Blogger Widgets

బుధవారం, జనవరి 13, 2016

బోగి శుభాకాంక్షలు .

బుధవారం, జనవరి 13, 2016

 పండగ అనగానే పల్లెటూర్లు గుర్తువస్తాయి.  అక్కడ ప్రజలు పండగను వారి లోగిళ్ళు ను పెద్ద పెదా ముగ్గులతో అలంకరించుకుంటారు , రకరకాల పిండివంతలతోను, బండుమిత్రులతో వారు ఎంతో సంతోషంగా పండగను జరుపుకుంటారు.  నెలరోజులుగా మనకు పండుగ వాతావరణమే వుంది .  ఈ కాలం లో మనకు చలి ఎక్కువుగా ఉంటుంది. ఈ నెలరోజులు తెలుగువారి లోగిలి చాలా అందముగా ముస్తాబవుతుంది . ప్రతీ ఇంట రంగురంగుల ముగ్గులతో చక్కని వాతావరణముతో ముచ్చట గొల్పుతూ వుంటాయి. ఆ రంగుల ముగ్గులు  మద్యలో గొబ్బెమ్మలు ను అలంకరించుతారు. సాయంత్రము సమయాలలో పోలాల్లోనుండి  బళ్ళు ధాన్యపు బస్తాలతో నిండి వస్తాయి. చాలా ఆనందముగా సందడిగా ఉంటుంది . నెల రోజులు, పగటి వేషగాళ్ళు, హరిదాసులు ,గంగిరేద్దులువాళ్ళు వస్తూవుంటారు .
భోగి రోజు తెల్లవారుజాముననే లేచి నలుగు పెట్టుకొని స్నానాలుచేసి భోగి మంటను వెలిగిస్తారు . ఈరోజు బోగి మంట చాలా విశేషం.  అందరు భోగి మంట లో పాత కర్ర సమానులు వంటివి పనికిరానివన్నీ వేసి చలిని పారగోలుపుతారు. మూడురోజులు వరుసగా పండగ వుండటం  ఈ పండగను పెద్ద  పండగ అంటారు.  ఈ పెద్ద పండగకి కొత్త అల్లుళ్ళు అత్తగారింటికి తప్పకుండా వస్తారు. బావా మరదళ్ల ఆటలు అల్లర్లుతో పండుగ చాలా సంతోషకరమైన శోభతో ఉంటుంది. ఈ పండుగని రైతుల పండుగ అని కుడా అంటారు.  పండగ మొదటిరోజు ను బోగి అంటారు . ఈరోజు  సాయంత్రము సమయములో పేరంటాండ్లను  పిలిచి చిన్నపిల్లలకు బోగిపళ్ళు ను దిష్టితీసి వారి తలమీద పోస్తారు. ఈ బోగిపళ్ళులోకి శనగలు , పువ్వులు , అక్షింతలు, డబ్బులు, చెరుకుగడలు, రేగుపళ్ళు వేసిపిల్లలకు దిష్టితీసి తలమీదవేసి  ఆశీర్వాదిస్తారు. బొమ్మల కొలువు పెట్టి పేరంటాలకి పసుపుకుంకుమలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు.  సంక్రాంతికి గొబ్బిళ్ళు పెట్టి గౌరిగా సర్వమంగళగా ఆరాధిస్తారు. అలానే కన్నెపిల్లల్తోటి తప్పక గొబ్బిళ్ళు పెట్టిస్తారు. ఈ పండుగకి ముగ్గులులో గొబ్బెమ్మలు పెడతారు వాటి చుట్టూ ఆడ పిల్లలు అన్నమాచార్య రచించిన గొబ్బెమ్మల పాటలు పాడతారు.  

