ఆదివారం, అక్టోబర్ 22, 2017
నమస్తే దేవదేవేశ
నమస్తే ధరణీధర
నమస్తే సర్వ నాగేంద్ర
ఆదిశేష నమోస్తుతే
మనము ప్రకృతిని ఆరాదిస్తువుంటాము కదా. దానికి నిదర్సానమే ఈ నాగుల చవితి. ఈ పండగ దీపావళి వెళ్ళిన నాలుగో రోజున, కార్తీక చతుర్ధి నాడు వస్తుంది. తెలుగునాట నాగుల చవితి ఒక ప్రముఖ పండుగ. ఈరోజున నాగ దేవతను ప్రసన్నం చేసుకునేందుకు పుట్టలో పాలు పోస్తారు.
నాగుల చవితి రోజున నాగదేవతను ఆరాధిస్తారు. తాము, తమ కుటుంబసభ్యులు సుఖసౌఖ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్త్రీలు పుట్టలో పాలు పోస్తారు.పాలతో బాటు పండ్లుఫలాలు, నువ్వులు, కోడిగుడ్డు మొదలైనవి కూడా కలుగులో విడుస్తారు. నాగుల చవితి నాడు స్త్రీలు ఉపవాసం ఉంటారు. నాగుల చవితి పండుగను ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో నాగదేవత విగ్రహాన్ని పెట్టి పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాముపుట్ట ఉన్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ పూజ చేస్తారు. పుట్ట దగ్గర శుభ్రం చేసి, నీళ్ళు జల్లి, ముగ్గులు వేసి, పసుపు కుంకుమలు జల్లి, పూలతో అలంకరిస్తారు. తర్వాత కలుగులో నైవేద్యం విడిచి, నాగదేవతకు నమస్కరించుకుంటారు. ఇతరుల సంగతి అలా ఉంచి, నాగదోషం ఉన్నవారు నాగుల చవితి నాడు తప్పక పుట్టలో పాలు పోస్తారు.నాగదోష నివారణకై పూజలు చేస్తారు. నాగదోషాన్ని తొలగించి, సుఖసంతోషాలు ప్రసాదించమని నాగదేవతను వేడుకుంటారు. నాగుల చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆంధ్రులే కాకుండా కన్నడీగులు కూడా నాగుల చవితి పండుగ జరుపుకుంటారు.
నాగులు చవితి రోజు పుట్టలో పాలు పోసి, చలివిడి, చిమిలి, మరియు వడపప్పు నేవేదించాలి.
పాము పుట్ట లో పాలు పోసేటప్పుడు ఇలా చేప్పాలి మరియు పిల్లలు చేత చెప్పించాలి .
నడుము తొక్కితే నావాడు అనుకో
పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో
తోక తొక్కితే తోటి వాడు అనుకో
నా కంట నువ్వుపడకు
నీకంట నేను పడకుండా చూడు తండ్రీ.
అని చెప్పాలి.
ప్రకృతి ని పూజిచటం మన భారతీయుల సంస్కృతి. మనం విషసర్పమును కూడా పూజించి మన శత్రువును కూడా ఆదరిస్తాము.అని అర్ధము. నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. పిల్లలుచేత ఇవి చెప్పించటం ఎందుకంటె వారికి మంచి అలవాట్లు నేర్పించటము ముఖ్యవుద్దేశము.
మనలను ఇబ్బంది పెట్టినవారిని , కష్టపెట్టేవారిని క్షమించాలి అని తెలుపుట ఇలాంటివి నేర్పుట ఉద్దేశము. నాగుల చవితిరోజు పుట్టలో పాలుపోసిన తరువాత. బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ జల్లుతారు ఎందుకంటే మన చుట్టూ వుండే చిన్న చిన్న జీవులుకు ఆహారం ను పెట్టటం అన్నమాట. ఉదాహరణకు చీమలకు ఆహారం గా పెడుతున్నాం. పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మన్నును చేవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంభందించిన ఇబ్బందులు రాకూడదని. ఈరోజు సాధారణంగా ఇంట్లో ఆడవాళు ఉపవాసం వుంటారు.
