Blogger Widgets

శుక్రవారం, జనవరి 30, 2015

(భీష్మ ఏకాదశి) విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మదినం

శుక్రవారం, జనవరి 30, 2015


ఈరోజు భీష్మ ఏకాదశి.  ఇది ఏకాదశి లలో చాలా విశేషమైన ఏకాదశి.  ఈరోజు భీష్మ పితామహుల నోటినుండి విష్ణు సహస్ర నామము అందరికీ ఉపదేసించబదినది. నేడు విష్ణు సహస్రం పుట్టినరోజు అన్నమాట.  తండ్రి మాటకు తలొగ్గి శ్రీరాముడు ఆదర్శపురుషుడైతే. ఒక మెట్టు ఎక్కువగా తండ్రి సుఖం కోరి సింహాసనాన్ని వదులుకుని ఆజన్మ బ్రహ్మచర్యం పాటించిన మహాపురుషుడు భీష్మాచార్యుడు. అంపశయ్యపై నుండే విష్ణుసహస్రనామ కీర్తన చేసి ఆ స్వామికి ఇష్టమైన మాఘశుద్ధ ఏకాదశిని తన పేరిట భీష్మ  ఏకాదశి గా బహుమానంగా పొందిన గొప్ప పురాణ పురుషుడు. 
అది ద్వాపరయుగం. శోభకృతు నామ సంవత్సరం. మాఘశుద్ధ అష్టమి. ప్రత్యక్ష నారాయణుడు తీక్షణ కిరణాలతో వెలిగిపోతుండగా ఆ మిట్టమధ్యాహ్నం వేళ  శ్రీమహావిష్ణువును నోరారా కీర్తిస్తూ ఆయనలో ఐక్యమైపోయాడు భీష్ముడు. ఆ పురాణ పురుషుడు మరణించిన రోజే.  భీషాష్టమి. మరణించే ముందు కృష్ణుడు ఇచ్చిన వరం ప్రకారం మూడురోజుల తర్వాత వచ్చే ఏకాదశి ఆ కురువృద్ధుని పేరిట భీష్మఏకాదశిగా ప్రసిద్ధి పొందింది. 

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము అత్యంత ప్రాచుర్యము కలిగిన హిందూ ప్రార్థనలలో ఒకటి. పేరును బట్టి ఇది శ్రీమహావిష్ణువు వేయి నామాలను సంకీర్తనం చేసేస్తోత్రము. ఈ స్తోత్రాన్ని చాలామంది హిందువులు భగవంతుని పూజించే కార్యంగా పారాయణం చేస్తూ ఉంటారు.
విష్ణు సహస్ర నామ స్తోత్రము మహాభారతం లోని అనుశాసనిక పర్వం లో 149వ అధ్యాయంలో ఉన్నది. కురుక్షేత్ర యుద్ధానంతరం అంపశయ్య మీద పండుకొని ఉన్న భీష్ముడు ఈ స్తోత్రాన్ని యుధిష్ఠురు నకు ఉపదేశిస్తాడు. ఈ స్తోత్ర పారాయణం సకల వాంఛితార్థ ఫలదాయకమని ఆ విధమైన విశ్వాసం ఉన్నవారి నమ్మకం. స్తోత్రం ఉత్తర పీఠిక (ఫలశ్రుతి)లో ఈ శ్లోకం "ధర్మార్థులకు ధర్మము, అర్థార్థులకు అర్థము, కామార్థులకు కామము, ప్రజార్థులకు ప్రజను ప్రసాదించును" అని చెప్పబడినది.
విష్ణు సహస్రనామ స్తోత్రము ఆవిర్భవించిన పరిస్థితులు ఆసక్తి కరమైనవి. కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన జనక్షయం, కష్టాలవలన పాండవాగ్రజుడు యుధిష్ఠిరుడు కృంగిపోయి ఉన్నాడు. తన వంశోన్నతిని కోరిన భీష్ముడు అంపశయ్యపై మరణానికి సిద్ధంగా ఉన్నాడు. అనితర జ్ఞాననిలయమైన భీష్ముని ఆశ్రయించి ధర్మాన్ని, నీతిని తెలిసికొనమని యుధిష్ఠిరుని వేదవ్యాసుడు, శ్రీకృష్ణుడు ఆదేశించారు. భీష్ముడు కృష్ణునితో "ప్రభూ! జగద్గురువువైన నీయెదుట నేను ఉపదేశము చేయజాలినవాడను కాను. ఆపై క్షతగాత్రుడనైన నా బుద్ధి, శక్తి క్షీణించినవి. క్షమింపుడు" అనెను. అప్పుడు శ్రీకృష్ణుడు "భీష్మా! నా ప్రభావము చేత నీ క్లేశములన్నీ ఇపుడే తొలగిపోవును. సమస్త జ్ఞానము నీ బుద్ధికి స్ఫురించును. నీచేత నేను ధర్మోపదేశము చేయించుచున్నాను" అని అనుగ్రహించెను. అలా భీష్ముడు అంపశయ్యపైనుండే యుధిష్ఠిరునకు సమస్త జ్ఞాన, ధర్మములను ఉపదేశించెను.  అలా జ్ఞానబోధను గ్రహించే సమయంలో యుధిష్ఠిరుడు ఆరు ప్రశ్నలను అడిగాడు. ఆ ప్రశ్నల సారాంశము: "దుఃఖముతో కృంగి ఉన్న నాకు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితమును ఇచ్చే ఉపాయమేది? ఎవరిని స్తుతించాలి?" దానికి భీష్ముడు చెప్పిన ఉపాయము: "భక్తితో, శ్రద్ధతో విష్ణువు వేయి నామాలను జపించు. అన్ని దుఃఖములు, కష్టములు, పాపములనుండి విముక్తి పొందడానికి ఇదే సులభమైన మార్గము". అలా భీష్ముడు ఉపదేశించినదే విష్ణు సహస్రనామ స్తోత్రము.
విష్ణు సహస్రనామ స్తోత్రపఠనానికి ముందుగా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని పఠించడం చాలామంది పాటించే ఆనవాయితీ. చాలా స్తోత్రాలలో లాగానే విష్ణు సహస్రనామ స్తోత్రంలో వివిధ విభాగాలున్నాయి.

