Blogger Widgets

సోమవారం, నవంబర్ 04, 2024

కార్తీక పురాణం 3వ రోజు

సోమవారం, నవంబర్ 04, 2024

 


శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,

శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

కార్తీక స్నాన మహిమ
జనకమహారాజా! కార్తీక మాసమున యే ఒక్క చిన్న దానము చేసిననూ, అది గొప్ప ప్రభావము కలది. అట్టి వారికి సకల ఐశ్వర్యములు కలుగుటయే గాక మరణానంతరము శివసాన్నిధ్యమును చేరుదురు. కాని, కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడువలేక, కార్తీక స్నానములు చేయక, అవినీతిపరులై, భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుదురు. అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునయినను స్నాన, దాన, జపతపాదులు చేయకపోవుటవలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మ రాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసము ఒకటి వినిపించెదను. సపరివారముగా శ్రద్ధగా ఆలకింపుము.

బ్రహ్మ రాక్షసులకి ముక్తి కలుగుట
ఈ భరత ఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామములో మహావిద్వాంసుడు, తపశ్శాలి, జ్ఞానశాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు 'తత్వనిష్టుడూ అను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరెను. ఆ తీర్థ సమీపమున ఓ మహా వటవృక్షంపై భయంకరమైన ముఖముతోను, దీర్ఘ కేశములతోనూ, బలిష్టములైన కోరలతోను, నల్లని బానపొట్టల తోనూ, చూచు వారికి అతి భయంకర రూపాలతో ముగ్గురు బ్రహ్మ రాక్షసులు నివసించుచూ, ఆ దారిన బోవు బాటసారులను బెదిరించి, వారిని భక్షించుచూ ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి.
తీర్థ యాత్రకై బయలుదేరి, అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారముగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతనిని చంపబోవు సమయమున, బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములు జూచి, గజగజ వణుకుచూ యేమియు తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచూ 'ప్రభో! ఆర్తత్రాణ పరాయణ! అనాధ రక్షక! ఆపదలోనున్న గజేంద్రుని రక్షించిన విధము గానే యీ పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి!' అని వేడుకొనెను.
ఆ ప్రార్ధనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయము కలిగి 'మహానుభావా! మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారయణ స్తుతి విని మాకు జ్ఞానోదయము కలిగింది. మహానుభావ! మమ్ము రక్షింపుడూ అని ప్రాధేయపడిరి. వారి మాటలకు విప్రుడు ధైర్యము తెచ్చుకొని, 'ఓయీ! మీరెవరు? ఎందులకు మీకు రాక్షస రూపంబులు కలిగెను? మీ వృత్తాంతము తెలుపుడూ అని పలుకగా, వారు 'విప్ర పుంగవా! మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్ఠాపరులు, మీ దర్శనభాగ్యము వలన మాకు పూర్వజన్మమందలి జ్ఞానము కొంత కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపదా కలుగదూ అని అభయమిచ్చినవి.
అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగెను.
ఒకటవ బ్రహ్మరాక్షసుని కధ 
నాది ద్రవిడదేశము. బ్రాహ్మణుడను. నేను మహా పండితుడనని గర్వముగల వాడినైయుంటిని. న్యాయాన్యాయ విచక్షణలు మాని పశువు వలే ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్థుల వద్ద, దౌర్జన్యముగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యా, పుత్రాదులను సుఖపెట్టక, పండితుల నవమానపరుచుచూ, లుబ్ధుడనై లోకకంటకునిగా నుంటిని. ఇట్లుండగా ఒకానొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్ధ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చెను.  వచ్చిన పండితుని నేను దూషించి, కొట్టి అతని వద్ద నున్న ధనమును, వస్తువులను తీసుకొని యింటి నుండి గెంటివైచితిని. అందులకా విప్రునకు కోపమొచ్చి 'ఓరీ నీచుడా! అన్యాక్రంతముగా డబ్బు కూడబెట్టినది చాలక, మంచి చెడ్డాలు తెలియక, తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించక కొట్టి, తిట్టీ వస్తుసామగ్రిని దోచుకుంటివి గాన, నీవు రాక్షసుడవై నర భక్షకునిగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాకా అని శపించుటచే నాకీ రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకొనవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా! కాన నా అపరాధమును క్షమింపుమని వానిని ప్రార్థించితిని. అందులకాతడు దయతలచి 'ఓయీ! గోదావరి క్షేత్రమందొక వట వృక్షము కలదు. నీవందు నివసించుచూ ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి, పుణ్యఫలమును సంపాదించి యుండునో ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మ నొందుదువు గాకా అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేనీ రాక్షసరూపమున నరభక్షణము చేయుచుంటిని. కాన, ఓ విప్రోత్తమా! నన్ను, నా కుటుంబము వారను రక్షింపు డని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును జెప్పెను.

రెండవ బ్రహ్మరాక్షసుని కధ
ఇక రెండవ రాక్షసుడు, 'ఓ ద్విజోత్తమా! నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేనూ నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి, వారికి తిండి పెట్టక మాడ్చి అన్నమో రామచంద్రా అనునటుల చేసి, వారి ఎదుటనే నా భార్యబిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండెడివాడిని. నేను ఎట్టి దాన, ధర్మములను చేసి యెరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలే ప్రవర్తించితిని. కాన నాకీ రాక్షసత్వము కలిగినది అని చెప్పెను.

మూడవ బ్రహ్మరాక్షసుని కధ  
మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. 'మహాశయా! నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను. నేను విష్ణ్వాలయంలో అర్చకునిగా వుంటిని. స్నానమైనను చేయక, కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండెడి వాడిని. భగవంతునికి ధూప, దీప, నైవేద్యములు అర్పించక, భక్తులు కొని దెచ్చిన సంభారములను నా ఉంపుడుగత్తెకు అందజేయుచూ మద్య, మాంసములను సేవించుచూ, పాపకార్యాలు చేసినందున, నా మరణాంతరమున ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తుని కావింపుమని ప్రార్థించెను.

ఓ జనక మహారాజా! తపోనిష్ఠుడగు ఆ విప్రుడు రాక్షసుల దీనాలాపములాలకించి, 'ఓ బ్రహ్మరాక్షసులారా! భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకీ రూపము కలిగెను. నా వెంట రండు. మీకు విముక్తిని కలిగింతునూ అని వారినోదార్చి తనతో గొని పోయి ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని, తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి, స్నాన పుణ్యఫలమునా ముగ్గురు బ్రహ్మ రాక్షసులకు ధారపోయగా, వారివారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకేగిరి.
కార్తీక మాసమున గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తినొంది, వారికి సకలైశ్వర్యములను ప్రసాదింతురు. అందువలన, ప్రయత్నించి అయినా సరే కార్తీకస్నానాలనాచరించాలి.

గురువారం, అక్టోబర్ 03, 2024

బాలా త్రిపురసుందరి

గురువారం, అక్టోబర్ 03, 2024







 బాలాత్రిపురసుందరి:  నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు.  ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు. 

స్తోత్రం :
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం
నవాంబురుహలోచనాం అభినవాంబుధశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీ ధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితావయం లీలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయన వాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిధూర్ణనేత్రాంచలాం
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీరచర్చారతాం
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీ
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం

గురువారం, ఫిబ్రవరి 15, 2024

అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ఆదిదేవుడు సూర్యనారాయణ మూర్తి

గురువారం, ఫిబ్రవరి 15, 2024

 నమస్కారిస్తే ఆయురారోగ్యాలుఅర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యడు.  


ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

2. సప్తాశ్వరథ మారూఢం – ప్రచండం కశ్యపాత్మజం |

శ్వేతపద్మధరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

3. లోహితం రథమారూఢం – సర్వలోకపితామహం |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

4. త్రైగుణ్యం చ మహాశూరం – బ్రహ్మ విష్ణుమహేశ్వరమ్‌ |

మహాపాపహరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌

5. బృంహితం తేజసాంపుంజం – వాయు రాకాశ మేవ చ |

ప్రియంచ సర్వలోకానాం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

6. బంధూకపుష్పసంకాశం – హారకుండభూషితం |

ఏకచక్ర దరం దేవం – తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

7. తం సూర్యం లోకకర్తారం – మహాతేజ: ప్రదీపనమ్‌|

మహాపాపహరం దేవం- తం సూర్యం ప్రణమామ్యహమ్‌.

8. తం సూర్యం జగతాం నాథం – జ్ఞానప్రకాశ్యమోక్షదమ్‌ |

మహాపాపహారం దేవం – తం సూర్యం ప్రణ మామ్యహమ్‌.

9. సూర్యాష్టకం పఠేన్నిత్యం – గ్రహపీడా ప్రణాశనం |

అపుత్రో లభతే పుత్రం – దరిద్రో ధనవా న్భవేత్‌ |

10. ఆమిషం మధుపానం చ య: కరోతి రవేర్ధినే|

సప్త జన్మ భవేద్రోగి – జన్మ జన్మ దరిద్రతా |

స్త్రీ తైలమధుమాంసాని – యే త్యజంతిరవేర్దినే |

న వ్యాధి: శోకదారిద్య్రం – సూర్యలోకనం చ గచ్ఛతి.

ఆదిదేవ ! నమస్తుభ్యం – ప్రసీద మమ భాస్కర |

దివాకర ! నమస్తుభ్యం – ప్రభాకర నమోస్తుతే

ఓ ఆది దేవా ! నీకు నమస్కారము. భాస్కరా! నన్ను కరుణించు  . ప్రభాకరా నీకు ప్రణామములు అంటు సూర్యునికి ప్రతినిత్యము నమస్కారములు చేస్తే ఆయురారోగ్యాలు, అర్ఘ్యమిసే చాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్షభగావానుడు సూర్యుడు.

మాఘమాసములో వచ్చే శుద్ధ సప్తమి తిధి కి రధసప్తమి అను పేరు. ఇది సూర్యునికి సంబందించిన రోజు . ఇది ముఖ్యముగా సూర్యభగవానుని ఆరాధించు పండుగ. ఈ రోజు సూర్యడు తన రధమును ఉత్తరం దిక్కునకు మళ్ళించే రోజు.
ఈ పర్వదినము రోజు కుటుంబములోని వారందరూ తెల్లవారుజామున నిద్రలేచి, కాలకృత్యాలు తీర్చుకొని జిల్లేడు ఆకుల్ని భుజాలమీద , తలమీద పెట్టుకొని