ఈ పాములు భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా సమస్త జీవకోటికి " నీటిని" ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనంచేసే క్రిమికీటకాదులను తింటూ, పరోక్షంగా " రైతు " కు పంటనష్టం కలగకుండా చేస్తాయట!. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి.
మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.
నాగులు చవితి శుభాకాంక్షలు.
శనివారం, అక్టోబర్ 21, 2017
దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ యమ ద్వితీయ అని కూడా అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు. వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు. దీనికి ఒక కదా వుంది. ఆ కద ఏంటి అంటే. యముడు యమునా సోదర సోదరిమణులు. వారు కలసి పెరిగారు. యమున ఒక అందమైన యువరాజును వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది. అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు. కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు. ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే. యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది. ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని. ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది. యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది.
ఇది దీపావళి తరువాత రెండు రోజులుకు వచ్చింది. ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు. అది చూసి యముడు చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు. వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు. యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు. నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు. ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది. అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు.
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు. యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది. అది ఏమిటంటే అన్నదమ్ములు కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు. ఈవిధంగా యమద్వితీయ జరుపుకుంటారు . అందరికి భగినీ హస్త భోజన శుభాకాంక్షలు.
శుక్రవారం, అక్టోబర్ 20, 2017
ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది.
అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు. బృందావనంలో ప్రతి సంవత్సరం ఈ పూజ ఇంద్రుని సంతృప్తి పరచడం కోసం సంరభంగా జరిపేవారు. అయితే మనం గోపాలురం కదా మనం గోవులకు పూజించాలి గాని, ఇంద్రున్ని ఎందుకని తండ్రి నందున్ని మరియు గ్రామవాసుల్ని ప్రశ్నిస్తాడు. దాని వలన ఇంద్రున్ని పూజించడం మానేస్తారు. కోపించిన ఇంద్రుడు ఏడు రోజులు కుండపోతగా రాళ్ల వర్షాన్ని కురిపిస్తాడు. అప్పుడు దిక్కు తోచని ప్రజలు కృష్ణున్ని వేడుకొనగా గోవర్ధన గిరి పర్వతాన్ని పైకెత్తి దాని క్రింద గోపాలుర్ని మరియు గోవుల్ని రక్షిస్తాడు. ఇంద్రుడు చివరకు ఓటమిని అంగీకరించి కృష్ణున్ని భగవంతునిగా గుర్తిస్తాడు. భాగవత పురాణం ప్రకారం వేద కాలంనాటి బలిదానాల్ని వ్యతిరేకించి కర్మ సిద్ధాంతాన్ని దాని ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశాడు. ఈ పర్వతాన్ని దీనిని హిందువులు పవిత్రంగా భావిస్తారు. ఇది ప్రస్తుతం బృందావనం పట్టణానికి సమీపంలో ఉన్నది.
గోవర్ధన పూజ దీపావళి తర్వాత రోజు,శ్రీకృష్ణుడు ఇంద్రున్ని జయించిన రోజుగా పండుగ జరుపుకుంటారు.
కృష్ణుని మరియు వైష్ణవ భక్తులు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నారు. చాలా మంది పర్యాటకులు ప్రతి సంవత్సరం ఈ ప్రాంతాన్ని సందర్శించి ఈ కొండ చుట్టూ జపాలు, గానాలు, భజనలు చేస్తూ, గిరి ప్రదక్షిణం చేస్తారు. ఈ గిరి పరిసర ప్రాంతాలలో శ్రీకృష్ణుడు మరియు బలరాముడు బాల లీలలు చాలా విశేషంగా ప్రాముఖ్యత వహించాయి.
