సోమవారం, నవంబర్ 26, 2012
కన్యాదన ఫలము
ఓ జనక చక్రవర్తీ! కార్తీక మాసంలో తప్పనిసరిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి. వాటి గురించి వివరిస్తాను సావధానంగా విను.
కార్తీక మాసంలో నదీస్నానం ముఖ్యం. దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారినికి ఉపనయనం చేయడం ముఖ్యం. ఒకవేళ ఉపనయనం చేయడానికి ఖర్చు భరించలేనప్పుడు మంత్రాక్షతలు, దక్షిణతాంబూలం, సంభావనలతో తృప్తి పరచినా ఫలితం కలుగుతుంది. ఇలా ఒక పేద బ్రాహ్మణుని బాలునికి ఉపనయనం చేస్తే మనం చేసిన ఎలాంటి పాపాలైనా తొలిగిపోతాయి. ఎన్ని దానధర్మాలు చేసినా కలగని పుణ్యం ఒక పేద బ్రాహ్మణుని బాలునికి చేసిన ఉపనయంతో కలుగుతుంది. మరో పుణ్యకార్యం కన్యాదానం. కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తే వారు తరించడమే కాకుండా, వారి పితృదేవతలను కూడా తరింపచేసినవాడవుతాడు. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను వినమనెను.
సువీర చరిత్రద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు, శూరుడు అయిన సువీరుడు అనే రాజు ఉండేవాడు. అతని భార్య పేరు రూపవతి. ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడించబడి, భార్యతో కలసి అరణ్యంలోకి పారిపోయాడు. నర్మదా నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకుని అడవిలో దొరికే కందమూలాలు, పండ్లు తింటూ కాలం గడుపుచున్నాడు. కొన్ని రోజులకు అతని భార్య రూపవతి ఒక బాలికను ప్రసవించింది. ఆ బాలికను అతి గారాబంతో పెంచుతున్నారు. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలిక సరైన ఆహార సదుపాయాలు లేకపోయినా చూసేవారికి కనులపండుగగా, ముద్దులొలుకు మాటలతో చాలా ముచ్చటగా ఉండేది. రోజులు గడిచే కొద్దీ, ఆ బాలిక పెరిగి పెండ్లి వయసుకు వచ్చింది. ఒక రోజు వానప్రస్థుని కుమారుడు ఆమెను చూసి ఆమె అందానికి పరవశుడై ఆమెను తనకిచ్చి పెండ్లి చేయమని సువీరుడు కోరాడు. అందుకు ఆ రాజు 'ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను. నా కష్టాలు తొలగడానికి నాకు కొంత ధనమిస్తే నా కుమార్తె నిచ్చి పెండ్లి చేస్తాను' అన్నాడు. తన చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఆ బాలికమీద మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరాన కుబేరుని గూర్చి ఘోరతపస్సు చేసి, కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించి, రాజుకు ఆ ధన పాత్రని ఇచ్చి ఆ బాలికను పెండ్లి చేసుకుని తీసుకువెళ్ళి తన తల్లితండ్రులకు నమస్కరించి అంతవరకూ జరిగిన వృత్తాంతమంతా చెప్పి భార్యతో సుఖముగా ఉన్నాడు. ముని కుమారుడు ఇచ్చిన ధనపాత్రతో సువీరుడు స్వేచ్ఛగా ఖర్చు పెడుతూ భార్యతో సుఖంగా ఉన్నాడు. మరి కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది. ఆ బిడ్డకు కూడా యుక్తవయసు రాగానే మరలా ఎవరైనా ధనం ఇచ్చేవారికి అమ్మవచ్చనన్న ఆశతో ఎదురుచూడసాగాడు. ఒకానొక రోజున ఒక సాధుపుంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానం చేయడానికి వస్తూ దారిలో ఉన్న సువీరుడుని కలుసుకుని 'నువ్వెవ్వరిని. నిన్నుచూస్తుంటే రాజవంశస్తుడవలే ఉన్నావు? నువ్వు ఈ అరణ్యంలో ఉండటానికి కారణం ఏమిటని ప్రశ్నించాడు.' సువీరుడు 'మహానుభావా నేను వంగదేశానికి రాజుని. నా రాజ్యాన్ని శత్రవులాక్రమించారు. భార్యతో కలసి ఈ అడవిలో నివసిస్తున్నాను. దరిద్రం కంటే కష్టమైనది ఏదీ లేదు. నాకు ఇద్దరు కుమార్తెలు. నా మొదటి కుమార్తెను ఒక మునిపుత్రునికిచ్చి అతని వద్ద కొంత ధనమును తీసుకొన్నాను. దానితోనే ఇంతవరకూ నెట్టుకొస్తున్నాను అని చెప్పాను.'