ఆదివారం, నవంబర్ 10, 2013
1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి, నేటి వైభవానికి కారణబూతమైనవాడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు సాహిత్యమునకు విశేష సేవ చేసిన ఆంగ్లేయుడు. తొలి తెలుగు శబ్దకోశమును ఈయనే ప్రచురించాడు. బ్రౌన్ డిక్షనరీని ఇప్పటికి తెలుగులో ప్రామాణికంగా ఉపయోగిస్తారు. తెలుగు జాతికి సేవ చేసిన నలుగురు ప్రముఖ బ్రిటిషు అధికారులలో బ్రౌన్ ఒకడు. ఆంధ్ర భాషోద్ధారకుడు అని గౌరవించబడిన మహానుభావుడు.దేశం నలుమూలలా చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.
1817, ఆగస్ట్ 13. ఇంగ్లండ్ నుంచి భారతదేశానికి ఓడ ఒకటి బయల్దేరింది. దాని పేరు కర్ణాటక్. వందలాది ప్రయాణికులున్నారు అందులో. ఆ వందల్లో ఓ అనామకుడు. 19 ఏళ్లవాడు పిల్లవాడే ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. భవిష్యత్తులో మరణశయ్యపై ఉన్న తెలుగు సాహిత్యాన్ని. శాస్త్రీయతా అనే గంగతో బతికించే సాహితీ భగీరథుడు. 'కానీ ఆ ఓడ ఎక్కేటప్పుడు అసలు 'తెలుగు' అనే మూడక్షరాల మాట విన్లేదు' అంటాడతను నిజాయతీగా. కానీ అతని జీవితం మొత్తాన్ని ఆ మూడు అక్షరాలే శాసించాయి. అతని మాటల్లో చెప్పాలంటే 'పిచ్చెక్కించాయి'. అతని వూపిరున్నంత వరకు వూడిగం చేయించుకున్నాయి! ఒక్క వ్యక్తి.. కేవలం ఒకే వ్యక్తి. పండితుల ఇంట్లో నా అనేవారులేక చెదలుపట్టిపోయిన తెలుగు సాహిత్యం బూజు దులిపాడు. మహరాజపోషకులు లేక... అణగారిన సారస్వతానికి అండగా నిలిచాడు. మిణుమిణుకులు మరిచిన అనర్ఘ రత్నాల మట్టితుడిచి సానబెట్టాడు. బ్రౌనే లేకుంటే.. మన తెలుగు సాహిత్యం మరొక వందేళ్లు వెనకబడి ఉండేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. సి.పి.బ్రౌన్ 1798 నవంబర్ 10న కలకత్తాలో జన్మించాడు. ఈయన తండ్రి డేవిడ్ బ్రౌన్ పేరొందిన క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణించిన తరువాత బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోయింది. బ్రౌను అక్కడే హిందూస్థానీ భాష నేర్చుకున్నాడు. తరువాత 1817 ఆగష్టు 4 న మద్రాసు లో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా మద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించాడు.1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరాడు. ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో పనిచేసినపుడు తెలుగులో మాట్లాడడం తప్పనిసరి అయ్యింది. అయితే తెలుగు నేర్చుకోడానికి సులభమైన, శాస్త్రీయమైన విధానం లేకపోవడం వలన, పండితులు తమ తమ స్వంత పద్ధతులలో బోధిస్తూ ఉండేవారు. తెలుగేతరులకు ఈ విధంగా తెలుగు నేర్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. భాష నేర్చుకోవడం లోని ఈ ఇబ్బంది, బ్రౌనును తెలుగు భాషా పరిశోధనకై పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు ఓ వ్యాకరణం, ఓ నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి మొదలైనచోట్ల పనిచేసి, 1826లో మళ్ళీ కడపకు తిరిగి వచ్చి అక్కడే స్థిర నివాసమేర్పరచుకొన్నాడు. అక్కడ ఒక బంగళా కొని, సొంత డబ్బుతో పండితులను నియమించి, అందులో తన సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించాడు. అయోధ్యాపురం కృష్ణారెడ్డి అనే ఆయన ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవాడు కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచితంగా భోజనవసతి కూడా కల్పించాడు. దానధర్మాలు విరివిగా చేసేవాడు. వికలాంగులకు సాయం చేసేవాడు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చుల కారణంగా బ్రౌను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడు. అప్పులు కూడా చేసాడు. 1834లో ఉద్యోగం నుండి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయి, తిరిగి1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చాడు. బ్రౌను మానవతావాది. 1832-33లో వచ్చినగుంటూరు కరువు లేదా డొక్కల కరువు లేదా నందన కరువు సమయంలో ప్రజలకు బ్రౌను చేసిన సేవలు ప్రశంసలందుకున్నాయి. ఆ సమయంలో కరువును కరువుగా కాక కొరతగా రాయాలని అధికారులు చెప్పినా, అలానే పేర్కొనడంతో వారి అసంతృప్తిని ఎదుర్కొన్నాడు. పదవీ విరమణ తరువాత 1854లో లండన్‌లో స్థిరపడి, 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసరుగా నియమితుడైనాడు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహము 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్ లో అవివాహితునిగానే మరణించాడు. ఈయనను కెన్సెల్ గ్రీన్ స్మశానంలో సమాధి చేశారు.
