Blogger Widgets

Tuesday, February 23, 2016

ఉదయాద్రి తెలుపాయె

Tuesday, February 23, 2016

తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.  అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట. 
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | 
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | 
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | 
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | 
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | 
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | 
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | 
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

Sunday, February 14, 2016

భక్తానా మభయప్రదం దినకరం

Sunday, February 14, 2016

సప్తాశ్వ రథ మారూడం
ప్రచండం కశ్యపాత్మజం 
శ్వేత పద్మ ధరం దేవం
తం సూర్యం ప్రణమామ్యహం 

సూర్యభగవానుని ధ్యాన శ్లోకం !
ధాయెత్పూర్యః మనంతకోటి కిరణం
త్రైలోక్య చూడామణి,
భక్తానా మభయప్రదం దినకరం
జ్యోతిర్మయం శంకరమ్,
ఆదిత్యం జగదీశ మచ్యుత మజం
త్రైయార్ధసారం రవిమ్,
భక్తా భీష్ట ఫలప్రదం ద్యుతినిభం
మార్తాండ మధ్యం విభుమ్!!


ఉషోదయ కిరణాలతో సమస్త జీవ కోటినీ నవ చైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్యభగవానుడి జన్మదినమును ధసప్తమి గా జరుపుకుంటాం.  ప్రత్యక్ష భగవానుడు  సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత... అన్న పేర్లున్నవాడు. రాత్రిపగళ్లతో- చీకటివెలుగులను పంచడంలో సిద్ధహస్తుడు. ఆయనే సూర్యుడు. అదితికశ్యపులకు పుట్టిన సూర్యభగవానుడి జన్మదినమే రథసప్తమి.  రధసప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను (ఏడు  గుర్రముల పేర్లు వరుసగా గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్ణుప్, అనుష్ణుప్, పంక్తి )  వంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏడురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు, శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు. ఎముకలకు  బలముగా వుంటాయి.  కేన్సర్ రాకుండా కాపాడతాయి.  ఒకప్పుడు సూర్యరశ్మి సమృద్ధిగా ఉండే భారతదేశంలో.. ప్రజలకు అసలు 'విటమిన్‌-డి' లోపమనేదే ఉండదని భావించేవారు. కానీ నేడది వట్టి అపోహేనని తాజా అధ్యయనాలన్నీ రుజువుచేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో 90% మందికి విటమిన్‌-డి లోపం ఉంది.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.
శుద్ధ సప్తమికి ’రథసప్తమి’ అని పేరు. ఈరోజు ఒక పరిపూర్ణ పర్వం. దీక్షానిర్వహణకి, వ్రతాచరణకి, సాధనాలకు ఈ సప్తమి ప్రసిద్ధి. ఏడాది పొడుగునా సూర్యారాధన చేసిన ఫలం ఈ దినం లభిస్తుంది.
సూర్యునికి రాగి పాత్ర ద్వారా అర్ఘ్యాన్నివ్వడం, ఎర్రచందనం, ఎర్రపువ్వులతో అర్చన చేయడం వంటివి ఈ రోజు ప్రత్యేకతలు.ఆవుపాల పాయసం నివేదించడం, అది కూడా ఆరుబయట సూర్యకిరణాలు పడే తావున ఆవుపేడ పిడకలను మండించి, దానిపై పాయసాన్ని పొంగించడం ఒక చక్కని ప్రక్రియ. వైద్యవిధానం, దేవతా మహిమ కలబోసిన పద్ధతి ఇది.
’రథ’శబ్దం గమనంలోని మార్పుని సూచిస్తుంది. సూర్యకిరణ ప్రసారం భూమికి లభించే తీరులో ఈ రోజునుండి ఒక మలుపు. ఈ మలుపులోని దేవతా ప్రభావాన్ని పొందేందుకు మన సంస్కృతిలో ఈ ఆనవాయితీని ప్రవేశపెట్టారు.
రామాయణంలో రావణవధి సమయంలో శ్రీరాముడు ’ఆదిత్యహృదయం’తో సూర్యోపాసన చేసి విజయం సాధించాడు. భారతంలో ధర్మరాజు ధౌమ్యుని ద్వారా సూర్యాష్టోత్తర శతనామ మంత్రమాలను ఉపదేశం పొంది , ఆదిత్యానుగ్రహంతో అన్న సమృద్ధిని, అక్షయపాత్రని సంపాదించాడు.
శ్రీకృష్ణుని పుత్రుడు సాంబుడు సూర్యోపాసన ద్వారా కుష్టువ్యాధి నుండి విముక్తుడయ్యాడు. చారిత్రకంగా మయూర కవి సూర్యశతక రచనతో ఆరోగ్యవంతుడయ్యాడు.
ఇలా పౌరాణిక చారిత్రకాధారాలు రవికృపా వైభవాన్ని చాటి చెబుతున్నాయి.  ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వున్నాయి.  
సూర్య రశ్మిలో విటమిన్ D ఉంటుంది అది ఎముకల పటుత్వానికి అవసరం అని చెబుతారు. అంతే కాకుండా విటమిన్ D కణ విభజనలో కూడా తోడ్పడుతోంది. దీన వలన గాయాలు మానడమే కాకుండా కాన్సర్ రాకుండా కూడా ఉపయోగం ఉంటుంది. సూర కాంతికి ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారిలో చాలా రకాల కాన్సర్ తక్కువగా వస్తుంది అని డాక్టర్స్ చెబుతారు. ముఖ్యంగా పెద్ద పేగు, మల ద్వారానికి సంబంధించిన కాన్సర్ మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  పన్నెండు భంగిమలతో కూడిన సూర్యనమస్కారాలలో ఒక సంక్షిప్తమైన ప్రాణాయామం, ధ్యానం సమ్మిళితమైన వ్యాయామం ఇమిడి ఉన్నాయి. 

