ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్ అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది. అందుకే, సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును పవిత్రమైన రోజుగా పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను మరింత ముఖ్యమైన భావిస్తారు. ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు. ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఈరోజు ధన్వంతరి జయంతి. ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.
ఈరోజు ధన్వంతరి జయంతి. ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు.
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు. ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు. కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది. విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది. పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి శుభాకాంక్షలు.
ఉక్కుమనిషిగా మనకు బాగా తెలిసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1875, అక్టోబరు 31న గుజరాత్ రాష్ట్రంలోని నదియాద్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి జవేరిభాయ్ పటేల్ వ్యసాయం చేసేవాడు. తల్లి లాద్ బాయ్. వారికి ఆరుగురు సంతానంలో పటేల్ నాల్గవవాడు. వారిది చాలా పేదకుటుంబం అవ్వటం వలన పిల్లల్ని చదివించటం చాలా కష్టంగా వుండేది. వల్లభాయ్ ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో స్కూల్ చదువు వరకు చదవగలిగాడు. పటేల్ స్కూలులో చదువుతున్నప్పుడు పుస్తకాలు కొనుక్కొనే పరిస్థితి లేకపోవటం వలన తన స్నేహితుల దగ్గర పుస్తకాలు తీసుకొని వాటిని పూర్తిగా బట్టి పట్టేవాడు. ఒక రోజు తన ఉపాధ్యాయుడు నీ పుస్తకం ఏది?" అని అడిగినప్పుడు, ఎంతో ధైర్యంతో "నాకు పుస్తకాలు కొనుక్కొనే స్తోమత లేదు కాబట్టి నోట్సు మాత్రమే రాస్తున్నాను. కానీ టెక్స్ట్ పుస్తకాల్లో ఇంత వరకు జరిగిన పాఠాలు అన్ని నాకు అక్షరం తప్పకుండా గుర్తున్నాయి అని చెప్పాడు. ఆ సమాధానం విన్న ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయి "ఏదీ ఆహార నియమాలు పాఠం చెప్పు చూద్దాం" అని అడిగాడు. అంతే పటేల్ అక్షరం పొల్లు పోకుండా పాఠాన్ని గడగడా అప్పజేప్పేసాడు . అది విని ఉపాధ్యాయుడు ఆశ్చర్యపోయాడు. మెట్రిక్యులేషన్ తరువాత, కాలేజీ చదువులకు స్తోమతలేకపోవటం వల్ల ప్లీడరు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యి, గోధ్రా అనే చిన్న పట్టణంలో ప్రాక్టీసు ప్రారంబించాడు. ప్రారంభించిన కొద్దిరోజులకే పటేల్ ప్రతిభను అందరూ గుర్తించసాగారు. అతను పట్టిన కేసులు ఓడిపోవటం అంటూ ఎప్పుడూ జరగలేదు. చివరకు ఆంగ్లేయులైన జడ్జీలు కూడా అతని వాదనను విని ముచ్చట పడేవారు. ఇంగ్లాండులో బారిష్టరు పరీక్ష చదివేనిమిత్తం తనకు ప్రయాణంలో సహాయం చేయమని అర్ధిస్తూ వల్లభాయ్ పటేల్ ఒక ట్రావెల్ ఏజన్సీకి లేఖ రాశాడు. అది చదివిన ఏజన్సీవారు వెంటనే సహాయం చేయటానికి అంగీకరించి లేఖరాశారు. 1913లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడై భారతదేశం తిరిగి వచ్చి తన ప్రాక్టీసును మరింత వృద్ది చేసుకున్నాడు. ఆ సమయంలో బొంబాయి చీఫ్ జస్టిస్, సర్ బాసిన్ స్కాట్ పటేల్ ని ప్రభుత్వ సర్వీసులో చేరమని ఆహ్వానించాడు. అయితే దేశాభిమానం మెండుగాగల పటేల్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించి క్రిమినల్ లాయరుగా పేరు ప్రఖ్యాతలు పొందసాగాడు. ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోధ్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగామహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడు. 1917లో మొదటిసారిగా పటేల్ కు గాంధీలోని నిర్మలత్వం, నిరాడంబరత్వం, స్వార్ధరహిత ప్రేమ, దేశాభిమానం పటేల్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో వ్యాపారం చేయటానికి వచ్చి, విభజించిపాలిస్తున్న ఆంగ్లేయులను తరిమి కొట్టాలనే ధృఢ నిశ్చయం ఆక్షణంలోనే తీసుకున్నాడు. ప్రజలలోకి చొచ్చుకొనిపోయి, వారి అవసరాలను తీర్చి, సహాయ సహకారాలు అందజేసి, వారిసహాయంతోనే విదేశీయుల్ని వెళ్ళగొట్టవచ్చుననే అభిప్రాయం కలిగి అహమ్మదాబాదు మున్సిపల్ ఎన్నికలలో పోటీచేసి సభ్యుడిగా ఎన్నికయ్యాడు. అనంతరం అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. పటేల్ అధ్యక్షుడిగా నిర్వహణా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన చేసిన సేవల వర్ణనాతీతం. నగరంలో ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపించటం జరిగింది అప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలలూ వ్యాపారసంస్థలూ అన్నీ మూసేసి ప్రజలు భయబ్రాంతులై ఉన్న సమయంలో పటేల్ ఆరోగ్య అధికారులతో నగరంలోని ప్రతి మారుమూల ప్రాంతంలోనూ తిరిగి ఒక్కరినీ వదలకుండా అందరికీ వైద్యం అందించాడు. రోగుల దగ్గర నిర్విరామంగా గడపటం వలన ఆయనకు కూడా దురదృష్టవశాత్తు ఆ వ్యాధి సోకింది. కొద్ది రోజుల్లోనే ఆయనకు వ్యాధి తగ్గింది.ప్లేగు వ్యాప్తి చెందినప్పుడే కాకుండా, వరదల్లోనూ, కరువుకాటకాల్లోనూ ప్రజలకు అండగానిలిచి వారి అభిమానం చూరగొన్నాడు. ఇతను ప్రముఖ స్వాతంత్ర యోధుడు మాత్రమే కాడు, స్వాతంత్రానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సపలుడైన ప్రముఖుడు. గాంధీజీతో పాటు అనేక సత్యాగ్రహాలు చేసి సహాయ నిరాకరణోధ్యమాలు నిర్వహించి కారాగారాలు అనుభవించి బ్రిటీషు వారి గుండెల్లో గుబులు కలిగించాడు పటేల్. సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఉధ్యమంలోనూ పాల్గొన్నాడు. 1931లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు అధ్యక్షత వహించాడు. భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించాడు. రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించాడు. స్వాతంత్రానంతరం జవహార్ లాల్ నెహ్రూ మంత్రిమండలిలో హోంమంత్రి గాను, ఉప ప్రధానమంత్రి గాను బాధ్యతలను నిర్వహించాడు. దేశవిభజన అనంతరం అనేక ప్రాంతాలలో జరిగిన అల్లర్లను చాకచక్యంతో అణచివేశాడు. నెహ్రూ మంత్రిమండలిలో ఉన్ననూ అనేక విషయాలలో నెహ్రూతో విభేధించాడు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు బలప్రయోగం చేపట్టి సఫలుడైనాడు. కేవలం 40 మాసాలు మాత్రమే పదవిలో ఉన్ననూ అనేక దేశ సమస్యలను తనదైన పద్దతితో పరిష్కరించి 1950 డిసెంబరు 15న మరణించాడు. మరణించిన 4 దశాబ్దాల అనంతరం 1991లో భారత ప్రభుత్వం భారతరత్న బిరుదాన్ని ఇచ్చి గౌరవించింది.
ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.
అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ ముద్దపప్పోయ్, మూడట్లోయ్ చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం''
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది. ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది. తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి. నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం. గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.