పురాణాలలో శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలు ధరించాడు అని వుంది. విష్ణువు అవతారాలలో మొట్టమొదటి అవతారమే ఈ మత్స్యావతారం. ఈ అవతారములో రెండు ముఖ్యమైన పనులు చేసారు. అవి 1 ) ప్రళయకాలంలో జీవరాసులను నావలో జలనిధిని దాటించడం. (2) వేదాలను కాపాడడం.
పూర్వం వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. సత్యవ్రతుడనే రాజర్షి మాలానదిలో తర్పణ మర్పిస్తూండగా . అప్పుడు అతని చేతిలోనికి ఒక చేపపిల్ల వచ్చింది. దానిని తిరిగి వదలి పెట్టబోగా అది తనను కాపాడమని కోరింది. సరే అని ఇంటికి తీసికొని వెళ్ళగా అది ఒక్క ఘడియలో చెంబుకంటె పెద్దదయ్యింది. ఇంకా పెద్ద పాత్రలో వేస్తే ఆ పాత్ర కూడా పట్టకుండా పెరిగింది. చెరువులో వేస్తే చెరువు చాలనంత పెరిగింది. నదిలో వేస్తె ఇంకా పెద్దయ్యింది. అప్పుడు రాజు "నీవెవరవు?" అని ఆ చేపను ప్రార్ధించగా ఆ చేప తాను మత్స్యాకృతి దాల్చిన విష్ణువునని చెప్పింది.
"శ్రీ లలనాకుచవీధీ కేళీ పరతంత్రబుద్ధిన్ క్రీడించు శ్రీహరీ! తామసాకృతిన్ ఏలా మత్స్యంబవైతివి?" అని రాజు ప్రశ్నించాడు.
అప్పుడు చేపగా వచ్చిన పరమాత్ముడు అతనితో, " ఇంకొక వారంలో ప్రళయం రానున్నది. నా ఆజ్ఞ ప్రకారం ఒక పెద్ద నావ నీ దగ్గరకు వస్తుంది. దానిలో అన్నిరకాల విత్తనాలు, ఔషదులూ, ఉంచు. సప్తర్షులు సకల జంతువులతో సహా వచ్చి నీ నావ ఎక్కుతారు. ప్రళయంలో ముల్లోకాలూ సముద్రంలో మునిగిపోయి , భయంకరమైన తుపాను వీస్తూ ఉంటుంది. భయపడకు. నా రక్ష వలన మీరు ఆ నావలో తిరుగగలుగుతారు. అంతా చీకటే అయినా సప్తర్షుల తేజస్సు మీకు వెలుగునిచ్చి కాపాడుతుంది. మీ దగ్గరకు ఒక పెద్ద చేప వస్తుంది. దానికి పెద్ద కొమ్ము ఉంటుంది. ఒక పెద్ద పాముతో మీ నావను దాని కొమ్ముకి కట్టు. ఆ చేప , బ్రహ్మ నిద్ర నుంచి లేచి కల్పం ఆరంభం అయ్యే వరకూ మిమ్ములని క్షేమంగా చూసుకుంటుంది" అని చెప్పి అంతర్థానమయ్యాడు. భగవంతుడు చెప్పినట్లుగానే తుపాను వచ్చింది. నావలో రాజర్షి సప్తర్షులతో, సమస్త బీజాలు , ఔషధాలు, జంతుజాలంతోనూ ఉంటుండగా , లక్ష యోజనాల పొడవు గల బంగారు చేప పెద్ద కొమ్ముతో వచ్చింది. దానికి రాజర్షి నమస్కరించి స్తోత్రం చేస్తూ , నావను దాని కొమ్ముకి పద్ద పాముతో కట్టాడు.
బ్రహ్మ మేలుకొన్నాకా ప్రళయం అంతమయింది. అప్పుడు నావలో ఋషులు స్తోత్రం చేస్తుండగా , మత్స్యావతారంలో ఉన్న పరమాత్ముడు వారికి మత్స్యపురాణ సంహితను చెప్పి , " బ్రహ్మ నిద్రలో ఉండగా వేదాలు అతని ముఖం నుండి బయటకు వచ్చాయి. దగ్గరలో ఉన్న హయగ్రీవుడనే రాక్షసుడు వాటిని యెత్తుకుపోతున్నది చూసి నేనీ అవతారంలో వాడిని సంహరించి , వేదాలను బ్రహ్మకు తిరిగి యెచ్చాను" అని వివరించాక , పరమాత్ముడు అంతర్థానమయ్యాడు. సత్య వ్రతుని కీర్తనలకు సంతోషించి శ్రీమత్స్యావతారమూర్తి అతనికి సాంఖ్యయోగ క్రియను, పురాణ సంహితను ఉపదేశించెను. అందరితోను, మూలబీజములతోను ఉన్న ఆ నావను ప్రళయాంభోనిధిని దాటించెను.
సత్యవ్రతుడు ప్రస్తుతం నడుస్తున్న "వైవస్వత మన్వంతరానికి" అధిపతి అయ్యాడు.
మత్స్యవతారాన్ని గురించి దాశరధి శతకము లోని కంచర్ల గోపన్న రాసిన మంచి పద్యం ఒకటి .
వారిచరావతారమున, వారిధిలో జొరబాఱి క్రోధ వి
స్తారగుడైన యా నిగమ తస్కరవీర నిశాచరేంద్రునిం
జేరి వధించి వేదముల చిక్క్డలించి విరించికిన్ మహా
దారత నిచ్చితీ వెగద దాశరథి కరుణాపయోనిధీ
భావం : దసరధ పుత్రా! దయానిధీ! రామా! మత్స్యావతారమునందు వేదములనుదొంగలించుకుపోయిన రాక్షసవీరుడగు సోమకాసురుని పట్టుకొనుటకు కోపాతిసయమును పొంది సముద్రము లోపలకు అతివేగముగా ప్రవేసించి వానిని చంపి, వేదముల చిక్కులను తోలగునట్లు చేసి మహాఔదార్యముతో బ్రహ్మకు ఆ వేదములను తిరిగిచ్చినమత్స్యావతారమూర్తివి నేవే.
ఈరోజు మత్స్యజయంతి అందుకే ఈ కద ను గుర్తు చేసాను. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో ఒకటైన మత్స్యజయంతి శుభాకాంక్షలు .