"జనని త్వంహి లోకానాం సప్తమీ సప్తసప్తికే, సప్తమ్యా హ్యదితే దేవి నమస్తే సుర్యమాతృకే "
అనే మంత్రముతో స్నానము చేయాలి, సూర్యునికి అర్ఘ్యమివ్వాలి. సూర్యుడికి  అర్గ్యమిస్తే అష్టైశ్వర్యాలు ఇస్తాడు . 
జిల్లేడు పత్రమునే అర్కపత్రమంటారు. ఈ పత్రము సూర్యునికి ఇష్టము.
తులసి కోటని పసుపు, కుంకుమ లతో అలంకరించి, తులసికోట ముందు ముగ్గులు పెట్టాలి. సూర్యబింబం, ఏడు గుర్రాలు, ఏకచక్రము తో బొమ్మ ముగ్గు పెట్టాలి . ముగ్గుమీద ఆవు పిడకలతో కుంపటి ఏర్పరచి దానిమీద గిన్నెలో అన్నం పాయసము వండాలి. కొత్త గిన్నెకి పసుపురాసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవుపాలను మూడుసార్లు పొంగించి , కొత్త బియ్యము, పటికబెల్లము, యాలకులపొడి చేర్చి , నెయ్యి వేసి చక్కగా వుడికించి పాయసముచేయ్యాలి.
పాలు మూడు సార్లు పొంగటమువల్ల ఇంట్లో సిరిసంపదలు పోంగిపోర్లుతాయని నమ్మకము వుంది.
చిక్కుడు కాయలకి చీపురుపుల్లలు గుచ్చి చేసిన రధమును ముగ్గులో పెట్టి, పదిహేను చిక్కుడు ఆకులు పరచి అందులో ఉడికించిన పాయసమును వడ్డించాలి. వాటిలో అగ్నిహోత్రునికి ఐదు ఆకులు అర్పించాలి. తులసి అమ్మవారికి ఐదు , మిగతా ఐదు సుర్యభాగావానునికి నివేదించాలి. సూర్యునికి గంధ , పుష్ప, అక్షతల, షోడపోచార అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆయనికి ప్రదక్షణాలు చేసి నమస్కారము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది.
సాయమ్త్రము సూర్యుని గుడికి వెళ్లి నమస్కరించాలి.
రధ సప్తమి రోజునుండి వేసవి కాలము ప్రారంబమవుతుంది . అందుకే రధసప్తమిరోజు తప్పకుండా సూర్య నమస్కారములు చేయాలి. మనకు ప్రతినిత్యము ప్రత్యక్షముగా కనిపించే దైవం సూర్యభగవానుడు. ప్రపంచములో అన్ని జీవరాసులకు వేడి, వెచ్చదనము, పాడిపంటలను, వెలుగును ఇచ్చేవాడు భాస్కరుడు. సుర్యారాధన మనకు వేద కాలమునుండి ఉంది. సూర్యుని పేరు సప్తిమ. ఏడు గుర్రాలను, పంచిన రధము కలిగినవాడు. సప్తలోకములకు తన శక్తిని ప్రసాదించువాడు సూర్య కిరణాలు ఏ డురంగులకు నిదర్శనమని, రధసప్తమినాడు ఆకాసములో గ్రహ నక్షిత్ర సన్నివేసం రధమును పోలి ఉంటుంది కనుకనే ఈ తిధిని రధసప్తమి అని పేరు వచ్చింది.
అనంతసక్తితో కూడుకొన్న కిరణాలు, తేజస్సు, శుద్ధమైన వాడు , భక్తులకు అభయము ఇచ్చేవాడు. జగతికి వెలుగుకారకుడు, జ్యోతిర్మయుడు, శుభానిచ్చే ఆదిత్యుడు, చీకటి పారద్రోలేవాడు, భక్తుల కోరికలు తీర్చేవాడు ఆదిత్యుడు , మార్తాండుడు,శుభంకరుడు, భాస్కరుడు అయిన సూర్యనారాయణమూర్తికి నమస్కారములు అంటూ ధ్యానించాలి.
సుర్యుడు ఆరోగ్య ప్రదాత. అది సైన్స్ ద్వారా కూడానిరూపించబడినది. సూర్య కిరణాలలో డి విటమిన్ కలదు.
అన్నట్టు రధసప్తమి రొజు స్త్రీలు ఎన్నో నోములు చెయటానికి ప్రారంబధినముగా చెయుదురు. అక్షింతలు వేసుకొని నోములకు నాంది పలుకుదురు.

శనివారం, ఫిబ్రవరి 03, 2024

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం

శనివారం, ఫిబ్రవరి 03, 2024

 మనం జీవితంలో ఎన్నో అనుకుంటూ వుంటాం.  కొన్ని పనులు అనుకోగానే అవుతాయి కొన్ని పనులైతే ఎన్నిసార్లు చేపట్టినా అవ్వదు.  అలాంటప్పుడు మనకి నిరాశా నిస్పృహ వస్తాయి.  కొంతమంది అయితే డిప్రషన్లోకి వెళ్ళిపోతారు.  అంతలా చేస్తాయి  నిరాశా నిస్పృహ .   మనం వింటు వుంటాం ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం వుంటుంది అని.  మనం ప్రయత్నిస్తూ వుండాలి అంతే. 

