Blogger Widgets

గురువారం, అక్టోబర్ 05, 2017

మహర్షి వాల్మీకి

గురువారం, అక్టోబర్ 05, 2017

ఈ రోజు వాల్మీకి జయంతి. వాల్మీకి సుమాలి కుమారుడు. మహర్షి వాల్మీకి షుద్ర కుటుంబంలో జన్మించాడు. ఆయన పుట్టిన పేరు రత్నాకర.  వాల్మీకి సంస్కృత సాహిత్యం ఆదికవి గౌరవించబడ్డాడు. వాల్మీకిని  మహర్షి వాల్మీకి అని కూడా పిలుస్తారు మరియు ఆది కవి సంస్కృత భాషలో మొదటి కవిగా పరిగణిస్తారు.  అతను ఒక గొప్ప యోగి మరియు ఈయన రామాయణ రచయిత.
రామాయణం రాసిన సమయం గురించి విభిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది ప్రజలు 2,500 సంవత్సరాల క్రితం వ్రాయబదినది అని  నమ్ముతారు (సుమారు 500 BC).  కొందరు 1,800 సంవత్సరాల క్రితము  వ్రాసినట్లు మరికొందరు భావిస్తున్నారు. పుస్తకం చాలా పురాతనమైనది మరియు మహాభారతకు ముందు వ్రాయబడింది అని అందరూ అంగీకరిస్తున్నారు.
వాల్మీక రామాయణంగా అందరికీ తెలిసిన వాల్మీకంలో 23వేల శ్లోకాలు 7 కాండాలుగా (ఉత్తరకాండ సహా)విభజించబడి ఉన్నాయి. 
రామాయణంలో 4 లక్షల ఎనభై వేల పదాలు ఉన్నాయి. రామాయణం దాదాపుగా క్రీపూ 500 లో రాయబడిందని పాశ్చాత్యులు నమ్ముతారు. మహర్షి వాల్మీకి శ్రీ రామ జననం శకంగా తన పుట్టిన ఖచ్చితమైన సమయాలను నిర్వచించటానికి చేస్తుంది కూడా ఆధునిక చరిత్రకారుల మధ్య చాలా చర్చనీయాంశంగా ఉంది.   శ్రీ రామ ప్రవాస తన కాలంలో వాల్మీకిని  కలుసుకున్నారు.  వాల్మీకి రామాయణంలో తాను శ్రీరాముడికి సమకాలీనుడని పేర్కొన్నాడు. శ్రీరాముడు వాల్మీకిని అరణ్యవాసంలో కలిసినట్టు, శ్రీ రాముడు  సీతను వనవాసానికి పంపినపుడు వాల్మీకాశ్రమంలోనే ఆవిడ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఆశ్రమంలోనే సీత లవ-కుశలను కన్నట్టూ, వీరిద్దరి విద్యాభ్యాసం ఇక్కడే వాల్మీకికి శిష్యరికంలో జరిగినట్టు రామాయణం ద్వారా తెలుస్తుంది. వాల్మీకి ఈ కవలలుకు  రామాయణం బోధించాడు.
రామాయణంలోని ఉత్తరకాండలో మనకి వాల్మీకి పూర్వాశ్రమ జీవితం గురించి తెలుస్తుంది. ఆ కథనం ప్రకారం వాల్మీకి ఒక బందిపోటు దొంగ,  అతని తల్లిదండ్రులు పెట్టిన పేరు రత్నాకర్ . అతను తన కుటుంబంను పోషించటానికి అడవిలో నివసిస్తూ బాటసారులను చంపి, వారి సొత్తును దోచుకుని జీవితం గడిపేవాడు. 
ఒకరోజు నారద మహర్షిని కూడా దోచుకోబోగా, నారదుడు ఆ దొంగను ఒక ప్రశ్న అడుగుతాడు, కుటుంబం కోసం చేసే ఈ దోపిడి ద్వారా వచ్చే పాపాన్ని కుటుంబం కూడా పంచుకుంటుందా అని ఆదిగాడు. ఔను అని దొంగ అనగా, ఈ విషయాన్ని భార్య నుండి ధృవీకరించుకోమని నారదుడు అంటాడు. భార్యను అడుగగా, పాపాన్ని పంచుకోడానికి నిరాకరిస్తుంది. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారం పొంది, నారదుడిని క్షమాపణ కోరి, జీవిత సత్యాన్ని గ్రహిస్తాడు. నారదుడు భగవత్ భక్తిని నేర్పటానికి ప్రయత్నిస్తాడు. "రామ" అని పలకమంటే ఆ దొంగ పలకలేకపోతాడు. చాలా సేపు ప్రయత్నించినా దొంగ ఆ పదాన్ని పలకలేకపోతాడు, అప్పుడు నారదుడు "మరా" అని పదే పదే చెప్పమని, ఆ విధంగా రామ మంత్రాన్ని వాల్మీకికి ఉపదేశిస్తాడు. ఉపదేశం పొందిన దొంగ, జపం చేస్తూ ఉన్న చోటనే తపస్సమాధిలోకి వెళ్ళిపోతాడు. చుట్టూచీమలు పుట్టలు తయారు చేసుకున్నా చలించకుండా తపస్సు చేస్తాడు. చాలా కాలం తపస్సు చేసాక బ్రహ్మ తపస్సుకు మెచ్చి ఆకాశవాణి ద్వారా తపస్సంపన్నం గురించి తెలియపరుస్తూ వాల్మీకి అనే పేరును ఆ దొంగను పిలుస్తాడు.  ఆపేరు నిలిచిపోయింది.  వల్మీకం అనగా పుట్ట అని అర్థం. వల్మీకం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి వాల్మీకి అయ్యాడు. 
వాల్మీకి తపస్సంపన్నత ఆశ్రమవాసం చేయసాగారు. ఆశ్రమ ధర్మాలలో భాగంగా గంగానదీ తీరానికి సంధ్యకు రాగా. భరద్వాజుడనే శిష్యుడు అతని వస్త్రాలను తెస్తాడు. మార్గంలో తామస నది వద్దకు చేరుకుంటారు. తామస నది నిర్మలత్వాన్ని చూసి ఆ నదిలోనే స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు. స్నానానికి నదిలో దిగుతూ ఒక క్రౌంచ పక్షి జంటను సంగమించడం చూస్తాడు. చూసి పరవశానికి గురి అవుతాడు. అదే సమయంలో మగ పక్షి బాణంతో ఛెదింపబడి చనిపోతుంది. భర్త చావును తట్టుకోలేక ఆడ క్రౌంచ పక్షి గట్టిగా అరుస్తూ చనిపోతుంది. ఈ సంఘటనను చూసి వాల్మీకి మనసు కరిగి శోకానికి లోనవుతాడు. ఈ సంఘటనకు కారణం ఎవరా అని చుట్టూ చూస్తాడు. దగ్గరలో ఒక బోయవాడు ధనుర్బాణాలతో కనిపిస్తాడు. వాల్మీకికి కోపం వస్తుంది. ఆ శోకంతో కూడుకున్న కోపంలో ఆ బోయవాడిని శపిస్తూ ఈ మాటలు అంటాడు:
మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షులజంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి
ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయినది రామాయణ కావ్యం అంతా  రాసేవరకూ సాగింది.  ఈ మొదట  శ్లోక రచన చేసింది వల్మికినే. 
అటవీ తెగకు చెందిన వాల్మీకి కరువుల వల్ల బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారత దేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్తబుషులచే జ్ఞానోదయమైన తర్వాత , మహర్షిగా మారి దండకార్యణం గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాల్ని కావ్యంలొ పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నదితీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విష్లేషకుల భావవ. 

