దసరా ముందువచ్చే అమావాస్య నాడు అనగా శ్రావణ బహుళ అమావాస్య రోజును పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారు. పూజలో ఒక కథ కూడా చెప్తారు. ఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు. పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు. నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు. అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు.
ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.
తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది.
ఇక కధ విషయానికి వస్తే:
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్ళు చేస్తారు. అందులో, ఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడు. కానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడు. అలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుంది. అప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు ఆపండుగ జరుపుకోలేకపోతున్నారు అని. ఆ బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుంది. అందరూ పూజ చేసుకుంటారు. అది అయ్యాక, ఆమె ఆ బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుంది. అదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి "ఎవరమ్మా నీవు? ఎవరా బాబు? ఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారు. దానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుంది. దానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మా" అంటారు. ఆమె తన గోడు చెప్పుకుంటుంది. వారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహా, ఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారు. వారిని చూసిన ఆశ్చర్యంలో ఆదంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరు. అప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుంది. అక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారు. అప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు."
ఈ కథ విన్న తరువాత చెప్పినవారు:"పోలేరమ్మ, నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతాను. నా ఇల్లు ఉచ్చతో, పియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది. కాని అది వారి పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది . ఆ కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు. తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు. అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు.