత చెక్కుచెదరడంలేదు. సాపేక్ష సిద్ధాంతవేత్త ఆల్బర్డ్‌ ఐన్‌స్టీన్‌ నుంచి అణుబాంబ్‌ రూపకర్త రాబర్ట్‌ఒపెన్‌హైమర్‌ వరకు, ప్రపంచ శాంతిదూత మహాత్మాగాంధీ నుంచి మార్టిన్‌ లూథర్‌కింగ్‌, డాక్టర్‌ అల్బర్ట్‌ స్విగ్జర్‌, హెర్మెన్‌హైసే, రాల్ఫ్‌వాల్డో ఎమర్సెన్‌, ఆల్డస్‌హక్సలీ, రుడోల్స్‌స్టైనర్‌, నికోలాటెల్సా వరకు ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ప్రతిఒక్కరు ఈ భగవద్గీతను ఔపోసన పట్టేశారు. దాన్ని విశ్వసించారు. తమ చర్యలకు, గీతాసారానికి సారూప్యతుందని స్పష్టం చేశారు. 
గీతలో విశిష్టమైన మొదటి శ్లోకం:   గీత మొత్తంలో ధృతరాష్ట్రుడు సంజయునితో చెప్పిన శ్లోకం
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః |
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1||
ధృతరాష్ట్రుడు పలికెను.
 సంజయాయుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకుచేరియున్న నా కుమారులునుపాండవులును ఏమి చేసిరి?

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)