తమిళనాడు లోని తిరువంచియూర్ లోని మహర్షి  వాల్మీకి కి చిన్న ఆలయం  (జీవా సమాధి) ఉంది.  వాల్మీకి ఆలయం

 Lord Valmiki Chennai Lord Valmiki Chennai.jpg

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

శుక్రవారం, ఏప్రిల్ 08, 2016

శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

ఉగాది ప్రతీ సంవత్సరం చాంద్రమానం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి రోజు వస్తుంది. ఉగాది పండగకు చారిత్రిక కధలువున్నాయి.    
దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించి, ధర్మాన్ని నిలపడానికి శ్రీమహావిష్ణువు ఈ భూమి మీద తిరిగి తిరిగి అవతరిస్తూ వచ్చాడని హిందువుల నమ్మకం. 'అవ తారం' అనే మాటకు 'దిగి రావడం' అని అర్థం ఉంది. ధర్మసంస్థాపనానికి శ్రీమహావిష్ణువు ఎత్తిన అవతారాలలో ప్రధానమైనవి పది. వాటినే దశావతారాలు అంటారు.  శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో మత్స్యావతారం మొదటిది. 
ఈరోజే మత్స్యము గా అవతరించారు అంటారు.

ద్రవిడ దేశపు రాజైన సత్యవ్రతుడు కృత మాలిక ఒడ్డున జల తర్పణం చేయుచుండగా మత్స్య మొకటి అతని దోసిట పడెను. అది నన్ను రక్షించు రక్షించు అని రాజును వేడు కొనెను. రాజు ఆ మత్స్యాన్ని ఒక భాండం నందుచెను. మరుసటి రోజు ఆమత్స్యం పది నారంగుళములు పెరిగిను. ఈ విధంగా పెరు గుతూపోతున్న చేపను చివరికి సముద్రంలో వేస్తూ నీవేవరివి? అని అడిగెను. దానికి ఆ చేప తాను, జనార్దుడనని చెప్పెను. బ్రహ్మదేవుడు నిద్రిస్తున్న సమయంలో నాలుగు వేదాలను సోమకుడు అనే ఒక రాక్షసుడు దొంగ లించా డని, అతడు కౄర స్వభావుడని చెప్పాడు. అంతేకాక, ధర్మ బద్దమైన జీవన విధానానికి రాక్ష సులు వ్యతిరేకులని కూడా చెప్పాడు.
సోమకుడు తాను దొంగిలించిన నాలుగు వేదా లతో సహాసముద్రం అడుగుభాగాన దాగి ఉన్నా డు. మహాజల ప్రళయం రానున్న కార ణంగా ముల్లోకాలు నీట మునుగుతాయి. నేను మీ కోసం ఒక నావను పంపుతాను. మీరు, సప్తఋషులు, ఔషధవృక్షజాతులతో కలిసి, ఆనావలో ఎక్కండి. వాసుకి అనే మహా సర్పంతో ఆనావను కట్టండి. మహాజల ప్రళయం ముగిసేదాకా ఆ నావ నీటిలో తేలియాడేలా నేను చూసుకుంటాను అని ఆ మత్స్యం అభ యమిచ్చింది.
చేప రూపంలో ఉన్న విష్ణువు చెప్పిన విధం గానే సత్య వ్రతుడు చేశాడు. అప్పుడు ఆ చేప సముద్రం అడుగు భాగానికి ఈదుకుంటూ వెళ్లాడు. సోమకుడు దాగి ఉన్న చోటికి చేరు కున్నాడు. ఘోర యుద్ధ అనంతరం సోమ కుడు మరణించాడు. శ్రీమహావిష్ణువు నాలుగు వేదాలు రక్షించి తెచ్చి బ్రహ్మదేవునికి అందించాడు. బ్రహ్మదేవుడు వాటిని ముందు తరాల వారికోసం భద్రపరిచాడు. ఆ విధంగా వేదాలు మనకు లభ్య మైన కారణంగా మానవులు సకల ధర్మాలను, శాస్త్రాలను, అభ్యసించే అవకాశం కలిగింది.
మనం చిన్న పిల్లలకు కధలు చెప్తాం కదా అందులో విక్రమార్క మాహారాజు కధలు కూడా చెప్తాం. ఆ విక్రమార్క మహారాజు పటాభిషేకం జరిగిన రోజు కూడా ఈరోజే.  ఇవి చరిత్రలోని కొన్ని అంశాలు.  
ఈ ఉగాది అందరికి ఎన్నో ఎన్నెన్నో ఆనందాలు ఇవ్వాలి అని కోరుకుంటూ శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.  

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

ఉదయాద్రి తెలుపాయె

మంగళవారం, ఫిబ్రవరి 23, 2016

తాళపాక  అన్నమయ్య 95 సంవత్సరాలు పరిపూర్ణ జీవితం గడిపి దుందుభి నామ సంవత్సరం ఫల్గుణ బహుళ ద్వాదశి నాడు (ఫిబ్రవరి 23, 1503) పరమపదించాడు. రాగిరేకులమీద వ్రాసిన తిధుల కారణంగా అతని జన్మ, మరణ దినాలు తెలుస్తున్నాయి.  ఇతడు శ్రీమహావిష్ణువు యొక్క ఖడ్గం అయిన నందకాంశ సంభూతుడు అని భావన ఉంది. "పదకవితా పితామహుడు", "సంకీరత్నాచార్యుడు", "పంచమాగమ సార్వభౌముడు", "ద్రవిడాగమ సార్వభౌముడు" - ఇవి అన్నమయ్యకు సమకాలీనులు సాదరంగా ఇచ్చిన బిరుద నామాలు.  అన్నమయ్య వర్ధంతి సందర్బంగా ఒక మంచి పాట. 
ఉదయాద్రి తెలుపాయె నుండు రాజు కొలు వీడె | 
అద నెర్కిగి రాడాయె నమ్మ నా విభుడు ||
చన్నులపై ముత్యాల సరులెల్ల జల్లనాయె | 
కన్నులకు గప్పొదవె గాంత నా కిపుడు |
కనె కలువల జాతి కనుమోడ్చినది మీద | 
వెన్నెల వేసంగి మొగ్గ వికసించె గదవె ||
పువ్వుల లోపలి కురులు బుగులు కొనగా నెర్కసె | 
దవ్వుల దుమ్మెదగములు తరమి డాయగను |
రవ్వసేయ శుక పికము రాయడి కోర్వగ రాదు | 
అవ్వలనెవ్వతె పసల కలరున్నవాడో ||
పన్నీట జలక మార్చి పచ్చకప్రము మెత్తి | 
చెన్ను గంగొప్పున విరులు చెరువందురిమి |
ఎన్నంగల తిరువేంకటేశుం డిదె ననుంగూడి | 
కన్నుల మనసునుం దనియం గరుణించెం గదవే ||

