Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 20, 2017

కృష్ణుని ప్రేమ అందరికి సమానమే

బుధవారం, డిసెంబర్ 20, 2017

ఆండాళ్ళు తల్లి ఈ వ్రతమునకు అంతా సిద్దముచేసింది.  గోదాదేవి ఈ వ్రతమునకు తానూ ఒకత్తే కాకుండా మిగతా గోపికలును కూడా ఈ వ్రతమునకు రమ్మని ఆహ్వానించింది.  ఈ వ్రతము అందరు చేయచ్చు అని వ్రతము భగవద్ అనుగ్రహము కొరకు. పాడి పంటలు బాగుండాలి అని వర్షాలు పడాలి అని లోక కల్యాణానికి అని చెప్పింది.
 కృష్ణ ప్రేమ పొందాలని చాలా కోరికతో కలలు కంటున్నారు మరి కొందరు. మరి కొందరు బగావంతుని ప్రేమ పొందుతున్నట్లు కలలు కంటూ మత్తుగా నిద్ర పోతున్నారు. ఆహా కృష్ణుడు కేవలము నా వాడే అనే తలంపుతో మగత నిద్రపోతున్నారు. కొందరైతే అస్సలు నిద్ర పోతాం లేదు. మరి కొందరు నిద్ర పోతున్నారు. అసలు శ్రీ కృష్ణుని ప్రేమ అందరికి సమానమే . మరి భగవంతుని గుణగణాలు మత్తులాంటిది  . అవి నిద్రను కలిగిస్తాయి .
ఆ నిద్రనుండి లేవని వారి పట్ల కుడా కృష్ణుని ప్రేమ ఎక్కువే. వారిని మనగోదా నిద్రలేపి వారి మనస్సులో వున్నా దోషాలను వారికి కమ్ము కున్న పొరలను తొలగిస్తుంది. భగవంతనుగ్రహము పొందేలా చేస్తుంది.
ఈ రోజు చిన్న పిల్ల అయిన ఉత్తిష్టను నిద్ర లేపుతున్నది. ఎలా అంటే.

పాశురము :

 
పుళ్ళుం శిలమ్బిన కాణ్ పుళ్ళరైయన్ కోయిల్
వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో
పిళ్ళాయ్! ఎళుందిరాయ్ పేయ్ములై నంజుండు
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై
ఉళ్ళత్తు క్కొండు మునివర్గళుం యోగిగళుం
మొళ్ళ ఎళుందరి ఎన్ఱ పేరరవం
ఉళ్ళం పుగుందు కుళిరుందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:  భగవదారణ పూర్వము లేనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుటచేత తానోక్కతియే తన భవనమున పరుండి నిద్రించుచున్న యొక్క స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొల్పుతున్నారు.  ఎట్లానగా ఆహారము సంపాదించుకోనుటకు పక్షులు గూళ్ళనుండి లేచి ధ్వని చేయుచు పోవుచ్చున్నవి.  ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రండి రండి అని ఆహ్వానించుచున్నది.  ఆ ధ్వని నీకు వినబడటంలేదా.  ఓ పిల్లా! లే ! మేము ఎలా లేచామో తెలుసునా?  పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురునికాలుతాపు తో కాలునివద్దకు పంపినవాడను.  సముద్రజలముపై హంసతూలికా తల్పముకంటే సుఖకరమైన శేషశయ్య పై లోక రక్షణమునే ఆలోచించు యోగానిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదములందు బంధించి మెల్లగా నిద్రమేల్కోను మునివర్యులు హరి హరి అని చేయు భగవన్నామ ధ్వని మా హృదయములో ప్రవేసించి మమ్ము నిద్రలేపినది.  నీవు కూడా లేచి రమ్ము.  అని నిద్రపోతున్న గోపికను గోదాదేవి చెలికత్తెలు లేపుతున్నారు.


