గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు. ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.
శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.