అత్రి మహర్షి అతి ఘోరమైన తపస్సు చేయగా త్రిమూర్తులు సాక్షాత్కరించి వరాన్ని కోరుకోమంటారు. అత్రి మహర్షి ఆ త్రిమూర్తులనే తనకు పుత్రుడుగా జన్మించి సమస్త ప్రజలకు సర్వదు:ఖాలను పోగొట్టగల మహాయోగాన్ని అనుగ్రహించమని కోరుకుంటాడు. ఇది ఇలా ఉండగా అనసూయాదేవి సుమతి అనే పతివ్రత వలన సూర్యోదయం ఆగిపోగా, ఆమెకు నచ్చజెప్పి సూర్యోదయాన్ని తిరిగి జరిగేలా చేస్తుంది. ఈ కార్యానికి సంతోషించి త్రిమూర్తులు వరాన్ని ప్రసాదించగా మరల తన భర్తకోరిన వరాన్నే కోరుతుంది.
ఆ పతివ్రత ఫలితంగా మార్గశిర పౌర్ణమి రోజు సద్యోగర్భంలో అనసూయాత్రులకు దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో జన్మించాడు. ఆ బాలునికి మూడు తలలు ఆరు చేతులు ఉన్నాయి. దత్తాత్రేయస్వామి వివిధ రూపాలలో కనిపించి వివిధ భక్తులను అనుగ్రహించాడు. ఆయారూపాలు వేర్వేరు పేర్లతో ప్రసిద్ధి చెందాయి.
మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతి గా వ్యవహరిస్తారు, దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి , కుక్కల పండగగా వ్యవహరిస్తారు . ఈ రోజు కుక్కలకు సజ్జ బూరెలు, తెప్పాల చెక్కలు ఆహరం పెట్టటం సాంప్రదాయం . దత్తాత్రేయుడు నాథ సంప్రదాయంలో ఆది సిద్ధుడు గా గుర్తించబడ్డాడు.
ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతం పొందుపర్చబడింది. దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది, దీంట్లో కృష్ణుడు దత్తాత్రేయుడి ఇరవై-నాలుగు గురువుల జాబితాను పేర్కొన్నాడు: భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రం, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పం, సాలీడు మరియు కందిరీగ. దత్తాత్రేయుడి 24 గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత్ యొక్క 24 గురువులనుంచి వచ్చారు.
శ్రీ శ్రీ శ్రీ గురు దత్తాత్రేయులవారి జన్మదిన శుభాకాంక్షలు.