నా మిత్రులకు, నా బ్లాగ్ మిత్రులకు, పాఠకులకు, నాశ్రేయోభిలాషులకు, నా బంధువులకు, అందరికీ దసరా శుభాకాంక్షలు. మీరు చేపట్టే ప్రతీపనిలోను విజయం పొందాలి అని మనసారా కోరుకుంటున్నాను.
దసరా పండుగను మనము విజయదశమి నాడు జరుపుకోవడం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ జరుపుకున్నాము. తెలంగాణా లో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. తెలంగాణా పల్లెల్లో ప్రతి అమావాస్య కి స్త్రీలు పట్టు పీతాంబరాలు దరించటం ఆనవాయితీ గా వస్తున్నది .
విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం రివాజుగా వస్తున్నది. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనేరాక్షసుని తో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి. ప్రజలందరూ ఆనందంగా ఈపండుగ జరుపుకుంటున్నారు. రావణాసురుని దహనం కూడా జరుపుతారు, మరియు దండియా నృత్యం చేస్తారు. ఈ దసరా బాగా జరుపుకొండి. ఈ దసరా సందర్బముగా అందరికి నా తరుపునా దసరా శుభాకాంక్షలు.
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది. ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత. శ్రీ రాజ రాజేశ్వరీ దేవి స్తోత్రము.