బుధవారం, డిసెంబర్ 06, 2017
విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతునకూహింప జన్మమికనేడ
సర్వ పరి పూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు కాలూదనొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమిక నేడ
నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు కానవిన వేడ
పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాములేడ
ఆదివారం, అక్టోబర్ 22, 2017
నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమోస్తుతే
మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా. దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి. ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు. నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు. ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
నాగులు చవితి రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి.
పాము పుట్ట లో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు.
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
నాగులు చవితి శుభాకాంక్షలు.
శనివారం, అక్టోబర్ 21, 2017
దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు. వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు. దీనికి ఒక కదా వుంది. ఆ కద ఏంటి అంటే. యముడు యమునా సోదర సోదరిమణులు. వారు కలసి పెరిగారు. యమున ఒక అందమైన యువరాజును వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది. అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు. కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు. ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే. యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది. ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని. ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది. యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది.
ఇది దీపావళి తరువాత రెండు రోజులుకు వచ్చింది. ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు. అది చూసి యముడు చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు. వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు. యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు. నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు. ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది. అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు.
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు. యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది. అది ఏమిటంటే అన్నదమ్ములు కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు. ఈవిధంగా యమద్వితీయ జరుపుకుంటారు . అందరికి భగినీ హస్త భోజన శుభాకాంక్షలు.
శుక్రవారం, అక్టోబర్ 20, 2017
ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు. ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.
గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:
“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.
శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