(1)కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో

కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో

దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో

పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో

దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో

(2) 
గొబ్బియ్యలో గొబ్బియ్యల్లో గొబ్బియ్యల్లో 

మన సీతాదేవి వాకిట వేసిన గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

మాణిక్యాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గులు మీద మల్లెపూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

నవరత్నాల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గుల మీద మొగలీ పూలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

ధాన్యపురాశుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గుల మీద సంపెంగలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గుల మీద మందారాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

భూదేవంతా ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గుల మీద నక్షత్రాలు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో || 

లక్ష్మీ రధముల ముగ్గులు వేసి గొబ్బియ్యల్లో 

ఆ ముగ్గుల మీద తులసీదళములు గొబ్బియ్యల్లో || గొబ్బియ్యల్లో ||
వంటి పాటలు పాడతారు . 
ఈ బోగి రోజు నెలరోజులు ధనుర్మాసము వ్రతము చేసిన గోదాదేవి రంగానాధునిని వివాహము చేసుకొని స్వామీ వారిలో ఐక్యము అయిపోతుంది.అందువలన అప్పటినుండి భోగి రోజు గోదా రంగానాయకులవివాహాలు ఆలయాలలోజరుపుతారు. ఈ వివాహము చూడటానికి రెండుకళ్ళుచాలని విధముగా చేస్తారు. ఇలా భోగి పండుగ ముగుస్తుంది.  బోగీ పండగ శుభాకాంక్షలు . 

ఆదివారం, డిసెంబర్ 20, 2015

వైకుంఠ ఏకాదశి - గీతా జయంతి

ఆదివారం, డిసెంబర్ 20, 2015



              హిందువుల పండుగలలో వైకుంఠ పదంతో రెండు ఉన్నాయి. ఒకటి వైకుంఠ చతుర్దశి, రెండు వైకుంఠ ఏకాదశి. అయితే ఈ రెండు పర్వాలు ఆంధ్ర ప్రాంతంలో వేరుపేర్లతో పిలుస్తారు.
వైకుంఠ ఏకాదశిని ఎక్కువగా ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. కాలపరిగణనంలో తెలుగువారిది చాంద్రమానం. వైకుంఠ ఏకాదశి సౌర మాన ప్రకారం జరిపే పండుగ. కర్కాటక సంక్రమణం, మకరసంక్రమ ణం మున్నగు పర్వాలవలె ఇది కూడ సౌరమానాన్ననుసరించి తెలుగు వారు జరిపే పండుగలలో ఒకటి. ధనుస్సు నెల పట్టిన తరువాత శుద్ధంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఇది మార్గశిరంలో కాని, పుష్యంలో గాని వస్తుంది.  ఇది వైష్ణవులకు, రామానుజ, మాధ్వమతస్థులకు చాలా ముఖ్య మైనది. అయినప్పటికీ దీనిని అందరూ ఈ ముక్కోటి ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారు. పంచాగ కర్తలు ఈనాటి వివరణలో వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, శ్రీరంగద్వారస్థ భగవదాలోకన మహోత్సవం అని వ్రాస్తారు. 
