ఒక గుత్తి దీపములు చుట్టును వేలుగుచుండగా , ఏనుగు దంతము లతో చేయబడిన కోళ్ళు గల మంచముపై నున్న, చల్లదనము, మెత్తదనము, తెల్లదనము,ఎత్తు , వెడల్పు కలిగిన పాన్పులపై ఎక్కి , గుత్తులు గుత్తులుగా వికసించుచున్న పూలు తలలో ముడుచుకోనిన కేశ పాశము గల నీలాదేవి యొక్క స్థనములపై తన శరీరమును ఆనుకొని పరుండి విశాలమైన వక్షస్థలము గల శ్రీ కృష్ణా నోరు తెరచి మాట్లాడు . కాటుక పెట్టికోనిన విశాలమైన కన్నులు కల ఓ నీలాదేవి ! నీవు నీ ప్రియుని ఎంతసేపు లేవనీవు?ఇంత మాత్రపు ఎడబాటుకుడా ఓర్వ లేకుండుట నీ స్వరుపమునకు, నీ స్వభావమునకు తగదు.
ఏనుగులతో పోరాడగలిగినవాడును, మదము స్రవించుచున్న ఏనుగు వంటి బలముకలవాడును, మదము స్రవించుచున్న ఏనుగులు కలవాడును, యుద్దములో శత్రువులను చూచి వెనుకకు జంకని భుజబలము కలవాడును అయిన నందగోపుని కోడలా ! సుగంధము వెదజల్లు కేశ పాశము గల ఓ నీలాదేవి ! తలుపు గడియ తెరువుము . కోళ్ళు అంతటా చేరి అరుస్తున్నాయి . మదవీలతప్రాకిన పందిరిమీద గుంపులు గుంపులుగా కూర్చొని కోకిలలు కూస్తున్నాయి. కావున తెల్లవారినది , చూడు. బంతిని చేతిలో పట్టుకోన్నదానా! మీ బావ గుణములను కీర్తించుటకు వచ్చితిమి . నీవు సంతోషముతో లేచి నడచి వచ్చి. ఎర్ర తామర పూలు ను పోలిన నీ చేతితో, అందమైన చేతి కంకణములు గల్లుమని ధ్వని చేయునట్లు తలుపు తెరువుము. అని నీలాదేవిని కీర్తిస్తున్నారు . ఈ పాశురములో అమ్మవారిని దర్శించ వచ్చునని పెద్దలు అంటారు.
వస్త్రములు కావలసినవారికి వస్త్రములు, మంచి నీరు , అన్నము కావసినవారికి అన్నము, ఫలాభిసంధి లేక ధర్మ బుద్ధితో దానము చేయు నందగోపాలా! మా స్వామీ! మేల్కొనుము , ప్రబ్బలి చెట్ల వంటి సుకుమారములగు శరీరములు గల స్త్రీలలో చిగురువంటిదానా! మా వంశమునకు మంగలదీపము వంటిదానా! మా స్వామినీ ! యశోదా! మేలుకొనుము. ఆకాశ మధ్య భాగమును చీల్చు కొని పెరిగి లోకముల నన్నిటిని కొలిచిన త్రివిక్రమా ! నిత్యసురులకు నాయకుడా! నిద్ర పోకూడదు. మేల్కొనుము. స్వచ్ఛమైన ఎర్రని బంగారుముతో చేయబడిన కడియము కాలిని దాల్చిన బలరామా! నీవును, నీ తమ్ముడును మేల్కొనవలెను. అని గోపికలు ప్రార్ధించిరి.