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని '

శుక్రవారం, ఫిబ్రవరి 12, 2016

దయానంద - 'పాఖండ ఖండిని ' పతాకము 
ఆర్యసమాజ్ స్థాపకుడు, అజ్ఙానాంధకారం, దారిద్య్రం, అన్యాయన్ని ఎదురించి పోరాడి, హిందు ధర్మ సంస్థాపనకు నడుం బిగించిన స్వామి దయానంద సరస్వతి జయంతి నేడు   ఈయన 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం లో చాలా ముఖ్యమైన  పాత్ర పోషించి, ఎందరో స్వాతంత్ర  సమర యోధులకు ప్రేరణ గా నిలిచాడు స్వామీ దయానంద సరస్వతి .
స్వామి దయానంద సరస్వతి 1824 సంవత్సరం లో గుజరాత్ లోని  ఠంకార అనే గ్రామంలోని  మహాశివభక్తులు అయిన ఒక వర్తక కుటుంబం లో జన్మిచారు.  ఈయన చిన్ననాటి నుండి భగవద్భక్తి ఎక్కువగా  కలిగివున్నాడు.  1846 లో భగవంతుడిని వెతకడానికి ఇల్లు వదిలి వెళ్లాడు. ఈ ప్రయాణంలో ఎందరో యోగులు మునుల సాంగత్యంలో గడిపి దయానందఅన్న నామం పొందాడు. భగవంతుని తపనలో భ్రమిస్తూ మథుర లోని స్వామి విరజానంద సరస్వతి కడకు చేరుకున్నాడు, అక్కడే వేదోపనిషత్తులను ఔపోసనం పట్టి గురువు ఆజ్ఞ మేరకు దేశమంతట ప్రబోధించుటకు బయలుదేరెను.  ధర్మం పేరిట జరిగే మోసాలు మూఢనమ్మకాలు గ్రహించాడు.  అలాంటి అధర్మాలను రూపుమాపటానికి ప్రయత్నించారు.  ప్రయాణ మార్గమున దేశ స్థితిగతులు, దీనమైన శోచనీయమైన హిందు సమాజమును అవగాహన చేసుకున్నాడు. భారతావని బ్రిటిష్ పాలనలో ఉంది, ఒకప్పుడు విశ్వమానవ సామ్రాజ్యానికి, ధర్మ సంస్కృతులకు కేంద్రమైన దేశం ఇప్పుడు, అపారమైన దరిద్రంలో స్వయం వినాశనానికి పరుగులెడుతుండడం చూసి శోకించాడు. హిందు సమాజం ఎటువైపు నుండి చూసినా కుల, మత వర్గ విభేదాలతో ఖండములగుచున్నది, అంధ విశ్వాసం, అంటరానితనం, సతి, బాల్య వివాహాలు ధర్మం పేరుతో జరుగుతున్న అవాంఛనీయమైన ఆచారాలు చూసిచలించి పోయి వాటిని ఛేదించడానికి 'పాఖండ ఖండిని ' అన్న పతాకాన్ని ఆవిష్కరించినాడు. భారత దేశాన్ని, హిందు సమాజాన్ని జాగృత పరచాలని సంకల్పించి ఎన్నో పురోగామి సంస్కరణలు చేపట్టాడు. అందులో భాగంగా సతి, బాల్య వివాహాలు, అంటరానితనం, వరకట్న దురాచారాన్ని బహిష్కరించాడు. స్త్రీ విద్య పరిచయం చేసాడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదం పోవాలని నమ్మి (స్వరాజ్) స్వయం పరిపాలన అని మొదటి సారి గొంతెత్తినాడు. దయానందుడు వ్రాసిన సత్యార్థ ప్రకాశ్ లో భారత దేశం నుండి సమస్త భారతీయుల మనసులలోని మూఢ నమ్మకాలు, అంధవిశ్వాసాల నిర్మూలన గూర్చి వ్యాఖ్యానించాడు. ధర్మ సంస్థాపనకు శాశ్వత సంస్థగా, దేశ సంఘ సంస్కరణకు పునాదిగా, 10 ఏప్రిల్ 1875 న ముంబాయి నగరంలో మొదటి ఆర్యసమాజము స్థాపించినాడు. ఈ క్రమంలో దయానంద సరస్వతి పెక్కుమందికి కంట్లో నలుసు అయినాడు, పూర్వం ఏడు సార్లు విషప్రయోగాలు జరిగిననూ బస్తి, న్యోళి అనే యోగ ప్రక్రియ ద్వారా ప్రేగులను ప్రక్షాళనము చేసుకుని వాటిని విఫలము చేసినను, చివరిసారిగా 30 అక్టోబర్ 1883 సాయంత్రము జరిగిన విష ప్రయోగంతో క్షీణిస్తూ ఓంకారనాదంతో సమాధి అవస్థలో మోక్షాన్ని పొందాడు.

సోమవారం, జనవరి 04, 2016

విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు.

సోమవారం, జనవరి 04, 2016

మూడు ఆపిల్స్ ప్రపంచ గమనాన్నే మార్చేశాయి. ఒకటో ఆపిల్...ఆడమ్ - ఈవ్ రుచి చూసిన నిషిద్ధ ఫలం. రెండో ఆపిల్...న్యూటన్ విశ్రాంతి తీసుకుంటున్న చెట్టు మీంచి రాలిన పండు. మూడో ఆపిల్...స్టీవ్‌జాబ్స్ స్థాపించిన సంస్థ. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా 'ఆపిల్ కంప్యూటర్స్' రికార్డు సృష్టించింది.  

ఈ రోజు సర్ ఐజాక్ న్యూటన్ జయంతి.  ఐజాక్ న్యూటన్ జనవరి 41643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు.  న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. ఈయన ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సు గా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది.

చిన్నతనంలో ఒకరోజు ఆపిల్ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్న చిన్ని న్యూటన్ మీద చెట్టుమీదనుండి ఆపిల్ పండు పడింది.  అప్పుడు చిన్న ప్రశ్న మనస్సులో మెదిలింది.  పండు కిందకె ఎందుకు పడింది.  పైకి ఎందుకు పడలేదు అన్న ప్రశ్న.  ఈ ప్రశ్నకు సమాదానం అన్వేషించే క్రమంలోనే గురత్వాకర్షణ సిద్దాంతాని ప్రతిపాదించాడు.  1661 వ సంవత్సరలో గొప్ప చదువుల కోసం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరిన న్యూటన్  భౌతిక, గణిత, ఖగోళ  శాస్త్రంలో ఇష్టాన్ని పెంచుకున్నాడు. అక్కడే ప్రొఫెసర్ గా చేరాడు న్యూటన్.  1667 లో పరావర్తన దూరదర్శిని ని కనిపెట్టి అప్పట్లో సంచలనం సృస్టించాడు.   1687 లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తి గురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్థావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపైపూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.