విశేషార్ధాము:
పుళ్ళుం శిలమ్బిన కాణ్:
తెల్లవారు చున్నది అని తెలియచేయుటకు మొట్టమొదట పక్షులు కలకాలమును ఇందు చెప్పుచున్నారు. తెల్లవారుచున్నది అని తెలుసుకుని తాము ముందు లేచి ఇతరులకు మేల్కొల్పునవి పక్షులు.  తాము భగవదనుభావము ననుభవించి తమ వాక్కుచే ఇతరులకు కూడా భగవదనుగ్రము కల్గించుటకు మేల్కొల్పునట్లు చేయువారు మాహాఙ్ఞానులు .  వీరి వాక్కులచే ప్రాత:కాలము అవుచున్నది.
పుళ్ళరైయన్ కోయిల్ వెళ్ళై విళి శంగిన్ పేరరవం కేట్టిలైయో:
పక్షిరాజగు గరుడునియోక్క ప్రభువు అగు శ్రీ మహావిష్ణువు ఆలయములో మ్రోగుచున్న - అందరినీ ఆహ్వానించు-తెల్లని శంఖము యొక్క పెద్దధ్వనియు నీవు వినలేదా! 
పక్షుల కిలకిలలును ఆమె తెల్లవారినట్టు నమ్మటంలేదు అందుకు వారు వేరొక గుర్తు చెబుతున్నారు.  పక్షులకు రాజగు గరుత్మంతుడు ఆలయములో అందరినీ రమ్మని తెల్లని శంఖమును పూరించుచున్నాడు. ఆ ధ్వని చాలా పెద్దది ఆ ధ్వని నీకు వినబడలేదా అని అడుగుతున్నారు గోపికలు.
పిళ్ళాయ్! ఎళుందిరాయ్:
ఓ పిల్లా! లెమ్ము.  అప్పుడు ఆపిల్ల  మీరు వారికంటే ముందేలేచారు కదా ! మిమ్మల్ని ఎవరు లేపారు అని అడుగగా దానికి జవాబుగా మునులు, యోగులు వారి పక్కనుండి వీడి మెల్లగా లేస్తున్నప్పుడు ఉచ్చరిస్తున్న హరి హరి హరి అను శబ్దము మాకు వినబడినది అని చెప్పారు.  ఆ యోగులు స్మరించు సర్వేశ్వరుని గుణాలు మూడిటిని చెప్పి నిరూపిస్తున్నారు.
పేయ్ములై నంజుండు:
పూతన స్తనమునందలి విషమును ఆరగించి,
కళ్ళ చ్చగడం కలక్కళియ క్కాలోచ్చి:
కృత్రిమ శకటమును  సంధిబంధములూడినట్లు కాలుచాచి కూల్చి, 
వెళ్ళత్తరవిల్ తుయిల్ అమరంద విత్తినై:
క్షీరసాగరమున శేషశయ్యపై నిద్రపోవుచున్న కారణభూతుని,
ఉళ్ళత్తు క్కొండు:
హృదయమున పెట్టుకొని,
మునివర్గళుం యోగిగళుం మెళ్ళ వెళున్ధు:
మునులును, యోగులును మెల్లగా లేచి
అరియెన్ఱ పేరరవం ఉళ్ళం పుగుందు కుళ్ళిర్ న్ధు:
హరి హరి హరి అనిన పెద్ద శబ్ధము ఊరంతా వ్యాపించి ఆ ధ్వని మా చెవులలో ప్రవేసించి మా మనసులో పది కృష్ణవిహారము చే మా హృదయము బీటలు వాలిన హృదయ క్షేత్రమున నీరుపెట్టి పదను చేసినది.  ఆ చల్లబడి తాపముపసమింఛి మేము మీల్కొంటిమమ్మా! నీవు కూడా మేల్కొనివచ్చి మాతో కలువు.  అని మొదటి గోపికను మేల్కొల్పిరి.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.

మంగళవారం, డిసెంబర్ 19, 2017

వర్షము ఎలా కురవాలో వారు ఇంతకు ముందు పాశురములో మేఘదేవుని ప్రార్ధించారు కదా.  వర్శములేక పాడిపంటలు శూన్యమైన సమయములో సస్యసమృద్ధికి పుష్కలముగా పైరులు పండుటకు వర్షపాతము సమృద్ధిగా పెద్దల అనుమతితో ఈ వ్రతము ప్రారంభించిరి.  కావునా ఇలా ప్రార్ధించారు. మరి ఈ పాశురము లో ఏమనుకుంటున్నారో మన గోపికలు తెలుసుకుందామా.

పాశురము:
 


మాయనై మన్ను వడమదురై మైందనై
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై
ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై
తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం
తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము: మనము సక్రమముగా పూర్తిచేసి ప్రయోజనమును పొందుటకు వెనుక మనము చేసిన పాపములాటంకములు కావచ్చునని భయపడనవసరము లేదు.  ఎందుచేతనంటే  శ్రీ కృష్ణుడే మన ఈ వ్రతానికి కారకుడు మరియు నాయకుడు. అతని గుణములు ఆశ్చర్యకరములైనవి.  అతని పనులు కూడా అట్టివే.  ఉత్తరమున మధురానగరమునకు నిర్వాహకుడుగా జన్మించినాడు.  నిర్మలమైన జలముగల యమునానది ఒడ్డున నివసించుచు మనకొరకు యదుకులమందున అవతరించిన మహానుభావుడు.  తన పుట్టుకచే యశోదకు శోభను సమకూర్చిన మహాత్ముడు.  అంతటి మహాత్ముడి ఉండి కూడా ఆమెచే త్రాటితో కట్టబడిన సౌలభ్య మూర్తి.  కనుక మనము సందేహములను వీడి పరిసుద్దములై అతనిని సమీపించి పరిసుద్దమైన వికసించిన హృదయకుసుమమును సమర్పించి నోరార పాడాలి.  నిర్మలమైన మనస్సుతో ద్యానిమ్చాలి. అంతటనే వెంటనే ఇంతకుముందు పాప సమూహము రాబోవు పాపముల సమూహము మంటలో పడిన దూది వలె భస్మము అయిపోతాయి.  మన వ్రతమునకు ఆటంకములుకలుగవు.


