Blogger Widgets

మంగళవారం, అక్టోబర్ 30, 2012

అట్ల తదియ

మంగళవారం, అక్టోబర్ 30, 2012



అట్ల తద్దోయ్ - ఆరట్లోయ్                                       ముద్దపప్పోయ్ -మూడట్లోయ్

అట్ల తదియ పండుగ గురుంచి. అట్ల తదియ ఈ పండుగ ప్రతి సవత్సరం ఆశ్విజ బహుళ తదియ రోజు వస్తుంది. ఈ తదియ రోజు తెలవారుజామునే ఆడవారు చిన్న పెద్ద అన్దరూ నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని , గోంగూర పచ్చడి, నువ్వుల పొడి, పులుసు, పెరుగు వేసుకొని తెల్ల వారుజామునే భోజనం చేస్తారు.ఆ తరువాత ఆటలే ఆటలు, చెమ్మచెక్కలు, ఉయ్యాలు అడతారు. అన్నట్టు ముందురోజే చేతుల నిండా గోరింట పెట్టుకుంటారు. తదియ రోజు చాలా సంతోషం గా ఆడుకుంటారు. ఉయ్యాల పోటీలు పెట్టుకుంటారు. పల్లెల్లో చాలా బాగా జరుపుకుంటారు. పొద్దు ఎక్కాగా తల స్నానం చేసి దేవుడుకి దణ్ణం పెట్టుకొని రోజు అంతా ఉపవాసం వుంటారు. సాయంత్రం చంద్రోదయం అయ్యాక స్నానం చేసి పార్వతి దేవికి పూజచేస్తారు. పూజచేసి చంద్రుడిని దర్శించుకుంటారు . 
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక రాచ చిన్నది తోడి చెలికత్తెలతో కలసి అట్ల తద్దె నోమును నోచుటకు వుపవాసముండెను, మూడు జాములు దాటు సరికి రాచ బిడ్డ సుకుమారి యగుటచే శోషవచ్చి పడిపోయెను. అంతట నామె అన్నలు వచ్చి ఆమె అట్లు పడి పోవుటకు కారణమును తల్లి వలన గ్రహించిరి, వారు తమ చెల్లెలు చంద్రుడు వచ్చు వరకు నుండ లేదని అనుకొని ఒక చింతచెట్టు కొమ్మకు అద్దము కట్టి దానికి యెదుట అరికె కుప్పకు అగ్గిని పెట్టి చెల్లిని లేపి "అడుగో చంద్రుడు వచ్చెను. భోజనమును చేయు" మనిరి. అద్దములో నిప్పు చూచి చంద్రుడే వచ్చెననుకొని, ఆమె భోజనము జేసెను.
కొంతకాలమునకు ఆమెకు యుక్త వయస్సు రాగా నామె అన్నలు పెండ్లి సంబంధములను చూచుచుండిరి. ఎన్ని సంబంధములు వెదకినను ముసలి వరుడే దొరకుటచే, కడకు వారు విసిగి తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెండ్లి చేయ నిశ్చయించిరి. ఆ సంగతి తెలసి ఆ రాచబిడ్డ "అయ్యో! అట్లతద్ది నోము నోచిన వారికి పడుచు మగడు దొరుకునని చెప్పిరి, కాని నాకీ ముసలి మగడేల దాపరించుచున్నాడు!" అని విచారించి, వృద్ధ భర్తను వివాహమాడుట కంగీకరింప లేదు. అన్నలామెనెంతో బలవంతపెట్టి వివాహమును జేయనెంచిరి. కాని ఆమె యందులకు సమ్మతింపక, ఒక నాటి రాత్రి అడివికి పోయి ఒక మర్రిచెట్టు క్రింద తపస్సు చేయుచుండెను.
కొంత కాలమునకు పార్వతి పరమేశ్వరులామెను చూచి "ఓ కన్యామణీ! నీ వేల తపస్సు చేయు చున్నావు? మేము పార్వతీ పరమేశ్వరులము. నీ కష్టమును మాతో చెప్పుము" అనిరి. అంత నామె వారిని అతి భక్తితో  నమస్కరించి తన వివాహ విషయమును చెప్పెను. వారది విని "అమ్మా! నీవు అట్లతద్దె నోము నోచి చంద్ర దర్శనము కాక పూర్వమే భోజనము జేసి యుల్లంఘన చేసితివి. అందుచే నీకు ముసలి మగని సంబంధము వచ్చుచున్నది. కావున నీవు యింటికి పోయి నోము నోచుకుని దీపాల వేళ వరకు వుపవాసముండిన పిమ్మట భోజనము జేయు" మని చెప్పి అదృశ్యమయిరి. అంత నామె తన యింటికి వెళ్ళి జరిగిన విషయమును తల్లి దండ్రులకు చెప్పి యధావిధిని నోము నోచుకొనెను. తరువాత నామెకు చక్కని పడుచు మగనితో  పెండ్లి జరిగెను.
దీనికి వుద్యాపనము
అట్లతద్దెనాడు నోము నోచుకొని, పగటి వేళ భోజనము చేయక, నీరు త్రాగక, వుపవాసముండి, చీకటి పడినంతటనే గౌరీదేవికి పదియట్లు నైవేద్యము పెట్టి, విడిగా పదియట్లను, ఒక తోరమును ముత్తైదువునకు వాయనమియ్యవలెను. అట్లు పది సంవత్సరములు చేసిన పిమ్మట పదేసి అట్లు, కొంత డబ్బును, నల్లపూసలను, లక్క జోడును పదిమంది ముత్తైదువులకు వాయన మియ్యవలెను. పద్ధతి తప్పినను ఫలము తప్పదు, భక్తి తప్పకుండిన ఫలము కలుగును.