ఒకటి స్వర్గ ద్వారం, రెండు ముక్కోటి, మూడు వైకుంఠం. ఈ రోజు వైకుంఠ ద్వారాలు తెరుస్తారనీ, దక్షిణాయనంలో నిర్యాణమైనవారు స్వర్గంలో ప్రవేశిస్తారని నానుడి. ఈ కారణంచేత ఈ పండుగకు దక్షిణా దిని కొన్ని ప్రాంతాలలో స్వర్గ ద్వారం అనే నామం కూడా ఉంది.  ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరవాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.  
ఈ రోజుకు  ఇంకోప్రత్యేకత వుంది అదేంటి అంటే ఈ రోజునే గీతజయంతి. 
మహాభారతంలో శ్రీ కృష్ణుడు అర్జునునికి చేసిన ఉపదేశమే గీత.  గీతలో మొదటి శ్లోకం
ధృతరాష్ట్ర ఉవాచ: 
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | 
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ||
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునందు నా తనయులూ మరియు పాండురాజు తనయులు యుద్దము చేయగొరువారై సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?
అనే విషయంతో మొదలవుతుంది భగవద్గీత.  
హిందూ పవిత్ర గ్రంధం భగవ​ద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా మార్గశిర ​శుద్ధ ఏకాదశి  రోజు జరుపుకొంటారు.  ఈ రోజు కౌరవ రాజు దృతరాష్ట్రునికి సంజయుడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునునికి బోధించిన గీతోపదేశాన్ని వినిపించాడు.   భగవత్ గీత భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామ భూమి లో ఉపదేశిస్తాడు.అన్ని సంధి ప్రయత్నాలూ విఫలమైన తర్వాత, యుద్ధం ప్రకటిస్తారు పాండవులు. సంగ్రామ భూమిమీద అడుగు పెట్టిన తర్వాత ఆ మహా సైన్యం చూసి, వారిలో తన తాత అయిన భీష్ముడు వంటి వారిని చూసి నేను యుద్ధం చేయలేను అని అస్త్త్రాలు విడిచి పెట్టాడు.  అప్పుడు శ్రీ కృష్ణులు వారు గీతోపదేశం చేసారు. దాని సారం శాంతి. కృష్ణుడు అర్జునుడుతో ఇలా ఇన్నారు.
మిత్రమా !ఎందుకు భాధపడుతున్నావు !అయ్యిందేదో అయ్యింది . పొయిందేదో పోయింది .
ఈ లోకానికి వచ్చేటప్పుడు ఏమి తెలేదుకదా. వట్టి చేతులతో వచ్చావు ! పోయేటప్పుడు లగేజిలతో పొవాలనుకుంటున్నావు! అందుకే నీకంత యాతన. నువ్వేమి తెచ్చావని -నువ్వు పోగొట్టుకున్తున్నావు. నీవేమి సృస్తిమ్చావని నీకు నష్టం వచ్చింది? నువ్వు ఏదైతే పోదావో అది ఇక్కడనుండే పోదావు. ఏదైతే ఇచ్చావో అదీ ఇక్కడనుండే ఇచ్చావు.