కృష్ణుడు భగవద్గీతను అర్జునికి ఒకనికే చెప్పలేదు.  మనకోసం చెప్పివుంటాడేమో .  ఇప్పుడు అందరు ఏదన్న సమస్య వస్తే మానసిక వైద్యునిదగ్గరికి వెల్తూన్నారు. వాళ్లు కౌన్సిలింగ్స్ ఇస్తారు.  అలాగే యుద్దభూమిలో అర్జునుడు తనవారిని చూసి యుద్దం చేయను, చేయలేను అంటూ అర్జుని విషాధం దానితరువాత శ్రీ కృష్ణులువారు భగవద్గీత చెప్పారు.  అయితే మనజీవితంలో అన్వయించుకుంటే    ప్రతీ సమస్యకి భగవత్గీతలో సమాధానం దొరుకుతుంది.  చూసే దృక్కోణం బట్టి సమాధానం వుంటుంది. 

ఈరోజు ఒకసమస్యని చూసి గీతలో కృష్ణుడు ఏమి చెప్పారో చూద్దాంరండి. 

సమస్య ఏమిటంటే :  

ఒకపని తలపెట్టాను. ఆపని ఎన్నిసార్లు చేసినా పూర్తీ అవ్వటంలేదు.. ఏ పని చేసినా మంచి ఫలితాలు రావటంలేదు. కష్టం వృధా అవుతొంది తప్పా మంచి ఫలితం రావటంలేదు.  మనస్సులో ధైర్యంలేదు. నేను ఏమి చేసినా ఇంతే .  ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటుంది . ఏమి చేయాలన్నా భయం నేను చేయగలనా లేదా. ఒకవేళ చేస్తే పర్ఫెక్ట్ అవుతుందో లేదో .  మనసునిండా tension .  మనసు కృంగిపోతుంది.  

ఈ సమస్య సర్వసాధారణంగా మనలో చాలామంది అంటూ ఉంటారు. మనం వింటూనే వున్నాం కదా మరి ఈ సమస్యకి గీత ఏమి చెప్తోందో చుద్దాం.  

నేను ఏమీ చేయలేను అనుకునేవారికి భగవద్గీత నుండి సమాధానం. 


 గీతలో సాంఖ్య యోగము, భగవద్గీతలో రెండవ అధ్యాయంలో మూడవ శ్లోకం చూడండి. 

||శ్లోకము 2-3||

క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే |
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వక్యోత్తిష్ట పరన్తప ||3||

చూడండి. దీని అర్ధం ఏమిటంటే 

“  పార్థా ! పిరికితనాన్ని తెచ్చుకోవద్దు ; అది నీకు ఎంత మాత్రమూ తగదు ; తుచ్ఛమైన హృదయదౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి సంసిద్ధుడవు కా ! ”

హృదయ దౌర్భల్యం, పిరికితనం, అధైర్యం వంటివి మన మనసున చేరిన బుద్ది నశిస్తుంది. విచక్షణ జ్ఞానము ఉండదు. 

అందువల్లే ఎంతో గొప్ప సాటిలేని వీరుడు అయిన అర్జునుడు కూడా తనలోని అంతఃశత్రువులైన హృదయ దౌర్బల్యానికి పిరికితనానికి లోనై యుద్ధం చేయకూడదు అనుకున్నాడు. ఒకానొక బుద్ధిశాలి ఎప్పుడూ వర్తమాన పరిస్థితుల వైపు కాక,అంతిమలక్ష్యం వైపు దృష్టిపెట్టాలి.  విజ్ఞతయే ధర్మయుద్ధానికి మూలం . ధర్మయుద్ధమే అంతిమ విజయానికి మార్గం.జీవన సమరంలో వెనుకడుగు వేసే ప్రతి సందర్భంలోనూ మన అడుగులు ముందుకు వేస్తూంటేగమ్యం చేరువ అవుతూ ఉంటుందిచివరికి లక్ష్యాన్ని చేరుతాం . 

