Blogger Widgets

మంగళవారం, డిసెంబర్ 21, 2021

వినలేదటే వెర్రి జవరాలా! (కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ పాశురము)

మంగళవారం, డిసెంబర్ 21, 2021

 నిన్న ఉత్తిష్ట అను చిన్నగోపికను మేలుకోల్పిరి. మరి నేడు. వేదపఠనముకు ముందు ఎల్లప్పుడూ "శ్రీ గురుభ్యోనమః, హరిః  ఓమ్" అని ప్రారంభిస్తారు.  నిన్న గోపికలు మెల్కొలుపుటతో మన ధనుర్మాసవ్రతం ప్రారంభము అయ్యింది.  అందుకే పక్షులు కిలకిల రవములు, శంఖనాదము, హరి హరి అను వినబడుట లేదా అంటున్నారు.  పక్షులు శ్రీ గురుమూర్తులు.  అందుకే శ్రీ గురుబ్యోన్నమః అన్నట్లు భావించాలి.  తరువాత శంఖము హరి శబ్దము - హరిః ఓం అన్నట్లు భావించాలి. ఇలా వ్రతారంభము చేసి నేడు ఆ శ్రవణము లో వైవిధ్యమును వివరించుచు వేరొక గోపికను నిద్ర మేల్కొల్పుతున్నారు. మరి ఏవిధంగా లేపుతున్నారో చూద్దం. నేడు విశేష పాశురము కావున నేడు పులిహోర ఆరగింపు పెట్టవలెను.

కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ పాశురము: 
కీశు కీశెన్ఱెంగుం ఆనైచ్చాత్తన్ కలందు
పేశిన పేచ్చరవం కేట్టిలైయో పేయ్ ప్పెణ్ణే
కాశుం పిఱప్పుం కలకలప్ప క్కై పేర్ త్తు
వాశ నఱుం కుళల్ అయిచ్చ యర్ మత్తినాల్
ఓ శై పడుత్త తయిర్ అరవం కేట్టిలైయో
నాయగ ప్పెణ్ పిళ్ళాయ్! నారాయణన్ మూర్ త్తి
కేశవనై ప్పాడవుం నీ కేట్టే కిడత్తియో
తేశం ఉడైయాయ్! తిఱవేలోర్ ఎమ్బావాయ్.
తాత్పర్యము:
భరద్వాజ పక్షులు తెల్లవారుజామున లేచి అన్నివైపులా మాట్లాడుకుంటున్నాయి.  ఆ ధ్వని నీవు వినలేదా?
ఓ పిచ్చిదానా! పువ్వులతో చుట్టబడిన కేశబంధములు విడిపోవుటచేత సువాసనలు వేదజల్లుచున్న జుట్టుముడులతో ఉన్నగోప వనితలు కవ్వములతో పెరుగు చిలుకునప్పుడు పెరుగు కుండల నుండి వెలువడు మృదంగ గంభీరధ్వని ఆ కాంతల చేతుల గాజుల సవ్వడి మరియు మేడలో ఆభరణముల ధ్వని కలిసి ఆకాశమునకు తగులుచున్నవి.  నీ చెవికి సోకటం లేదా ?  
ఓ నాయకురాలా!  అంతటను వాత్సల్యముతో వ్యాపించి ఉన్న పరమాత్మ మనకు కనబడవలెను అని శరీరము ధరించి కృష్ణుడు అవతరించినాడు.  లోకకంటకులైనవారిని నశింపజేసిన ఆ స్వామిని మేము పెద్దగా కీర్తించుచుండగా నీవు వినియును మేల్కొనవేలా?  నీ తేజస్సును మేము దర్శించి అనుభవించునట్లుగా తలుపులు    తెరువవలేనని మేల్కొల్పుతున్నారు. 
వినలేదటే వెర్రి జవరాలా!

వినలేదటే వెర్రి జవరాలా!
వినియె హాయిగా పవ్వళించేవటే!
తనితనిగ తెలవారెనని కీచుకీచుమని
మునుమునుగ ఏటిరింతలు మూగి పలికేను ||వినలేదటే||

ఘల్లుమనగా కంఠసరులు కాసులపేర్లు,
జల్లగా కడల క్రొమ్ముడులు వాసనలు,
గొల్ల యిల్లాండ్రు తరిగోలలను కైకొనుచు,
పెల్లుగా చల్ల తరిచే సవ్వడి ||వినలేదటే||

హరిని నారాయణుని కైవారముల మేము
ఆలపించిన ఆలకించనే లేదటే
దొరసాని వౌరౌర! ఓ బాల లేచి
తెరవవే వాకిలి ఓసి తేజోవతీ! ||వినలేదటే||

సోమవారం, డిసెంబర్ 20, 2021

తెల్లవారుచున్నదిగదే! లేవే! లేవవే! (పుళ్ళుం శిలమ్బిన కాణ్ పాశురము )

సోమవారం, డిసెంబర్ 20, 2021

 ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమునకు అంతా సిద్దముచేసింది.  గోదాదేవి ఈ వ్రతమునకు తాను  ఒకత్తే కాకుండా మిగతా గోపికలును కూడా ఈ వ్రతమునకు రమ్మని ఆహ్వానించింది.  ఈ వ్రతము అందరు చేయచ్చు అని వ్రతము భగవద్ అనుగ్రహము కొరకు. పాడి పంటలు బాగుండాలి అని వర్షాలు పడాలి అని లోక కల్యాణానికి అని చెప్పింది.

 కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు భగవంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్రపోతున్నారు. ఆహా! కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోవటం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మట్టులాంటివి . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదామాత నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది. ఎలా అంటే.
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పాశురము :
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:  
భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు.  ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి.  ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది.  ఆ ధ్వని నీకు వినబడటంలేదా.  ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా?  పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను.  సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది.  నీవు కూడా లేచి రమ్ము.  అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.

తెల్లవారుచున్నదిగదే! లేవే! లేవవే!

తెల్లవారుచున్నదిగదే! లేవే! లేవవే!
కలకలా కూసేను పులుగులు - ఓ బాల!
అల గరుడవాహనుని గుడినుండి తెలిసంకు
అదిగదిగో పిలిచేను, లేవే! బాలలేవే! ||తెల్లవారు||

ఓలి పెనువిసపు చనుబాలు పీల్చినవాని,
లీల మాయశకటము కాల కూల్చినవాని,

మేలుకొని, రుషులు యోగులు మనసున లోనగొని
మరిమరీ హరిహరీ యను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే... ||తెల్లవారు||

పాలకడలిని పాపపానుపున యోగ ని
ద్రాళువగువాని కారణభూతుని

మేలుకొని, రుషులు యోగులు మనసున లోనగొని
మరిమరీ హరిహరీ యను మహాఘోషమ్ము
చొరబారి మా యెదలలో
చలచల్లనాయె గదవే... ||తెల్లవారు||

ఆదివారం, డిసెంబర్ 19, 2021

చెప్పరే! చెప్పరే! శ్రీ నామమములను! (మాయనై మన్ను వడమదురై మైందనై పాశురము)

ఆదివారం, డిసెంబర్ 19, 2021

 వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.

మాయనై మన్ను వడమదురై మైందనై పాశురము:
మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్
తాత్పర్యము:
 మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.
 
చెప్పరే! చెప్పరే! శ్రీ నామమములను!

చెప్పరే! చెప్పరే! శ్రీ నామమములను!
ఒప్పుల కొప్పులార! తప్పక! తప్పక!
ఎప్పుడో చేసిన తప్పులన్నీ నశింప
నిప్పులో తూలికలుగా! ఇప్పుడే! ఇప్పుడే!  || చెప్పరే||

అల్ల వ్రజవంశమ్మునకు కళ్యానదీపమైనవాని!
తల్లికడుపున కెల్లవేళల చల్లనగు వెలుగైనవాని,
అల్లన, అమలినలుగా ఏతెంచి, ధ్యానించి, ధ్యానించి, 
సల్లలిత, సుమము లర్పించి, సేవించి, సేవించి, ||చెప్పరే||

మాయవాని, ఉత్తర మధురాపురికి రేడైనవాని,
హాయిగా గంభీరయమునాతీరమున విహరించు వాని,
ఈయెడ, దామోదరుని, ధ్యానించి మరిమరి ధ్యానించి, 
తీయని అచ్చంపు పువులర్పించి  మరిమరి సేవించి ||చెప్పరే|| 

శనివారం, డిసెంబర్ 18, 2021

కురియుము కురియుము వర్షము! (ఆళి మళైక్కణ్ణా! పాశురము)

శనివారం, డిసెంబర్ 18, 2021

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటలతో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతమునకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.

ఆళి మళైక్కణ్ణా! పాశురము:

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్

తాత్పర్యము 
గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  

కురియుము కురియుము వర్షము!

కురియుము కురియుము వర్షము!
వరలగ జగతికి హర్షము!
ఓయి గంభీర హృదయ!
ఓహో వర్ష నిర్వాహ          ||కురియుము||

మురిసి మార్ఘశిరస్నాన
మును మే మొనరుప తడియక      ||కురియుము||

జలనిధిలో జొరబడి, అట సలిలమెల్ల త్రాగిత్రాగి,
ఫెళఫెళమని గర్జింపుచు, బిరబిర పై కెగసి ఎగసి,
అల కాలోపలక్షిత జగత్కారణుని మూరితి
నలె నీమెయి నీల నీలవర్ణముతో తేలతేల     ||కురియుము||

సుందరపటుబాహువు అరవిందనాభు మేటికరము
పొందిన శ్రీ సుధర్శనము పొలుపున తళతళామెరసి,
క్రందుగ దక్షిణావర్తమగు శ్రీ పాంచజన్యమ్ము
చందమ్మున ఉరిమి, శర్జమట్లు అంపజడుల చిమ్మి           ||కురియుము||

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)