విశేషార్ధము:
మాయనై : 
ఆశ్చర్యకరములగు గుణములు, చేష్టములు కలవానిని కీర్తించి మనము మన వ్రతమున ఉపక్రమించుదుము.
మాయ అంటే భగవద్శక్తి ఇది చాలా విచిత్రముగా వుండును.
మన్ను వడమదురై మైందనై:
ప్రతినిత్యము భాగావత్సంబంధముకల ఉత్తర మధురకు నాయకుడగు వానిని కీర్తించుచున్నారు.  పyరమపదమున వికార రహితుడగు విష్ణువు ఏకరూపుడై ఎల్లప్పుడు నిత్యసూరులకు దర్సనమిచ్చు పరమాత్మయే మధురానగరిలో అవతారములు మార్చి మార్చి దర్శనము ఇచ్చినాడు.  ఈ మదురనే సిద్దాశ్రామము.  అక్కడ వామనావతారుడుగా దర్సనం ఇచ్చారు.  ఇక్కడ శత్రుఘ్నుడు ఇక్కడ నేలవనుడను రాక్షసుడును చంపి రాజదానిగా చేసికొని పాలించాడు.  తరువాత దేవకీవసుదేవులకు శ్రీ కృష్ణుడుగా ఇచట అవతరించాడు.
తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై:

పరిశుద్ధములగు అగాధములగు జలములుగల యమునానది యొక్క తీరమున విహరించువాడా! అని కీర్తించుచున్నారు.  ఇక్కడ యమునానది పవిత్రము అయినది అని అంటున్నారు.  ఈ నది శ్రీ రామావతారములో అయోద్యగా సరయునదిగా వచ్చింది.  ఇక్కడ శ్రీ కృష్ణావతారములో మదురగా యమునగా వచ్చినది.  అలా వచ్చుటచే భగవంతుని అభిప్రాయము తెలిసి కృష్ణుని ఎత్తుకు వచ్చుటకు వసుదేవునకు దారినిచ్చినది.  అలా దారి ఇవ్వటమే ఆనది ప్రత్యేకత.
 ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై:
గోపవంసమునందు ప్రకాశించిన మణిద్వీపమయిన వానిని కీర్తించుచున్నారు.    ఈ పరమపదములో సర్వేస్వరుడు ఉన్నా అక్కడ తన గుణములన్నియు ప్రకాశింప వీలుండదు.  ఆ పరమ పురుషుడే మధురలో జనించి నందవ్రజము  చేరి దీపమువలె ప్రకాసించినాడు.
తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై:
తల్లి అయిన యశోద గర్బమును ప్రకాసిమపచేసిన దామోదరుని కీర్తిమ్చుచున్నారు.  ఆనాడు వన్నెల చిన్నవాడు అగు శ్రీ కృష్ణుని యశోదమ్మ తాడుతో రోటికి కట్టిన మచ్చ ఎప్పుడు కనపడుటచే అతనికి దామోదరుడు అని పేరు వచ్చింది ఆ పేరును కీర్తిస్తున్నారు.  దామోదరతత్వముచే తల్లికి కీర్తి తెచ్చినవాడు చిన్ని కృష్ణయ్యా.
తూయోమాయ్ వందు నాం :
ఇట్లు స్మరించుచు పరిశుద్దలమై వచ్చి మనము సేవించినచో  సకల పాపములు పోతాయి అని చెప్పుచున్నారు.  పరిశుద్ధము అనగా భగవద్ సంబందము తప్ప వేరొకటి లేకుండా మనసు శుద్ధముగా వుమ్చుకోనుట.
తూమలర్ తూవి త్తొళుదు:
పరిశుద్ధములయిన పుష్పములు విసిరి సేవించి.  పుష్పాలకు పారిసుద్ధము, సమర్పించు వారి భక్తియే!  ఈ పువ్వునైనా భక్తితో అర్పించినా అది పరిశుభ్రమినదే.  భగవంతుడు ఆకు అయినా, పువ్వునైనా, ఫలం అయినా, నీరు అయినా సరే భక్తితో సమర్పిస్తే వారిని కరుణిస్తాడు. భగవంతునికి ఇష్టమైన పుష్పాలు ఎనిమిది వున్నాయి.
అవి అహింసా, ఇంద్రియనిగ్రహము, సర్వభూతదయ, క్షమా, ఙ్ఞానము , తపస్సు, సత్యము, ద్యానము ఇవే ఆయన కోరుకునే పుష్పాలు.
వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క:
మనము భగవంతునివద్దకు నడచి వెళ్ళుటచే అతని మనస్సున భాదకలిగించును.  అయ్యో! నేనే వారివద్దకు వెళ్ళవలసినది.  వాళ్ళు వచ్చేవరకు చేసెనే అనుకుంటాడు.  పైగా మనం మాటాడినా ఇంకా భాదపడును.  మనము అతని అనుగ్రహము కొరకు అతని వద్దకు చేరి కీర్తించూదాం.
పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం తీయనిల్ తూశాగుం:
ముందు చేసిన పాపములు, తరువాత రాబోవు పాపములు కూడా అగ్నిలో పడిన దూది వలె అవుతుంది.  భగవంతుని మనము అర్చించి, పాడి, చింతించిన వెంటనే మనము చేసిన పాపాలు భగవంతుడు విస్మరించును.  రాబోవు పాపాలు తెలియనట్లు వదిలివేయును.
శెప్పు:  
చెప్పుడు,  మాయావీ, మధురానాయకా, యమునాతీరా విహారి! నందవ్రజ మంగళదీపా ! యశోదాగర్భ ప్రకాశకా!  దామోదరా! అని కీర్తించుట చాలు.  అలా కీర్తించినా సర్వ పాపాలు నాశనం అవుతాయి. అని చెప్పి వ్రతమునకు అందరిని ప్రిపేర్ చేసింది.  రేపటినుండి వ్రతానింకి ఉపక్రమిస్తున్నారు గోపికలు.

సోమవారం, డిసెంబర్ 18, 2017

వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!

