పక్షి శరీరమున ఆవేశించిన బకాసురుని నోరుచీల్చి తన్ను కాపాడుకొని మనను కాపాడిన శ్రీ కృష్ణుని, దుష్ట రాక్షసుడగు రావణుని పది తలలను హేలగా చిగుళ్ళు త్రుపినట్లు త్రుంపి పారవేసిన శ్రీ రాముని గానముచేయుచూ పోయి మనతోడి పిల్లలందరును వ్రత క్షేత్రమును చేరినారు. లోపల ఉన్న తుమ్మెదగల తామరపూలను పోలిన కన్నులు కలదానా !
లేడిచూపులు వంటి చూపులు కలదానా ! శుక్రుడు ఉదయించుచున్నాడు . గురుడు అస్తమించుచున్నాడు . పక్షులు కిలకిల కూయుచున్నవి . కృష్ణ విరహ తాపము తీరునట్లు చల్లగా అవగాహన మొనర్చి స్నాన మోనర్పక పాన్పుపై ఏల పడుకున్నావు. ఓ సుకుమార స్వభావురాలా! ఈ మంచి రోజున నీవు నీకపటమును వీడిచి మాతో కలసి ఆనందము అనుభవింపుము.
లేగ దూడలు గల గేదెలు పాలుపితుకువారు లేక లేగ దూడలును తలంచుకొని వానిపై మనసు పోవుటచే ఆ దూడలే వచ్చి మొదుగులో మూతి పెట్టునట్లు తోచి పొదుగునుండి కారిపోవుటచే ఇల్లంతయూ బురధగుచున్న ఒకానొక మహైశ్వర సంపన్నుని చెల్లెలా! మంచు తలపై పడుచుండ నీ వాకిట నిలచియుంటిమి. కోపముతో దక్షిన దిక్కున నున్న లంకకు అధిపతియైన రావణుని చంపిన మనోభి రాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది వినియైనను నీవు నోరు విప్పవా? ఇంక మమ్మేలు కొనవా? ఏమి యీ గాఢ నిద్ర? ఊరివారందరుకూ నీ విషయము తెలిసిపోయినది. లెమ్ము అని కృష్ణుని విడువక సర్వ కాలముల నుండుటచే స్వధర్మమును కూడ చేయలేని దశయందున్న ఐశ్వర్యసంపన్నుడగు ఒక గోపాలుని చేల్లెలిని మేల్కొల్పినారు.