పరిష్కారం : ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు. నీశక్తి నీలోనే ఉంది . అది నువ్వు గ్రహించాలి. నువ్వు ఇప్పటికే చాలా విజయాలు సాధించావు అలాంటి నువ్వా ఇలా క్రుంగిపోతున్నావా ? లే  దైర్యం తెచ్చుకో .  నీచమైన పిరికితనం వదిలిపెట్టు . ఉత్సాహంతో దైవంమీద భారం వేసి పని మొదలు పెట్టు. తప్పకుండా విజయం సాధిస్తావు. 

ఇదండీ భగవద్గీతలో మన సమస్యకి సాంఖ్యా శాస్త్రంలో సమాధానం దొరికింది.  మీకు నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు. 

బుధవారం, డిసెంబర్ 15, 2021

సిరినోము చేసే సమయం వచ్చింది (మార్గళి త్తింగళ్ పాశురము)

బుధవారం, డిసెంబర్ 15, 2021

  ధనుర్మాసం మొదలు  అయ్యింది కదండి. ఈ నెలరోజులు పాశురాలు పాడతాము కదా.  అయితే మరి మొదటి పాశురం గురించి తెలుసుకుందాం.

గోపికలును గోదాదేవి ఈ వ్రతం గురించి ముందుగా వారు మార్గశిరమాసం గురించి ఆ వ్రతం చేయుటకు అనుకూలంగా వుందని కాలాన్ని వారు పొగిడారు.  తరువాత ఈ వ్రతం ఎవరు చేస్తారో దాని వల్లన కలుగు ఫలితం గురించి తెలుసుకున్నారు.  ఆవిషయాన్ని మొదటి పాశురంలో చెప్పదలచారు.  
                                    మొదటి పాశురం లో మనకు  నారాయణ తత్వము కనిపిస్తుంది. 

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .
పాశురం తాత్పర్యము:  
ఒహ్హో మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజులు  . ఓ! అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలో సంపదలతో తులతూగుచున్న ఓ! బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్న సంకల్పమున్నచో రండు. ముందునడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపదరాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశోద యొక్క బాలసింహము నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించని మనకే , మనమాపేక్షెంచు వ్రతసాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చేయుటను చూచి లోకులందరు సంతోషించునట్లు మీరు అందరూ కూడా చేరి ఈ వ్రతము చేయండి అని భావము.

సిరినోము  చేసే సమయం వచ్చింది 

సిరినోము 

రారమ్మా ఓ అమ్మలారా! రారే మమ్మ!
నీరాడ మనసున్నవారు, మీరూ  మీరూ !
శ్రీరమ్యమైన మన వ్రేపల్లెలోన
చేరి, కన్నియలార! కూరిమి చెలులార !   !!రారమ్మ !!  

ఇది మార్గశిరము , వెన్నెలవేళ , భాసురము !
ఇది పరవాద్య వ్రతారంభ వాసరము !
మదిలోన జగమెల్ల ముదమంది పొగడ ,
కదిసే కంకణ కటక కింకిణులు కదల  !! రారమ్మ !!

మరీమరీ కనికనీ మెరిసేటి కనులతో 
మురిసే యశోదమ్మ ముద్దు సింగపుకొదమ,
కరిమొయిలు మెయిహోయలు  గల అందగాడు,
వరదుడౌ మనరేడు వ్రతమేలువాడు !! రారమ్మా !!

కరమందు కరకువాల్ కాపుగా దాలిచి 
వారాలేటి మేటినందుని నందనుండు 
అరుణశశిబింబనిభ శుభవదనుడు 
సరసిజాక్షుడే నోము కరుణింపగా !! రారమ్మ !!

ఆదివారం, నవంబర్ 15, 2015

పాహిపాహి సర్పరూప

ఆదివారం, నవంబర్ 15, 2015



"కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణంచ రాజర్షి కీర్తనం కలినాశనం"





పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి 27/10/2015.
వాల్మీకి సంస్కృత సాహిత్యం మొదటి కవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.  వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది. మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)