ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండుగకు సాహిత్యానికి సామీప్యత వుంది. ఉపాధ్యాయులు కలసి ఈ పండుగ రోజులలో పిల్లలచేత రంగు రంగు కాగితాలు, రంగురంగు పువ్వులుతో చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకొని వెళుతూ! బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడిస్తూ వుండే వారు. వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. ఈ పండుగతో ఉపాధ్యాయులకు, శిష్యులకు గల అన్యోన్యతను వ్యక్తపరిచే సందడి కూడా తెలుగు నాట ఒక ప్పుడు ప్రచురంగా ఉండేది.
దసరా పండుగల సందర్భంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలులో వున్న ఆచారాల్లో కొట్టవచ్చేటట్లు కనిపించేవి తమిళ నాడులో ఆడపిల్లల బొమ్మల కొలువు, ఆంధ్రదే శాన బడిపిల్లల విల్లంబుల ధారణ పేర్కొనదగినవి.
గిలకలు పట్టడం. బడిపిల్లలు దసరా రోజులలో విల్లంబులు ధరించడం యుద్ధానికి కాదు, గురుదక్షిణ కొరకు. వీరి ఈ విల్లు అంబు ధరించటాన్ని గోదావరి ప్రాంతంలో గిలకలు పట్టడం అంటారు. గిలకలు పట్టి విద్యార్థులు ఇంటింటికి తిరిగి గురుదక్షిణ స్వీకరిస్తారు. దసరా పద్యాలు సరసులైన బిడ్డల తండ్రులపై పూలబాణాలువేస్తూ తమ ఆయుధాలకు నివే దన తెమ్మంటూ, పప్పుబెల్లాలిమ్మంటూ, తమ్ము విద్యావంతులుగా చేసిన గురువులకు కట్నా లిమ్మంటూ, అదే పాటగా, అదే ఆటగా గ్రామం అంతా కలకల విరిసే చిన్న బొట్టెల సందడితో పలు పలుకులు పలుకుతూ ఉండేది. ఎక్కడ విన్నా పసిపాపల పాటలే. ఎక్కడ విన్నా జయ జయ ధ్వానాలే. ఇవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమిదాకా వినిపించేవి. మనకు ఎన్ని పండగలో కదా! వాటిలో ఈ దసరా పండగ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది . బలే సరదాక సంతోషంగా వుంటుంది. ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు సెలవులు ఎక్కువగా వస్తాయి అందుకే. మా అమ్మగారు వాళ్ళు ఈ దసరా పండగకి వాళ్ళ అమ్మమ్మా, ఊళ్ళకి వెళ్ళేవారట. అక్కడ ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రము వరకు చాలా బాగా జరిగేవిట. అలాంటి పండగ విధానం మా అమ్మకూడా చూసింది నేనే చూడలేకపోయాను. ఎందుకంటే అలాంటివి ఇప్పుడు లేవుకదా. అవి విన్టువుంటే బలే అనిపిస్తోంది నాకు. మనకు దసరా సందడే తెలియదు మరి. ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు మరియు పాటలు అమ్మమ్మ నాకు రాసి ఇచ్చింది అవి మీకు కూడా share చేస్తాను చూడండి. మీకు నాలా తెలియకపోతే తెలుసుకోండి.
ఒకవేళ మీకు తెలుసా ఒకసారి ఆ రోజులు ను ఒకసారి గుర్తు చేసుకొని.
అప్పటి మీ అనుభవాలు నాపోస్ట్ లో కామెంట్ రూపంలో బ్లాగ్ మిత్రులతో షేర్ చేయండి.
దసరా పద్య మరియు పాటలు.
అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా
“అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” .
అని పాటలు పాడుకుంటూ బడి పిల్లలు వాళ్ళ ఉపాద్యాయులతో వారి ఇంటికి వెళ్లి పద్యాలూ పాటలు పాడేవారు. అప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వారికి పప్పు బెల్లాలు, మరమరాలు కలిపి ఇచ్చేవారు. కొందరు వారికి గిఫ్ట్స్, బుక్స్ మొదలగున్నవి ఇచ్చేవారట.
ఈ దసరా పండగ ఉత్సవాలలో నేటికి ఆచరించుచున్నది ఒకటి మాత్రం వుంది అది ఏమిటి అంటే అదే "శ్రీ రామ చంద్ర లీల ఉత్సవాలు" పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి "రాక్షస పీడ వదిలందని" భావిస్తూ బాణాసంచాలతో వారి బొమ్మలను తగుల పెడతారు.
అంతే కాదు మన ఇళ్ళల్లో ఈ పదిరోజులు బొమ్మల కొలువు పెడతారు. పెరంటాళ్ళను పిలిచి వారికి వాయనాలు ఇస్తారు. మరికొంతమంది లలితా సహస్త్రపారాయణ జరుపుతున్నారు. పండగ పాటలు పాడుకోవటానికి మనకు అస్సలు సమయమె వుండటంలేదు. కనీసం మన సంస్కృతి సాంప్రదయాలైనా తెలుసుకుంటున్నాం కదా దానికి మనం ఎంతో సంతోషించాలి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.