Blogger Widgets

మంగళవారం, నవంబర్ 24, 2015

చరణములే నమ్మితి

మంగళవారం, నవంబర్ 24, 2015

ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి

చ1: వారధి గట్టిన వర భద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే ||

చ2: ఆదిశేష నన్నరమర చేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

చ3: వనమున రాతిని వనితగ జేసిన
చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే ||

చ4: పాదారవిందమే యాధారమని నేను
పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే ||

చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన
అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

సోమవారం, నవంబర్ 23, 2015

తులసి దామోదరవివాహ శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 23, 2015


కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు.  తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ:
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.
తులసి ని Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). 
తులసీధాత్రీ సమేత దామోదర పూజ చేస్తారు. ఈరోజునే  క్షీరాబ్ది ద్వాదశి  అని కూడా అంటారు.
శ్రీ తులసీ స్త్రోత్ర మ్
జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే

తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

తులసి దామోదరవివాహ శుభాకాంక్షలు.  




శనివారం, నవంబర్ 21, 2015

యాజ్ఞవల్క్య గురుదేవ నమోస్తుతే

శనివారం, నవంబర్ 21, 2015

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.  ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను. యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 

శుక్రవారం, నవంబర్ 20, 2015

ఆంధ్ర జాలరి

శుక్రవారం, నవంబర్ 20, 2015

 జాలరి అంటే పడవ నడిపేవాడు అని అర్ధం.  ఆంద్రా జాలరి అంటే ఆచార్య డి.వై.సంపత్ కుమార్.  ఇదివరకు తెరచాప పడవకు గట్టిగా కట్టి గాలి వాటంతో నీటిమీద ప్రయాణం చేసేవారు లేదా చేపలు పట్టేవారు.   గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడు కట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగే వారు. పాడుతూ లయప్రకారం అడుగులు వేస్తూ పాట  పాడుతూ కష్టం తెలియకుండా పడవను ఒడ్డుకుచేర్చేవారు . 
ఆంధ్రజాలరి గా ప్రఖ్యాతి వహించిన సంపత్కుమార్ జాలరి వేషం ధరించి 

ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్ట టానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు. 
చేపల కోసం గాలిస్తాడు. 
ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది. 
పడవ వూగిపోతూ వుంటుంది. 
జాలరి మెలికలు తిరిగి పోతాడు. 
ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది. 
అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయ వంతంగా ఆనందంతో గంతు లేస్తాడు. 

ప్రదర్శనానికి రంగ స్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపద్య్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహరిస్తాయి. ఈ కళా రూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించింది
పడవ సరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగ స్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు. కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరం కు చెందిన డి.వై.సంపత్ కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు.  జాలరి నృత్యం అద్భుతమైన కళాఖండంగా చెప్పవచ్చు. నేడు  ఆచార్య డి.వై.సంపత్ కుమార్  గారి జయంతి సందర్బంగా జాలరినృత్యము గురించి తెలుసుకున్నాం. 

ఆచార్య డి.వై.సంపత్ కుమార్ ను ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు.  ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద భరతనాట్యం పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం మరియు ఫోక్ నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ నృత్య శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతివృత్తపరంగాను , సాంకేతికపరంగాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అద్భుతమైన కళాఖండమై విరాజిల్లింది.

మంగళవారం, నవంబర్ 17, 2015

కాదన్న వారికి వారికర్మమే సాక్షి

మంగళవారం, నవంబర్ 17, 2015


కాదన్న వారికి వారికర్మమే సాక్షి
యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి

వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై
ఆదటఁ దెచ్చి నిలిపె నది సాక్షి
ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన
పోదితో నీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి

అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్త-
మెదుట విశ్వరూపము యిది సాక్షి
మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు
పొదిగొన్న యాగములే భువిలో సాక్షి

బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు
పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి
యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతడనుటకు
వరమిచ్చే శ్రీవేంకటేశుడే సాక్షి

ఆదివారం, నవంబర్ 15, 2015

పాహిపాహి సర్పరూప

ఆదివారం, నవంబర్ 15, 2015



"కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణంచ రాజర్షి కీర్తనం కలినాశనం"





పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

బుధవారం, నవంబర్ 11, 2015

దీపావళి శుభాకాంక్షలు

బుధవారం, నవంబర్ 11, 2015


దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    

దీపావళి శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 09, 2015

ధనత్రయోదశి శుభాకాంక్షలు.

సోమవారం, నవంబర్ 09, 2015

ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను  మరింత ముఖ్యమైన భావిస్తారు.  ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
 అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు.  ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు.  ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి.  ఈరోజు ధన్వంతరి జయంతి.  ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.




ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి  శుభాకాంక్షలు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)