"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు. న్యూటన్ పరిశోధనలకు 1705 లో బ్రిటన్ ప్రభుత్వం గుర్తించి "సర్" అనే బిరుదును గౌరవంగా అందించింది.  అప్పటినుండి సర్ ఐజాక్ న్యూటన్ గా పిలవబడుతున్నారు.  
 ఆధునిక యుగంలో  వైజ్ఞానిక విప్లవానికి శ్రీకారం చుట్టిన శాస్త్రవేత్తగా సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ చరిత్రలో నిలిచాడు. గురుత్వాకర్షణ శక్తిని, సౌర కుటుంబ చలనానికి మూల సూత్రాన్ని ఆవిష్కరించి, చీకట్లను పారదోలిన మహానీయుడు న్యూటన్‌. అవని నుంచి అంతరిక్షం వరకు పలు రంగాలను అర్ధం చేసు కోవడానికి ఆయన సూత్రాలు కొత్తమార్గాన్ని చూపాయి. 1727 మార్చి 20న న్యూటన్‌ మరణించారు . వైజ్ఞానిక ప్రపంచంలో తన పరిశోధనలతో విప్లవం సృష్టించిన సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ ఇలా అన్నారు .''వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతి ఏ ఒక్కరివల్లో ఉన్నట్టుండి ఊడిపడేది కాదు. ఎందరో శాస్త్రవేత్తలు తరాల తరబడి చేసే కృషి ఫలితమే ప్రగతి అంటు'' విశ్వరహస్యాల గుట్టు విప్పిన మహానుభావుడు. 

బుధవారం, డిసెంబర్ 23, 2015

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు 8

బుధవారం, డిసెంబర్ 23, 2015

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు పాశురం :  

కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు 
మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం
పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -
క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ
పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు
మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ
దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్
ఆవా ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్

తాత్పర్యము:
 తూర్పు దిక్కున తెల్లని కాంతి వ్యాపించుచున్నది.  తెల్లవారినది మేతకు విడువబడిన గేదెలు నలుదిక్కులకు వ్యాపించుచున్నవి.  మనతోటి పిల్లలు వ్రతస్తలమునకు వెళ్ళుటకు కృష్ణుని వద్దకు వెళ్ళుటయే ప్రయోజనకరమని భావించి నడుచుచున్నారు.  అట్లు వెళ్ళుచున్నవారిని నిలిపివేసి మేము నిమ్ము పిలుచుటకు నీ ద్వారమందు నిలిచి యున్నాము.  కుతూహముగల ఓ లలనా ! లేచి రమ్ము.  శ్రీ కృష్ణుని దివ్యమంగళ "పర" అను సాధనము గ్రహించి కేశియను రాక్షసుని చీల్చి సంహరించినట్టియు మల్లుర ప్రాణములను కొల్లకోట్టినట్టియు దేవతలందరకు ఆ దేవుడైన వానిని సమీపించి సేవించినట్లు అయితే అతడు మెచ్చుకొని అయ్యయ్యో నేను రావలెననుకొనుచుండగా మీరే వచ్చితిరే అని మానను పరిశీలించి మన కోరిక నెరవేర్చును కనుక వెంటనే లేచి రమ్ము అని తోటి కన్యను మేల్కొల్పుతున్నారు.
  

గురువారం, డిసెంబర్ 17, 2015

మార్గశిర లక్ష్మివారము

గురువారం, డిసెంబర్ 17, 2015




సిరి మహాలక్ష్మి 
మార్గశిర లక్ష్మివార వ్రతము
మార్గశిర  నెలలో లక్ష్మీ పూజ చేసుకునే అన్ని సమస్యలను పరిష్కరించటానికి మరియు దేవత లక్ష్మీ దేవి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్య తో నివశించాగలరని  భక్తులు నమ్ముతారు.  మార్గశిర లక్ష్మీ పూజ  పూజ విధానం  దీపావళి  లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి  పూజ వంటి ఇతర లక్ష్మీ వ్రతం వలెనే  అయితే, ఈ దేవత కు సమర్పించే ఆ నైవేద్యం వైవిధ్యమైనది. 
మార్గశిర నెల గురవారం, భక్తులు దేవాలయాలు లోను  లేదా ఇళ్లలో లక్ష్మీ పూజ చెయ్యడానికి ముందు రోజే సిద్ధం చేసుకుంటారు. ఇళ్ళు, శుభ్రం చేసి చక్కగా ఉంచబడిన పండుగ రోజులలో మరియు దేవత లక్ష్మి యొక్క చిత్రం లేదా చిన్న విగ్రహం పూజ ప్రదేశం వద్ద ఉంచుతారు. 
లార్డ్ వినాయక కు  మొదటి పూజలు చేస్తుంటారు. భక్తులు అవరోధాలు లేదా విఘ్నాలు వదిలించుకోవటం కొరకు గణపతి ప్రథమ పూజ చేస్తారు. గణపతి పూజ తర్వాత, దేవత లక్ష్మీ షోడశోపచార  పూజ మరియు అష్టోత్తరం  తో పూజలు మరియు నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం అందింస్తారు. మార్గశిర  లక్ష్మీ పూజ, కథ చదువుకోవాలి.
లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారం చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో లో వుంటాయి కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి అదే ఇక్కడ విశేషం.
నైవేద్యం  లేదా మార్గశిర  లక్ష్మివార  వ్రతం  సమయంలో దేవత లక్ష్మీ దేవికి ఆహార సమర్పణలు:
1 వ గురువారం - పులగం 
2 వ గురువారం - అట్లు, తిమ్మనం
3 వ గురువారం -  అప్పాలు, పరమాన్నము
4 వ గురువారం - చిత్రాన్నం, గారెలు, 
5 వ గురువారం - పూర్ణం బూరెలు 
మార్గశిర లక్ష్మివార వ్రత కధ:
పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు.  అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.  ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం యిచ్చేది.  ఆసుశీల  సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహా లక్ష్మి చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆదుకునేది సుశీల.  ఇలాకొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది.  అత్తవారింటికి పోవుచూ తానూ తయారు చేసుకున్న లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.  ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు.  పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని  సుశీల చాలా బాధపడుతుంది.  తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా!  నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.  సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు.  దరిద్రమును తెలుసుకున్న ఒకకర్రను దోలిపింఛి దానినిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది.  ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు.  ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు.  ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను.  మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.  కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగితెలుసుకున్నది.  వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి.  ఒకచేప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను.  సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి ఒక చేరువుగాట్టును చెప్పులు మూట పెట్టి నీరుతాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు.  జరిగిన విషయం తల్లికి చెప్పాడు.  తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.  మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను.  అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను.  అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది.  సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒకచేరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు.  ఇంతలో ఒకబాటసారి పండుబాగుందని పట్టుకుని వెళ్ళిపోయెను.  ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతగాగా పండులేదు.  ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు.  తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను.  తల్లి విచారించింది.  కొన్నాళ్ళకు.  తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను.  తల్లిని చూసి సుశీల వారిదరిద్రమును తెలుసుకొని చింతిచి  మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది.  అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమివేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అనిచేప్పెను.  ఆమెకూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.  కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది.  అప్పుడు జరిగినది తల్లిచేప్పినది.  ఆవారం కూతురుమాత్రమే చేసుకున్నది.  రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది.  ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.  మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగావుండమని చెప్పినది.  పిల్లలకు తలదువ్వుతూ ఆమె తలడువ్వుకొని వ్రతం చేయలేకపోయినది.  కూతురుమాత్రమే చేసుకున్నది.  నాలగవ వారం ఈసారి అయినా చాలజాగ్రత గావుండమని చెప్పి సుశీల తల్లి ఈపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది.  పని అయినతరువాత అమ్మను తెస్సుకుని వచ్చి స్నానం చేస్తే పూజచేసుకుంధం అని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు నేను తోచక అది తిన్నా అని చెప్పింది.  అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొని.  ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం ఆఖరి వారం .  అప్పుడు సుశీల తల్లిని తనకోగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది.  పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది.  కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది. ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా....  నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది.  అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.  మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృస్యము అయ్యినది మహాలక్ష్మి.  సరే అని మొదటివారం పులగం, రెండవ వారం అట్లు, తిమ్మనం,  మూడవ వారం అప్పాలు, పరమాన్నము, నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు,  పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది.  కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు.  అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.  కధలోపమైనను వ్రత లోపము కారాదు.  భక్తి తప్పినను ఫలము తప్పదు.  