సోమవారం, డిసెంబర్ 18, 2017

గోపికలు తమ వ్రతముచే లోకమంతయు పాడిపంటల తో సమృద్దిగా వుండాలని కోరుకున్నారు. తన వ్రతముంకు స్నానము ప్రదానము కావున స్నానము చేయుటకు అనుగుణముగా జలమును సమృద్దిగా ఉండవలెను అని భావించినారు.  ఈ వ్రతము నకు ఫలముగా అనుకుని వేరే వాటిని ఆశ్రయించక భక్తి తో భగవంతుని వినయ విదేయత కలిగివున్నారు .  వానదేవుని ఈ పాసురములో ప్రార్ధిస్తున్నారు.  మరి ఈ పాసురము లో ఎలా అడుగుతున్నారో తెలుసుకుందాము.
పాశురము 

  

ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్
ఆళి ఉళ్ పుక్కు ముగందు కొడార్ త్తేఱి
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
ఆళిపొల్ మిన్ని వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ నాంగళుమ్
మార్గళి నీరాడ మగిళుందేలోర్ ఎమ్బావాయ్



తాత్పర్యము:  గంభీరమైన స్వభావము కలవాడైన వర్షము కురుయునట్టి ఓ మేఘదైవతమా!  నీవు వర్షజలముననుగ్రహించు దాత్రుత్వములో ఏ మాత్రము సంకోచము చూపించకు.  గంభీరమైన సముద్రము మద్యలోనున్న నీటినంతను బాగుగా త్రాగి గర్జించి ఆకాసమునంతను వ్యాపింపచేయును.  సమస్త జగత్తులకు కారణమైన శ్రీమన్నారాయణుని శరీరమువలె దివ్యమైన నల్లని స్వరూపమును ధరించి ఆభగవంతుని సుందర విశాల దీర్గబాహువుల జంటలో కుడిచేతి యందలి చక్రాయుధమువలె మెరయుచు ఎడమచేతి యందలి శంఖము వలె మధురగంభీరముగా ఉరిమి ఆ భగవంతుని శారంగమను ధనుస్సు నుండి వెడలివచ్చు బాణములవలె వర్షదారాలు  లోకమునంతను సుఖింపజేయునట్లును.  మేము సంతోషముతో మార్ఘశీర్ష స్నానము చేయునట్లు వర్షించు. అని అండాళ్ళమ్మ ఈ పాశురములో ప్రార్దించుచున్నది.  




విశేషార్ధము:
ఆళి మళైక్కణ్ణా! ఒన్ఱు నీ కై కరవేల్:
ఈ గోపికలు వర్షాధిదేవుడగు పర్జన్యుని సంభోదించుచున్నారు.  ఆళి=సముద్రము వలె గంభీర్య వైశాల్యములు కలవాడు పర్జనుడు అని భావము.
ఆళి ఉళ్ పుక్కు:
సముద్రము మద్యలోనికి ప్రవేసించి,  సముద్రములో నీరు త్రాగుటకు పైపై ఒడ్డున తాగరాదు.  చిన్నచిన్న గుంటలు, పడియలలో, చెరువులలో, నదులలో నీరు త్రాగరాదు.  సముద్రములో మధ్యకు పోయి అగాధముగా నుండు చోట లోనికి చొచ్చి నీటిని త్రాగవలె.
ముగందు కొడు:
పూర్తిగా సముద్రజలమును త్రాగీ- గోపికలు మేఘముతో సముద్రపు నడిబొడ్డున చొచ్చి జలమునంతా ఇసుకతగిలే వరకు నీటిని త్రాగామంటున్నారు.
ఆర్తు  ఏఱి:
గర్జించి మిన్నంది.  ఓ మేఘమా ! నీవు సముద్రజలమును తృప్తిగా తాగిన తరువాత ఒక్కసారిగా గర్జించాలి.  మనము బోజనము చేసినతరువాత త్రేనుపు వస్తుంది అటువంటి శబ్ధము.
ఊళి ముదల్వన్ ఊరువం పోళ్ మెయ్ కఱుత్తు:
కాలమునకు కారణమైన బ్రహ్మతత్వముయొక్క రూపమువలె నీ శరీరమును నల్లగా చేయవలె. 
 "బ్రహ్మవేద బ్రహ్మైవభవతి" బ్రహ్మ నెరిగినవాడు బ్రహ్మ స్వరూపమునే పాడుతాడు అని ఉపనిషత్తు చెప్పుతుంది.
జలము త్రాగిన మేఘము నీలముగా మారును అది చల్లగా వుండును.
పాళియన్ తోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్ 
ఆళిపొల్ మిన్ని:
విశాలమగు సుందరమగు బాహువులుగల పద్మనాభుని చేతిలోని చక్రమువలె మెరిసి, వర్షించవలె.  ఆకాశమున అధిరోహించిన మేఘము నల్లగా వుంది వర్షించుటకు ముందు మెరయును.  ఆ మెరుపు పద్మనాబుని చేతిలోని చేక్రపు మెరపువలె ఉండాలి.  పరమాత్మ బాహువులు విశాలములు సుందరములు అనిచేప్తున్నారు.
 వలమ్బురిపోల్ నిన్ఱదిరుందు:
దక్షణావర్త  శంఖము వలె నిలిచి గర్జించి. మేఘము మేరయుట ఘర్జించుట సహజమే.  కానీ మన గోపికలు శ్రీ మన్నారాయుణుని చేతిలోని చక్రంవలె  మెరవాలిట.   శంఖమువలె గర్జించవలెను అని వారి కోరిక.
తాళాదే శారుంగం ఉదెత శరమళైపోల్
వాళ ఉలగినిల్ పెయ్దిడాయ్ :

శారంగమను విల్లు బాణములను వర్షించునట్టు వర్షము వర్షించాలి అని భావము.
నాంగళుమ్ మార్గళి నీరాడ మగిళుందేలోర్ :
ఆ వర్షానికి మేము ఆనందముగా మార్గశిర స్నానము చేయాలి అని అనుకుంటున్నారు.

