బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ.
ఆనాటి కాలాన ... ఉయ్యాలో!
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!
ఆనాటి కాలాన ... ఉయ్యాలో!
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో!
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో!
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో!
నూరు నోములు నోమి ... ఉయ్యాలో!
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!
తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..
ఊరికి ఉత్తరానా ... వలలో
ఊడాలా మర్రీ ... వలలో
ఊడల మర్రి కిందా ... వలలో
ఉత్తముడీ చవికే ... వలలో
ఉత్తముని చవికేలో ... వలలో
రత్నాల పందీరీ ... వలలో
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో
గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో
చోద్యంపూ కొలిమీ ... వలలో
తూమెడు ముత్యాలా ... వలలో
తూగేనే కొలిమీ ... వలలో
చద్దన్నమూ తీనీ ... వలలో
సాగించూ కొలిమీ ... వలలో
పాలన్నము దీనీ ... వలలో
పట్టేనే కొలిమీ ... వలలో
శ్రీలక్ష్మి నీ మహిమలు
1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//....
చిత్తూ చిత్తూల బొమ్మ
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//