Blogger Widgets

శనివారం, అక్టోబర్ 20, 2012

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో

శనివారం, అక్టోబర్ 20, 2012

బతుకమ్మ బతుకుని కొలిచే పండుగ. బతుకునిచ్చే తల్లిని శక్తిరూపంగా భావిస్తూ, లక్ష్మీ, గౌరి దేవీలను అభేదిస్తూ, ఆటపాటల ద్వారా పూజిస్తూ, రకరకాల వంటలు నైవేద్యాలుగా సమర్పిస్తూ, మనకున్నంతలో కొత్త బట్టలు, నగలు ధరిస్తూ, ఆడబిడ్డల్ని పండుగకు ఆహ్వానించుకొని జరుపుకునే గొప్ప వేడుక బతుకమ్మ. 


బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో 
బంగారు బతుకమ్మ ఉయ్యాలో !!


ఆనాటి కాలాన ... ఉయ్యాలో! 
ధర్మాంగు డను రాజు ... ఉయ్యాలో! 
ఆరాజు భార్యయు ... ఉయ్యాలో! 
అతి సత్యవతి యంద్రు ... ఉయ్యాలో! 
నూరు నోములు నోమి ... ఉయ్యాలో! 
నూరు మందిని గాంచె ... ఉయ్యాలో!
వారు శూరు లయ్యి ... ఉయ్యాలో!
వైరులచె హత మైరి ... ఉయ్యాలో!


తల్లిదండ్రు లపుడు ... ఉయ్యాలో!
తరగని శోకమున ... ఉయ్యాలో!
ధన ధాన్యములను బాసి ... ఉయ్యాలో!
దాయాదులను బాసి ... ఉయ్యాలో!
వనితతో ఆ రాజు ... ఉయ్యాలో!
వనమందు నివసించె ... ఉయ్యాలో!
కలికి లక్ష్మిని గూర్చి ... ఉయ్యాలో!
జనకోసం బొనరింప ... ఉయ్యాలో! ....
....
ఊరికి ఉత్తరాన ..


ఊరికి ఉత్తరానా ... వలలో 
ఊడాలా మర్రీ ... వలలో 
ఊడల మర్రి కిందా ... వలలో 
ఉత్తముడీ చవికే ... వలలో 
ఉత్తముని చవికేలో ... వలలో 
రత్నాల పందీరీ ... వలలో 
రత్తాల పందిట్లో ... వలలో
ముత్యాలా కొలిమీ ... వలలో


గిద్దెడు ముత్యాలా ... వలలో
గిలకాలా కొలిమీ ... వలలో
అరసోల ముత్యాలా ... వలలో 
అమరీనా కొలిమీ ... వలలో
సోలెడు ముత్యాలా ... వలలో 
చోద్యంపూ కొలిమీ ... వలలో 
తూమెడు ముత్యాలా ... వలలో 
తూగేనే కొలిమీ ... వలలో 
చద్దన్నమూ తీనీ ... వలలో 
సాగించూ కొలిమీ ... వలలో 
పాలన్నము దీనీ ... వలలో 
పట్టేనే కొలిమీ ... వలలో 

శ్రీలక్ష్మి నీ మహిమలు 

1: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ
1: గౌరమ్మ చిత్రమై తోచునమ్మా
భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై
2: భారతీ దేవివై బ్రహ్మ కిల్లాలివై


1: పార్వతీ దేవివై పరమేశు రాణివై
పరగ శ్రీలక్ష్మివైయ్యూ గౌరమ్మ
భార్య వైతివి హరికినీ గౌరమ్మ


2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ


1: ముక్కోటి దేవతలు సక్కనీ కాంతలు
ఎక్కువగ నిను గొల్చి పెక్కు నోములు నోచి
ఎక్కువా వారయ్యిరీ గౌరమ్మ
ఈలోకమున నుండియూ గౌరమ్మ


2: శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ
చిత్రమై తోచునమ్మా గౌరమ్మ .... //శ్రీలక్ష్మి//....