ఆదివారం, డిసెంబర్ 17, 2017

మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా!

ఆదివారం, డిసెంబర్ 17, 2017

రెండవ పాశురములో మనము వ్రత నీయమాలు నిర్ణయించుకున్నాము కదా.  మరి వ్రతము ఒక ఫలాపేక్ష తో చేస్తున్నాము కదా మరి ఆ వ్రత ఫలము ఎలావుండాలి మరి. ఆ ఫలము ఎలావుండాలో మూడవ పాశురము లో తెలుపుతారు మన అమ్మ.  అయితే ఈ పాశురము విశేషము కలది  అయితే చక్కేరపోంగాలి నివేదించాలి స్వామికి. మరి ఆ పాశురము ఇదిగో..... 
ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి కోసం చిత్ర ఫలితం

పాశురం: 

*ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి
 నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్
 తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు
 ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ
 పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప
 తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి
 వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్
 నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


తాత్పర్యము:   పూర్వము భగవంతుడు దేవతలను కాపాడుటకై వామనావతారము ఎత్తి బలిచక్రవర్తిని మూడు అడుగులు భూమిని దానము అడిగెను.  బలిచక్రవర్తి అలాగే అని దానము చేయగా వామనుడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమించారు.  అట్టి త్రివిక్రముని దివ్యనామములను గానము చేయుచూ వ్రతనిమిత్తముగా మేము స్నానము చేయుటచే సకాలములో కావలసిన వర్షము కురిసి చక్కగా పెరిగిన వరిచేను కన్నులకానందము కలుగచేయాలి.  చేనులోని నీటిలో చేపలు యెగిరి పడుచు మనస్సును ఆకర్షించవలెను.  అన్ని పైరులును బాగుగా పెరిగి ఆనందము కలిగింపవలెను.  పాలు పితుకువారు  పాత్రలతో దగ్గరకు వచ్చి కూర్చోండి పోదుగునంటిన వెంటనే గోవులు కుండలు నిండునట్లు పాలను వర్షించవలెను.  స్థిరమైన  సంపదదేశమంతటను విస్తరింపవలేనని ఈ పాసురములోని గోదామాత కోరుచున్నది.


విశేషార్ధము:  
1 ) ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి:
పెరిగి లోకములు కొలిచిన ఉత్తముని పేరు పాడి మేము ఈ వ్రతమునకు స్నానమాచరించుతుము.  పుట్టుట-ఉండుట-పెరుగుట-మారుట-తరగుట-లేకుండుట అనునవి ఆరు ప్రకృతి వికారాలు అలాంటి వికారాలు లేని స్వామీ మనకోసం వచ్చి పెరిగాడని గోపికలు సంతోషించారు.
2 )నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్:
మేము మావ్రతమునకు అని, మిష పెట్టి స్నానము చేసినచో లోకమంతయు సుఖముగా వుండును.  మేము-మావ్రతము గొప్పవని చెప్పుకుంటున్నారు.
3 ) తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు:
ఎటువంటి బాదలు లేకుండా దేశమంతా నెలకు మూడు వానలు పాడుటను.   ఈవ్రతం వల్లన లోకములో పాడి పంట సమృద్దిగా వుండును.
4 ) ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ: 
పెరిగిన పెద్దపెద్ద వరిచేనులో చేపలు త్రుళ్ళిపడును.  చేను పెద్దగా పెరుగుట, అడుగున నీరు సమృద్దిగా ఉండుట, పంటకు విశిష్టత.  అట్టివిశిష్టత ఈ వ్రతము వాళ్ళ కలుగును అని భావం.
5 )పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప:
పూచినా కలువ పువ్వులలో లేదా సుందరమైన కలువపూలలో అందమయిన తుమ్మెదలు ఒకదానితో ఒకటి కలహించుకోనుచూ నిద్రిస్తున్నవి.   వారి చేనులో నీరు అధికముగా వుండుట వాళ్ళ కాలువలు ఎక్కువున్నాయి.  వాటిలోని మకరందము కోసం తుమ్మెదలు వస్తున్నాయి.  అంటే వారి ఊరిలో పాడియోక్క వైబోగం చెప్తున్నారు.
6 )తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ:
ఎటువంటి జంకూలేకుండా కోట్టములోకి వెళ్లి కుర్చోనిన బాగా బలసిన చనుకట్లు పట్టి పాలు పిండగా  అక్కడ ఆవులు కుండలు కుండలు పాలు ఇస్తున్నాయి.  ఆ రేపల్లేలో గోవులు సమృద్దిగా వున్నవి అని.
7 )క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్ 
    నీంగాద శెల్వం నిఱైందే:
కుండలు నిండునట్లు పాలను ఇస్తున్న ఉదారములగు పశువులు, తరగని సంపద, నిండియుండును.



శనివారం, డిసెంబర్ 16, 2017

భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు.