ఈనాడు నీవు నీ సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం , రేపు ఇంకొకరి సొంతం కాగలదు.
కావున జరిగేది జరుగక మానదు . అనవసరంగా ఆందోళన చెందకు . ఆందోళన అనారోగ్యానికి మూలం. ప్రయత్నలోపంలేకుండా ప్రయత్నించు. ఫలితం ఏదైనా భగవంతుని ప్రసాదంగా స్వీకరించు అన్నారు.

సుమారు 6,000 సంవత్సరాల పుర్వం ఉపదేశించబడినా ఇది ప్రస్తుత కాలపు మానవులకు ఉపయోగపడడం విశేషము. ఇది మానవుల్ని మానవత్వం కలిగిన మంచి మార్గం లో నడిపిస్తుంది.  అనటంలో ఎటువంటి సందేహం లేదు.
మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టే జరిగితే అదే అదృష్టంగా బావిస్తాము.  అన్నిటిలోనూ మనం అనుకున్నది జరగక పొతే అప్పుడు మనం అనుకుంటాం మనకు ఆ గీత రాసి లేదు అనుకుంటాము.  మన గీత లోనే వుంది భగవద్గీత.  అడితెలిసినవాడు ఎటువంటి భాధకు లోనుకాడు. గీతను శ్రీ క్రిష్ణులవారు ద్వాపరయుగం చివర లో అనగా కలియుగానికి ప్రారంబం లో జరిగింది.  జగత్గురు శ్రీ కృష్ణులు కార్తీక బహుళ అమావాస్యనాడు చెప్పారు.  ఉపనిషిత్తులు ను అవులుగాను,  అర్జునుని దూడగా చేసి శ్రీ కృష్ణుడు పితికిన ఆవుపాల సారమే భగవద్గీత.  గీతను అర్జునునికి శ్రీ కృష్ణుడు చెప్పిన గీత జ్ఞానం అంతా 18 అద్యాయాలుగా పరమపదసోపాన మార్గంగా విరాజిల్లుతోంది.  ఎవరు సంసార సాగరాన్ని దాటాలనుకుంటున్నారో, అటువంటివారు గీత అనే ఈ నావనెక్కి సుఖంగా, సులువుగా ఆవలి ఒడ్డుకు చేరుకుంటారు. మోక్షస్థానాన్ని ల క్ష్యంగా చేసుకున్న వారు ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కి పరబ్రహ్మాన్ని పొందుతాడు.  
వ్యాసుని అనుగ్రహం వల్ల గీతాబోధనను సంజయుడు ప్రత్యక్షంగా వినగలిగాడు. అందువల్ల భగవంతుని ద్వారా విన్నది విన్నట్లుగా సంజయుడు గీతను లోకానికి అందించాడు. గీత అనే పదంలో గీ అంటే త్యాగం, త అంటే తత్వజ్ఞానం. అంటే త్యాగాన్ని, తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. అది భగవంతుని ముఖతః వెలువడింది కాబట్టి భగవద్గీత అయింది. గీతలో నిత్యజీవితంలో మానవుడు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి.
గీతను మొదట  ఎవరు విన్నారంటే... శ్రీకృష్ణపరమాత్మ గీతాబోధన చేయగా విన్నవారు అర్జునుడు, వ్యాసుడు, సంజయుడు, అర్జునుని రథంపై ఎగిరే ధ్వజరూపంలో ఉన్న ఆంజనేయుడు.
గీతామహాత్మ్యాన్ని శివుడు పార్వతికి, విష్ణువు లక్ష్మీదేవికి, బ్రహ్మ సరస్వతికి చెప్పారు. త్రిమూర్తులే ఒకరి సతులతో ఒకరు గీతామహాత్మ్యాన్ని చెప్పుకున్నారంటే సామాన్యులమైన మనమెంత? కనుక భగవత్ప్రసాదమైన ఈ మానవ జన్మను సార్థకం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవాలి. చదవలేనివారు వినాలి. అదికూడా సాధ్యం కానివారు కనీసం పూజగదిలో ఉంచి పూజించాలి.
గీతాగ్రంథాన్ని పఠించిన వారికే కాదు, పూజించిన వారికీ ప్రయోజనకరమే. యజ్ఞం చెసిన ఫలం.  సమస్త  భూమండలాన్నీ దానం చెసినంత ఫలం.  గీతాగ్రందాన్ని పూజించిన దానం చెసినా ఎన్నొ  ఎంత పుణ్యం లభిస్తుందో, గీతాగ్రంథాన్ని పూజించినా, దానం చేసినా అంతే పుణ్యం లభిస్తుంది. సకల పుణ్యతీర్థాలలో అన్ని వ్రతాలూ ఆచరించిన పుణ్యంతో సరిసమానమైన పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, గీతాగ్రంథం ఉన్న వారి ఇంట భూతప్రేత రోగబాధలతో సహా దైవిక-దేహిక పీడలు తొలగిపోతాయి.
ఆధునిక జీవితంలో యుద్ధాలు లేకపోవచ్చు కాని జీవనయానం కోసం వేసే ప్రతి అడుగూ ఒక యుద్ధభేరి వంటిదే. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అర్జునుడిలా, శ్రీకృష్ణునిలా అవతారం ధరించవలసిందే. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ఆనందం కలిగినప్పుడు పొంగిపోకుండా శాంతంగా, స్థిమితంగా ఆలోచించడం ఎలాగో వివరించిన గ్రంథం ఇదొకటే! కాబట్టి దీనిని మించిన జీవన విధానం, వ్యక్తిత్వ వికాసమూ మరొకటి లేదని చెప్పవచ్చు.
భగవద్గీత మానవ సుఖ జీవన మంత్రంగా ఉపయోగించుకోవచ్చు.  ఇది నిజం. 
వైకుంఠ ఏకాదశి - గీతా జయంతి  శుభాకాంక్షలు. 