చిత్తూ చిత్తూల బొమ్మ 

1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
1: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
2: చిత్తూ చిత్తూల బొమ్మ శివుడీ ముద్దుల గుమ్మ
1: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన
2: బంగారు బొమ్మ దొరికె నమ్మో ఈ వాడ లోన


రాగీ బిందె దీస్క రమణీ నీళ్లాకు బోతె ... //రాగీ//
రాములోడు ఎదురాయె నమ్మో ఈ వాడ లోన... //రాము//
ముత్యాల బిందె దీస్క ముదితా నీళ్లాకు బోతె ... //ముత్యాల//
ముద్దు కృష్ణు డెదురాయె నమ్మో ఈ వాడలోన ... //ముద్దు//
వెండీ బిందె దీస్క వెలదీ నీళ్లాకు బోతె ... //వెండి//
వెంకటేశు డెదురాయె నమ్మో ఈ వాడలోన ...//వెంకటేశు//
పగడీ బిందె దీస్క పడతీ నీళ్లాకు బోతె ...//పగడీ//
పరమేశుడెదురాయె నమ్మో ఈ వాడలోన ...//పరమేశు//

ఆరవరోజు దుర్గామాత

దుర్గామాత


నవరాత్రులలో అమ్మవారు ఈ రోజు దుర్గామాతగా మనకు దర్శనము ఇస్తారు. మహిషాసురుని వధించుటకు అమ్మ అష్టమి రోజు కాళీ మాత దుర్గాదేవిగా కనిపిస్తారు.ఈ దుర్గాఅవతారంలో అమ్మ మహిషాసురినితో భయంకరమైన యుద్దంచేస్తారు.ఈమె అరుణ వర్ణ వస్త్ర దారిఅయి సింహవాహనము కలిగి సర్వఅయుధ దారియై రాక్షసులనుండి మనలను రక్షించుటకు వున్నట్టు దర్శనము ఇస్తున్నది.
ఈమెకి ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, ఎర్రని వస్త్రాలు , దనిమ్మ పండ్లు వంటివి సమర్పించి . అమ్మ కరుణ మనపై కురిపించుకోవచ్చు.

శ్రీ దుర్గ అష్టోత్తర శతనామ స్తోత్రం  

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా |
సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా || 4 ||
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||
కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మఙ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||
ఙ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వఙ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||



నవదుర్గలలో ఆరవరోజు  కాత్యాయిని మాత. "కాత్యాయనీ మాత" భాద్రపదబహుళ చతుర్దశి (ఉత్తరభారత పంచాంగ సంప్రదాయము ననుసరించి ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి) నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తేజస్సుతో కాత్యాయన మహర్షి యింట పుత్రికగా అవతరించినది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథుల యందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమినాడు మహిషాసురుని వధించెను.

కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. కృష్ణ భగవానుని పడయుటకు గోకులమునందలి గోపికలందఱును యమునాతీరమున ఈమెను పూజించిరి. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము. బంగారు వర్ణము గలది. నాలుగు భుజములతో విరాజిల్లుచుండును. ఈమె కుడిచేతిలో ఒకటి అభయ ముద్రను, మఱియొకటి వరముద్రను కలిగియుండును. ఎడమచేతిలో ఒకదానియందు ఖడ్గము, వేఱొకదానియందు పద్మము శోభిల్లుచుండును. ఈమెయు సింహవాహన.

ఈ దేవిని భక్తితో సేవించినవారికి ధర్మార్ధకామమోక్షములనెడి చతుర్విధ పురుషార్ధముల ఫలములు లభించును. రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మజన్మాంతర పాపములు నశించును. 
కాత్యాయని దేవి మంత్రం:
చంద్రహాసోజ్వలకరా శార్దులపర వాహనా l 
కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవఘాతినిll 
ఈనాడు ఈమెకు కేసరి బాత్ నివేదన అర్పిస్తారు .