శనివారం, డిసెంబర్ 16, 2017

ధనుర్మాసవ్రతము ముప్పై రోజుల వ్రతము కదా అయితే గోపికలు మొదటిపాసురములో వారికి ఏమికావాలో ఎలాచేయాలో అల్లోచించారు.  వారు భగవత్ప్రాప్తి కావాలని వ్రతము ప్రారంభించారు అని తెలుస్తోంది.  మరి రెండవ పాసురములో వారు ఏమిచేస్తున్నారో తెలుసుకుందామా.
వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు కోసం చిత్ర ఫలితం
పాశురము 


వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్ 


తాత్పర్యము:  భగవంతుని దర్శించుటకు వెళ్ళేవారు భాగాత్ప్రాప్తి కోసం కొన్ని నియమాలు పాటించాలని.  శ్రీ కృష్ణుడు అవతరించిన ఈ లోకములో పుట్టి దు:ఖమైన ఈ లోకములో కూడా భగవదనుగ్రహముచే ఆనందము అనుభవించుచుతున్న వారలారా!  మేము మా వ్రతమునకు ఏర్పరచుకోనిన నియామాలు వినండి.  పాలసముద్రములో పడుకొని నిద్రించుతున్న పరమాత్మ యొక్క పాదపద్మాలకు మంగళము పాడతాము.  మేము ఈవ్రతము చేసినంతన కాలమున నీటిని కానీ పాలను కాని అనుభవించము.  తెల్లవారుజాముననే నిదురలేచి చల్లనినీటినే స్నానము చేసెదము.  కళ్ళకు కాటుకను అలంకరించము.  తలకు పరిమలబరితమగు పూలదండలను ధరించము.  మా పెద్దలు విడిచిపెట్టిన చేడుపనులు మేము ఆచరించము.  ఇతరులకు బాధ కలిగే మాటలు కానీ, అసత్యాలను కాని ఎప్పుడూమాటాడము.  ఇతరులకు హాని uకలిగించము.  ఇతరులకు హానిలాగే ఆలోచనలు చేయము.  ఙ్ఞానసంపన్నులైన మహాత్ములను ధనధాన్యాదులచే ఎక్కువ సత్కారిచుదుము.  బ్రహ్మచారులకు బిక్షుకలుకు బిక్షపెట్టేదము.  భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తించేదము.  గురువు ను పరబ్రహ్మగా భావించాలని మన పెద్దలు చెప్పారు కదా అందుకే గురువులను పూజించి ఆచార్య కృపపోందేదము.  వ్రతనీయమాలు ఏ రీతిగా చెప్పబడినవో ఆవిధంగా పాటిద్దాం అనుకున్నారు. శ్రీ కృష్ణుని పొందుదాము.


విశేషార్ధము :
1 .  వైయత్తు వాళ్ వీర్గాళ్!  :-
ఈ లోకములో ఆనందము అనుభవించువారలారా!  అని సంబోధించుచున్నారు.
2 . నాముం నం పావైక్కు చ్చెయ్యుఙ్గిరిశైగళ్ కేళీరో!  :-
మేము మా వ్రాతములో చేయు క్రియలను వినుడు.
3 . పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి  :-
పాలసముద్రములో మెల్లగా పాడుకొనిన పరమపురుషుని పాదములకు మంగళము పాడి.
4 . నెయ్యుణ్ణోం పాలుణ్ణోం  :-
నేతులారగించము- పాలు తాగము.
5 .  నాట్కాలే నీరాడి  :-
తెల్లవారుజ్హాముననే స్నానము చేయవలెను.
6 . మైయిట్టెళుదోం  :-
కాటుకను మాకళ్ళకు అలంకరించము.
7 .   మలరిట్టు నాం ముడియోమ్  :-
మేము మాకోప్పులలో పూలు ధరించము.
8 . శెయ్యాదన శెయ్యోం  :-
"మా పెద్దలు చేయని పనులను మేమూ చేయము"
9 .  తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్  :-
ఇతరులకు అనర్ధమును కల్గించు తప్పు మాటలను పలుకము.
10 .  ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి  :-
దానమును, భిక్షమును చాలు అన్నంతవరకు  ఇచ్చి  అయ్యో! ఏమియు చేయలేకపోతిమే అని విచారింతుము.
11 . ఉయ్యుమాఱెణ్ణి యుగందు :-
పైన విధంగా ఉజ్జీవించు విధములను పరిశీలించి సంతోషించి ఈ వ్రత నీయమాలను వినండి.

జై శ్రీమన్నారాయణ్

ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు .

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః

మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .

ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.

