Blogger Widgets

శుక్రవారం, ఆగస్టు 28, 2015

చంద్రసహోదరి శ్రీ వరలక్ష్మీదేవి

శుక్రవారం, ఆగస్టు 28, 2015


లక్ష్మీం క్షీర సముద్రరాజ తనయాం1 శ్రీ రంగథామేశ్వరీం
దాసీభూత సమస్త దేవ వనితాం1 లోకైక దీపాంకురాం1
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవః 1 బ్రహ్మేంద్ర గంగాధం 1
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందేముకుందప్రియామ్" 2
అంటూ శ్రీ వరలక్ష్మీ వ్రతం నాడు శ్రీ మహాలక్ష్మిని ధ్యానించిన వారికి సుఖసంతోషాలు చేకూరుతాయని అందరు అంటున్నారు. ఇటువంటి మహిమాన్వితమైన "శ్రీ వరలక్ష్మీ" వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి.  తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి "శ్రీ వరలక్ష్మీ" రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి.  పూజ సంతోషంగా జరుపుకోవాలి. 
ఈమెని పూజిస్తే అష్ట ఐస్వరాలు లభిస్తాయి మరి ఈ రోజున స్త్రీలు వరలక్ష్మి భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం.
నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠే సుర పూజితే
శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే
తాత్పర్యం
మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ, చక్ర, గదల్ని ధరించిన మహాలక్ష్మీ దేవి అష్త్టెశ్వర ప్రదాయిని. అష్ట సంపదల్ని అందించే జగన్మంగళ దాయిని. అష్త్టెశ్వరాల్నీ కలగజేసే అష్టలక్ష్మి రూపాన్నే వరలక్ష్మీ దేవిగా మనం ఆరాధిస్తాం. భక్తితో పూజించినవారికీ, కొలిచినవారికీ కొంగుబంగారమై వరాలనిచ్చే మహాలక్ష్మే వరలక్ష్మి.
స్కాంద పురాణం లో పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం గురించి పార్వతీదేవికి వివరించిన వైనం ఉంది. లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని పార్వతీదేవి ఆది దేవుణ్ని కోరుతుంది. అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి వృత్తాంతాన్ని తెలియజేశాడంటారు. భర్త పట్ల ఆదరాన్నీ, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉండేది. మహాలక్షీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది. ఆ మహా పతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు దేవదేవి అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, గౌరికి విశదపరచాడని పురాణ కథనం. దాంతో పార్వతీ దేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపకు పాత్రురాలైందని చెబుతారు.
అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందంటారు. మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్ఠమని శాస్త్ర వచనం. శ్రీహరికి ఇష్టమైన, పైగా విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయంటారు. సర్వమంగళ సంప్రాప్తి కోసం, సకలాభీష్టాలకోసం, నిత్య సుమంగళిగా తాము వర్ధిల్లాలని పుణ్యస్త్రీలు ఈ వ్రతం చేస్తారు. దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ సంప్రదాయాల్లో ఆచరిస్తారు. ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిదీ ఒక్కటే! సకల శుభంకరమైన, సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగదానందకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం. 
 ఈ శ్రావణమాసం పూజ అందరికి సర్వసుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నాను. 

శుక్రవారం, ఆగస్టు 21, 2015

సౌభాగ్యలక్ష్మి రావమ్మా

శుక్రవారం, ఆగస్టు 21, 2015


సౌభాగ్యలక్ష్మి రావమ్మా... అమ్మా... 

నుదుట కుంకుమ రవిబింబముగ, కన్నులనిండుగ, 
కాటుగ వెలుగ, కాంచనహారము గళమున 
మెరయగ పీతాంబరముల శోభలు నిండగ ||సౌ|| 

నిండుగ కరముల బంగారు గాజులు ముద్దులొలుకు 
పాదమ్ముల మువ్వలు, గల గల గలమని సవ్వడి 
జేయగ సౌభాగ్యవతుల సేవలనందగ ||సౌ|| 

నిత్య సుమంగళి, నిత్య కళ్యాణి భక్త జనుల 
మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండ 
గా కనకవృష్టి కురిపించే తల్లి ||సౌ|| 

రమణీ మణివై, సాధు సజ్జనుల పూజలందుకొని 
శుభములనిచ్చెడి దీవనలీయగ ||సౌ|| 

కుంకుమ శోభిత, పంకజలోచని, వెంకట 
రమణుని పట్టపురాణి, పుష్కలముగ 
సౌభాగ్యములిచ్చె పుణ్యమూర్తి మాఇంటవెలసిన ||సౌ|| 

సౌభాగ్యమ్ముల బంగారు తల్లి పురంధర విఠలుని 
పట్టపురాణి, శుక్రవారము పూజలనందగ 
సాయంకాలము శుభ ఘడియలలో ||సౌ||

