దీపదాన మహాత్య్మం:
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును. దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం
దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమఅని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.
ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.
లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట:పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.
ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.