అప్పుడు ఆ ముని 'ఓ రాజా నువ్వు ఎంత దరిద్రుడివైనా, ధర్మసూక్షమాలోచించకుండా కన్యను అమ్ముకున్నావు. కన్యావిక్రయం మహా పాపాలలో ఒకటి. కన్యను విక్రయించివారు 'అసిపత్రవన'మను నరకం అనుభవిస్తారు. ఆ ధనముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్ధం ఏ వ్రతం చేస్తారో వారు నాశనం అయిపోతారు. అంతేకాకుండా కన్యా విక్రయం చేసేవారికి పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు. అలానే కన్యను ధనమిచ్చి పెండ్లాడినవారు చేసే గృహస్థ ధర్మాలు వ్యర్థమవుటయే గాక అతడు మహా నరకం అనుభవిస్తాడు. కన్యా విక్రయం చేసేవారికి ఎటువంటి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కాణించి చెబుతున్నారు. కాబట్టి రాబోయే కార్తీకమాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలదీ బంగారు నగలతో అలంకరించి సదాచార సంపన్నుడు, ధర్మబుద్ధి కలవానికి కన్యాదానం చెయ్యి. అలా చేస్తే గంగాస్నానం చేసినంత ఫలం, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం పొందుటయే కాకుండా, మొదట కన్యను అమ్మిన పాపం కూడా తొలిగిపోతుంది' అని రాజుకు హితవు చెప్పాడు.అందుకారాజు చిరునవ్వు నవ్వి 'ఓ మునివర్యా! దేహసుఖం కంటే దానధర్మాల వలన వచ్చిన ఫలం ఎక్కువా? తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోను, సిరిసంపదలతోనూ సుఖంగా ఉండకుండా, చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ప్రస్తుతమున్న అవకాశం చేతులారా జారవిడవమంటారా? ధనమూ, బంగారం ఉన్నవారే ప్రస్తుతలోకంలో రాణింపగలరు. ముక్కూ, నోరు ముసుకుని బక్కచిక్కి శల్యమై ఉన్నవారిని ఈ లోకం గుర్తిస్తుందా?, గౌరవిస్తుందా? ఐహిక సుఖాలే గొప్ప సుఖాలు. కాబట్టి నేనడిగినంత ధనం ఎవరైతే నాకిస్తారో, వారికే నా రెండవ కుమార్తెను కూడా ఇచ్చి పెండ్లి చేస్తాను' అని నిక్కచ్చిగా చెప్పాడు. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. మరికొన్ని రోజులకు సువీరుడు మరణించాడు. వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయారు. యమలోకములో అసిపత్రమనే నరకభాగంలో పడవేసి అనేక విధాలుగా బాధించారు. సువీరుని పూర్వీకుడైన సృతకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గంలో సర్వసుఖములు అనుభవిస్తున్నాడు. సువీరుడు చేసిన కన్యావిక్రయం వలన ఆ సృతకీర్తిని కూడా యమకింకరులు పాశాలతో బంధించి స్వర్గం నుండి నరకానికి తీసుకొచ్చారు. అప్పుడు సృతకీర్తి 'నాకు తెలిసినంతవరకు దానధర్మాలు, యజ్ఞయాగాదులు చేసి, ఇతరులకు ఉపకారమే చేశాను. మరి నాకు ఇటువంటి దుర్గతి ఎలా కలిగింది?' అనుకుని నిండు సభలో కొలువుదీరియున్న యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి నమస్కరించి 'ప్రభూ! నీవు సర్వజ్ఞుడవు. ధర్మమూర్తివి. బుద్ధిశాలివి. ప్రాణకోటినంతటినీ సమంగా చూస్తావు. నేనెప్పుడూ ఏ పాపం చేయలేదు. నన్ను స్వర్గలోకం నుండి నరకలోకానికి తీసుకొచ్చిన కారణం ఏమిటి? దయచేసి తెలియజేయండి' అని ప్రాధేయపడ్డాడు. యమధర్మరాజు సృతకీర్తిని చూస్తూ 'సృతకీర్తి నువ్వు న్యాయమూర్తివి. ధర్మజ్ఞుడవు. నువ్వు ఎటువంటి దురాచారాలు చేయలేదు. కానీ నీ వంశస్తుడు అయిన సువీరుడు తన పెద్ద కుమార్తెను ధనానికి ఆశపడి అమ్ముకున్నాడు. కన్యను అమ్ముకొన్నవారి ఇటు మూడు తరాలు, అటు మూడు తరాలువారు ఎంతటి పుణ్యపురుషులైనా నరకాన్ని అనుభవించడమే కాకుండా నీచజన్మలెత్తవలసి వస్తుంది. నీవు పుణ్యాత్ముడవని, ధర్మాత్ముడవని తెలుసు. కాబట్టి నీకొక ఉపాయం చెప్తాను. నీ వంశస్తుడు సువీరునికి మరొక కుమార్తె ఉంది. ఆమె నర్మదా నతీ తీరాన తల్లి వద్ద పెరుగుతోంది. నా ఆశీర్వాదం వల్ల నీవు మానవ శరీరం దాల్చి, అక్కడకు వెళ్ళి ఆ కన్యను వేదపండితుడు, శీలవంతుడు అయిన ఒక బ్రాహ్మణునికి