Blogger Widgets

గురువారం, ఏప్రిల్ 25, 2013

హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

గురువారం, ఏప్రిల్ 25, 2013


యత్ర యత్ర రఘునాథకీర్తనం - తత్ర తత్ర స్తుతమస్తకాంజలిమ్

భాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షశాంతకామ్
 శ్రీ ఆంజనేయస్వామివారు! ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు చేస్తూ ఉంటారో అచ్చోట ఆనంద భాష్పాలతో అంజలిఘటిస్తూ! చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్ష మవుతారని భక్తుల ప్రగాఢమైన విశ్వాసం.

అట్టి మూర్తీభవించిన భక్తాగ్రేశ్వరుని "హనుమజ్జయంతి"నాడు శ్రీ స్వామివారికి అష్టోత్తరంతో విశేషపూజలు, శ్రీరామ భజనలు, సుందరకాండ, హనుమాన్ చాలీసా, వంటి పారాయణలు గావించాలి.

శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు.
భారతదేశములో ప్రతీ చోట రామాలయమో లేక ప్రత్యేకించి హనుమంతుని విగ్రహరూపంతో ఆలయము లేకుండా ఉండవు అనుటలో అతిశయోక్తిలేదేమో! అటువంటి శ్రీహనుమంతుని జన్మవృత్తాంత ఏమిటో తెలుసుకుందాం! ఎక్కడెక్కడ రామ సంకీర్తనం జరుగుతూ ఉంటుందో ఆంజనేయస్వామి అక్కడ శిరసాంజలి ఘటించి ఆనంద బాష్పపూరిత నయనాలతో పరవశించి నాట్యం చేస్తూ ఉంటాడంటారు. ఆంజనేయుడు బలానికి ధైర్యానికి, జ్ఞానానికి, సాహసానికి ప్రతిరూపంగా నిలచిన దైవం. శ్రీరాముని బంటుగా రాక్షసులకు , దుర్మార్గుల పాలిట యమునిగా తాను నమ్మిన భక్తులకు కొండంత అండగా నిలుస్తాడని చెబుతారు. సుగ్రీవుని దర్శించడానికి రామలక్ష్మణులు ఋష్యమూక పర్వతం సమీపిస్తున్నప్పుడు తొలిసారిగా వారికంట పడ్డాడు హనుమంతుడు. మరుక్షణంలో శ్రీరాముని హృదయం చూరగొన్నాడు. ఎల్లప్పుడూ  రామనామ సంకీర్తనా పరుడు హనుమంతడు . 
ఒకసారి దేవలోకమందు దేవేంద్రుడు కొలువుతీరి యున్న సమయాన "పుంజికస్థల " అను అప్సరసకాంత బృహస్పతి వద్దకు చేరి హాస్య ప్రసంగము చేయసాగిందట, ఆమె యొక్క హావభావ వికారాలకు బృహస్పతి మిక్కిలి ఆగ్రహించి నీవు భూలోకమందు "వానరస్త్రీ" గా జన్మింతువుగాక! అని శాపము పెట్టినాడు. అంత ఆ పుంజికస్థల తన తప్పిదాన్ని మన్నించి శాపవిమొచనమీయమని పరిపరి విధముల ప్రార్ధించింది. దానికి బృహస్పతి సంతసించి నీవు భూలోకమందు "హనుమంతునికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించెను. ఇది కంబరామాయణ గాధలో గల వృత్తాంతము.  ఆ శాపకారణంగా "పుంజికస్థల" భూలోకమందు వానరకన్యగా జన్మించి "కేసరి" అను అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. అంత ఆమె గర్భముదాల్చి శివాంశ సంభూతుడైన "శ్రీ ఆంజనేయస్వామి" వారికి జన్మ ఇచ్చింది. ఆ బాలుడు శుక్లపక్ష చంద్రునిలా! దిన దిన ప్రవర్ధమానముగా పెరిగి సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏక సంథాగ్రాహియై అచిరకాలములోనే సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అందుకు సూర్యభగవానుడు గురుదక్షిణగా! నీవు "సుగ్రీవుని" వాలి బారి నుండి ఎల్లప్పుడు రక్షిస్తూ ఉండవలసిందిగాకోరెను.అందువల్ల హనుమంతుడు సూర్యభగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడుగా, మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందించసాగెను. 
ఇక రామాయణ గాధలో సీతాన్వేషణ సమయమందు "శ్రీ ఆంజనేయస్వామి" వారి పాత్ర అత్యంత ప్రశంసనీయమైనది. నిరంతరము శ్రీరామపాదారవిందములు కొలుస్తూ "శ్రీరామనామజప" మాధుర్యాన్నిగ్రహించి  స్వామిభక్తి పరాయణుడై   వ్యాకరణం పండితుడుగా, నీతిశాస్త్ర, తత్వశాస్త్ర, వాస్తుశాస్త్ర కోవిదుడుగా, దేశకాల పరిస్థితులకు అనుగుణంగా బుద్ధి పరాక్రమాలు చూపుతూ శ్రీరామ పాదసేవతో వెలుగొందసాగెను. ఈతనిని పవనపుత్ర, కేసరి, వాయునందన, వజ్రకాయ, మారుతి అను పలు నామాలతో కీర్తిస్తూ ఉంటారు.   కారణజన్ముడైన శ్రీ హనుమంతుడు అంతటి శక్తియుక్తులు కలవాడు కాబట్టి, సీతాన్వేషణలో సఫలీకృతుడై రామ-రావణ యుద్ధసమయములో మూర్ఛపోయిన లక్ష్మణుని బ్రతికించుటకు సంజీవని తెచ్చుటవంటి పలుకార్యక్రమములతో హనుమంతుని యొక్క ఆదర్శవంతమైన స్వామిభక్తి, త్యాగనిరతి, ధైర్య సాహసోపేత కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకుని శ్రీరామునిచే "ఆలింగనభాగ్యము" అందుకున్న భాగ్యశీలి అయినాడు. అంతటి మహత్ భాగ్యము మరి ఎవరికి దక్కుతుందో కదా !.హనుమతుని గురించి చెప్పుకుంటూ పోతే మనకు కాలం తెలియదు.    సరే ఇక మన బ్లాగ్ మిత్రులు అందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)