గురువారం, డిసెంబర్ 17, 2015

మార్గశిర లక్ష్మివారము

గురువారం, డిసెంబర్ 17, 2015




సిరి మహాలక్ష్మి 
మార్గశిర లక్ష్మివార వ్రతము
మార్గశిర  నెలలో లక్ష్మీ పూజ చేసుకునే అన్ని సమస్యలను పరిష్కరించటానికి మరియు దేవత లక్ష్మీ దేవి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్య తో నివశించాగలరని  భక్తులు నమ్ముతారు.  మార్గశిర లక్ష్మీ పూజ  పూజ విధానం  దీపావళి  లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి  పూజ వంటి ఇతర లక్ష్మీ వ్రతం వలెనే  అయితే, ఈ దేవత కు సమర్పించే ఆ నైవేద్యం వైవిధ్యమైనది. 
మార్గశిర నెల గురవారం, భక్తులు దేవాలయాలు లోను  లేదా ఇళ్లలో లక్ష్మీ పూజ చెయ్యడానికి ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. ఇళ్ళు, శుభ్రం చేసి చక్కగా ఉంచబడిన పండుగ రోజులలో మరియు దేవత లక్ష్మి యొక్క చిత్రం లేదా చిన్న విగ్రహం పూజ ప్రదేశం వద్ద ఉంచుతారు. 
లార్డ్ వినాయక కు  మొదటి పూజలు చేస్తుంటారు. భక్తులు అవరోధాలు లేదా విఘ్నాలు వదిలించుకోవటం కొరకు గణపతి ప్రథమ పూజ చేస్తారు. గణపతి పూజ తర్వాత, దేవత లక్ష్మీ షోడశోపచార  పూజ మరియు అష్టోత్తరం  తో పూజలు మరియు నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం అందింస్తారు. మార్గశిర  లక్ష్మీ పూజ, కథ చదువుకోవాలి.
లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.
నైవేద్యం  లేదా మార్గశిర  లక్ష్మివార  వ్రతం  సమయంలో దేవత లక్ష్మీ దేవికి ఆహార సమర్పణలు:
1 వ గురువారం - పులగం 
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం -  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు, 
5 వ గురువారం - పూర్ణం బూరెలు 
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు.  అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.  ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.  ఆసుశీల  సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల.  ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది.  అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు.  పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని  సుశీల చాలా బాధపడుతుంది.  తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా!  నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.  సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు.  దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.  ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు.  ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు.  ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.  మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.  కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది.  వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి.  ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.  సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు.  జరిగిన విషయం తల్లికి చెప్పాడు.  తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.  మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను.  అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.  అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.  సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు.  ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను.  ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు.  ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు.  తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.  తల్లి విచారించింది.  కొన్నాళ్ళకు.  తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.  తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి  మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.  అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను.  ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.  కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది.  అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.  ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది.  రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది.  ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.  మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది.  పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది.  కూతురుమాత్రమే చేసుకున్నది.  నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది.  పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.  అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని.  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం .  అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది.  కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా....  నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది.  అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.  మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి.  సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం,  మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు,  పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.  కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు.  అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.  కధలోపమైనను వ్రత లోపము కారాదు.  భక్తి తప్పినను ఫలము తప్పదు.  

ఆదివారం, నవంబర్ 15, 2015

పాహిపాహి సర్పరూప

ఆదివారం, నవంబర్ 15, 2015



"కర్కోటకస్య నాగస్య దమయంతీ నలస్యచ 
ఋతుపర్ణంచ రాజర్షి కీర్తనం కలినాశనం"





పాముని చుడగా బెదిరి చోటన మంత్ర అక్షతల్
భూమిని చల్లగా విషము పోవును లొంగును భక్తికిన్ మరిం 
పాములు దుష్ట జంతువని భావము మాత్రమే కాని తప్పదే
కామిత సంతతిచ్చరయుగా అవిదేముడే ! కోల్వుడీ ప్రజల్

మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
లా "నాగుల చవితి రోజున ప్రత్యక్షముగా విషసర్పపుట్టను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే ..మానవునిలో ఉన్న "విషసర్పం కూడా శ్వేతత్వం పొంది,మన అందరి హృదయాలలో నివశించే "శ్రీ మహా విష్ణువు నకు" తెల్లని ఆదిశేషువుగా మారి "శేషపాంపుగా" మారాలనికోరికతో చేసేదే! ఈ నాగుపాము పుట్టలో పాలు పోయిటలలోగలాంతర్యమని చెప్తారు.

దీనినే జ్యోతిష్యపరంగా చుస్తే...కుజ,రాహు దోషాలున్న వారు, సాంసారిక బాధలు ఉన్నవారు, ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠీ ,చతుర్దశలలో రోజంతా ఉపవాశము ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరించాలి.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహి మే సదా!

నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 

ఆ ప్రకృతిని మానవుడు చెజేతులార నాశనం చేసుకుంటే, ఇటు మానవ కోటికి, అటు జీవ కోటికి తప్పక వినాశనానికి దారితీస్తున్నందున భావముతో నేడు ప్రకృతిని - పర్యావరణ రక్షణ అంటూ పలు కార్యక్ర
అలాగ ప్రకృతిని మానవ మనుగడకు జీవనాధరమైనది కనుక దానిని దైవ స్వరూపముగా భావించి ఆనాటి నుండి నేటి వరకూ చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని - ఇలాగ సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపముగా చూసుకుంటు పూజిస్తు వస్తున్నారు.

అదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత!

అలా మనకంటికి కనబడే విషనాగుపాము కంటే మానవ శరీరమనేపుట్టలో నిదురిస్తున్న నాగుపాము మరింత ప్రమాదకరమని చెప్తారు. 
ఈ మానవ శరీరము అనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు.

మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెమూకను "వెన్నుపాము" అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తూన్నట్లు ,కామ, క్రోధ, లోభ,మోహ,మద,మత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో "సత్వ గుణ" సంపట్టిని హరించివేస్తూ ఉంటుంది.

యుగాల నాటిది. సౌభాగ్యానికి, సత్సంతానప్రాప్తికి సర్ప పూజ చేయుట అనేది లక్షల సరత్తులనాడే ఉన్నట్లు మన పురాణాలలో ఎనో గాధలు కానవస్తున్నాయి. దేశమంతటా పలు దేవాలయాలలో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తు ఉంటాయి.

ఈ "నాగుల చవితి" నాడు నాగేంద్రుని శివభావముతో అర్చిస్తే సర్వరోగాలు పటాపంచలై సౌభాగ్యవంతులవుతారని ఋషివచనం .

నాగేంద్రా ! మేము మా వంశములో వారము నిన్ను ఆరధిస్తున్నాము. పొరపాటున "తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నా వాడు అనుకో! పడగ త్రొక్కితే కస్సుబూసుమని మమ్మల్ను భయ పెట్టకు తండ్రి ! అంటూ పుట్టకు ప్రదక్షిణ నమస్కారాలు చెయ్యాలని పెద్దలు అంటారు.

ఈ నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుంది అని శస్త్రాలు పేర్కుంటున్నాయి. 

"కర్కోటకస్య నాగస్య
దమయంత్యా నలస్య చ 
ఋతుపర్ణస్య రాజర్షేః
కీర్తినం కలినాశనం

ఈ సర్పారాధనకు తామరపూలు, కర్పూరపూలు, మొదలైనవి ప్రీతికరమైనవి అని చెప్తారు.

సర్పారధనచేసే వారి వంశం "తామరతంపరగా" వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్ళల్లో ఇలవేల్పు సుబ్రహ్మణ్ణ్యేశ్వరుడే! 


నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నయని,గరళన్ని ఆయుర్వేద మందులలో తగుమోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఇలాగ ప్రకృతిలో నాగు పాములకు ,మానవ మనుగడులకు అవినవ భావ సంబంధం కలదని విదితమవుతోంది.

ఈరోజు నాగుల చవితి సందర్భముగా అందరికి నాగులు చవితి శుభాకాంక్షలు. 

బుధవారం, నవంబర్ 11, 2015

దీపావళి శుభాకాంక్షలు

బుధవారం, నవంబర్ 11, 2015


దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!
అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.
దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.
స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.
స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత
హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.
స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:
1) ఇంటిధ్వారం.
2) ధాన్యపుకొట్టు.
౩) బావి.
4) రావిచెట్టు.
5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
ఉల్కాదానం:
యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.
ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.
రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.
దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||
దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.
దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే .  
దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం.   ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.
అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.    

దీపావళి శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 09, 2015

ధనత్రయోదశి శుభాకాంక్షలు.

సోమవారం, నవంబర్ 09, 2015

ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్  అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది.  అందుకే, సంపద దేవుడు అయిన  కుబేరుడుతో  పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును  పవిత్రమైన రోజుగా  పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను  మరింత ముఖ్యమైన భావిస్తారు.  ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
 అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు.  ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు.  ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి.  ఈరోజు ధన్వంతరి జయంతి.  ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.




ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి  శుభాకాంక్షలు.

గురువారం, అక్టోబర్ 29, 2015

గౌరీవ్రతము / అట్లతద్ది

గురువారం, అక్టోబర్ 29, 2015

                       











ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.

అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం'' 
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''  
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే  అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి

మంగళవారం, అక్టోబర్ 27, 2015

వాల్మీకి జయంతి 27/10/2015.
వాల్మీకి సంస్కృత సాహిత్యం మొదటి కవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.  వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 

వాల్మీకి తపస్సంపన్నత తరువాత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది. మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)