కార్తీకమాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడవుతాడు. పుత్రికా సంతానం లేనివారు తమ ధనంతో కన్యాదానం చేసినా, విధి విధానంగా ఆబోతునకు అచ్చువేసి వివాహం చేసినా కన్యాదాన ఫలం లభిస్తుంది. కనుక నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి నేను చెప్పినవన్నీ చేసిరా. అలా చేయడం వల్ల నీ పితృగణం తరిస్తారు వెళ్ళిరమ్మని' యమధర్మరాజు పలికెను. సృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరాన ఒక పర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుని భార్యను, కుమార్తెను చూసి సంతోషించి ఆమెతో విషయమంతా చెప్పి, కార్తీకమాసంలో సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకంగా చతుర్వేదాలు చదివిన ఒక బ్రాహ్మణ కుమారునికిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. అలా కన్యాదానం చేయడం వల్ల సువీరుడు కూడా పాపవిముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకున్నాడు. కన్యాదనం వల్ల మహాపాపాలు కూడా నాశనమవుతాయి. వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినా పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానం చేయాలని దీక్షబూని ఆచరించివాడు విష్ణు సాన్నిధ్యం పొందుతాడు. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకానికి వెళతాడు.
ఆదివారం, నవంబర్ 25, 2012
ఆకాశం లో ఎప్పుడైనా హరివిల్లు వస్తుంది కానీ ఆదివారం మాత్రం ప్రపంచం మొత్తం మీద ఒకేసారి హరివిల్లు వస్తుంది అదే నా షో పేరు హరివిల్లు. ఆహరివిల్లు కూడా ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 12:00 గంటలవరకు వస్తుంది. అది కూడా ఎక్కడబడితే అక్కడ రాదండి కేవలం Online Radio Josh Live లో మాత్రమే వస్తుంది. ఇది కేవలము live ప్రోగ్రాం మాత్రమె కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి. నా కబుర్లు, పాటలు , కదలు వినటమే కాదండి మీరు నాతో సరదాగా మాట్లాడైవచ్చును. నాతో మాట్లాడి నాప్రశ్నలకు జవాబులు చెప్పెయవచ్చు. మరి హరివిల్లు షోను అస్సలు మిస్ అవ్వద్దు.
మరి నా షోపేరు చెప్పేసాను కదా, మరి నాతో మాట్లాడాలి అంటే
Skype id: radiojoshlive
US: 914-214-7574
UK: 20-3286-9594
AUS: 28003-4546
Local Number: 040-4200-2003
ఈ నెంబర్స్ కాల్ చేసి నాతో మాట్లాడైవచ్చు. మరి నా షోను మిస్ కాకండి. ధన్యవాదములు.
ద్వాదశీ ప్రశంస: మహారాజా! కార్తీకమాసములో, కార్తీక సోమవారమన కార్తీక ద్వాదశీ వ్రతమును గురించి, సాలగ్రామపు మహిలను గురించి వివరిస్తాను వినుమంటూ వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలిపెను. కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేసి, శక్తి కొలదీ బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఆ రోజంతా ఉపవాసముండి, సాయంకాలం శివాలయానికి గానీ, విష్ణాలయానికి గానీ వెళ్ళి దేవుని పూజించి, నక్షత్ర దర్శనం చేసుకొన్న తర్వాత భోజనం చేయాలి. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలతో పాటు మోక్షం కూడా కలుగుతుంది. కార్తీకమాసంలో శనిత్రయోదశినాడు ఈ వ్రతమాచరిస్తే వంద రెట్లు ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ద ఏకాదశి రోజున ఉపవాసముండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీ హరిని మనసారా ధ్యానించి, శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసేనా కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఈవిధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదీ స్నానం చేసి కోటి మందికి బ్రాహ్మణలకు భోజనం పెడ్తే ఎంత పుణ్యం లభిస్తుందో దానికి రెట్టింపు పుణ్యం లభిస్తుంది.
