షాహాజీ-జిజాబాయ్ దంపతులకు పూణేకు దగ్గర ఉన్న జున్నార్ పట్టణమందు శివాజీ ఫిబ్రవరి 19, 1627 న జన్మించాడు. జిజాబాయ్‌కి శంభాజీ తర్వాత పుట్టిన కొడుకులు అందరూ చనిపోతూవుండగా జిజాబాయ్ ఎప్పుడూ పూజించే దేవత అయిన పార్వతిదేవి పేరును శివై పేరు శివాజీకు పెట్టింది. శివాజిని పార్వతిదేవి ప్రసాదంగా భావించింది.
షాహాజీ పూణేలో తన జాగీరు వ్యవహారాలను తన భార్యఅయిన జిజాబాయ్ కి అప్పగించి యువకుడయిన శివాజీకి రాజనీతి వ్యవహారాలు నేర్పడానికి కొందరు ముఖ్య అనుచరులతో కలసి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి తాను బెంగుళూరు జాగీరుకు వెళ్ళాడు. శివాజీ తల్లి అతనికి పుట్టిన భూమి పైన, ప్రజల పైన ప్రేమ కలుగునట్లు విద్యాబుద్దులు నేర్పింది. చిన్నప్పటినుండి భారత రామాయణ గాథలు చెప్పి వీర లక్షణాలు కలిగేలా చేసింది. పరమత సహనం, స్త్రీల పట్ల గౌరవం తన తల్లివద్దనే నేర్చుకున్నాడు శివాజి. తన తండ్రి పొందిన పరాజయాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి అనతి కాలంలో శివాజీ యుద్ద తంత్రాలలో గొప్ప నేర్పరిగా మారాడు. సకల విద్యలు నేరుచుకున్న శివాజీ మరాఠా సామ్రాజ్య స్థాపనే తన ప్రధాన కర్తవ్యముగా అనుకోని ఆ దిశగానే తన ప్రయత్నము మొదలు పెట్టాడు . మరాఠా సామ్రాజ్య స్థాపనకు చాలా కృషి చేసాడు శివాజి.చిన్నవయసులోనే అంటే 17 సవత్సరాల వయసులోనే శివాజీ మొట్టమొదటి యుద్దం చేసి బిజాపూర్ సామ్రాజ్యానికి చెందిన తోర్నా కోటను సొంతం చేసుకున్నాడు. మరో మూడేళ్ళలో కొండన, రాజ్‌ఘడ్ కోటలను సొంతం చేసుకొని పూణే ప్రాంతాన్నంతా తన తన ఆధీనములో తెచ్చుకున్నాడు. శివాజీ తమ కోటలను సొంత చేసుకోవడం చూసి ఆదిల్షా మోసపూరితంగా శివాజీ తండ్రి అయిన షాహాజీని బందీ చేసాడు. తర్వాత శివాజీని, బెంగుళూరులో ఉన్న శివాజి అన్న అయిన శంభాజీని పట్టుకోవడానికి రెండు సైన్యాలను పంపగా అన్నదమ్ములిరువురు ఆ సైన్యాలను ఓడించి తమ తండ్రిని బంధ విముక్తుడిని చేయించుకున్నారు. తరువాత వారు చాలా యుద్ధాలు చేసారు. వాటిలో ప్రధానముగా ప్రతాప్‌ఘడ్ యుద్దం, కొల్హాపూర్ యుద్దం, పవన్‌ఖిండ్ యుద్దం, షైస్తా ఖాన్ తో యుద్దం, సూరత్ యుద్దం మొదలగున్నవి. తరువాత 1666లో ఔరంగజేబు తన యాభయ్యవ పుట్టినరోజు సందర్భంగా శివాజీని, అతని ఆరేళ్ళ కొడుకు శంభాజీని ఆగ్రాకు పుట్టినరోజు వేడుకలకు అహ్వానించాడు. ఇది శివాజీని అలా ఆహ్వానించటం వెనుక మోసపూరితమైన ఆలోచన ఔరంగజేబు కలిగివుండటమే. మొదట శివాజీని చంపాలనుకున్నాడు దానివల్ల మరాఠాలు ఒక్కసారిగా చెలరేగుతారని తెలుసుకొని శివాజీని బందీగా ఉంచాలని నిశ్చయించాడు. తన కొడుకుతో బందీగా ఉన్న శివాజీ ఎలాగయినా తప్పించుకోవాలని ప్రయత్నించసాగాడు. ప్రతిరోజు తాను ఏరికోరి సమకూర్చిన పళ్ళను ఆగ్రాలోని సాధువులకు, గుడులకు, ఫకీర్లకు పంపించేలా అనుమతి తీసుకున్నాడు. కొన్ని నెలలపాటు పళ్ళ బుట్టలు పంపించిన తర్వాత తాను పనిమనిషిగా