శుక్రవారం, అక్టోబర్ 19, 2012

ఐదవ రోజున సరస్వతి

శుక్రవారం, అక్టోబర్ 19, 2012

దసరా నవరాత్రులలో ఐదవ రోజున మూలా నక్షిత్రము కదా సరస్వతి పూజ ఈ రోజు చేస్తారు. పిల్లలు కు మంచి చదువులు రావాలని కోరిన విద్యలు వారికి రావాలంటే సరస్వతి మాత కరుణకావాలి ,ఈ మాతను కొలచిన సకల విద్యలు ప్రసాధిస్తుంది. ఈమె తెల్లని వస్త్రదారిని అయ్యి. ఒక చేతితో వీణను మీటుతూ పుస్తకదారియై మనకు దర్శనము ఇస్తుంది .ఈమెకి హంసవాహనము. ఈమాత త్రిమూర్తులలో బ్రహ్మదేవుని అర్ద్దంగి. పరాశక్తి మొదట దరించిన ఐదు అవతారలలో సరస్వతి మాత అవతారము ఒకటి. సరస్వతి మాత కేవలం చదువులు ప్రసాధించేది మాత్రమే కాదు సర్వశక్తులు యుక్తులు ప్రసాధిస్తుంది.
సరస్వతీ వందన మంత్రం అధిక జ్ఞానం మరియు విజ్ఞత కోసం వల్లించే ముఖ్యమైన హిందూ మంత్రం.

సరస్వతీ దేవి చదువులకి మరియు కళలకి అధిదేవత. భారతదేశంలో సంగీతకారులు నుంచి శాస్త్రవేత్తల వరకు అందరూ మార్గదర్శకత్వం మరియు జ్ఞానం కోసం ఆమెని పూజిస్తారు. సరస్వతీ వందన మంత్రాన్ని ఆమె భక్తులు ప్రతి ఉదయం శుభంకోసం వల్లిస్తారు.కేవలం పాట అనే అర్థం గల వందనానికి ప్రతి ఒక్కరు భిన్న విధాలను పాటిస్తారు. కనుక విద్యార్థిగా నువ్వు భౌతిక జ్ఞానాన్ని కోరుకుంటే, సంగీతకారుడు సరైన తాళాలని మొదలైన వాటిని కోరుకుంటాడు.

సరస్వతీ వందన మంత్రం:
యా కుందేందు తుషార హార-ధవళా,
యా శుభ్ర-వస్త్రా'వ్రిత
యా వీణా-వర-దండ-మండితకర,
యా శ్వేత పద్మా'సన
యా బ్రహ్మా'చ్యుత శంకరః ప్రభ్రితిభిర్ దేవై-సదా వందితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిఃశేష జాడ్యా-పహా.
తెలుగు లో అనువాదం: పద్మము, చంద్రుడు, ఉదయపు పుష్పాల వంటి తెలుపుదనం కలిగినది;
వీణని చేత ధరించి, తెల్లని పద్మాసనం మీద కూర్చున్నది;
బ్రహ్మా, విష్ణు, మహేశ్వరులతోపాటు దేవతలందరితోను నిత్యం పూజించబడేది;
ఓ తల్లి నా మానసిక జడత్వాన్ని తొలగించు

శుక్లాం బ్రహ్మ విచార సార పరమ మద్యం జగద్వ్యాపిని,
హస్తే స్ఫతిక్ మాలికం కమలం పద్మాసనే సంస్తితం .
వందేతం పరమేశ్వరీ భగవతీ.....
సా మాం పాతు సరస్వతీ భగవతీ బుద్ధి ప్రదం శరదాం.

సరస్వతి మహామంత్రం 
కుమారస్వామి లేక స్కందుని తల్లి అయిన స్కందమాత నవ దుర్గ లో ఐదవ అవతారం. చతుర్భుజి ఐన ఈ మాత రెండు చేతులలో కమలములనూ కుడి హస్తమందు స్కందుని ధరించి అభయ హస్తి అయి దర్శనమిస్తుంది. మూడు కనులు కలిగి వుంటుంది. ఈమె పద్మములో కూర్చొని ఉండటం చేత పద్మాసన అనే నామధేయం కూడా ఉంది.'


స్కందమాత స్తుతి

'సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వ యా
శుభదాస్తు సదాదేవి స్కాందమాతా యశస్వినీ '

ఈ చరాచర జగత్తుకే మూలపుటమ్మ . శక్తిధరుడైన స్కందదేవుని జనని కావడంవల్ల దుర్గామాత స్కందమాతగా పిలవబడింది. సుబ్రహ్మణ్యోం అని కుమారస్వామిని స్మరిస్తే ఆయన తల్లి అయిన స్కందమాత హృదయం నిండా ఆనందజ్యోతులు ప్రకాశిస్తాయి. ఈమెని ఆరాధించేవారు దివ్యతేజస్సుతో స్వచ్చ కాంతులతో విరాజిల్లుతారు
.

ఏ దయా మీ దయా మా మీద లేదా?

మా అమ్మమ్మ వాళ్ళు స్కూల్ కి వెళ్ళే రోజులలో వాళ్ళు మరియు ఉపాధ్యాయులు కలసి ఈ పండుగ రోజులలో  పిల్లలచేత రంగు రంగు కాగితాలు, రంగురంగు పువ్వులుతో  చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకొని వెళుతూ! బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడిస్తూ వుండే వారు.  వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. అలాంటి వేడుకలు ఇప్పుడు లేవు కదా! ప్చ్  :(  వుంటే బలేవుండేది. 

ఈ దసరా పండగ ఉత్సవాలలో నేటికి ఆచరించుచున్నది ఒకటి మాత్రం వుంది అది ఏమిటి అంటే అదే "శ్రీ రామ చంద్ర లీల ఉత్సవాలు" పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి "రాక్షస పీడ వదిలందని" భావిస్తూ బాణాసంచాలతో వారి బొమ్మలను తగుల పెడతారు.

మనకు ఎన్ని పండగలో కదా వాటిలో ఈ దసరా పండగ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది .  బలే సరదాక సంతోషంగా  వుంటుంది. ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే చాలా happy గా వుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు సెలవులు ఎక్కువగా వస్తాయి అందుకే.  మా అమ్మగారు వాళ్ళు ఈ దసరా పండగకి వాళ్ళ అమ్మమ్మా, ఊళ్ళకి వెళ్ళేవారట. అక్కడ ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రము వరకు చాలా బాగా జరిగేవిట. అలాంటి పండగ విధానం మా అమ్మకూడా చూసింది నేనే చూడలేకపోయాను.  ఎందుకంటే అలాంటివి ఇప్పుడు లేవుకదా.  అవి విన్టువుంటే బలే అనిపిస్తోంది నాకు.  మనకు దసరా సందడే తెలియదు మరి.  ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు మరియు  పాటలు అమ్మమ్మ నాకు రాసి ఇచ్చింది అవి మీకు కూడా share చేస్తాను చూడండి.   మీకు నాలా తెలియకపోతే తెలుసుకోండి.  ఒకవేళ మీకు తెలుసా ఒకసారి ఆ రోజులు ను ఒకసారి గుర్తు చేసుకొని.  అప్పటి మీ అనుభవాలు నాపోస్ట్ లో కామెంట్ రూపంలో బ్లాగ్ మిత్రులతో షేర్ చేయండి. 

దసరా పద్య మరియు పాటలు.

అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
 
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
 
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా
 “అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” . అని పాటలు  పాడుకుంటూ బడి పిల్లలు వాళ్ళ ఉపాద్యాయులతో వారి ఇంటికి వెళ్లి పద్యాలూ పాటలు పాడేవారు.  అప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వారికి  పప్పు బెల్లాలు, మరమరాలు కలిపి ఇచ్చేవారు.   కొందరు వారికి గిఫ్ట్స్, బుక్స్ మొదలగున్నవి ఇచ్చేవారట.  ఈ పండగను  పూర్వం స్కూల్ పిల్లలు బాగా చేసుకున్నారు కదా .  నేను కూడా అప్పుడు పుట్టివుంటే ఎంతబాగుండునో అనిపిస్తోంది.  మీకు కూడా అనిపిస్తోందా! లేదా !.



My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)