తెలుగు భాషకు చేసిన సేవ
వేమన పద్యాలను వెలికితీసి ప్రచురించాడు. 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించాడు.
1841లో "నలచరిత్ర"ను ప్రచురించాడు.
"ఆంధ్రమహాభారతము", "శ్రీమద్భాగవతము" లను ప్రచురించాడు.
తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కొరకు వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసాడు. 1840లో వ్యాకరణాన్ని ప్రచురించాడు.
లండన్‌లోని "ఇండియాహౌస్ లైబ్రరీ"లో పడి ఉన్న 2106 దక్షిణభారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించాడు.
బ్రౌన్ వ్యాయ ప్రయాసలకోర్చి సేకరించిన తెలుగు, సంస్కృత గ్రంధాలు అసంక్యాఖం. మనుచరిత్ర, రాఘవపాండవీయం, రంగనాధ రామాయణం, పండితారాధ్య చరిత్ర, దశావతార చరిత్ర మొదలైన కావ్యాలు, ప్రబంధాలు బ్రౌన్ కృషి వల్లనే తెలుగు వారికి అందుబాటులోకి వచ్చాయి.
"హరిశ్చంద్రుని కష్టాలు" గౌరన మంత్రిచే వ్యాఖ్యానం వ్రాయించి 1842లో ప్రచురించాడు.
1844లో "వసుచరిత్"', 1851లో "మనుచరిత్ర" ప్రచురించాడు. జూలూరి అప్పయ్య శాస్త్రి చేత వీటికి వ్యాఖ్యానాలు రాయించాడు.
1852లో "పలనాటి వీరచరిత్ర" ప్రచురించాడు.
చిత్తు కాగితాలు గా ఉపయోగిస్తున్నవేమన ప్రతులను చూసి బాధపడి, ఆ గ్రంధాన్ని పునర్ముద్రించాడు.
కడపలోను, మచిలీపట్నంలోను కూడా పాఠశాలలు పెట్టి ఉచితంగా చదువు చెప్పించాడు.
ఈ నాటికీ ప్రామాణికంగా ఉన్న బ్రౌన్ “ఇంగ్లిష్ – తెలుగు”, “తెలుగు-ఇంగ్లిష్” dictionary ని ఆయన 1852, 1853 లో సమకూర్చాడు.
రచనలు
ఆంధ్ర గీర్వాణ చందము కాలేజి ప్రెస్సు, మద్రాసు -1827.
లోకం చేత వ్రాయబడిన శుభ వర్తమానము, బైబిల్ కధల తెలుగు అనువాదం
రాజుల యుద్దములు, అనంతపురం ప్రాంత చరిత్ర.
తెలుగు-ఇంగ్లీషు, ఇంగ్లీషు-తెలుగు నిఘంటువులను రాసి, 1852, 1854లో ప్రచురించాడు.