కారుణ్యమూర్తి హెన్రీ డ్యూనాంట్‌


''మన నాగరికతకు యుద్ధం ఎలా చేయాలో తెలుసు కాని, శాంతి ఎలాగ సాధించాలో తెలియదు'' అని ఇటాలియన్‌ రచయిత గుల్మిల్మో పెరేరో'' తన పుస్తకంలో ఎంతో భాదను వ్యక్తం చేశారు.  

1895వ సంవత్సరంలో ఫ్రాంకో-సార్డియన్ కూటమికి, ఆస్ట్రియా సామ్రాజ్యవాద సైనిక దళాలకు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 40 వేలమంది సైనికులు అసువులు బాయగా, వేలాది మంది గాయపడ్డారు. ఈ యుద్ధంలో గాయపడ్డ క్షతగాత్రులను ఆదుకుని, వారికి సేవలందించేందుకు అప్పట్లో స్విట్జర్లాండ్‌కు చెందిన హెన్రీ డునాంట్ అనే వ్యక్తి ముందుకొచ్చాడు.
ఆ సంఘటన తరువాత... తానే ఇలాంటి వారికోసం ఓ సేవాసంస్థను ఎందుకు స్థాపించకూడదని ఆలోచనలో పడ్డాడు హెన్రీ డునాంట్. 
దేశ దేశాల మధ్య యుద్ధాలు, అంతర్యుద్ధాలు, హత్యలు, కలహాలతో సతమతమవుతున్న సమయంలో ఈ ప్రపంచంలో 125 సంవత్సరాల క్రితం ఈ ఉద్యమం ఏర్పడింది.  చిన్న చిన్న విషయాలలోనే  పెద్ద విషయాలు దాగివుంటాయి. అక్కడనుండే గొప్ప  గొప్ప ఉద్యమాలు ఆవిర్భవిస్తాయి అనే విషయాన్ని రుజువు చేసారు  కారుణ్యమూర్తి, కర్తవ్య దీక్షాపరుడు అయిన హెన్రీ డ్యూనాంట్‌ ప్రారంభించిన యుద్ధ క్షతగాత్రుల సహాయ కార్యక్రమం శాఖోపశాఖలుగా విస్తరిల్లింది.  అతని ఆలోచనల ఫలితంగా ఏర్పడిన సంస్థే ఈ రెడ్‌క్రాస్ ఇంటర్నేషనల్ సౌసైటీ. అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు దాదాపు అన్నిరకాల సేవా కార్యకలాపాలను నిర్వహిస్తోంది.
హెన్రీ డ్యూనాంట్‌ (1828-1910) చేసిన ఆ గొప్ప సేవలో నుండే 'రెడ్‌ క్రాస్‌'' జన్మించింది. 1862లో తన ఈ ''చిన్న'' ప్రయోగం గురించి పుస్తకంగా ప్రచురించగానే క్షతగాత్రుల దయనీయస్థితి గురించి యూరప్‌లో ప్రజలు మేల్కొన్నారు. ఈయనే రెడ్ క్రాస్ ను ఏర్పరచారు. డ్యూనాంట్‌ స్విట్జర్‌లాండ్‌ దేశస్థుడు కనుక అతని గౌరవార్థం ఆ దేశపు జండారంగులను తల్లక్రిందులు చేసి తెల్ల జెండాపై ఎర్రక్రాసును రెడ్‌క్రాస్‌ గుర్తుగా ఆ కొత్త జెండాను రూపొందించారు. నోబెల్‌ శాంతి బహుమానం ప్రారంభించగానే 1901లో నోబెల్‌ బహుమతిని డ్యూనాంట్‌కు ఇవ్వడం జరిగింది. అంతేకాక 1963లో రెడ్‌క్రాస్‌ శతజయంతి సందర్భంగా నోబెల్‌ శాంతి బహుమానాన్ని రెడ్‌క్రాస్‌ సొసైటీకి ఇచ్చి గౌరవించారు.  