పరమాత్మ అవ్యక్తుడు సర్వవ్యాపకుడు నిరాకారుడు. అలాగే దేవతలుకూడా మనకు కనబడరు. కానీ సూక్ష్మ బుద్ధితో పరీక్షిస్తే ఈ ప్రకృతి (ఆది శక్తి) పరమాత్మ యొక్క ప్రత్యక్షస్వరూపం. కావున ప్రత్యక్షంగా మనకు కనిపించే ప్రకృతిని వదిలివేయుట మంచిది కాదు. మనము వేటిమీద ప్రత్యక్షంగా ఆధారపడి బ్రతుకుతున్నామో వాటినికూడా పూజించి మన కృతజ్ఞతా భావాన్ని సుస్థిరం చేసుకోవాలి.
శ్రీ కృష్ణులు వారు ప్రకృతిని పూజించాలని గోవర్ధని గిరి పూజ తో మనకు తెలియచేసారు.
మనం ఈ గోవర్ధన గిరి వద్ద నివసిస్తాము. గోసంపదతో బ్రతుకు వారము. కావున గోవర్ధన గిరి పూజ గోమాత పూజ మనకు అత్యంత ప్రధానమ్. అందునా గోవర్ధనగిరి గోవిందుని వక్షఃస్థలం నుండి పుట్టి పులస్త్య మహర్షి అనుగ్రహంచే ఇచటికి వచ్చింది”. పరమాత్ముని అమృతవాక్యాలు విన్న వ్రజవృద్ధుడైన సన్నందుడు “ఓ నందనందన! నీవు జ్ఞానస్వరూపుడవు. నీ మాటలు మాకు శిరోధార్యములు. గోవర్ధనగిరి పూజావిధానము మాకు తెలుపుము” అని అన్నాడు. పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:
“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.
శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.
మంగళవారం, అక్టోబర్ 17, 2017
ఈరోజును ధనత్రయోదశి అని పిలుస్తారు ధనతెరాస్ అని ఐదు రోజుల సుదీర్ఘ దీపావళి సంబరాలలో మొదటి రోజు . ధనత్రయోదశి రోజున, ఐశ్వర్య దేవత అయిన మహాలక్ష్మీ పాలసముద్రము మథనం సమయంలో సముద్రము నుండి బయటకు వచ్చింది. అందుకే, సంపద దేవుడు అయిన కుబేరుడుతో పాటు లక్ష్మీదేవిని , ఈ ధనత్రయోదశి రోజును పవిత్రమైన రోజుగా పూజిస్తారు. అయితే, లక్ష్మీ పూజ అమావాస్య రోజున మరియు ధనత్రయోదశి రెండు రోజుల్లోను మరింత ముఖ్యమైన భావిస్తారు. ఈరోజున నరకాసుని చెరనుండి మహాలక్ష్మిని విడుదల చేసి ఆమెని ధనమునకు మూలదేవతగా వుంచుతారు మహావిష్ణువు. ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వద్ద మూడు అడుగుల నేలను దానంగా స్వీకరించాడు. భూలోకం మొత్తాన్నీ ఒక్క పాదంతో వామనుడు ఈ ధన త్రయోదశి నాడే ఆక్రమించాడంటారు.
అందుకే ఈరోజును పవిత్రముగా పుజిస్తారు. ఈరోజున బంగారము కొనుక్కోదలచినవారు కొనుక్కొని ధనలక్ష్మికి తమ శక్తీ కొలది పూజిస్తారు. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధికోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. ఆశ్వయుజ బహుళ త్రయోదశినాడు ఆచరించే ఈ పండుగకు ధన్వంతరీ త్రయోదశి, యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లూ ఉన్నాయి. ఈరోజు ధన్వంతరి జయంతి. ఆయుర్వేద దేవుని జయంతి జరుపుకుంటున్నాం. పరిపూర్ణ ఆయువుకోసం యమధర్మరాజును ధన త్రయోదశినాడు పూజిస్తారు. ఈ రోజు సూర్యాస్తమయ సమయంలో ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా మట్టి ప్రమిదల్లో నువ్వులనూనె పోసి దీపాల్ని వెలిగిస్తారు. వీటిని యమదీపాలుగా పేర్కొంటారు. యముడు దక్షిణదిక్కుకు అధిపతి కాబట్టి, ఇంటి ఆవరణలో దక్షిణం వైపున, ధాన్యపు రాశిమీద దీపాన్ని వెలిగిస్తారు. ఈ యమదీపంవల్ల సమవర్తి అయిన యముడు శాంతి చెంది, అకాల మృత్యువును దరిచేరనీయడని ప్రతీతి.