తెలుగు వ్యాకరణము - 1840లో ప్రచురణ
వేమన పద్యాలకు ఆంగ్ల అనువాదం
|
బ్రౌన్ గురించి తెలుసుకోవాలని నాకు జిజ్న్యాస కలిగించిన నాటకం
తెలుగు సాహితీ పూ తోటను కాపాదడటానికి వచ్చిన తోటమాలి బ్రౌన్ తెలుగు భాషాబిమానులందరికి జయంతి శుభాకాంక్షలు |
శనివారం, నవంబర్ 09, 2013
|
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. |
శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ పేరొందిన సంగీత విద్వాంసులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంది 2006 వరకు ఆస్థాన గాయకులుగా ఉన్నాడు. అన్నమాచార్య సంకీర్తనలకు సంప్రదాయ సంగీత స్వరకల్పనలో ఆద్యుడు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశాడు. "వినరో భాగ్యము విష్ణుకథ..", "జగడపు చనువుల జాజర..", "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.." వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చారు. ఆయన సంప్రదాయ కర్ణాటక సంగీతంలొ, లలిత సంగీతంలో, జానపద సంగీతంలోనూ పేరుపొందిన అభినవ అన్నమయ్య శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు.స్వయంగా వాగ్గేయకారుడైన ఆయన హనుమంతునిపై "ఆంజనేయ కృతిమాల" (21 కృతులు), వినాయకునిపై (50 కృతులు), నవగ్రహాలపై ఇతర దేవతలపై కృతులు రచించాడు. ఆయన స్వంత కృతులు వెయ్యికి పైగా ఉన్నాయి. వాటిలో కొన్ని సంగీత స్వరాలతో సహా ప్రచురించబడ్డాయి.
ఆయన కృష్ణవేణి, నరసింహారావు దంపతులకు రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ లో జన్మించాడు. కర్ణాటక సంగీతంలో డిప్లొమా చేశాడు. ఆల్ ఇండియ రేడియోలో ఏ-గ్రేడ్ గాయకుడు. ఆయన సంగీత కళానిధి నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో అన్నమాచార్య సంకీర్తనలలో ప్రత్యేకత సంపాదించాడు. కేవలం సంగీతం నేర్చుకొవటమే కాకుండా, అన్నమాచార్య సంకీర్తనల స్వరకల్పనలోనూ, వాటికి సంగీత స్వరాలతో కూడిన పుస్తకాలు ప్రచురించడంలోనూ, సిడి రికార్డింగ్ లలోనూ పాలుపంచుకున్నాడు. ఆయన 1978లో అన్నమాచార్య ప్రాజెక్ట్ లో గాయకుడిగా చేరాడు. అన్నమయ్య సంగీత,సాహిత్యాలను ప్రజలకు చేరువ చెయ్యడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్, ఆయన సంగీత నైపుణ్యాన్ని ప్రదర్శించే చక్కని వేదికగా ఉపయోగపడింది. అక్కడ చేరినప్పటినుండి, 2006లో పదవీ విరమణ వరక్లు ఆయన ఈ ప్రాజెక్ట్ లో ముఖ్యులుగా ఉన్నారు. వివిధ స్థాయులలో ఈ సంస్థను గొప్ప సాంసృతిక సంస్థగా తీర్చిదిద్దటానికి కృషి చేశాడు. నాలుగు దశాబ్ధాల నాదోపాసనలో సంపూర్ణ విశ్వాసంతో, అంకిత భావంతో, పరిపూర్ణత కోసం నిరంతరం పరిశ్రమించాడు. 6000లకు పైగా కచేరీలు చేశాడు. 600లకు పైగా అన్నమాచార్య కీర్తనలకు స్వరకలపన చేశాడు.తితిదే కోసం ఆడియో రికార్డింగ్ లు చేశాడు, స్వరకల్పనతో కూడిన పుస్తకాలను ప్రచురించాడు. అన్నమాచార్య కృతులకు ఇంకా ప్రాచుర్యం కల్పించడానికి తరగతులు నిర్వహించాడు.
ఇంకా ఎంతో విలువైన సంగీత సంపదను మాలాంటివారికి అందజయ్యాలని కోరుకుంటున్నాను. ఈరోజు వారి జన్మదినము కావున వారు ఇలాంటి జన్మదినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను.