శుక్రవారం, డిసెంబర్ 15, 2017

ధనుర్మాస వ్రతారంభం

శుక్రవారం, డిసెంబర్ 15, 2017

తిరుప్పావై తెలుగు కోసం చిత్ర ఫలితం
ధనుర్మాస వ్రతారంభం 
ధనుర్మాసం అనగానే అది మార్గశిరమాసం లో వస్తుందని అందరికి తెలుసు కదా మరి మర్ఘశిరమాసం వచ్చింది.  శ్రీ కృష్ణులవారు స్వయంగా ఇలా అన్నారు మాసానాం మార్గశీర్షోహం అని భగవద్గీతలో.  అలాంటి మార్గశిరమాసం అంత విశిష్టత సంతరించుకుంది .  ఇది తెలుగు సంవత్సరములలో తొమ్మిదో మాసం దీనినే మనం  దనుర్మాసం అని కూడా అంటాము.  ఎంతో విశేషమైన రోజులు.  ఈ దనుర్మాసం నెల రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవకు బదులుగా గోదాదేవి పాడిన ౩౦ పాశురాలును పాడతారు  అందుకే ఈ మాసం విశేషమైన మాసం గా చెప్పుకోవాలి. 
అంత విశేషమైన ఈ నెలరోజులు చంద్రమానము బట్టి చేయుటకు గుర్తుగా ఆ నెలరోజులు ఇంటి ముంగిట పండగ వాతావరణముతో విశేషమైన ముగ్గులు పెట్టి అందులో నేలగంట పెడతారు . ఆ నెలరోజులు వైష్ణవ గుళ్ళకు వెళ్ళతారు ఈ నెలరోజులు రోజుకు ఒక పాశురమ్  చదువుతారు . ఇలా 30 రోజులు పాశురములు నివేదిస్తారు.  ఈ వ్రతమునే కాత్యాయనీ వ్రతము అని మరియు సిరినోము అనికూడా అంటారు.  ఈ పాశురములు స్వయంగా గోదామాత పాడతారు.  మరి మనం కూడా ఈ నెల రోజులు గోదావ్రతం ఆచరిద్దాం.  
శ్రీశైలేశ దయాపాత్రం 

శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవమ్ |
యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిమ్ ||
లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమామ్ |
అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం ||

యోనిత్యమచ్యుత పదామ్బుజ యుగ్మరుక్మ
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే |
అస్మద్గురోర్ భగవతోస్య దయైకసిన్ధోః
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ||

మాతా పితా యువతయ స్తనయా విభూతిః 
సర్వం యదేవ నియమేన మదన్వయానామ్ |
ఆద్యస్య నః కులపతే ర్వకుళాభిరామం
శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా ||

భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ
శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ |
భక్తాంఘ్రిరేణు పరకాల యతీంద్రమిశ్రాన్
శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యమ్ ||

కల్పాదౌ హరిణాస్వయంజనహితం దృష్ట్వైవ సర్వాత్మ్నాం
ప్రోక్తం స్వస్య చ కీర్తనం ప్రపదనం స్వస్మై ప్రసూనార్పణం  |
సర్వేషాం ప్రకటం విధాతుమనిశం శ్రీధన్వినవ్యేపురే
జాతాం వైదిక విష్ణుచిత్తతనయాం గోదాముదారాంస్తుమ: ||

ఈ పాశురాలన్ని ఆండాలమ్మ తల్లి ధనుర్మాస వ్రతము చేసి రోజుకో పాశురం ఆశువుగా పాడి ౩౦ రోజులు నియమనిష్టలతో వ్రతము చేసి . ఆ పాండురంగనుని వివాహం చేసుకొని ఆయనలో ఐక్యమైనది.  అలాంటి గోదాదేవి చేసిన వ్రతము మనమూ చేద్దాం . అయితే ఆ అమ్మకు భక్తితో నమస్కార రూపమున శ్రి శ్రీ శ్రీ పరాసుర భట్తరువారు  ఈ శ్లోకం తో విన్నవించారు.  ప్రవచనం 

నీలా తుంగస్తన గిరితటీ సుప్త ముద్బోధ్య కృష్ణం
పారార్ధ్యం స్వం శ్రుతి శతశిరస్సిద్ధ మధ్యాపయంతి
స్వోచ్చిస్టాయాం స్రజి నిగళితం యా బలాత్క్రుత్య భుంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః       



అన్నవయల్ పుదువై ఆండాళ్ అరంగఱ్ఱ్కు
ప్పన్ను తిరుప్పావై ప్పల్పదియం ఇన్నిశైయాల్
పాడి కొడుత్తాళ్ నర్పామాలై పూమాలై
శూడి కొడుత్తాళై చ్చోల్లు

శూడి క్కొడుత్త శుడర్ క్కొడియే! తొల్పావై
పాడియరుళవల్ల పల్-వళై యాయ్ నాడినీ
వేంగడవఱ్ఱ్కెన్నె  విది ఎన్ఱ ఇమ్మాఱ్ఱం
నాంగడవా వణ్ణమే నల్గు

శ్రీ కృష్ణ పరమాత్ములవారు నీలా దేవి యొక్క ఉన్నతమైన స్తనగిరులలో నిద్రించుచున్నారు . ఆ నిద్రిస్తున్న కృష్ణ సింహమును మేల్కొల్పినది అమ్మ గోదామాత . ఆయనికి ఉపనిషత్తు లలొ ప్రతిపాదించబడిన పరతంత్రమును పాఠమును చెప్పినది . తాను అనుభవించిన వదన మాలికతో అతనిని బంధించింది . అలాంటి అలాంటి గోదాదేవికి నా మరలా మరలా నమస్కారములు .