ఈరోజు ధన్వంతరి జయంతి. ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు.
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు. ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు. కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది. విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది. పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు.
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.
అందరు సుఖంగా, సంతోషంగా మరియు సిరిసంపదలతో తులతూగుతూ వుండాలని కోరుకుంటూ ధనత్రయోదసి శుభాకాంక్షలు.
సోమవారం, అక్టోబర్ 16, 2017
ఈరోజు మహారాష్ట్రలో గోవత్స ద్వాదశి పండుగను జరుపుకుంటారు. ఇది ధన్తేరాస్ కు ఒకరోజు ముందు జరుపుకుంటారు. గోవత్స ద్వాదశి పూజ హిందువులు జరుపుకునే పండుగ .
మనం ఆవులను ఆరాధించటానికి గుర్తుగా జరుపుకుంటారు. మానవ జీవితాన్ని కాపాడుకోవటానికి అవి చేస్తున్న సహాయంకు కృతజ్ఞతలు చెప్పటమే . ఈ సంప్రదాయము 'ద్వాదశి ' రోజు జరుపుకుంటున్నాం . దీనిని 'నందిని వ్రతము ' అని కూడా పిలుస్తారు. గోవత్సా ద్వాదాషి హిందూ భక్తులు దైవ ఆవు అయిన నందినిని పూజిస్తారు. ఈ పూజ వల్ల వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. ఈ పండుగను దేశంలో అన్ని ప్రాంతాలలో అపారమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ రోజును 'వాసు బరస్' గా గుర్తించి పూజ చేస్తారు మరియు దీనితోనే దీపావళి సంబరాలలో మొదటి రోజుగా పూజలు మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజునే , 'శ్రీపద వల్లభ ఆరాధన ఉత్సవ్' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిఠాపురం దత్తా మహాసాంధన్లో జరుగుతుంది, గుజరాత్లో 'వాగ్ బరాస్' గా జరుపుతారు.
గోవత్సా ద్వాదశి సమయంలో ఆచారాలు:
గౌవ్సా ద్వాదశి రోజున ఆవులు ఆరాధించబడుతున్నాయి. ఒక సంప్రదాయ స్నానం చేయించి నుదురు మీద తిలకం దిద్ది పూజ చేస్తారు. ఆవులు మరియు వారి దూడలను అందంగా ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు పూల పూలలతో అందంగా అలంకరిస్తారు.
గోవత్సా ద్వాదశి రోజు కొందరు భక్తులు ఆవుల విగ్రహాలను మరియు వారి దూడలను మట్టి తో తయారు చేస్తారు. ఈ మట్టి విగ్రహాలు కు కుంకుం మరియు పసుపుతో అలంకరించి పూజ చేస్తారు . సాయంత్రం హారతి ' ని ఇస్తారు.
గ్రామాలలో పశువులకు వివిధ రకాల ఆహార పదార్ధాలు సమర్పిస్తారు.
భక్తులు విష్ణువు అవతారంగా ఉన్న శ్రీ కృష్ణుడికి ప్రార్ధనలు చేస్తారు. ఆవుల పట్ల కృతజ్ఞతలు మరియు ప్రేమను కలిగి ఉంటారు.
కొన్ని ప్రాంతాల్లో, ప్రజలు గోవత్సా ద్వాదాషి రోజున ఆవు పాలను త్రాగటం మరియు నెయ్యి ని ఉపయోగించటం మానివేస్తారు.