శనివారం, నవంబర్ 21, 2015

యాజ్ఞవల్క్య గురుదేవ నమోస్తుతే

శనివారం, నవంబర్ 21, 2015

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.  ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను. యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 

గురువారం, అక్టోబర్ 29, 2015

గౌరీవ్రతము / అట్లతద్ది

గురువారం, అక్టోబర్ 29, 2015

                       











ఈ నోమును మొట్టమొదటిసారిగా గౌరీదేవి నారదమహాముని ప్రోద్బలంతో నోచుకుని సాక్షాత్తూ పరమేశ్వరుని పతిగా పొందిందని పురాణోక్తి. ఇందుకే ఈ నోముకు చంద్రోదయ గౌరీవ్రతమని కూడా పేరు.

అట్ల తద్దోయ్ ఆరట్లోయ్
ముద్దపప్పోయ్, మూడట్లోయ్
చిప్ప చిప్ప గోళ్ళు, సింగరయ్య గోళ్ళు
మా తాత గోళ్ళు, మందాపరాళ్ళు
అంటూ ఆటపాటలతో, కోలాహలంగా సాగే నోము అట్లతద్దె. ఈ నోమును కన్నెపిల్లలు సలక్షణమైన భర్త కోసం ఆచరిస్తే, వివాహితలు తమ కాపురం చల్లగా సాగాలని, కడుపు పండాలనీ నోచుకుంటారు. ఈ వ్రతం చేసేవారు ఆశ్వయుజ బహుళ తదియనాడు తెల్లవారు ఝామున లేచి చద్దెన్నం, గోంగూర పచ్చడి, పొట్లకాయ కూర, నువ్వులపొడి, ఉల్లిపాయ పులుసు, గడ్డపెరుగుతో విందారగించి, తాంబూలం వేసుకోవాలి. ఆ తర్వాత ఆటలు ఆడాలి. ఊయల ఊగాలి. స్నానపానాదులు పూర్తి చేసుకుని గౌరీదేవిని పూజించాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయిన అనంతరం తిరిగి గౌరీ పూజ చేసి అమ్మవారికి పది అట్లు నివేదించాలి తర్వాత ఓ ముత్తయిదువకు అలంకారం చేసి, పది అట్లు, పది ఫలాలు వాయనమివ్వాలి.
వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి,  అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకునే స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. 
''ఇస్తినమ్మ వాయనం''
''పుచ్చుకుంటినమ్మ వాయనం'' 
''అందించానమ్మా వాయనం''
''అందుకున్నానమ్మా వాయనం''
''ముమ్మాటికీ ఇస్తినమ్మ వాయనం''
''ముమ్మాటికీ అందుకుంటినమ్మ వాయనం''  
ఆంధ్ర దేశ విశిష్ట సాంప్రదాయాల్లో ''అట్లతద్ది'' జరుపుకోవడం ఒకటి.  మనం జరుపుకునే అట్లతద్ది పండుగ ఉత్తర భారత దేశ స్త్రీలు చేసుకునే ''కార్వా చౌత్'' వేడుకతో సమానం.
అట్ల తదియకు ఒక కదా వుంది ఆకధ
పూర్వం పాటలీపుత్రాన్ని సుశీలుడనే రాజు పాలిస్తుండేవాడు. వారికి లేకలేక పుట్టిన కుమార్తెకు ‘సునామ’ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. సునామకు యుక్తవయస్సు రాగానే రాజదంపతులు ఆమెకు ఎన్నో సంబంధాలు చూశారు. అయితే అన్నీ ఏదో ఒక కారణంతో తప్పిపోతుండేవి. దాంతో విరక్తి చెందిన సునామ గౌరీదేవి ఆలయానికెళ్లి ఆత్మహత్యకు సిద్ధమైంది. సరిగ్గా ఆ తరుణంలో ‘‘చంద్రోదయ గౌరీవ్రతం ఆచరించినట్లయితే యోగ్యుడు, సర్వలక్షణ సంపన్నుడైన భర్త లభిస్తాడని, సంసారం సౌఖ్యంగా సాగిపోతుంద’’ని ఒక అదృశ్యవాణి పలుకుతూ, ఆ వ్రతవిధానాన్ని వివరించింది.
ఆ మాటలతో ఉత్సాహం తెచ్చుకున్న సునామ ఆశ్వయుజ బహుళ తదియనాడు పొద్దున్నే మేల్కొని, రాత్రి చంద్రోదయం అయ్యేవరకూ కఠిన ఉపవాసం ఉంది. సునామ ఎంతో సుకుమారి కావడంతో సాయంత్రానికల్లా నీరసంతో పడిపోయింది. దాంతో ఆమె సోదరులు చెల్లెలి మీద ప్రేమతో చేరువలో ఉన్న చింతచెట్టుకి ఒక అద్దాన్ని కట్టి, దానికెదురుగా గడ్డిమోపుకు నిప్పంటించి, ఆ మంట వెలుగు అద్దంలో ప్రతిబింబించేలా చేశారు. చెల్లెల్ని లేపి, ‘‘సోదరీ! అదుగో ఆ చింతచెట్టు కొమ్మల్లోంచి చంద్రుడు కానవస్తున్నాడు చూడు’’ అన్నారు. సునామ ఆ వెలుగు చంద్రుడేనని భ్రమించి ఎంగిలిపడింది.
తెలియక చేసినప్పటికీ వ్రత ఉల్లంఘన దోషం కారణంగా ఆమెకు ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో విసుగు చెందిన తల్లిదండ్రులు వయసు ముదిరిన వరులను వెదకడం ఆరంభించారు. దాంతో ఒకనాటి రాత్రి సునామ అడవిలోకి పారిపోయి ఆత్మహత్యకు సిద్ధపడింది. అప్పుడు భూలోక సంచారం చేస్తున్న పార్వతీ పరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఆమెకు ఎదురై, ఆమెని వారించారు. ఆమె అన్నలు చేసిన పని వల్ల వ్రతోల్లంఘనమయిందనీ, అందువల్లే సరైన సంబంధం కుదరడం లేదని, తిరిగి నియమ నిష్టలతో వ్రతాన్ని ఆచరించమని చెప్పి అదృశ్యమయ్యారు. ఈసారి వారు చెప్పిన విధంగా సజావుగా వ్రతాన్ని నిర్వహించింది సునామ. దాంతో ఆమెకు అతి స్వల్పకాలంలోనే  అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
పదిమంది ముత్తయిదువలకు ఒక్కొక్కరికి ఒక నల్లపూసల గొలుసు, లక్కజోళ్లు, రవికెల గుడ్డ, దక్షిణ, తాంబూలంతో పది అట్లు చొప్పున వాయనం ఇచ్చి, వారి ఆశీస్సులందుకోవాలి.
నవగ్రహాలలోని కుజునికి అట్లంటే ప్రీతి కాబట్టి అట్లను నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమవడమేగాక సంసారం సాఫీగా సాగుతుంది. గర్భధారణలో సమస్యలు తలెత్తవు. అట్లను తయారు చెయ్యడానికి వాడేది మినప పిండి, బియ్యప్పిండి మిశ్రమం కదా, అందులో మినుములు రాహువుకూ, బియ్యం చంద్రునికీ సంబంధించినవి. ఈ రెండూ కలిసిన అట్లను వాయన మివ్వడం వల్ల గర్భదోషాలు తొలగి సుఖప్రసవం అవుతుందని విశ్వాసం.
గౌరీదేవికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ వ్రతంలో భాగంగా ఆడపిల్లలంతా తెల్లవారుజామున వెన్నెల్లో ఒక చోటికి చేరి బలంగా ఉన్న చెట్లకొమ్మకి ఉయ్యాలలు కట్టి తమ స్నేహితురాళ్లందరికీ వినిపించేలా చప్పట్లు చరుస్తూ పాటలు పాడతారు. అట్లతద్దిరోజు ఆటలాడటం వల్ల నడుము గట్టిపడుతుంది. తద్దెపాటలు లోకంలో బతకాల్సిన తీరు గురించి సందేశమిస్తాయి. అందుకే అట్లతద్దెకు ఆంధ్రదేశంలో అంత ప్రాధాన్యత.

