జాలరి అంటే పడవ నడిపేవాడు అని అర్ధం. ఆంద్రా జాలరి అంటే ఆచార్య డి.వై.సంపత్ కుమార్. ఇదివరకు తెరచాప పడవకు గట్టిగా కట్టి గాలి వాటంతో నీటిమీద ప్రయాణం చేసేవారు లేదా చేపలు పట్టేవారు. గాలి లేనప్పుడు పడవ సరంగులు పడవకు తాడు కట్టి కాలువ గట్టున నడుస్తూ లాగేవారు. బరువైన పడవల్ని అతి కష్టంగా అరుపులతో, కేకలతో పాటలతో పడవల్ని లాగే వారు. పాడుతూ లయప్రకారం అడుగులు వేస్తూ పాట పాడుతూ కష్టం తెలియకుండా పడవను ఒడ్డుకుచేర్చేవారు .
ఆంధ్రజాలరి గా ప్రఖ్యాతి వహించిన సంపత్కుమార్ జాలరి వేషం ధరించి
ఉదయాన్నే లేచి ఎంతో సంతోషంగా చేపలు పట్ట టానికి తన నావతో సముద్రంలోకి వెళతాడు.
చేపల కోసం గాలిస్తాడు.
ఇంతలో కారు మేఘాలతో తుపాను కమ్ముకుంటుంది.
పడవ వూగిపోతూ వుంటుంది.
జాలరి మెలికలు తిరిగి పోతాడు.
ఇంతలో ఒక పెద్ద చేప గాలానికి తగుల్కుని జాలర్ని అతలాకుతలం చేస్తుంది.
అయినా పట్టు విడువని జాలరి పడవలో తల క్రిందులై పోతూనే ఎంతో కష్ట పడి ఆ చేపను ఒడ్డుకు చేర్చటం తుఫాను హోరు తగ్గి పోవటంతో విజయ వంతంగా ఆనందంతో గంతు లేస్తాడు.
ప్రదర్శనానికి రంగ స్థలం తెరమీద బ్యాక్ ప్రొజక్ష్ణన్ తో సముద్ర హోరుని చూపిస్తారు. ఉరుముల్ని, మెరుపుల్ని లైటింగ్ తో జిగేలు మనిపిస్తారు. నేపద్య్యంలో సన్ని వేశాన్ని అనుసరించి తబలా ధ్వనులు అద్భుతంగా సహరిస్తాయి. ఈ కళా రూపాన్ని అత్యద్భుతంగా సృష్టించిన ఘనత సంపత్కుమార్కు దక్కుతుంది. ఈ కళారూపానికి సంబంధించిన పడవ పాటల్ని ప్రజా నాట్య మండలి రాష్ట్ర దళం జాతీయ సమైక్యతకు ఉపయోగించిందిపడవ సరంగులుగా, జాలరులుగా కొంత మంది వేషాలు ధరించి రంగ స్థలం మీద జాలరుల వేషాలతో గడ పట్టి పడవ నడపటం, చుక్కాని పట్టటం, తెర చాప ఎత్తటం మొదలైన అభినయాలతో విద్యార్థులు మొదలైన వారు అక్కడక్కడ ప్రదర్శించేవారు. కానీ ఈ జాలరి వేషాన్ని విజయనగరం కు చెందిన డి.వై.సంపత్ కుమార్ తన నాట్య ప్రదర్శనలతో పాటు ఈ వేషాన్ని అత్యద్భుతంగా ప్రదర్శించి జాతీయ అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించారు. అవార్డుల నందుకున్నారు. ప్రజానాట్య మండలి కళాకారుడుగా ఈ కళా రూపాన్ని దేశ మంతటా ప్రదర్శించారు. జాలరి నృత్యం అద్భుతమైన కళాఖండంగా చెప్పవచ్చు. నేడు ఆచార్య డి.వై.సంపత్ కుమార్ గారి జయంతి సందర్బంగా జాలరినృత్యము గురించి తెలుసుకున్నాం.