ప్రార్థన

ప్రార్ధన శ్లోకములు, స్తోత్రము ఆవిర్భవించిన సందర్భ వివరణ ఈ పూర్వపీఠికలో ఉన్నాయి. ముందుగా వినాయకునకు, విష్వక్సేనునకు, వ్యాసునకు, ఆపై విష్ణువుకు ప్రణామములతో స్తోత్రము ఆరంభమౌతుంది.

ముఖ్య స్తోత్ర:

అనేక పవిత్ర ధర్మములను విన్న తరువాత ధర్మరాజు భీష్ముని అడిగిన ఆరు ప్రశ్నలు:
  1. కిమ్ ఏకమ్ దైవతం లోకే - లోకంలో ఒక్కడే అయిన దేవుడు ఎవరు?
  2. కిమ్ వాపి ఏకమ్ పరాయణమ్ - జీవితానికి పరమపదమైన గమ్యము ఏది?
  3. స్తువంతః కమ్ ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని స్తుతించుట వలన మానవులకు శుభములు లభించును?
  4. కమ్ అర్చంతః ప్రాప్నుయుః మానవాః శుభమ్ - ఏ దేవుని అర్చించుట వలన మానవునకు శుభములు లభించును?
  5. కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః - మీ అభిప్రాయము ప్రకారము సర్వధర్మములకు ఉత్కృష్టమైన ధర్మమేది?
  6. కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్ - ఏ దేవుని జపించుటవలన జన్మ సంసార బంధనములనుండి ముక్తి లభించును?    అన్న ప్రశ్నలు అడుగగా.....
అందుకు భీష్ముడు చెప్పిన సమాధానం: జగత్ప్రభువును, దేవదేవుని, అనంతుని, పురుషోత్తముని వేయి నామములను నిశ్చలమైన భక్తితో స్తుతిసేయట వలనను, ఆరాధించుట వలనను, ధ్యానించుట వలనను, ప్రణామము చేయుట వలనను సర్వదుఃఖములనుండి విముక్తి పొందవచ్చును. ఆ బ్రహ్మణ్యుని, పుండరీకాక్షుని ఆరాధించుట ఉత్తమ ధర్మము. ఆ దేవదేవుడు పరమ మంగళ ప్రదుడు. సకల సృష్టి-స్థితి-లయ కారకుడు. ఈ వేయి గుణ కీర్తనకరములైన నామములను ఋషులు గానము చేసినారు.
విష్ణు సహస్రనామాలను గురించి పెక్కుభాష్యాలు వెలువడినాయి. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యలు రచించిన భాష్యము వీటిలో ప్రధమము. అద్వైత సిద్ధాంతము ననుసరించే ఈ భాష్యంలో భగవంతుని పరబ్రహ్మ తత్వమునకు, షడ్గుణైశ్వర్యమునకు ఎక్కువ ప్రాదాన్యతనిచ్చి వ్యాఖ్యానించారు. 12వ శతాబ్దంలో పరాశర భట్టు రచించిన భాష్యము భగవద్గుణ దర్పణము అనే గ్రంధం విశిష్టాద్వైతం సిద్ధాంతాలకు అనుగుణంగా సాగుతూ, భక్తుల పట్ల భగవానుని సౌలభ్యాన్నీ, సౌశీల్యాన్నీ, కరుణనూ మరింతగా విపులీకరించినది. తరువాత అనేకులు రచించిన వ్యాఖ్యలకు ఈ రెండు భాష్యాలే మార్గదర్శకాలు.  ఇది మహాభారతమునకు సారము.  విష్ణువు అంశావతారము, వేదవిదుడు అనబడే వేదవ్యాసుడు దీనిని మనకు అందించాడు. ఇది ధర్మములలోకెల్ల ఉత్తమము, సులభము, సకల కర్మబంధ విముక్తి సాధకము అని భీష్ముడు చెప్పాడు. ఈ స్తోత్రపారాయణం దుఃఖములనుహరిస్తుందనీ, శాంతి సంపదలను కలుగజేస్తుందనీ విస్తృతమైన విశ్వాసం
ఈరోజు అందరు ఇళ్ళల్లోను, గుళ్ళలోను విష్ణుసహస్రనామ స్తోత్రం పూజలు  చేస్తున్నారు.  నేడు విష్ణువు గురించి, భీష్ములవారి గురించి , విష్ణుసహస్రము గురించి తెలుసుకున్నాము. మనజన్మ ధన్యము అయినట్టే కదా.  విష్ణుసహస్రనామస్తోత్ర జన్మదిన శుభాకాంక్షలు.
జై శ్రీమన్నారాయణ

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)