గోవత్సా ద్వాదాషి యొక్క ప్రాముఖ్యత మరియు దాని పురాణము 'భవిష్య పురాణం' లో ప్రస్తావించబడింది. పురాణం లో నందిని యొక్క కథ కూడా ఉంది , దైవత్వం కల ఆవు మరియు దూడ గా పురాణం చెబుతుంది. హిందూ మతంలో, ఆవులు చాలా పవిత్రంగా భావిస్తారు. వారు మానవాళికి పోషణ అందించేటప్పుడు వారు కూడా పవిత్ర మాతృమూర్తి గా పూజిస్తారు. Govatsa Dwadashi రోజు న మహిళలు తమ పిల్లలు సుదీర్ఘ జీవితం కోసం ప్రార్ధిస్తారు . పిల్లలు లేని జంట జంటగా గోవత్సా ద్వాదాషి పూజ నిర్వహిస్తారు మరియు ఉపవాసం ఉంటే, వారికి పిల్లలతో ఆనందంగా ఉండే ఆశీర్వదము కలిగి ఉంటారనే నమ్మకం ఉంది . ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో, గోవత్సా ద్వాదాషి కూడా 'వాగ్' అని కూడా పిలుస్తారు, వాగ్ అనగా ఆర్థిక రుణాలను తిరిగి చెల్లించాలని సూచిస్తుంది. అందువలన ఈ రోజున వ్యాపారవేత్తల్లో వారి ఖాతాల పుస్తకం ను క్లియర్ చేసి, వారి నూతన లావాదేవీలు దీవాలి తో మొదలుపెడతారు . గోవత్సా ద్వాదశి రోజు ఆవులు ను పూజించి న వ్యక్తి సమృద్ధిగా మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతాడు అని నమ్ముతారు. మనం పూజించే ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారుట. గోవును పూజిస్తే మనం ఒకసారి ముక్కోటి దేవతలను పూజించినట్టే వారి దీవెనలు మనకు అందినట్టే.
గోవత్స ద్వాదశి పూజ గురించి బాగుంది కద .
"గోవులను పూజించండి. గోవధను వ్యతిరేకించండి "అదే మన హిందూ సాంప్రదాయం .
బుధవారం, అక్టోబర్ 11, 2017
ఈరోజుకొక విశేషము వుంది అది ఏమిటంటే. మనందరికీ చీకటి నుండి తెల్లవారాక ముందే వారికి తెల్లవారుతుంది. చకాచకా పరిగెడుతూ పరిగెడుతూ సైకిల్ మీద వార్తా పత్రికలు ప్రతి ఇంటికి ప్రతీ వీధి వీధి కీ వార్తాపత్రికలును వేసి తొందర తొందరగా వార్తా పత్రికలను అందిస్తూ ఉంటాడు. పల్లెటూరులో అయితే కొక్కొరోకో అనే కోడి అరుపుతో తెల్లారుతుంది. మరి మన ఇంటి ముందర పాల పేకట్లు తో పాటు ప్రఫంచం అంతటా ఎమి జరిగిందో, ఏమి జరగబోతోందో తెలపటానికి వార్తా పత్రిక కూడా వుంటుంది. వార్తాపత్రికలు చూస్తే కానీ మనకు తెల్లవారిన అనుభూతి రానే రాదు. వేడి వేడి కాఫి పట్టుకొని పేపర్ చదవటం ప్రతి ఇంట్లో జరిగే రోజు జరిగే మొదటి పని. అందరు దేవదేవుని సుప్రభాతము వింటారో వినరో కానీ పేపరు చదవకుండా వుండలేరు. ఆ పేపర్ చేరటం ఆలస్యం అయితే మనమే అతని కోసం ఎదురు చూస్తాం. ఈ పేపరు మన ఇంటికి చేర్చేది పేపర్ బోయ్ నే. వాతావరణం ఎలా వున్నా. తెల్లారేసరికి మన ఇంటికి పేపర్ అందిస్తాడు పేపర్ బోయ్.
ఈరోజు ప్రపంచం అంతా "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" జరుపుకుంటున్నారు.
మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ - న్యూయార్క్ సన్ పత్రిక 1833 నుంచి 1950వరకు ప్రచురణ అయ్యింది). చదువుకుంటూనే పేపర్ బాయ్ లుగా పని చేసి ఎంతో మంది సమాజంలో ఉన్నతస్థాయికి ఎదిగారు. ఉదాహరణకు రామేశ్వరంలో పుట్టిన అబ్దుల్ కలాం పేపర్ బాయ్ నుండి జీవితాన్ని మొదలుపెట్టి భారత రాష్ట్రపతి వరకు ఎదిగారు.