యుద్ధంలో మరణించడం, క్షతగాత్రులుకావడం వారి కర్మ, నుదిటివ్రాత, అన్నభావం నుండి బయటపడింది. ఏ దేశానికి చెందిన వారైనా, గెలిచినా, ఓడినా ఆ క్షతగాత్రు లకు సేవచేయడం మానవధర్మంగా ఈ రెడ్‌క్రాస్‌ భావిస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలలో ''రెడ్‌క్రాస్‌'' ఎనలేని సేవ చేసింది. జర్మనీలో హిట్లర్‌ యుద్ధంలో 'రెడ్‌క్రాస్‌'' జోక్యాన్ని అంగీకరించకపోవడం వల్ల జర్మన్‌ యుద్ధ శిబిరాలలో 90 శాతం మంది చనిపోయారు. దాన్నిబట్టి హిట్లర్‌ ఎంత కౄరుడో ప్రపంచానికి అర్థమయ్యింది. ఈనాడు వందకుపైగా దేశాలు రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. చివరికి అరేబియా, ఇతర మహ్మదీయ దేశాలు కూడా రెడ్‌క్రాస్‌లో భాగస్వాములయ్యాయి. ఆ ముస్లిం దేశాలలో రెడ్‌క్రాస్‌ గుర్తు తెల్లజెండాపై ఎర్రని చంద్రవంకగా మారింది. ఇరాన్‌లో రెడ్‌క్రాస్‌ ఎర్రని సింహం, సూర్యునిగా రూపొందింది. మానవతా దృష్టితో ప్రారంభమైన ఈ రెడ్‌క్రాస్‌ ఉద్యమంలో స్కూళ్ళు, కాలేజీలు భాగస్వామ్యమయ్యాయి.
పరస్పర అవగాహన, స్నేహం, ప్రపంచ శాంతి, సద్భావం ఈనాడు రెడ్‌క్రాస్‌ లక్ష్యాలుగా మారాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలి అన్నది రెడ్‌క్రాస్‌ ఆకాంక్ష. రెడ్‌క్రాస్‌ ఒకనైతిక శక్తి. యుద్ధ మేఘాలు కారుమబ్బులులాగా వస్తూ వుంటే, రెడ్‌క్రాస్‌ చీకట్లో కాంతిరేక లాగా మెరుస్తోంది.  యుద్ధాలు లేదా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు తీవ్రంగా నష్టపోయిన వారిని ఆదుకుని వారికి ఆసరాగా నిలవడం కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన సంస్థే "రెడ్‌క్రాస్ సొసైటీ". ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి సేవా సంస్థలన్నింటిలోకీ అతి పెద్దది.
స్విడ్జర్లాండ్‌ దేశపు జాతీయ జెండాలోని ఎర్రని బ్యాక్‌గ్రౌండ్‌లో తెల్లని క్రాస్‌ ఉంటుంది. దానిని తారుమారు చేసి తెల్లని బ్యాగ్‌డ్రాప్‌లో ఎర్రని క్రాస్‌ను లోగోగా ఏర్పరిచాడు. 8-5-1812న జన్మించిన హెన్రీ డ్యూనెన్ట్‌ గౌరవార్థం ప్రతి సంవత్సరం మే 8న ప్రపంచవ్యాప్తంగా రెడ్‌ క్రాస్‌ దినోత్సవం జరుపుకుంటారు. 1901 లో ఈయనకు నోబెల్‌ బహుమతి లభించింది. నేడు హెన్రీ వర్ధంతి సందర్బంగా ఈ కారుణ్యమూర్తికి  మన బ్లాగ్ ద్వారా నివాళి అందిస్తున్నాను .