కార్తీక శుద్ధ ద్వాదశీ వ్రతమంటే విష్ణువుకు ఎంతో ప్రీతికరం. ఆ రోజున శ్రీమంతులెవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి, ఆవుకాళ్ళకు వెండి డెక్కలు తగిలించి, దూడతో సహా బ్రాహ్మణుమనికి దానిమిస్తే ఆ ఆవు శరీరం మీద ఎన్ని రోమాలున్నాయో అన్ని సంవత్సరాలు ఇంద్రలోకంలో స్వర్గసుఖాల్ని అనుభవిస్తారని ప్రతీతి. కార్తీక మాసంలో వస్త్రదానం చేసినా గొప్ప ఫలితం కలుగుతుంది. కార్తీక శుద్ధ పాడ్యమి రోజున, కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవునెయ్యి పోసి దీపముంచినవారికి పూర్వ జన్మలో చేసిన సకల పాపాలూ తొలిగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతాలు బ్రాహ్మణునకు దానమిస్తే ఇహపర సౌఖ్యాలు పొందుతారు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టుగానీ, సాలగ్రామాన్ని గానీ బ్రాహ్మణునికి దానిస్తే నాలుగు సముద్రముల మధ్య నున్న భూమిని దానం చేసినంత ఫలితం కలుగుతుంది.
సాలగ్రామ దాన మహిమ
పూర్వం గోదావరి నదీ తీరంలోని ఒక పల్లెలో ఒక వైశ్యుడు నివశించేవాడు. అతనికి ధనాన్ని కూడబెట్టడమే పని. తాను తినడు, ఇతరులకు పెట్టడూ, ఎవరకీ దానం చెయ్యడు. పైగా ఇతరులను చులకనగా చేస్తూ తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ, ఎవరికీ ఉపకారం చేయకుండా పరుల దగ్గర నుండి సొమ్ము ఎలా కాజేయాలా అని చూస్తుండేవాడు. ఆ వైశ్యుడు తన పల్లెకు సమీపాన ఉన్న మరో పల్లెలో నివసించే ఒక బ్రాహ్మణునికి అధిక వడ్డీకి తన దగ్గరున్న ధనాన్ని అప్పుగా ఇచ్చాడు. కొంతకాలం గడిచిన తరువాత తన ధనం తిరిగి ఇచ్చేయమని అడిగాడు ఆ వైశ్యుడు. తనకి ఓ నెల రోజులు గడువు ఇవ్వమన్నాడు. ఈ జన్మలో అప్పు తీర్చలేకపోతే మరు జన్మలో మీ ఇంట ఏ జంతువుగానో అయినా పుట్టి మీ ఋణం తీర్చుకుంటానని ప్రాధేయపడ్డాడు.
ఆ మాటలకు ఆ వైశ్యుడు పండిపడి 'అలా వీలు కాదు. నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వమని లేకపోతే నరికివేస్తాను' అంటూ ఆవేశంతో ముందూ, వెనుకా ఆలోచించక తన మొలలో ఉన్న కత్తితో ఆ బ్రాహ్మణుని కంఠాన్ని కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉంటే రాజభటులు వచ్చి పట్టుకుంటారని తలచి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహా పాపం కనుక, అప్పటి నుండి ఆ వైశ్యునికి కుష్టువ్యాధి సోకి నానా బాధలు పడుతూ మరి కొన్నాళ్ళకు మరణించినాడు. వెంటనే యమదూతలు అతనిని తీసుకొని పోయి నరకకూపంలో పడేశారు. ఆ వైశ్యునికి ఒక కుమారుడు ఉన్నాడు. అతని పేరు ధర్మవీరుడు. పేరుకు తగినట్టే తండ్రి సంపాదించిన ధనాన్ని దానధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూండేవాడు. నీడకొరకు చెట్లు నాటిస్తూ, నీటి కొరకు నూతులు, చెరువులు త్రవ్విస్తూ మంచి కీర్తిని పొందాడు. కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదులవారు యమలోకమును దర్శించి, భూ లోకానికి వచ్చి ధర్మవీరుని ఇంటికి వెళ్ళెను. ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండప్రాణాలాచరించి, విష్ణుదేవునిగా భావించి, ఆర్ఘ్యపాద్యాది విధులచే సత్కరించి, చేతులు జోడించి 'మహానుభావా! నా పుణ్యం కొలది నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమైంది. శక్తి కొలదీ నేను చేసే సత్కార్యాలను స్వీకరించి, తమరు వచ్చిన కార్యాన్ని వివరించ'మని వినయంగా వేడుకున్నాడు.