బుధవారం, అక్టోబర్ 14, 2015

బ్రహ్మచారిణి

బుధవారం, అక్టోబర్ 14, 2015

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ ।
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ॥
దుర్గామాతయొక్క నవశక్తులలో రెండవది ‘బ్రహ్మచారిణి’ స్వరూపము. ఈ సందర్భంలో ‘బ్రహ్మ’ అనగా తపస్సు. ‘బ్రహ్మచారిణి’ అనగా తపమాచరించునది. ‘వేదస్తత్త్వం తపోబ్రహ్మ’ – ‘బ్రహ్మ’ యనగా వేదము, తత్త్వము, తపస్సు. బ్రహ్మచారిణీదేవి స్వరూపము పూర్తిగా జ్యోతిర్మయము, మిక్కిలి శుభంకరమూ, భవ్యము. ఈ దేవి కుడిచేతిలో జపమాలను, ఎడమ చేతిలో కమండలాన్నీ ధరించి ఉంటుంది.
హిమవంతుని కూతురైన పార్వతియే ఈ బ్రహ్మచారిణీ దేవి. ఈమె పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి నారదుడి ఉపదేశాన్ని అనుసరించి ఘోరతపము ఆచరిస్తుంది. ఈ కఠిన తపశ్చర్య కారణానే ఈమెకు ‘తపశ్చారిణి’ అనగా ‘బ్రహ్మచారిణీ’ అనే పేరు స్థిరపడింది. తపశ్చర్యకాలములో ఈమె కేవలము ఫల, కంద మూలములను మాత్రమే ఆరగిస్తూ లెక్కలేనన్ని సంవత్సరాలు గడుపుతుంది. కేవలము పచ్చికాయగూరలనే తింటూ మరికొన్ని సంవత్సరాలూ, కఠినోపవాసములతో ఎలాంటి ఆచ్ఛాదనమూ లేకుండా ఎండలలో ఎండుతూ, వానలలో తడుస్తూ కొంత కాలంపాటూ తపస్సును ఆచరిస్తుంది. ఇలాంటి కఠినతరమైన తపస్సును ఆచరించిన తరువాత, మరింకెన్నో సంవత్సరాలపాటు నేలపై రాలిన ఎండుటాకులను మాత్రమే స్వీకరిస్తూ పరమేశ్వరుణ్ణి అహర్నిశలూ ఆరాధిస్తుంది. మెల్లిగా ఎండుటాకులనుకూడా తినటం మానివేసి ‘అపర్ణ’యై చాలాకాలంపాటు ఆహారమూ, నీళ్ళు కూడా ముట్టకుండా ఘోరమైన తపస్సును ఆచరిస్తుంది.
ఇలా చాలాకాలంపాటు కఠినమైన తపస్సును కొనసాగించటం కారణాన, బ్రహ్మచారిణిదేవి శరీరము పూర్తిగా కృశించి పోతుంది. ఈవిడ స్థితిని చూసి తల్లియైన మేనాదేవి ఎంతగానో దుఃఖిస్తుంది. ఈమెను ఈ కఠిన తపస్సునుండి మరలించడానికి తల్లి ‘ఉ మా’ – ‘బిడ్డా! వలదు, వలదు’ అని పలికినందున, బ్రహ్మచారిణిదేవి పేరు ‘ఉమా’ అని ప్రసిద్ధి కెక్కింది.
బ్రహ్మచారిణీదేవి చేసిన ఘోరతపస్సు కారణాన, ముల్లోకాలలో హాహాకారాలు చెలరేగుతాయి. దేవతలూ, ఋషులూ, సిద్ధులూ, మునులూ మొదలైనవారందరూ ఈవిడ తపస్సు కనీవినీ యెరుగనటువంటి పుణ్యకార్యమని పలుకుతూ ఈవిడను కొనియాడతారు. చివరికి పితామహుడైన బ్రహ్మదేవుడు, అశరీరవాణి ద్వారా ఈమెను సంబోధిస్తూ ప్రసన్నమైన స్వరంలో ఇలా పలుకుతారు “దేవీ! ఇట్టి కఠోర తపస్సును ఇంతవరకునూ ఎవ్వర్రునూ ఆచరింపలేదు. ఇది నీకే సాధ్యమైనది. అలౌకికమైన నీ తపశ్చర్య సర్వత్ర శ్లాఘించబడుచున్నది. నీ మనోవాంఛ సంపూర్ణముగా నెరవేరును. చంద్రమౌళియైన పరమేశ్వరుడు అవశ్యముగా నీకు పతియగును. ఇక నీవు తపస్సును విరమించి ఇంటికి మరలుము. త్వరలోనే నీ తండ్రి నిన్ను ఇంటికి తీసికొనిపోవుటకై వచ్చును.
దుర్గామాతయొక్క ఈ రెండవ స్వరూపము భక్తులకూ, సిద్ధులకూ అనంతఫలప్రదము. ఈమెను ఉపాసించటంవల్ల మానవులలో తపస్సూ, త్యాగమూ, వైరాగ్యమూ, సదాచారమూ, సంయమమూ వృద్ధి చెందుతాయి. జీవితంలో ఎలాంటి ఒడుదొడుకులు ఎదురైనా దేవి అనుగ్రహముతో వారి మనస్సులు కర్తవ్యమార్గం నుండి మరలవు. లోకమాత అయిన బ్రహ్మచారిణీదేవి కృపవలన ఉపాసకులకు సర్వత్ర సిద్ధీ, విజయాలూ ప్రాప్తిస్తాయి. దుర్గానవరాత్రి పూజలలో రెండవరోజున ఈమె స్వరూపము ఉపాసించబడుతుంది. ఈ రోజు సాధకుని మనస్సు స్వాధిష్ఠాన చక్రములో స్థిరమవుతుంది. ఈ చక్రంలో స్థిరమైన మనస్సుగల యోగి, ఈమెకృపకు పాత్రుడగుతాడు. అతనికి ఈమె యెడల భక్తి ప్రపత్తులు దృఢమవుతాయి.