మారువేషం వేసుకొని కొడుకును బుట్టలో పెట్టుకొని తప్పించుకున్నాడు. శివాజీ, శంభాజీ ఇద్దరూ పళ్ళబుట్టల్లో దాక్కుని తప్పించుకొన్నారని అంటారు. అప్పటికే శివాజీ ప్రాబల్యం తగ్గడం వల్ల, మొఘలులు మరిన్ని యుద్దాలలో పాల్గొంటూ ఉండడంవల్ల ఔరంగజేబు శివాజీ నుండి ముప్పు ఉండదని భావించినా సరే పెద్దగా పట్టించుకోలేదు. శివాజీ ఎక్కువ ప్రాచుర్యంపోందేలా కాకుండా రహస్యంగా తన కార్యకలాపాలు నిర్వహించడం మొదలుపెట్టాడు. 1674 నాటికి లక్ష మంది సుశిక్షితులయిన సైన్యాన్ని, ఆయుధాలు, అశ్వాలు, నౌకా వ్యవస్థను సమకూర్చుకున్నాడు. 1670 జనవరి నుండి మొఘల్ కోటల పైన దాడులు చేసి సొంతం చేసుకోవడం మొదలు పెట్టాడు. అలుపెరగని యుద్దాలతో అలసిపోవడం, సరి అయిన సైన్యం లేకపోవడం, ఖజానా ఖాళీ కావడంతో మొఘల్ సైన్యం శివాజీని ఎదుర్కొనలేకపోయింది. తరువాత కొన్నాళ్ళకు సింహగఢ్ యుద్ధం చేసి తానాజీ తన అనుచరులతో రహస్యంగా ఆ కోటను కొద్దిరోజులపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసాడు. అన్ని ప్రధాన ద్వారాల్లో కట్టుదిట్టమయిన సైన్యం ఉంది. చివరగా కోటకు ఒకవైపు ఉన్న ఒక కొండ తానాజీని ఆకర్షించింది. ఆ కొండ చాలా ఏటవాలుగా ఉండడంతో సైన్యం ఆ కొండ ఎక్కడం అసాధ్యం. అప్పుడు తానాజీ 'యశ్వంతి ' అనే పేరుకల ఉడుముకు తాడు కట్టి కొండ పైకి విసిరాడు. తాడు సహాయంతో పైకి వెళ్ళినవారు అందించిన తాళ్ళను పట్టుకొని సైన్యం కోటలోకి చేరుకొంది. చరిత్రలో యుద్దంలో ఉడుమును ఉపయోగించడం ఇదే ఫస్ట్ కావచ్చు అని చారిత్రకుల విశ్లేషణ ప్రకారం తెలుస్తోంది .
యుద్దతంత్రాలలో మాత్రమే కాకుండా పరిపాలనా విధానంలో కూడా శివాజీ భారతదేశ రాజులలో అగ్రగణ్యుడు. మంత్రిమండలి, విదేశాంగ విధానం,పటిష్టమయిన గూఢచారి వ్యవస్థ ఏర్పాటు చేసాడు. ప్రజలకోసమే ప్రభువు అన్న సూత్రం పాటించి, వ్యక్తిగత విలాసాలకు ఎటువంటి వ్యయం చేయక ప్రజల సంక్షేమం కోసమే పాటు పడ్డాడు. జూన్ 6, 1674న రాయఘడ్ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియరాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ 'ఛత్రపతి ' అని బిరుదును ప్రదానం చేసారు.కొన్నాళ్ళకు 50,000 బలగంతో దక్షిణ రాష్ట్రాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నాడు.27 ఏళ్ళపాటు యుద్దాలలో గడిపి హిందూ రాజులకు ఆదర్శంగా నిలిచి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ఛత్రపతి శివాజి మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి ఏప్రిల్ 3, 1680 రాయఘడ్ కోటలో మరణించాడు. మరణించేనాటికి 300 కోటలు శివాజీ ఆధీనంలో ఉండేవి. కొండలపైన ఉన్నత సాంకేతిక విలువలతో దుర్భేధ్యమయిన కోటలను నిర్మింపచేయడంలో శివాజీ ప్రపంచ ఖ్యాతి పొందాడు. నాసిక్ నుండి మద్రాసు దగ్గర ఉన్న జింగీ వరకు 1200 కిలోమీటర్ల మధ్య ఈ 300 కోటలు నిర్మించబడ్డాయి.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.