అలాగే పేపర్ బాయ్ గా సంపాదన మొదలు పెట్టి ఇండియాన్ ఐడల్ 2017 రేవంత్ విజేతగా నిలిచాడు. ఇలాంటి వారిని చూసి మనం ఆదర్శంగా తీసుకోవాలి. మనం జీవితంలో ఏదన్నా సాధించాలి అంటే చాలా కష్టపడాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలకు చేరగలం.
పేపర్ బోయ్స్ అందరికి "ప్రపంచ పేపర్ బాయ్స్ రోజు" శుభాకాంక్షలు.
శనివారం, అక్టోబర్ 07, 2017
ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.
అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి, అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు.
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం''
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి. మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.
శుక్రవారం, అక్టోబర్ 06, 2017
ప|| పలుమరు ఉట్ల్ల పండగను |
చిలుకు చిడక్కని చిందగను ||
చ|| ఊళ్ళ వీధుల ఉట్ల కృష్ణుడు |
తాళ్ళు తెగిపడ తన్నగను |
పెళ్ళు కఠిల్లు పెఠిళ్ళు చిఠిల్లని |
పెళ్ళుగ మ్రోసె పెనురవము ||
చ|| బంగరు బిందెల పాలు పెరుగులు |
ముంగిట నెగయుచు మోదగను |
కంగు కళింగు కఠింగు ఖణింగని |
చ|| నిగ్గగు వేంకట నిలయుడిటు పా |
లగ్గలిక పగుల అడువగను |
బగ్గు బగ్గిలని పరమామౄతములు |
గుగ్గిలి పదనుగ గురియగను ||
గురువారం, అక్టోబర్ 05, 2017
ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు
రత్నాకర. వాల్మీకి సంస్కృత సాహిత్యం
ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని
మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు. అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని నమ్ముతారు (సుమారు 500 BC). కొందరు 1,800 సంవత్సరాల క్రితము వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు.
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు
7 కాండాలుగా
(ఉత్తరకాండ
సహా)విభజించబడి ఉన్నాయి.
రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు
ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది. శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని కలుసుకున్నారు.
వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి
సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు
వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు సీతను
వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు రామాయణం బోధించాడు.
రామాయణంలోని
ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ
, అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో
నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు.
ఒకరోజు నారద మహర్షిని
కూడా దోచుకోబోగా, నారదుడు
ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు
పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ
తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు. ఆపేరు నిలిచిపోయింది. వల్మీకం అనగా పుట్ట
అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు.
వాల్మీకి తపస్సంపన్నత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
- ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
- ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి.
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా రాసేవరకూ సాగింది. ఈ మొదట శ్లోక రచన చేసింది వల్మికినే.
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ.
తమిళనాడు లోని తిరువంచియూర్ లోని మహర్షి వాల్మీకి కి చిన్న ఆలయం (జీవా సమాధి) ఉంది. వాల్మీకి ఆలయం
బుధవారం, అక్టోబర్ 04, 2017
నీవే మాకు దిక్కు నిన్నే తలతుము
కావు మా నేర మెంచక కరుణానిధీ
నెట్టన సూర్యు లోని నెకొన్న తేజమా
గట్టిగా జంద్రునిలోనీ కాంతిపుంజమా
పుట్టి రక్షించే యజ్ఞ పురుషుని ప్రకాశమా
వోట్టుక దేవతలలో నుండిన శక్తీ
సిరులు మించిన యట్టి జీవులలో ప్రాణమా
గరిమ వేదములలో గల యర్థమా
పరమపాదమునందు బాదుకొన్న బ్రహ్మమా
చరాచరములలో సర్వాధారమా
జగములో వెల సేటిసంసారసుఖమా
నిగిడిన మంత్రముల నిజమహిమా
మిగుల శ్రీవేంకటాద్రి మీదనున్న దైవమా
ముగురు వేల్పులలోని మూలకందమా
నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