సోమవారం, అక్టోబర్ 29, 2012

స్వామి వివేకానంద - సూక్తులు

సోమవారం, అక్టోబర్ 29, 2012


  • మన ఆలోచనలే మనలను తీర్చిదిద్దుతాయి.
  • అజ్ఞానులకు వెలుగుచూపండి. 
  • విద్యావంతులకు మరింత వెలుగుచూపండి.
  • ఆధునిక విద్య పెంచే అహంకారానికి అంతులేకుండా పోతూంది.
  • మీరు పవిత్రులు కండి. అప్పుడు ప్రపంచమంతా పవిత్రంగా కనబడి తీరుతుంది
  • వేదాంత దృక్పధంలో పాపమనేదే లేదు. పొరపాట్లు మాత్రమే ఉన్నాయి.  
  • మీరు పాపాత్ములనీ, ఎందుకూ  పనికిరానివారనీ అనడమే వేదాంతం అది చూసే దృష్టిలోనే పెద్ద పొరపాటు.
  • విగ్రహాన్ని దేవుడని అనవచ్చు. కానీ దైవం విగ్రహమే అని ఆలోచిస్తే, అది పెద్ద పొరపాటు.
  • మతం సిద్ధాంతాలలో,రాద్ధాంతాలలో లేదు. దాని రహస్యమంతా ఆచరణలోనే వుంది. 
  • పవిత్రంగా ఉండటం అంటే  పరులకు మేలు చేయడం- మతమంటే ఇదే.
  • ప్రతి ఒక్కరూ అధికారం కోసమే అర్రులు చాస్తారు. చివరికి మొత్తం వ్యవస్త కుప్పకూలుతుంది.
  • సజీవ దైవాలను సేవించండి. అంధుడు,పేదవాడు, వికలాంగుడు,దుర్బలుడు,కౄరుడు, ఇలా వివిధ రూపాల్లో భగవంతుడు మీ వద్దకు వస్తాడు. వారిలోని భగవంతుని గుర్తించండిచాలు.
  • " నువ్వు దుష్టుడివి " అనవద్దు. " నువ్వు మంచివాడివి ", కానీ"మరింత మెరుగవ్వాలి" అని మాత్రం అనండి.
  • హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం పిరికితనాలు మటుమాయమవుతాయి.
  • పురాణాలు వర్ణించిన ముప్ఫై మూడు కోట్ల దేవతల్లో విశ్వాసం ఉండీ, మీపై మీకు విశ్వాసం లేకపొతే విముక్తి లేదు.   – స్వామి వివేకానంద.

పలుకు దేనెల తల్లి పవళించెను

పలుకు దేనెల తల్లి పవళించెను
కలికి తనముల విభుని గలసినది గాన

నిగనిగని మోముపై నెఱులు గెలకుల జెదర
పగలైన దాక జెలి పవళించెను
తెగని పరిణతులతో తెల్లవారినదాక
జగదేక పతి మనసు జట్టి గొనె గాన

కొంగు జారిన మెఱుగు గుబ్బ లొలయగ దరుణి
బంగారు మేడపై బవళించెను
చెంగలువ కనుగొనల సింగారములు దొలుగ
అంగజ గురునితోడ నలసినది గాన

మురిపెంపు నటనతో ముత్యాల మలగుపై
పరవశంబున దరుణి పవళించెను
తిరు వేంకటాచలా ధిపుని కౌగిట గలసి
అరవిరై యూరుల జెమట యంటినది గాన

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)