Saturday, February 13, 2016

భారత కోకిల

Saturday, February 13, 2016

భారత కోకిల (నైటింగేల్ ఆఫ్ ఇండియా)గా ప్రసిద్ధి చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు కవయిత్రి అయిన సరోజనీ దేవి జయంతి నేడు. సరోజినీ దేవి 1935 డిసెంబరులో కానుపూరులో జరిగిన అఖిల భారత జాతీయ కాంగ్రెష్ మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు మరియు స్వతంత్ర భారత దేశపు తొలి మహిళా గవర్నర్ కూడా.  ఈమె గొప్ప భారతదేశపు గర్వించదగ్గ మహిళ.  "హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజలతో మమైకం అయ్యింది ఈమె.  స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె హైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. సరోజినీదేవికి అయిదుగురు సోదరులుండేవారు.ఆమె సోదరీ మణులు ముగ్గురు. అందరూ బాగా చదువుకున్నవారే.  1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని, అందరి ప్రశంసలు పొందటంతో, నిజాం నవాబు ఉప్పొంగిపోయి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం.  1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించింది. ఇంగ్లాండు, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా, కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి, ఎందరికో ఆదర్శ మహిళ అయింది. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. ప్రభుత్వానికి ఎదురు తిరిగి తూటా దెబ్బలకో, చీకతి కొట్లకో బలయ్యేబదులు ఈ బానిస బ్రతుకే నయమనుకుని సర్దుకుపొయ్యె అమాయక ప్రజానీకములో ఆమె ఉపన్యాసాలు దేశభక్తిని నూరి పోసి చావుకు కూడా భయపడని తెగింపును తేగలిగాయి. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు జరిగితే దేశనికి జరిగినట్టే, దేశం అనుభవించే బానిసతనం నీవూ అనుభవించవలసినదే" అంటూ దేశమంతా తిరిగి దేశభక్తిని నూరిపోసించా వీరతిలకం. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు.   ఆమె రచించిన కావ్యాలలో "కాలవిహంగం"(Bird of time), "స్వర్గ ద్వారం" (the Golden Threshold) , విరిగిన రెక్కలు(the broken wings) అనేవి చాలా ప్రసిద్ధమైనవి.  19వ శతాబ్దం చివరలో రచించింది Nightfall In The City Of Hyderabad ఇది చదివితే సంధ్యా సమయంలో హైద్రాబాద్ నగరం ఏ విధంగా ఉండేది అని తెలుస్తుంది.  తండ్రి మరణాంతరం రచించిన విషాదకవితలు ఈమెకు కైసర్-ఇ-హిండ్' బంగారు పతాకాన్ని సాధించిపెట్టింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో అతిపెద్ద అప్పటి రాష్ట్రం ఉత్తరప్రదేశకి ఈమె గవర్నరు గా నియమించబడింది. హైదరాబాదులో తాను నివశించిన ఇంటికి తన మొదట కవితాసంకలనం పేరునే స్వర్ణప్రాగణంగా"ఎన్నుకొన్నది.ఈమె 1949 మార్చి 2న లక్నోలో మరణించినది. ఈమె జ్ఞాపకార్థం భారత ప్రభుత్వం 1964 ఫిబ్రవరి 13న ఈమె చిత్రంతో ఒక తపాలబిళ్ళను విడుదల చేసింది.ఈమెపై అభిమానంతో హైదరాబాదులో సికింద్రాబాద్ దగ్గర ఒక వీధికి సరోజినీ దేవి రోడ్డూ' అని నామకరణం చేసారు. ఈమె పేరున హైదరాబాదులో సరోజినీ కంటి ఆసుపత్రీ'ని కూడా స్థాపించారు. ఈవిడగారి విలువైన వస్తువులు ఇప్పటికీ సాలార్ జంగ్ మ్యూజియంలోను, జాతీయ పురావస్తు ప్రదర్శనశాలలోనూ భద్రంగా ఉన్నాయి.

Friday, February 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని '

Friday, February 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము 
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు   ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన  పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర  సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .
స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరం లో గుజరాత్ లోని  ఠంకార అనే గ్రామంలోని  మహాశివభక్తులు అయిన ఒక వర్తక కుటుంబం లో జన్మిచారు.  ఈయన చిన్ననాటి నుండి భగవద్భక్తి ఎక్కువగా  కలిగివున్నాడు.  1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానందఅన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.  ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించాడు.  అలాంటి అధర్మాలను రూపుమాపటానికి ప్రయత్నించారు.  ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు.

My Blog Lovers