మంగళవారం, అక్టోబర్ 13, 2015

శైలపుత్రి

మంగళవారం, అక్టోబర్ 13, 2015

వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరామ్ ।
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీమ్ ॥
దుర్గామాత మొదటి స్వరూపము ‘శైలపుత్రి’ నామముతో ప్రసిద్ధికెక్కినది. పర్వత రాజైన హిమవంతుని ఇంట పుత్రికయై అవతరించినందున ఆమెకు ‘శైలపుత్రి’ అనే నామము ఏర్పడినది. వృషభవాహననారూఢయైన ఈ మాత కుడి చేతిలో త్రిశూలమూ, ఎడమచేతిలో కమలమూ విరాజిల్లుతుంటాయి. ఈ అవతారమే నవదుర్గలలో మొదటిది.
పూర్వజన్మలో ఈమె దక్ష ప్రజాపతికి పుత్రిక దాక్షాయని. అ జన్మలో ఈమె పేరు సతీదేవి. ఈమె పరమేశ్వరుని పరిణయమాడినది. ఒకసారి దక్షుడొక మహాయజ్ఞమును ఆచరిస్తాడు. దేవతలు తమతమ యజ్ఞభాగములను స్వీకరించటానికై దక్షుడు వారిని ఆహ్వానిస్తాడు. కానీ పరమశివుని మాత్రము ఆ యజ్ఞానికి పిలువడు. తన తండ్రి ఒక మహాయజ్ఞమును సంకల్పించిన విషయం ఆమెకు తెలుస్తుంది. ఆ యజ్ఞాన్ని వీక్షించటానికై ఆమె మసస్సు ఉబలాటపడుతుంది. అప్పుడు ఆమె పరమేశ్వరునికి తన కోరికను తెలియజేస్తుంది. బాగా ఆలోచించి పరమేశ్వరుడు “కారణము ఏమోగానీ, దక్షుడు మనపై కినుకుబూనినాడు. అతడు తన యజ్ఞమునకు దేవతలందరినీ ఆహ్వానించినాడు. యజ్ఞభాగములనుగూడ వారికి సమర్పించుచున్నాడు. కానీ ఉద్దేశ్యపూర్వకముగానే మనలను పిలువలేదు. కనీసము సమాచారమునైననూ తెలుపలేదు. ఇట్టి పరిస్థితిలో నీవు అచటికి వెళ్ళుట ఏ విధముగను మంచిదిగాదు” అని హితవు బోధించారు. శంకరుని ఈ హితవచనము ఆమె చెవికెక్కలేదు. ఈ యజ్ఞమిషతోనైనా అక్కడికి వెళ్ళి తన తల్లినీ, తోబుట్టువులనూ చూడవచ్చునన్న కోరిక ప్రబలంగా ఉండటంతో అనుమతికై ఆమె పట్టుబడుతుంది. ఆమె పట్టుదలను చూసి, చివరకు శంకరుడు అనుమతిస్తారు.
సతీదేవి తన తండ్రియింటికి చేరినప్పుడు అక్కడివారెవ్వరూ ఆమెతో మాట్లాడరు, ఆదరించరు. అందరూ ముఖాలను పక్కకు తిప్పుకొంటారు. తల్లి మాత్రము ఆమెను ప్రేమతో కౌగిలించుకొంటుంది. తోబుట్టువుల పలుకులలో వ్యంగ్యం, పరిహాసమూ నిండి ఉంటాయి. తనవారి ప్రవర్తనకు ఆమె మనస్సు కలత చెందుతుంది. అందరిలోనూ శంకరుని పట్ల నిరాదరణభావమే ఉండటం ఆమె గమనిస్తుంది. తండ్రియైన దక్షుడు ఆమెతో అవమానకరంగా మాట్లాడతాడు. ఇదంతా అనుభవించిన పిమ్మట, సతీదేవి హృదయము క్షోభతో, గ్లానితో, క్రోధముతో ఉడికిపోతుంది. ‘పరమేశ్వరుని మాటను పాటింపక నేను ఇచ్చటికివచ్చి పెద్ద పొరబాటే చేసితిని‘ అని ఆమె భావిస్తుంది.
తన పతియైన పరమేశ్వరునికి జరిగిన ఈ అవమానమును ఆమె సహించలేక పోతుంది. వెంటనే ఆమె తన రూపమును అక్కడికక్కడే యోగాగ్నిలో భస్మము గావిస్తుంది. భరింపలేని ఈ దారుణదుఃఖకరమైన సంఘటనను గురించి విని, పరమశివుడు మిక్కిలి క్రోధితుడవుతాడు. ఆయన తన ప్రమథగణాలను పంపి దక్షుని యజ్ఞాన్ని పూర్తిగా ద్వంసం చేయిస్తారు.
సతీదేవి యోగాగ్నిలో తన తనువును చాలించి, మరుజన్మలో శైలరాజైన హిమవంతునికి పుత్రికగా అవతరిస్తుంది. అప్పుడామె ‘శైలపుత్రి’గా ప్రసిద్ధికెక్కుతుంది. పార్వతి, హైమవతి అన్నవి కూడా ఆమె పేర్లే. ఉపనిషత్తులోని ఒక కథను అనుసరించి, ఆమె హైమవతీ రూపంలో దేవతల గర్వాన్ని ఆణచివేస్తుంది.
‘శైలపుత్రి’ అవతారములో ఆమె పరమేశ్వరుణ్ణే పరిణయమాడుతుంది. పూర్వజన్మలో లాగానే ఈ అవతారంలో కూడా శంకరునికి ‘అర్ధాంగి’ అవుతుంది. నవదుర్గలలో మొదటి అవతారమైన ‘శైలపుత్రి’ యొక్క మహిమలూ, శక్తులూ అనంతములు. నవరాత్రి ఉత్సవములలో మొదటిరోజున ఈ దేవికై పూజలూ, ఉపవాసాలూ జరుపబడుతాయి. మొదటి రోజున యోగులు ఉపాసనద్వారా తమ మనస్సులను మూలాధారచక్రంలో స్థిరపరుచుకుంటారు. దీనితోనే వారి యోగ సాధనలు ఆరంభమవుతాయి.