శుక్రవారం, నవంబర్ 08, 2013
గురువారం, నవంబర్ 07, 2013
ఆకాశం నీలంగా వుండడానికి, పగలు నక్షత్రాలు కనిపించకపోడానికి కారణాలు వివరించిన మహా శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్! ... వి.రామన్ చరిత్ర పుటలకు ఎక్కారు. ప్రపంచ వ్యాప్తంగా భారతావనికి వన్నె తెచ్చిన సి.వి.రామన్ తిరుచురాపల్లి సమీపంలో 1888 వ సంవత్సరం నవంబర్ 7న జన్మించారు. విశాఖపట్నంలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఎమ్మే చదివి ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేశారు. 1907లో ఉద్యోగరీత్యా కలకత్తాకు బదిలీ అయ్యారు. అక్కడ ఇండియన్ సైన్స్ అసోసియేషన్‌కు రోజూ వెళ్ళి పరిశోధనలు చేసుకునేవారు. రామన్ ఆసక్తిని గమనించిన కలకత్తా విశ్వవిద్యాలయం ఉపకులపతి అశుతోష్ ముఖర్జీ బ్రిటీష్ ప్రభుత్వానికి లేఖ రాస్తూ... రామన్ సైన్స్ పరిశోధనలను పూర్తి కాలానికి వినియోగించుకుంటే బాగుంటుం దని సూచించారు. కానీ, బ్రిటీష్ ప్రభుత్వంఅంగీకరించలేదు. ఉద్యోగానికి రాజీనామా చేసి పరిశోధనలు కొనసాగించాడు. రామన్ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు. 1928 ఫిబ్రవరి 28న సి.వి. రామన్ ''రామన్ ఎఫెక్ట్'' కనుగొని ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచాడు. మనదేశంలో పుట్టి, మనదేశంలోనే చదువుకొని, మనదేశంలోనే పరిశోధన చేసి, తన అత్యంత ... 1928లో రామన్‌కి ''సర్'' బిరుదు లభించింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి ఎనలేని గుర్తింపు తెచ్చిన ఆవిష్కరణ అది. దానికి గుర్తుగా ఈ రోజును భారత ప్రభుత్వం ‘జాతీయ సైన్స్’ దినోత్సవంగా ప్రకటించింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ .
భారతఖండం ఖ్యాతి దశదిశలా వ్యాప్తి చెందింది 1930వ సంవత్సరం ప్రతిస్ఠాత్మకమైన నోబెల్ బహుమతి రామన్ కు లభించింది. రామన్ పరిశోధనల్లో సౌందర్య దృష్టికి ప్రాముఖ్యతనిచ్చి ప్రకృతిపై దృష్టి సారించారు. సంగీతంలోని స్వరాలు,ప్రకృతిలోని రంగులు, ఆకాశం, నీటి రంగులు, పక్షులు, సీతాకోక చిలుకల అందాలు, నవరత్నాలు, నత్తగుల్లలు, వజ్రాలు ఇతని పరిశోధనా వస్తువులు."ఉదయాకాశంలోని వెలుగుల్లో చెట్లు ఎంత అందంగా కనబడతాయో మీరు ఎప్పుడైనా గమనించారా? నాకు వీటిని చూస్తూ ఉంటే స్పటిక నిర్మాణం గురించిన ఆలోచనలు వస్తుంటాయి. "అని చెప్పారు రామన్. అందుకే "విజ్ఞానం అత్యుత్తమైన సృజనాత్మక కళారూపం" అన్నారు. గులాబీ తోటను అమితంగా ప్రేమించేవారు.
SIR CV Raman's Interview
రామన్ ఫలితము - అనువర్తనాలు(ఉపయోగాలు)
- అణు నిర్మాణం, అణువుల ప్రకంపన అవస్థలు, అణు ధర్మాలు అధ్యయనం చేయవచ్చు.
- స్పటికంలో పరమాణువుల అమరిక, స్పటిక జాలకం, స్పటికీకరణ జలవంటి విషయాలు తెలుసుకోవచ్చు.
- రేడియోధార్మికత,అణుశక్తి, పరమాణుబాంబు వంటి విషయాలు తెలుసుకోవచ్చు.
- అన్ని రాళ్ళను సానబట్టినపుడు వాటి ఆకృతి, స్పటిక జాలక స్థాన భ్రంశము వంటి విషయాల అవగాహనకు రామన్ ఫలితం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా గృహాల్లో అందమైన మొజాయిక్ ఫ్లోరింగుకు ఉపయోగిస్తున్నారు.
- కర్బన రసాయన పదార్ధాల అమరికలో శృంఖలాలు, వలయాలు కనుగొని ఆరోమాటిక్ స్వభావ నిర్ణయం వీలవుతుంది.
- పలుచటి రాళ్ళలో స్పటిక నిర్మాణం ఎక్కువ వేడిమి, పీడనాల వల్ల ఖనిజాల స్వభావం జీవ ఖనిజాల లక్షణాలు తెలుసుకోవచ్చు.
- మిశ్రమ లోహాలు, ఆ లోహాలు, ప్రవాహ స్థితిలోనున్న లోహాల స్వభావ నిర్ణయం వీలవుతుంది.
- వాహాకాలు, అర్థవాహకాలు, అతి వాహకాల స్వభావం తెలుసుకోవచ్చు.
- మానవ శరీరంలోని ప్రోటీన్లు, అమినో ఆమ్లాలు, ఎంజైములు, నూక్లియాన్ల ఆకృతి, క్రియా శీలతల పరిమాణాత్మక విలువలు కనుక్కోవచ్చు.
- డీ ఆక్సీరైబోనూక్లిక్ ఆమ్లం (D.N.A) మానవ శరీర నిర్మాణంలో అతి ప్రధాన పదార్థం.దీనికి గల వేర్వేరు నిర్మాణ దృశ్యాలను రామన్ వర్ణపట మూలంగా తెలుసుకున్నారు.
- పిత్తాశయంలోని కొన్ని రకాల రాళ్ళు, జీవ భాగాల అయస్కాంతత్వం రామన్ పరిచ్ఛేదన పద్ధతిలో తెలుసుకోవచ్చు.
- మధుమేహం, కేన్సరు రోగుల ప్లాస్మా పరీక్ష, కండరాల నొప్పులు, బలహీనతలకు లోనైన వ్యక్తుల జన్యులోపాలను రామన్ ఫలితంతో తెలుసుకోవచ్చు.
- వివిధ రకాలైన మందులు, ఔషధాలు డి.యన్.ఏ.పై చూపే ప్రభావాన్ని అంచనా వేయవచ్చు.
- వాతావరణంలో కాలుష్యాలైన CO2,CO,SO2,O3 ఉనికిని గుర్తించవచ్చు.
- జల కాలుష్యాలైన సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి పదార్థాలను, కీటక నాశన పదార్థాలు, సింథటిక్ పైరిత్రాయిడ్ల ఉనికి కనుక్కోవచ్చు.
- ప్లాస్టిక్కులలో రసాయనిక సమ్మేళనాన్ని కనుక్కోవచ్చు.
- ఏక, ద్వి, త్రిబంధ నిర్ధారణకు ఉపయోగపడుతుంది.
- ఆమ్లజని, నత్రజని వంటి సజాతి కేంద్రక అణువుల్లో కంపన మరియు భ్రమణశక్తి స్థాయిల గూర్చి తెలుసుకోవచ్చు.
- కాంతి స్వభావ నిర్ధారణ, వస్తువులతో కాంతికి గల పరస్పర చర్యా విధానం పదార్ధ ఉపరితలాలపై కాంతి క్రియా విధానం విషయాలు అధ్యయనం చేయవచ్చు.
- ఘన పదార్ధల స్పటిక స్థితి, ద్రావణీయత, విద్యుత్ విఘటనం విషయాలు తెలుసుకోవచ్చు.ఆధునిక విజ్ఞాన,సాంకేతిక శాస్త్రాల్లో రామన్ ఫలితము అతి ప్రధానమైన ప్రయోగాత్మక సాధనం. అంతర్జాతీయ వైజ్ఞానిక - సాంకేతిక శాస్త్రంలో కీలక పాత్రను వహిస్తున్న రామన్ ఫలితం భారతీయుడు కనుక్కోవడం భరతజాతికి గర్వకారణం.
భారతరత్న సర్ చంద్రశేఖర వేంకట రామన్ జయంతి శుభాకాంక్షలు
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