మనము కూడా మాయచే నిద్రించుచున్నాము. కాని పరమాత్మ నిద్రించడు , అట్టి పరమాత్మకు నిద్ర తెప్పించు సౌందర్యరాశి నీలాదేవి. ఆయనని మెల్కొల్పినధి గోదాదేవి. ఆలాంటి పరమాత్మకే  ఉపదేసించినధి ఈ గోదాదేవి. ఆమె పరమాత్మను తాను అనుభవించి విడిచిన పూమాలలతో మరియు పాశురములతో బంధించింధి.  తాను చెసిన కర్మకు ఫలితంగా పరమాత్మనే అనుభవించింధి. శ్రీ గోదాదేవి. ఈ స్థితి  కేవలము శ్రీ గోదామాతకే చెల్లినది.
ఆమె దరించిన మాల పరమాత్మ స్వీకరించుటచే ఆమెకు ఆముక్తమాల్యద" అని పేరు వచ్చినది.  మాలలు తయారు చేయువాని బిడ్డ కావునా కోదై అని అంటారు. కోదై అంటే గోదా అని అర్దం.  ఇలా భట్టనాధుని కూతురై , శ్రీ రంగనాధుని ప్రియురాలై, భగవద్రామనుజులకు అభిమాన సొదరైన ఆండాళి కు మరలా మరలా నేను నమస్కారిస్తున్నాను.
.

1 నుంచి 5 వరకు ఉన్న పాశురాలలో వ్రత విధానం గురించి, 6 నుంచి 15 వరకు పాశురాలలో తన తోటి చెలికత్తెలను నిద్రలేపి నందగోపుని గృహానికి వెళ్లడం, 16 నుంచి 17,18 పాశురాలలో నందగోపుడు, యశోద, బలరాములను మేల్కొల్పడం, 23వ పాశురంలో మంగళాశాసనం చేయడం, 25, 26 స్వామివారికి అలంకారలైన ఆయుధాలను 'పర' అనే వాయిద్యాన్ని కోరుకుంటూ తమ శరణాగతిని అనుగ్రహించి తమ సంకల్పాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తుంది. 27వ పాశురంలో పరమాత్మకు, జీవాత్మకు గల సంబంధాన్ని 'కూడారై' ప్రసాదంతో పోల్చి వివరించింది. 30వ పాశురం ఫలశ్రుతితో భగవంతునికి, మనకు గల సంబంధం తెలిస్తే కోరికలను మనం కోరవలసిన పనిలేదని స్వతంత్రించి భగవంతుడిని అడిగి పొందవచ్చని తెలియజేసింది గోదాదేవి.


గోదాదేవి భగవంతుని విషయంలో ఏవిధమగు దాస్యము కోరుకున్నదో, ఆ విధముగా దాస్యము ఆమె యెడ మాకు లభించుగాక అని పరాశర భట్టారువారు ప్రార్ధించిరి.  నేను రేపు వ్రతపాశురంలు ఆరంభిస్తాను. 
అలానే మనం కూడా ఈధనుర్మాసం  వ్రతం చేద్దామ్. 

బుధవారం, డిసెంబర్ 06, 2017

విశ్వప్రకాశునకు

బుధవారం, డిసెంబర్ 06, 2017



విశ్వప్రకాశునకు వెలియేడ లోనేడ
శాశ్వతునకూహింప జన్మమికనేడ

సర్వ పరి పూర్ణునకు సంచారమిక నేడ
నిర్వాణమూర్తికిని నిలయమిక నేడ
వుర్వీధరునకు కాలూదనొకచోటేడ
పార్వతీస్తుత్యునకు భావమిక నేడ

నానా ప్రభావునకు నడుమేడ మొదలేడ
ఆనన సహస్రునకు నవ్వలివ లేడ
మౌని హృదయస్తునకు మాటేడ పలుకేడ
జ్ఞానస్వరూపునకు కానవిన వేడ

పరమ యోగీంద్రునకు పరులేడ తానేడ
దురిత దూరునకు సంస్తుతి నిందలేడ
తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ
హరికి నారాయణున కవుగాములేడ

ఆదివారం, అక్టోబర్ 22, 2017

నాగేంద్ర ఆదిశేష నమోస్తుతే

ఆదివారం, అక్టోబర్ 22, 2017


నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమోస్తుతే


మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా.  దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి.  ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు.  నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు.  ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు.  నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
నాగులు  చవితి  రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి. 
పాము పుట్ట లో  పాలు పోసేటప్పుడు  ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు 
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం  మన భారతీయుల  సంస్కృతి.  మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము.  నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత.  బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట.  ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం.  పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు.  ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని.  ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు. 
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. 
నాగులు చవితి శుభాకాంక్షలు. 

శనివారం, అక్టోబర్ 21, 2017

యమద్వితీయ

శనివారం, అక్టోబర్ 21, 2017

దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు . 
 ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర  మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న  వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి  ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు.  వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు.  దీనికి ఒక కదా వుంది.  ఆ కద ఏంటి అంటే.  యముడు యమునా సోదర సోదరిమణులు.  వారు కలసి పెరిగారు.  యమున ఒక అందమైన యువరాజును  వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది.  అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు.  కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు.  ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే.  యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది.  ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని.  ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది.  యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది. 
ఇది దీపావళి తరువాత  రెండు రోజులుకు వచ్చింది.  ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు.  అది చూసి యముడు  చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు.  వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు.  యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు.  నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు.  ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది.  అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు. 
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు.  యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది.  అది ఏమిటంటే అన్నదమ్ములు  కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు.  ఈవిధంగా యమద్వితీయ జరుపుకుంటారు .  అందరికి భగినీ హస్త భోజన శుభాకాంక్షలు. 

శుక్రవారం, అక్టోబర్ 20, 2017

గోవర్ధనగిరిదారి

శుక్రవారం, అక్టోబర్ 20, 2017

ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు  మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు.  బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని   పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు.  ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు.  ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.

గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.  
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.  
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:

“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.

శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.
ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)