ఆదివారం, అక్టోబర్ 11, 2015

పోలాంబ వ్రతం. పొలాల అమావాస్య

ఆదివారం, అక్టోబర్ 11, 2015

పోలాంబ వ్రతం.


 శ్రావణ బహుళ అమావాస్యను 'పోలాల అమావాస్య' అంటారు. పోలాల అమావాస్యకు ఎంతో విశిష్టత వుంది. స్త్రీలు

 తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగ, క్షేమాల కోసం, తమ కుటుంబంకోసం వ్రతాలు ఆచరించడం మనకు

అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ ‘పోలాల అమావాస్య వ్రతం’ ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం 
నిర్ధేశించబడినది. పెళ్లయి చాలాకాలమయినా సంతానం కలుగని స్త్రీలు, సంతానవతులైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి.ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్యనాడు చేసుకోవాలి. పూజచేసే చోట గోమయంతో అలికి,వరిపిండితోఅందమైన ముగ్గువేసి, ఒక కందమొక్కను  వుంచి, పసుపుకొమ్ము కట్టిన నాలుగుతోరాలను అక్కడ వుంచి, ముందుగా వినాయకుని పూజించి,   ఆతర్వాత ఆకందమొక్కలోకి మంగళగౌరీదేవినిగానీ, సంతానలక్ష్మీదేవినిగానీ ఆవాహనచేసి,షోడశోపచారాలతోఅర్చించి, తొమ్మిది పూర్ణంబూర్లుగారెలు, తొమ్మిదిరకాల కూరగాయలతో చేసిన పులుసు   ఆమెకు నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత బహుసంతానవతి అయిన పెద్దముత్తయిదువును పూజించి, కొత్తచీర, రవికల గుడ్డ పెట్టి, నైవేద్యం పెట్టని తొమ్మిది పూర్ణంబూర్లు, ఒక తోరాన్ని, ఆమెకు వాయనంగా సమర్పించి, దీవెనలు అందుకోవాలి. ఆ తర్వాత ఒక

 తోరాన్ని కందమొక్కకు కట్టి, మరొకటి తను మెడలో కట్టుకుని, మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో
 కట్టాలి. అలా చేస్తే.., ఆమె సంతానం ఆయురారోగ్య, ఐశ్వర్యాలతో పది కాలాలపాటు చల్లగా ఉంటారు.  ఆడపిల్ల కావాలనుకునేవాళ్ళు( ఉన్నవాళ్ళు) గారెలు,మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు బూరెలు (ఉన్నవాళ్ళు ) అమ్మవారికి సమర్పిస్తారు. ఇక పూర్ణంబూరెలు ఎందుకు వాయనంగా ఇవ్వాలంటే..,పూర్ణంబూరె పూర్ణగర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం, గర్భస్థశిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణబూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు మన పూర్వులు. ఇంకా పనసఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ  పిండి అందు లో నింపి ఆవిరి మీద ఉడికించి అమ్మవారికి నైవేద్యం పెడతాము. ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
వ్యవసాయం కలవారు ఎద్దులకు పూజ చేస్తారు.  అదే వ్యవసాయం లేనివారు ఎద్దు బొమ్మలు మట్టి తో చేసి వాటికి పూజ చేస్తారు. ఇక ఇదే రోజున పోలేరమ్మను ఆరాధించే ఆచారం కూడా చాలా ప్రాంతాలలో కనిపిస్తూ వుంటుంది. గ్రామీణ ప్రాంతాలకి చెందిన ప్రజలు 'పోలాంబ' పేరుతో అమ్మవారిని పూజిస్తారు. ఆమెకి ఇష్టమైన నైవేద్యాలతో పాటు చీరసారెలు సమర్పిస్తారు. ఈ విధంగా చేయడం వలన ఆ తల్లి అనుగ్రహం లభిస్తుందనీ ... ఫలితంగా వర్షాలు పంటలకి అనుకూలంగా కురుస్తాయని విశ్వసిస్తుంటారు.
జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సుఖశాంతులతో కొనసాగాలంటే పితృదేవతల ఆశీస్సులు కావాలి. అలాగే వర్షాలు బాగా కురవాలంటే గ్రామదేవత అయిన పోలేరమ్మ అనుగ్రహం వుండాలి. వర్షాలుపడితే వ్యవసాయ పనులు చేయడానికి అనుకూలంగా ఎద్దులు ఆరోగ్యంగా వుండాలి. పంటలు బాగా పండినప్పుడే ఆవులకు మేత దొరుకుతుంది. ఫలితంగా లభించే పాలు ఆ కుటుంబ సభ్యులను ఆరోగ్యపరంగాను ... ఆర్ధికంగాను ఆదుకుంటాయి.
తమ జీవనాధారానికి తోడ్పాటుని అందించే దేవతను ... పెద్దలను ... పశువులను పూజించే పర్వదినంగా పోలాల అమావాస్య కనిపిస్తుంది. గ్రామదేవతను ఆరాధిస్తూ ... వ్యవసాయానికి సహకరించే పశువులను పూజించే పర్వదినం కనుక ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపిస్తుంది. ప్రత్యేకతను సంతరించుకుని తన విశిష్టతను చాటుకుంటూ వుంటుంది. 
 
ఈ వ్రతంలో ముఖ్యమైన కధ ప్రచురణలో వుంది అది 
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులుఅందరికీ పెళ్లిళ్ళు చేస్తారుఅందులోఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడుకానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడుఅలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుందిఅప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుందిఅందరూ పూజ చేసుకుంటారుఅది అయ్యాకఆమె  బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుందిఅదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవుఎవరా బాబుఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారుదానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుందిదానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మాఅంటారుఆమె తన గోడు చెప్పుకుంటుందివారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహాఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారువారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరుఅప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుందిఅక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారుఅప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు.
 కథ విన్న తరువాత చెప్పినవారు"పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు ఉచ్చతోపియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)