కాదన్న వారికి వారికర్మమే సాక్షి
యేదెస చూచిన మాకు నీతఁడే సాక్షి
వేదాలు సత్యమౌటకు విష్ణుఁడు మత్స్యరూపమై
ఆదటఁ దెచ్చి నిలిపె నది సాక్షి
ఆదిఁ గర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన
పోదితో నీతడు యజ్ఞభోక్తౌటే సాక్షి
అదె బ్రహ్మము సాకారమౌటకు పురుషసూక్త-
మెదుట విశ్వరూపము యిది సాక్షి
మొదలనుండి ప్రపంచమును తథ్యమగుటకు
పొదిగొన్న యాగములే భువిలో సాక్షి
బెరసి జీవేశ్వరుల భేదము గలుగుటకు
పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి
యిరవై దాస్యాన మోక్షమిచ్చు నీతడనుటకు
వరమిచ్చే శ్రీవేంకటేశుడే సాక్షి
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.