ఆచార్య డి.వై.సంపత్ కుమార్ ను ఆంధ్ర జాలరి గావ్యవహరిస్తారు. ఇతడు భారతదేశంలో ప్రముఖ క్లాసికల్ మరియు ఫోక్ నృత్యములోను మరియు కొరియోగ్రఫీ లోనూ సుప్రసిద్ధుడు. ఈయన దక్షిణ భారత దేశంలోని ప్రాచీన సాంప్రదాయ కళలైన నృత్యం మరియు సంగీతాలను ఏకీకృతం చేశారు. ఈయన ప్రముఖ వైణికుడు అయిన శ్రీ పేరి నరశింహ శాస్త్రి వద్ద వీణా వాద్యం పై శిక్షణ పొందారు. శ్రీ దువ్వూరి జగన్నాథ శర్మ వద్ద భరతనాట్యం పై శిక్షణ పొందారు. వివిధ నృత్య రీతులను నిశితంగా అధ్యయనం చేసిన మీదట అతడు భరతనాట్యం , కూచిపూడి , యక్షగానం మరియు ఫోక్ నృత్యరీతులకు ఒక విశిష్టమైన విధానాన్ని ప్రవేశ పెట్టాడు. అయన కొన్ని వేల ప్రదర్శనలిచాడు. ఆయన అనేక రాష్ట్రాలలో నే కాకుండ వివిధ దేశాలలో కూడా ప్రదర్శనలిచ్చాడు. 1954 మరియు 1999 ల మధ్య 45 సంవత్సరాలలో అతని అధ్వర్యంలో 60 మంది ప్రముఖ కళాకారులు ఆయన శిక్షణలో తయారైనారు.ఆయన ప్రముఖ నృత్య శిక్షణా సంస్థ అయిన శ్రీ గీతా నృత్య కళాశాలను విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ లో ఏర్పరచి జాతీయ, అంతర్జాతీయ వేదకలపై సుమారు 3000 ప్రదర్శనలిచ్చి అనేక గౌరవాలను అవార్డులను పొందారు.
1957వ సంవత్సరం కొత్తఢిల్లీలో ప్రజా నాట్యమండలి ఐ.పి.టి.ఏ. వారి అధ్వర్యంలో అఖిల భారత నృత్య పోటీలు జరిగాయి . ప్రజా నాట్యమండలి ఉద్యమకర్త ప్రముఖ చలనచిత్ర నిర్మాత, దర్శకుడైన గరికపాటి రాజారావు , సంపత్ కుమార్‌ను ఆ పోటీల్లో పాల్గొనమని ప్రేరేపించాడు. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే అవకాశం కలిగించారు . సాధారణంగా ఒక నృత్యం ప్రదర్శించాలంటే చాలా మంది సహకారం అవసరమవుతుంది. అటువంటిది కేవలం ఇద్దరితో ఏ అంశం చేయాలో అనే ఆలోచనలో పడ్డ సంపత్ కుమార్‌కి సరోజిని నాయుడు వ్రాసిన " కోరమండల్ ఫిషర్స్" అనే ఆంగ్ల కవిత మదిలో మెదిలింది. ఆ ఆలోచన అతన్ని భీమిలికి తీసుకుపోయింది. అక్కడ సముద్ర తీరాన సాగరమే సంసారంగా, దినదిన గండంగా దినాలు గడిపే నిరుపేద జాలరుల జీవన సమరాన్ని, భావగర్భితంగా ఏ సాహిత్యము లేకుండా కేవలం " మైమ్ " తో ప్రదర్శించే మహత్తర భావం రూపుదాల్చుకుంది. అవసరార్థం, పోటీకొరకు, సరదాగా కూర్చిన ఈ నృత్యం ఇతివృత్తపరంగాను , సాంకేతికపరంగాను అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుందని ఆనాడు ఎవరూ ఊహించలేదు. కేవలం తబలా శబ్ద తరంగాలతో, అలలు, తూఫాను హోరు, ఉరుములు, మెరుపుల సృష్టితో, ప్రేక్షకుల్ని మైమరిపింపజేసే ఈప్రత్యేక తరహా నృత్య రూపకం అవతరించి, ఒక అద్భుతమైన కళాఖండమై విరాజిల్లింది.