Blogger Widgets

శుక్రవారం, మే 02, 2014

ధనలక్ష్మి రూపేణ పాలయమాం

శుక్రవారం, మే 02, 2014


ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి! దుందుభినాదసుపార్ణమయే!!
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ! శంఖ నినాద సువాద్యనుతే!1
వేదపురాణేతిహాససుపూజిత! వైదిక మార్గ ప్రదర్శయుతే!!
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమాం
 వైశాఖ శుద్ధ తదియనే అక్షయ తృతీయ గా పిలుస్తారు. సంస్కృతం లో ' అక్షయ ' అనగా క్షయం కానిది , తరిగి పోనిది అని అర్థం. సూర్య చంద్రులిరువురూ అత్యంత ప్రకాశమానంగా ఉండే రోజు . ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా అమితమైన శుభ ఫలాలను ఇస్తుందని , ఈ రోజు మొత్తం శుభకరం కనుక వేరే ముహూర్తం కోసం వెతక వలసిన పనిలేదని హిందువులు నమ్ముతారు. వెండి బంగారాలను కొనుగోలు చేయడం చేస్తారు.
ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మిదేవిని తమ తమ ఇళ్లల్లో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతుంటారు. బంగారం కొనుగోలు చేయలేనివారు  ఉప్పును కొనుగోలు చేయవచ్చు. ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువే  కనుక బంగారం కొనలేనివారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని భావన.  వైశాఖ శుద్ధ తదియనాడు జరుపుకునే అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది. ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. 
ఈ రోజున బదిరీనారాయణ మందిరం ద్వారములు భక్తుల దర్శనం కోసం తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ రోజున దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్య ఫలము సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గోదానము, భూదానము. సువర్ణదానము, వస్త్రదానము చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. అందుచేత అక్షయ తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి, గౌరీదేవీకి డోలోత్సవము జరిపించి ముత్తైదువలను కన్యలను పూజించి ఫలపుష్పాదులను శనగలు వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరిసంపదలతో వెల్లివిరుస్తుందని విశ్వాసం. 
శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే "అక్షయ తృతీయ"గా పిలువబడుతోందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని విశ్వాసం. బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు.. ఉప్పు, పచ్చిబియ్యం, పసుపును ఓ అరటి ఆకుపై పోసి నిష్ఠతో ప్రార్థించి, కర్పూర నీరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామిని పుష్ప, ఫలాలను అర్పించి దైవ నామస్మరణ చేసిన వారికి సంపద, పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి. ఇంకా చెప్పాలంటే... ఈ రోజున గోధుమలు, శెనగలు, పెరుగన్నం దానం చేసిన వారికి సకల పాపాలు హరించి, శాశ్వతంగా శివసాయుజ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. వీటితో పాటు గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ఆర్జించిన జ్ఞానం, చేసిన దానాల ఫలం ద్విగుణీ కృతమవుతుందనీ , అత్యంత ఫలప్రదమవుతుందనీ నమ్మకం. ఉపవాస దీక్షల ద్వారా, పూజా కార్యక్రమాల ద్వారా భక్తులు ఈ రోజున దైవ ధ్యానం లో గడుపుతారు. నిత్యావసర వస్తువులనూ, వస్త్రాలనూ దానమిచ్చి తులసి తీర్థాన్ని విష్ణు మూర్తి విగ్రహం పై చిలకరిస్తూ స్వామిని పూజిస్తారు. అక్షయ తృతీయ నాడు చేసే గంగాస్నానం శుభ ఫలాలనిస్తుందని నమ్ముతారు.వేద వ్యాసుడు చెపుతుండగా, విఘ్ననాయకుడైన వినాయకుడు అక్షయ తృతీయ నాడే మహాభారత కథను లిఖించే మహత్కార్యాన్ని ప్రారంభించాడని చెపుతారు. మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముని పుట్టినరోజు కూడా ఈ రోజే . వనవాసంలో ఉన్న పాండవులు శ్రీ కృష్ణుడి కృప వల్ల అక్షయ పాత్రను పొందిన రోజూ కూడా ఇదే. అందుకే ఈనాడు భగవంతునికి అర్పించినదేదైనా అమిత ఫలాలనిస్తుందనీ, కొనుగోలు చేసినది ఏదైనా అక్షయమై నిలుస్తుందనీ భక్తులు నమ్ముతారు. ఈ రోజు వేకువ జామునే లేచి, మహా విష్ణు అవతారాలనూ, లక్ష్మీ దేవినీ పూవులతో, తులసీ దళాలతో అర్చిస్తారు. శ్రద్ధాసక్తులున్నవారు లక్ష్మీ కుబేర హోమాన్ని చేయించుకుంటారు. అన్నదానాలు నిర్వహిస్తారు.
అక్షయ తృతీయ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)