నారదుడు చిరునవ్వు నవ్వి 'ఓ ధర్మవీరా! నేను నీకు ఒక హితవు చెప్పడానికి వచ్చాను. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధద్వాదశి మహా ప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన, దాన, జపాదులలో ఏం చేసినా అత్యంత పుణ్యం లభిస్తుంది. నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ, పురుషులయినా, జారుడైనా, చోరుడైనా, పతివ్రత అయినా, వ్యభిచారిణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశిలో ఉండగా స్నానమాచరించి, నిష్ఠగా పూజ చేసి ఉపవాసం ఉండి, సాలగ్రామ దానం చేస్తే పూర్వజన్మలోని పాపాలే కాకా ఈ జన్మలో చేసిన పాపాలు కూడా తొలగుతాయి. నీ తండ్రి యమలోకములో మహా నరకం అనుభవిస్తున్నాడు. అతన్ని ఆ నరకాన్నుండి తప్పించాలంటే నువ్వు సాలగ్రామ దానం చేయక తప్పదు. అలా చేసి నీ తండ్రి ఋణం తీర్చుకోమని' చెప్పాడు నారదమహర్షి. అప్పుడు ధర్మవీరుడు 'నారద మహర్షీ! నేను గోదానం, భూదానం, హిరణ్యదానం వంటి మహా మహా దానాలే చేశాను. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి మోక్షం కలగలేదు. అటువంటప్పుడు ఈ 'సాలగ్రామ'మనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయనకి ఎలా విముక్తి కలుగుతుంది. దీని వలన ఆకలిగొన్న వానికి ఆకలి తీరదు, దాహం గొన్నవారికి దాహం తీరదు. అటువంటి దానాలు చేసినా నా తండ్రికి విముక్తి గలుగుతుంది. అందువల్ల ఈ దానం ఎందుకు చేయాలి' అని అడిగాడు.
ధర్మవీరుని ఉద్దేశించి నారద మహర్షి 'ధర్మవీరా సాలగ్రామమంటే శిలా ప్రతిమ కాదు. శ్రీహరియొక్క ప్రతిరూపం. అన్ని దానలకంటే సాలగ్రామ దానం చేస్తే కలిగే ఫలితం గొప్పది. కాబట్టి నీ తండ్రిని నరకబాధలనుండి విముక్తి పొందటానికి ఈ దానం కంటే మరే మార్గం లేదు' అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు.
ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండీ, దానధర్మాలు చేసినా సాలగ్రామ దానం చేయలేదు. కొంతకాలానికి అతను చనిపోయాడు. నారదుని మాట పెడచెవిన పెట్టడంతో మరణానంతరం ఏడు జన్మలందు పులిగా, మూడు జన్మలందు వానరమై, అయిదు జన్మలందు ఎద్దుగా, మరో పది జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టగా ఆమెకు యవ్వనకాలం రాగానే ఒక విద్వాంసునికి ఇచ్చి పెండ్లిచేశారు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు.
చిన్నతనమందే ఆమెకు అష్టకష్టాలు రావడంతో ఆమె తల్లితండ్రులు, బంధువులు చాలా దు:ఖించారు. తండ్రి ఆమెకు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయో దివ్యదృష్టితో గ్రహించి వెంటనే ఆమెతో సాలగ్రామ దానం చేయించి 'నాకు బాల వైధవ్యమునకు కారణమైన పూర్వ జన్మ పాపము నశించుగాక' అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును ధారపోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం కావడంతో ఆ సాలగ్రామ దాన ఫలముతో ఆమె భర్త జీవించాడు. పిదప ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యాలతో జీవించి, మరణానంతరం స్వరాగానికి వెళ్ళారు. మరి కొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారునిగా జన్మించి నిత్యం సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందాడు. కావున ఓ జనకా! కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసినా దాని ఫలం ఎంతో ఘనమైంది. కాబట్టి నీవు కూడా ఆ సాలగ్రామ దానం చేయమని చెప్పను.
శనివారం, నవంబర్ 24, 2012
కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే తులసి దగ్గర కు వస్తారు . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు. మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు. తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ:
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