Blogger Widgets

శుక్రవారం, నవంబర్ 23, 2012

యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.

శుక్రవారం, నవంబర్ 23, 2012

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.   ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను.

కార్తీక పురాణం 10వ రోజు

ద్వాదశీ ప్రశంస  
మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.

సాలగ్రామ దాన మహిమ

పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.

గురువారం, నవంబర్ 22, 2012

భావయామి గోపాలబాలం

గురువారం, నవంబర్ 22, 2012


భావయామి గోపాలబాలం మన 
సేవితం తత్పదం చింతయేయం సదా 

కటి ఘటిత మేఖలా ఖచిత మణిఘంటికా 
పటల నినదేన విభ్రాజమానం 
కుటిల పద ఘటిత సంకుల శింజీతేన తం 
చటుల నటనా సముజ్జ్వల విలాసం 


నిరత కర కలిత నవనీతం బ్రహ్మాది 
సుర నికర భావనా శోభిత పదం 
తిరువేంకటాచల స్థితం అనుపమం హరిం 
పరమపురుషం గోపాలబాలం … భావయామి


ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. ఎల్లప్పుడూ చేతులకు వెన్న కలిగి ఉండే దొంగ కృష్ణుడు, బ్రహ్మ మొదలగు దేవతల భావనలలో ఆయన పాదాలు శోభిల్లుతాయిట. ఆయనే శ్రీ హరి, పరమపురుషుడు, వేరే ఉపమానము లేని వాడు, శ్రీ వేంకటాచలముపై వెలసిన శ్రీనివాసుడు.

ఈ పొడుపు కధ మీకు తెలుసా


నేను ఒక పొడుపు కధని అడుగుతాను జవాబు మీకు తెలుసా అయితే జవాబు చెప్పండి  మరి. 
ఋతువులో వుంది.
లతలో వుంది .
కన్నెపిల్ల సిగ్గులో వుంది. 
దేవుని దయలో వుంది.
స్నేహపరిమళంలో వుంది. 
ఏమిటది?

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)