శనివారం, మే 09, 2015

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా

శనివారం, మే 09, 2015

కలియుగ ప్రత్యక్ష దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని 32 వేల సంకీర్తన కుసుమాలతో అర్చన చేసి తరించిన పరమ భగవత్ భక్తుడు, తోలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారు.   ఈయన జన్మదినము నేడే.  15 వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య తల్లితండ్రులు శ్రీమతి లక్కమాంబ, శ్రీ నారాయణ సూరి దంపతులకు వారి  తపః ఫలితంగా వేంకటేశుని దివ్య అనుగ్రహం వలన జన్మించినాడు అన్నమయ్య .  క్రీ. శ 1408 వ సంవత్సరం లో మే నెల 9 వ తారీకున జన్మించారు.  మనం తెలుసుకున్న  తెలుగులో మొట్టమొదటి పదాలు అన్నమయ్యవే.  
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డ గోరుముద్దలు తినిపిస్తూ పాడుతున్న పాట 
 " చందమామ రావో జాబిల్లి రావో , మంచి 
    కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో"   
ఆహా ఎంత అద్బుతంగా వుందండి ఈ పాట అంతే కాదు నిదిరించే వేళ  అమ్మ పాడిన జోల పాట 
"జో అచ్యుతానంద జోజో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా..జో జో"
ఆయన ఏ పాట రాసిన పూర్తిగా అనుభూతి పొంది రాసిన పాటలు లో ఒకటి అన్నమయ్య స్వయంగా అనుభూతి పొందిన పాటలు. చిన్ని కృష్ణుని గురించి ఆలోచిస్తూ మేలుకొలుపు పాట ఒకటి ఇదిగో 

మిన్నక వేసాలు మాని మేలుకోవయ్యా 
సన్నల నీ యోగ నిద్ర చాలు మేలుకోవయ్యా ||

ఆవులు పేయలకు గానఱచీ బిదుకవలె 
గోవిందుడయింక మేలుకొనవయ్యా 
ఆవలీవలిపడుచులాటలు మరిగి వచ్చి 
త్రోవ గాచుకున్నారు ప్రొద్దున మేలుకోవయ్యా || 

వాడల గోపికలెల్లా వచ్చి నిన్నుముద్దాడ
గూడియున్నారిదే మేలుకొనవయ్యా 
తోడనే యశోద గిన్నెతో బెరుగు వంటకము 
ఈడకు దెచ్చి పెట్టెనిక మేలుకోవయ్యా ||

పిలిచీ నందగోపుడు పేరు కొనియదె కన్ను -
గోలుకులు విచ్చి (ఇంక) మేలుకొనవయ్య 
అలరిన శ్రీ వేంకటాద్రిమీద బాలకృష్ణ
యిల మామాటలు వింటివిక మేలుకోవయ్య || 

అన్నమయ్య పై సంకీర్తన ద్వారా యోగనిద్రలో మునిగియున్న ఆ గోపబాలుని మేలుకొలుపుతున్నారు.    

నీ ఆటలు, యోగనిద్రా కట్టిపెట్టవయ్యా ! ఆవులు దూడలకు పాలిచ్చువేళ అయినది. అవి అంబారావం చేస్తున్నవి. పాలు పితికే వేళ అయినది. నీ తోటి గోప బాలురందరూ, నీతో ఆటలాడుటకు నీ వాకిట వచ్చి చేరి యున్నారు. గోపికా మణులు నీపై వ్యామోహంతో నిన్ను ముద్దులాడు వచ్చి యున్నారు. నీవు ఆరగించుటకై, నీ తల్లి యశోదమ్మ వాత్సల్యంతో బంగారు గిన్నెలో పెరుగన్నం తెచ్చి నీ చెంత నిలచి యున్నది. మేల్కొనవయ్యా ! గోపరాజైన నీ తండ్రి, నందుడు నిన్ను చేరి పిలుస్తున్నాడు.
నందరాజునకు శ్రీకృష్ణుడంటే ఎంతో ప్రేమ. శ్రీకృష్ణునకు అసురులవలన ఎపుడు ఆపద కలుగుతుందో అన్న భయంతో, నందుడు ఎల్లపుడూ చేతిలో వేలాయుధం ధరించి రక్షకుడుగా ఉంటాడట. శేషగిరిలో నెలకొన్న ఓ బాలకృష్ణా ! విశాలమయిన నీ పద్మనయనములను తెరచి మమ్ము కృపతో ఏలుకోవయ్యా ! 

ఎంత అద్బుతంగా రాసారండి.  అన్నమయ్య జన్మదినము రోజు ఇంత మంచి పాటను పంచుకుంటుంన్నందుకు చాలా సంతోషంగా వుంది.  అన్నమయ్య జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. 

శుక్రవారం, మే 08, 2015

రామ నామ

శుక్రవారం, మే 08, 2015


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తు(స్తు)ల్యమ్ రామనామ వరాననే
రామనామము సకల పాపహరమనీ, మోక్షప్రదమనీ చాలామంది నమ్మకము . "రామ" నామములో పంచాక్షరీ మంత్రము "ఓం నమ: శివాయ" నుండి "మ" అనే  బీజాక్షరము, మరియు  అష్టాక్షరీ మంత్రము "ఓం నమో నారాయణాయ" నుండి "రా" అనే  బీజాక్షరము పొందుపరచబడి ఉన్నయని ఆధ్యాత్మిక వేత్తలు  వివరణ.  ఒక్కసారి  "రామ" నామమును స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము చేసిన ఫలము లభించుననీ  శ్రీ విష్ణు సహస్ర నామ స్తోత్రము-ఉత్తర పీఠికలో చెప్పబడినది.  దీనిని గూర్చి పెద్దలు  చెప్పిన వివరణ ఏమిటంటే .  రామ పదంలో మొదటి అక్షరం "రా" ఇది య,ర,ల,వల్లో "ర" రెండవ అక్షరం.  రామలో రెండవ అక్షరం "మ".  ఇది ప,ఫ,బ,భ,మ వర్గములో "మ" ఐదవ అక్షరం.  సంఖ్యాశాస్త్రాన్ని అనుసరించి రెండుచేత ఐదుని గుణిస్తే 2 x 5 = 10 అవుతుంది . అలాగే రెండవ రామ శబ్దానికి పది ని పది చేత గుణిస్తే 10 x  10 = 100 అవుతుంది. ఇప్పుడు మూడవ రామ శబ్దా న్ని పది చేత వందని గుణిస్తే 10 x 100 = 1000 అవుతుంది .  ఇలా  "శ్రీ రామ , రామ , రామ ఇతి " అన్న ఒక్క శ్లోకం చదివితే వెయ్యి నామాలు చదివిన ఫలితం వస్తుంది .  అని మహా శివుడు పార్వతి దేవికి చెప్పాడు.
ఇంకా రామ నామాన్ని జపించి "ఋక్షకుడు" అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగా మారుతాడు, రామ నామం వల్ల శబరి, గుహుడు, హనుమ, సీతామాత, ఇలా ఎందరో పునీతులు అయ్యారు . ఇంకా "రా"అన్న అక్షరం పలికేటప్పుడు పెదవులు తెరుచు కొంటాయి. అంటే మనలో ఉన్న పాపాలు బైటికి పోతాయి అన్నమాట. ఇక "మా" పలికేటప్పుడు పెదవులు మూసుకొంటాయి. బైటికి పోయిన పాపాలు లోపలకిచేరకుండా చేస్తాయి. ఇలా రామ నామాన్నిగూరించి ఎంతైనా చెప్పవచ్చును . వశిష్టుడు "ఓం నమో నారాయణాయ" అన్న అష్టాక్షరి మంత్రం నుండీ " రా" అన్న అక్షరాన్ని, "నమశ్శివాయ" అన్న పంచాక్షరి మంత్రం లోంచి "మ" అన్న అక్షరాన్ని గ్రహించి "రామ" అని పేరుపెట్టేడు. కనుక రామ అని అంటే చాలు, అష్టాక్షరిమంత్రము + పంచాక్షరి మం త్రము ఒకేసారి  జపించినట్లవుతుంది .
రామ చంద్రుడు తన సైన్యముతో సీత ను చేరటానికి లంకానగరంపై దండెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు  సముద్రంపై వానరసేన రాళ్ళతో వారథిని నిర్మిస్తున్నారు.  అప్పుడు ప్రతీ రాయిపై 'రామ' అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తె అది తేలిపోతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉన్న రాముడికి 'నా పేరు రాసిన రాయి తేలుతూ వుంది కదా, నేను రాయి వేస్తే'  అది ఏమి అవుతుంది అనే ఆలోచన కలిగింది. అప్పుడు శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలోకి విసిరాడు. ఆ రాయి సముద్రంలో మునిగిపోయింది. అది చూసిన రాముడు  ఆశ్చర్యానికి లోనై పక్కనే వున్న హనుమంతుడికి ఈ విషయాన్ని చెప్పి ఎందుకిలా జరిగిందని ప్రశ్నించాడు . అందుకు "రామ" అనే నామం రాసిన రాళ్ళే పైకితేలుతాయి. మీరు వేసిన రాయిపైన రామనామం లేదు కదా! అందుకే మునిగిపోయింది" అని హనుమంతుడు సమాధానం చెప్పాడు. అంటే రామ నామం కు ఉన్న గొప్పతనం ఎంత వుందో కదా.  శ్రీ రాముని కంటే రామనామ గొప్పదే అనిపిస్తోంది. 
రామ నామ మహిమను చెప్పటానికి ఇంకా చాలా కధలు వున్నాయి .  వాటి గురించి ఇంకోసారి పోస్ట్ చేస్తాను . 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)