Blogger Widgets

Saturday, May 09, 2015

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

Saturday, May 09, 2015

కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తరించిన పరమ భగవత్ భక్తుడు, తోలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.   ఈయన జన్మదినము నేడే.  15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లితండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులకు వారి  తపః ఫలితంగా వేంకటేశుని దివ్య అనుగ్రహం వలన జన్మించినాడు అన్నమయ్య .  క్రీ. శ 1408 వ సంవత్సరం లో మే నెల 9 వ తారీకున జన్మించారు.  మనం తెలుసుకున్న  తెలుగులో మొట్టమొదటి పదాలు అన్నమయ్యవే.  
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డ గోరుముద్దలు తినిపిస్తూ పాడుతున్న పాట 
 " చందమామ రావో జాబిల్లి రావో , మంచి 
    కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో"   
ఆహా ఎంత అద్బుతంగా వుందండి ఈ పాట అంతే కాదు నిదిరించే వేళ  అమ్మ పాడిన జోల పాట 
"జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో"
ఆయన ఏ పాట రాసిన పూర్తిగా అనుభూతి పొంది రాసిన పాటలు లో ఒకటి అన్నమయ్య స్వయంగా అనుభూతి పొందిన పాటలు. చిన్ని కృష్ణుని గురించి ఆలోచిస్తూ మేలుకొలుపు పాట ఒకటి ఇదిగో 

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె 
గోవిందుడయింక మేలుకొనవయ్యా 
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి 
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా || 

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య 
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య || 

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 

ఎంత అద్బుతంగా రాసారండి.  అన్నమయ్య జన్మదినము రోజు ఇంత మంచి పాటను పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది.  అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 

0 comments:

Post a Comment

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers