Blogger Widgets

బుధవారం, డిసెంబర్ 16, 2015

మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్ 1

బుధవారం, డిసెంబర్ 16, 2015

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  
పారార్థ్యం స్వం శ్రుతి శత శిర సిద్ధ మధ్యాపయంతీ
స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భూంక్తే
గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః
మార్గళి త్తింగళ్ పాశురము :
మార్గళి త్తింగళ్ మది నిఱైంద నన్నాళాల్
నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
శీర్ మల్గుం ఆయ్ ప్పాడి చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్
కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్
ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం
కార్మేని చ్చెంగణ్ కదిర్మదియం పోల్ ముగత్తాన్
నారాయణనే నమక్కే పఱైతరువాన్
పారోర్ పుగళప్పడిందేలోర్ ఎమ్బావాయ్ .




ఓహో ! మార్గశీర్షమాసము, వెన్నెల నిండిన మంచి రోజు . ఓ అందమైన ఆభరణములు గల పడచులారా ! ఐశ్వర్యముతో నిండిన వ్రేపల్లెలొ సంపదలతో తులతూగు చున్న ఓ బాలికలారా! ఈ మార్గశీర్ష స్నానము చేయవలెనన్నా సంకల్పమున్నచొ రండు. ముందు నడువుడు. వాడియగు వేలాయుధమును దాల్చి కృష్ణునకు ఏవిధమగు ఆపద రాకుండా కాపాడుచున్న శ్రీ నంద గోపుల కుమారుడును , అందములగు కన్నులతో అలరుచున్న యశొద యొక్క బాలసిమ్హమును, నీలమేఘశ్యాముడును, ఎఱ్ఱని తామరలనుపోలు కన్నులు కలవాడును, సూర్యుని వలే ప్రకాశమును , చంద్రునివలె ఆహ్లాదమును ఈయజాలిన దివ్యముఖమండలము కలవాడును అయిన నారాయణుడే, అతనినే తప్ప వేరొకనిని అర్ధించనిమనకే , మనమాపేక్షెంచు వ్రత సాధనమగు `పరా అను వాద్యమును ఈయనున్నాడు. మనమీ వ్రతము చీయుటను చూచి లోకులందరు సమోషించునత్లు మీరందరు వచ్చి ఈ వ్రతములొ చేరుడు.

మంగళవారం, నవంబర్ 24, 2015

చరణములే నమ్మితి

మంగళవారం, నవంబర్ 24, 2015

ప: చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి

చ1: వారధి గట్టిన వర భద్రాచల
వరదా వరదా వరదా నీ దివ్య || చరణములే ||

చ2: ఆదిశేష నన్నరమర చేయకు
మయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

చ3: వనమున రాతిని వనితగ జేసిన
చరణం చరణం చరణం నీ దివ్య || చరణములే ||

చ4: పాదారవిందమే యాధారమని నేను
పట్టితి పట్టితి పట్టితి నీ దివ్య || చరణములే ||

చ5: వెయ్యారు విధముల కుయ్యాలించిన
అయ్యా అయ్యా అయ్యా నీ దివ్య || చరణములే ||

చ6: బాగుగ నన్నేలు భద్రాచల రామ
దాసుడ దాసుడ దాసుడ నీ దివ్య || చరణములే ||

సోమవారం, నవంబర్ 23, 2015

తులసి దామోదరవివాహ శుభాకాంక్షలు

సోమవారం, నవంబర్ 23, 2015


కార్త్తికంలో వచ్చే అత్యంత పుణ్యప్రదమైన రోజు క్షీరాబ్ది ద్వాదశి. కార్తీక శుక్లపక్ష ద్వాదశి. హరిబోధినీ ద్వాదశి అనీ, యోగీశ్వర ద్వాదశి అని , చినుకు ద్వాదశి, కైశిక ద్వాదశి అనీ అంటారు . ఎల్లప్పుడూ క్షీరసాగరంలో దర్సనం ఇచ్చే  శ్రీమన్నారాయణుడు ఈ ద్వాదశిరోజు శ్రీమహాలక్ష్మీ తో కూడి బృందావనానికి వచ్చి తన ప్రియ భక్తులకు దర్శనమిస్తాడట కావునా ఈ ద్వాదశి ని బృందావన ద్వాదశి అని కూడా అంటారు . బృందావనం అంటే మన ఇంట్లో వుండే  తులసి దగ్గర కు వస్తారు  . ఈరోజు బృందావనంలో శ్రీమహావిష్ణువును అర్చించిన వారికి సకల శుభాలు కలుగుతాయని పెద్దలు చెప్తారు.  మనం ఎప్పుడు దేవుని దగ్గర దీపం వెలిగించినా విలిగించక పూయిన ఒక్క క్షీరాబ్ధి ద్వాదశి రోజు దేవుని దగ్గర దీపం పెడితే సంవత్సరం మొత్తం దీపం వేలిగించినంత పుణ్యం వస్తుంది అని అంటారు.
దూర్వాస మహర్షి వారి చేత శపించ బడి  వారి సిరిసంపదలను, సామ్రాజ్యాన్ని కోల్పోయి తేజోవిహీనుడైన ఇంద్రుడు, తదితర దేవతలు తాము కోల్పోయిన వైభవాన్ని, తేజస్సును తిరిగి పొందడానికి శ్రీమహావిష్ణువు ఆలోచన తో  రాక్షసులతో కలిసి క్షీరసాగరాన్ని మధనం  ప్రారంభించారు. అలా క్షీర సముద్రాన్ని  మధించినరోజు కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశి అనీ, ఆషాఢశుద్ధ ఏకాదశినాడు యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీహరి నాలుగు నెలల తరువాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కాంచి తొలిసారిగా మునులకు, దేవతలకు క్షీరసాగరం నుండి దర్శినమిచ్చినది ఈ ద్వాదశినాడే కాబట్టి ఇది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడుతున్నదని అనేక  పురాణాలు చెప్తున్నాయి. అలా శ్రీహరి క్షీరసాగరం నుండి దర్శనమిస్తున్నప్పుడు కొన్ని చినుకు  చుక్కలు మునుల మీద, దేవతలమీద చిలకరించబడ్డాయట. అందుకే ‘చినుకు ద్వాదశి’ అని కూడా పిలుస్తారు.
క్షీరసాగర మధనంలో ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మిని విష్ణువు వివాహమాడిన రోజు కూడా ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజే. అందుకే పవిత్రమయిన ఈరోజు వీరి కల్యాణం జరిపించడం సర్వశుభప్రదమన్న భావనతో విష్ణుస్వరూపమైన ఉసిరి కొమ్మకు, లక్ష్మీస్వరూపమైన తులసికి వివాహం చేస్తారు. ఈరోజే మోహినీ అవతారంతో శ్రీమహావిష్ణువు అమృతం దేవతలకు పంచి ఇచ్చాడట. అందుకనేఈరోజు విష్ణాలయాల్లో స్వామిని మోహినీరూపంతో అలంకరిస్తారు. సుగంధద్రవ్యాలు కలిపిన క్షీరాన్ని అమృత భావనతో భక్తులకు స్వామి ప్రసాదంగా పంచుతారు.
మన పురాణ ఇతిహాసాలలో తులసికున్న ప్రాముఖ్యత, ప్రాధాన్యం వెలకట్టలేనిది. ‘తులసి’ని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా, లక్ష్మీసమేతంగా మన పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే తులసిని పూజించినవారి ఇంట ధనధాన్యాదులకు ఎలాంటి లోటు ఉండదని, వారి ఇంట సిరులు పండుతాయని నమ్ముతారు.  తులసి పూజవల్ల అపారమైన పుణ్యఫలాలు సంప్రాప్తిసాయి సత్యాదేవి తులాభారమున . రుక్మిణీదేవి తులసీదళమునుంచి తూచి తకృష్ణుణ్ణి తన వాడుగా చేసుకొంది. దీనితో కృష్ణుడికి తులసి అంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది. గోదాదేవి తులసి దండలను శ్రీరంగనాధుని కర్పించి అతనికిష్టురాలై శ్రీరంగనాధుని సాన్నిధ్యం పొందింది. వనవాసంలో కూడా సీతాదేవి తులసిని పూజించింది. తులసి వృత్తాంతం, తులసి ప్రశంస, మన పురాణాలలో అనేకచోట్ల ప్రస్తావించి ఉంది. తులసి జన్మవృత్తాంతం తెలిపే పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది.
పురాణగాథ:
తులసి మధురానగరంలో గొప్ప కన్య. శ్రీకృష్ణుని అనురాగాన్ని అపారంగా పొందింది. తులసి, శ్రీకృష్ణుల అనురాగాన్ని ఓర్వలేని రాధ శాపానికి గురై భూలోకాన మాధవీ, ధర్మధ్వజులను రాజదంపతులకు జన్మించింది. ఆ రాజ దంపతులు ఆ బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటుండగా, ఆమెకు యుక్తవయస్సు వచ్చింది. ఆమె రంభ, ఊర్వశి, మేనకల అందానే్నతలదన్నిన అందకత్తెగా ఆమె పేరుగాంచింది. అలాగే ఆమె గుణ రూపాదులలో తుల  లేక పోవడంవల్ల ఆమెకు ‘తులసి’ అని పేరొచ్చింది. బ్రహ్మకోసం తపస్సు చేసి, విష్ణు సాంగత్యాన్ని వరంగా పొందింది. ఇది ఇలా వుండగా శ్రీకృష్ణుని అంశగల సుధాముడు శంఖచూడుడను రాక్షసుడిగా జన్మించాడు. బ్రహ్మనుంచి మరణం లేకుండా వరం పొందాడు. అయితే అతని భార్య పతివ్రతగా ఉన్నంతవరకూ శంక చూడుడికి మరణం సంభవించదని వరమిచ్చాడు. ఒకసారి శంఖచూడుడు తులసి అందానికి పరవశుడై, ఆమెను మోహించి వివాహమాడాడు. తులసిని వివాహం చేసుకున్న శంఖచూడుడు ఆమె ప్రాతివ్రత్య ప్రభావంతో, దేవతలను, మునులను మట్టుబెట్టినా, ఎవరూ ఏమీచేయలేకపోయేవారు. దాంతో శ్రీహరి దేవతలు, మునుల అభీష్టంమేరకు ఓసారి శంఖచూడుడి రూపంలో తులసి దగ్గరికి వెళ్ళాడు. వచ్చింది తన భర్తేననుకుని తులసి శంఖచూడుడి రూపంలో ఉన్న విష్ణువుతో క్రీడించింది. అనంతరం అతను తన భర్తకాదని తెలుసుకుని రాయిని కమ్మనమని శపించింది. శ్రీహరి జరిగిన విషయాన్ని చెప్పగా పశ్చాత్తాప పడింది. శ్రీహరి ఆమెని అనుగ్రహించాడు. ఆమె అప్పటినుంచి లక్ష్మీదేవితో సమానంగా పూజింపబడుతుందని, ఆమె శరీరం గండకీ నదియై ప్రవహించి పుణ్యప్రదమవుతుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామ రూపాన ఉన్న తాను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఆనాటినుంచి తులసి లక్ష్మీస్వరూపంగా పూజింపబడుతోంది.
తులసి పూజ ఇలా చేయాలి:
తులసి కోట (బృందావనం) ముందు అయిదు పద్మాలు వేసి వాటిమీద దీపాలుంచి తులసి దేవిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల భక్ష్యాలను, ఫలాలను నివేదించి అయిదు తాంబూలాలను సమర్పించాలి. ప్రదక్షిణ నమస్కారాలతో కార్తీక శద్ధ ఏకాదశి వరకూ పూజించాలి. కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం పూజ మొదలైనవి చేసి, తులసీదేవిని, లక్ష్మీనారాయణులను అర్చించాలి. నాటి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశినాడు మానెడు బియ్యపు పిండితో మూడు ముద్దలు చేయాలి. వాటిని నివేదించి తులసివద్ద ఒక దానినుంచాలి. రెండవ దానిని బ్రాహ్మణునికీయాలి. మూడవ దానిని రోటిలోనుంచి పాలు పోసి చెరకు గడలతో దంచాలి. అలాచేయడంవల్ల విశేషమైన పుణ్యఫలాలు లభించి, మోక్షం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని అవి చెబుతున్నాయి. తులసి మహత్యం గురించి నారదుడు చెప్పగా, శ్రీకృష్ణుడు ఈ వ్రతాన్ని ఆచరించాడట. అందువల్ల ఇంతటి మహిమాన్విత తులసి పూజ సర్వజనులకు శ్రేయోదాయకమైన పూజగా కొనియాడబడుతోంది.
తులసి ని Tulasi, Tulsi, Holy Basil) ఔషధీ పరంగానూ, హిందూ సంప్రదాయాలలోనూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న మొక్క. దీని శాస్త్రీయ నామము ఓసిమమ్ టెన్యుయిఫ్లోరమ్ (Ocimum tenuiflorum). 
తులసీధాత్రీ సమేత దామోదర పూజ చేస్తారు. ఈరోజునే  క్షీరాబ్ది ద్వాదశి  అని కూడా అంటారు.
శ్రీ తులసీ స్త్రోత్ర మ్
జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టి స్థిత్యంత కారిణీ
నమస్తులసి కళ్యాణి నమో విష్ణు ప్రియే శుభే
నమో మోక్షప్రదే దేవి నమ సంపత్ప్రదాయికే

తులసీ శ్రీ మహాలక్ష్మీర్విద్యా యశస్వినీ
ధర్మా ధర్మా నవా దేవీ దేవ దేవః మనఃప్రియా
లక్ష్మీప్రియసఖీ దేవీద్యౌర్భమిరచలాచలా
షోడశైతాని నామాని తులస్యాః కీర్తెయేన్నరః

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం భవేత్
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా
తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

తులసి దామోదరవివాహ శుభాకాంక్షలు.  




శనివారం, నవంబర్ 21, 2015

యాజ్ఞవల్క్య గురుదేవ నమోస్తుతే

శనివారం, నవంబర్ 21, 2015

కృషి వుంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులు అవతారు అన్న విషయం అందరికి తెలుసు ఆవిషయాన్ని రుజువు చేసారు. కృషి ,పట్టుదల, ఆత్మవిశ్వాసాలకు మారు పేరుగా వున్న మహర్షి యాజ్ఞవల్క్య మహర్షి. ఈరోజు కార్తికశుద్ధ దశమి అంటే యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదినము.  నాకు ఋషులలో  చాలా ఇష్టమైన మహర్షి యాజ్ఞవల్క్యుడు.  ఎందుకు ఇష్టం అన్నది చెప్తా. ఆయన కధ  మీకు తెలుసుకోవాలని కుతూహలముగా వుంటుంది అని నాకు తెలుసు అందుకే మీకోసం యాజ్ఞవల్క్య మహర్షి కధ.
యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 
పూర్వం కురుపాంచాల దేశంలో గంగానదీ తీరాన చమత్కారపురం అనే నగరం ఉండేది. ఆ నగరంలోనే యజ్ఞవల్క్యుడు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్యపేరు సునంద. ఆ దంపతులిద్దరికీ జన్మించినవాడే యాజ్ఞవల్క్యుడు. యాజ్ఞవల్క్యుడికి ఆయన తండ్రి సమయ సందర్భ కాలోచితంగా చెయ్యాల్సిన సంస్కారాలన్నీ చేయించాడు. దాంతో యాజ్ఞవల్క్యుడు భాష్కలుడి దగ్గర రుగ్వేదాన్ని, జైమిని మహర్షి దగ్గర సామవేదాన్ని, అరుణి దగ్గర అధర్వణవేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత యాజ్ఞవల్క్యుడి తండ్రి యజ్ఞవల్క్యుడు తన కుమారుడిని వైశంపాయన మహర్షి దగ్గరకు పంపాడు.  ఈ వైసంపాయన మహర్షి యాజ్ఞవల్క్య కి మేనమామ.  అతని దగ్గర యజుర్వేదాన్ని నేర్చుకున్నాడు యాజ్ఞవల్క్యుడు. ఆ వేదంతోపాటు మరింకా ఎన్నెన్నో విషయాలను గ్రహించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి అహంకారం, విద్యామదం లాంటివి కలిగాయి. ఆ విషయాన్ని గురువు గ్రహించాడు. ఆ లక్షణాలు కాలక్రమంలో మెల్లమెల్లగా తగ్గిపోతాయని అనుకున్నాడు ఆ గురువు. అయితే యాజ్ఞవల్క్యుడిలో నానాటికీ విద్యామదం పెరగసాగింది. అది ఆత్మాభిమానమని యాజ్ఞవల్క్యుడు అనుకున్నాడు. ఓ రోజున వైశంపాయనుడు తన మేనల్లుడు అధర్మమార్గంలో సంచరిస్తున్నాడని తెలుసుకొని కోపం పట్టలేక కాలితో అతడిని తన్నాడు. బ్రాహ్మణుడిని కాలితో తన్నటం బ్రహ్మహత్యతో సమానమని ధర్మశాస్త్రాలు చెప్పిన విషయాన్ని వైశంపాయనుడు కోపం చల్లారిన తర్వాత గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇక ఆ పాపాన్ని ఎవరు పోగొడతారా అని మదనపడసాగాడు. ఆ విషయాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు గురువు దగ్గరగా వెళ్ళి ఆ పాపాన్ని పోగొట్టడం తనవల్ల తప్ప మరెవరివల్లా కాదని గర్వంగా అన్నాడు. తనపాపం పోవటం అటుంచి అంతటి కష్టకాలంలోను శిష్యుడు అంత గర్వంగా మాట్లాడటం గురువుకు కోపం తెప్పించింది. ఇక తాను ఎలాంటి విద్యలు అతడికి నేర్పబోనని, అప్పటిదాకా నేర్పినవాటినన్నింటినీ కక్కి వెళ్ళిపొమ్మని అన్నాడు. గురుద్రోహానికి అదే తగిన శిక్ష అని అన్నాడు. అయితే అప్పటికి యాజ్ఞవల్క్యుడు తాను ఆత్మాభిమానం పేరున గర్వభావాన్ని కలిగివున్నానని తెలుసుకొన్నాడు. క్షమించమని గురువును వేడుకొన్నా లాభం లేకపోయింది. అయితే తనవంతు బాధ్యతగా యాజ్ఞవల్క్యుడు తన తపోబలంతో గురువుకు సంక్రమించిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టి తాను నేర్చుకొన్న వేదాలను అక్కడే రక్తరూపంలో కక్కి వెళ్ళిపోయాడు. అయితే ఎంతో విచిత్రంగా యాజ్ఞవల్క్యుడు  కక్కిన దానిని  వైశంపాయుని శిష్యులు తిత్తిరిపక్షులుగా మారి  గ్రహించారు. అవి పలికె పలుకులే తైత్తిరీయోపనిషత్తుగా ప్రసిద్ధికెక్కాయి.  
గురువు దగ్గర నేర్చుకున్నదంతా అక్కడే వదిలివేసిన యాజ్ఞవల్క్యుడు దిగాలుపడి కూర్చోలేదు. ఆత్మస్త్థెర్యంతో సూర్యభగవానుడిని ఆరాధించి ఆయన కరుణకు పాత్రుడై శుక్లయజుర్వేదాన్ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలూ అభ్యసించాడు. అలా అందరికన్నా ఉత్తమోత్తమ విద్యాధిపతిగా యాజ్ఞవల్క్యుడు పేరుతెచ్చుకున్నాడు. కణ్వుడు లాంటి ఉత్తమశిష్యులు ఆయనదగ్గర శిక్షణ పొందాడు. ఒకసారి జనకుడు యాగం చేస్తూ మహర్షులందరినీ ఆహ్వానించాడు. యాజ్ఞవల్క్యుడికి ఆహ్వానం వెళ్ళింది. అలా మహర్షులందరూ రాగానే జనకుడు మీలో ఎవరు గొప్ప విద్యావంతులైతే వారొచ్చి ఇక్కడున్న ధనరాశులను తీసుకువెళ్ళవచ్చు అని గంభీరంగా అన్నాడు. అయితే రుషులంతా ఒకరిముఖాలు ఒకరు చూసుకొని తామందుకు అర్హులం కామనుకొంటూ ఊరకనే కూర్చున్నారు. యాజ్ఞవల్క్యుడు మాత్రం లేచి తన శిష్యులను పిలిచి ఆ ధనరాశులను తన ఇంటికి తీసుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. యాజ్ఞవల్క్యుడి ధైర్యాన్ని చూసిన అక్కడివారంతా అతడితో శాస్త్రవిషయాల్లో పోటీకి దిగి యాజ్ఞవల్క్యుడిని అనర్హుడిగా నిరూపించేందుకు ఎన్నోవిధాలుగా ప్రయత్నం చేశారుకానీ అవేవీ వారివల్లకాలేదు. దాంతో జనకుడు ఆ ఋషిని గొప్పగా పూజించి సత్కరించాడు. జనకునికి ఆయన అనేక ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో కనిపిస్తాయి. ఓరోజున విశ్వావసుడు అనే గంధర్వుడు యాజ్ఞవల్క్యుడి దగ్గరకు వచ్చాడు. తత్త్వాన్ని ఉపదేశించమని కోరి ఎంతో నేర్చుకొని యాజ్ఞవల్క్యుడంతటి గొప్పవాడు మరొకడు లేడని ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు. అనంతరకాలంలో ఆ ఋషి గృహస్థాశ్రమాన్ని స్వీకరించాడు. ఆ రోజుల్లో కతుడు అనే ఒక రుషి ఉండేవాడు. ఆయనకు కాత్యాయని అనే పేరున్న కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యుడికిచ్చి పెళ్ళిచేశారు పెద్దలు. అయితే మిత్రుడు అనే పేరున్న ఒక బ్రాహ్మణుడి కుమార్తె, పండితురాలైన గార్గి అనే ఆమె శిష్యురాలు అయిన మైత్రేయి యాజ్ఞవల్క్యుడిని వివాహమాడాలని పట్టుబట్టింది. అప్పటికే అతడికి కాత్యాయనితో వివాహం కావటంతో పెద్దలకు ఏంచేయాలో అర్థంకాలేదు. గార్గి ఈ సమస్యకు సమాధానాన్ని వెతికింది. మైత్రేయిని కాత్యాయనికి పరిచయంచేసి ఆ ఇద్దరూ ఎంతో స్నేహంగా ఉండేలా చేసింది. కాత్యాయని, మైత్రేయి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. అప్పుడు గార్గి అసలు విషయాన్ని కాత్యాయనికి చెప్పింది. కాత్యాయని కూడా మైత్రేయి కోరికను మన్నించి యాజ్ఞవల్క్యుడితో వివాహాన్ని జరిపించింది. అలా యాజ్ఞవల్క్యుడికి ఇద్దరు భార్యలయ్యారు. ఆనాటి రుషులంతా యాజ్ఞవల్క్యుడిలోని విద్యావైభవాన్ని, యోగప్రాభవాన్ని గుర్తించి యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. ఆయన ప్రకటించిన యోగవిషయాలు యోగయాజ్ఞవల్క్యంగా ప్రసిద్ధికెక్కాయి. చివరలో భార్యలకు కూడా తత్త్వాన్ని ఉపదేశించి ఆయన సన్యాసాన్ని స్వీకరించి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపాడు.  ఇంతగొప్ప మహర్షి అయిన యాజ్ఞవల్క్య గురుదేవుల వారి పాదపద్మాలకు నమస్సులు తెలుపుకుంటున్నాను. యాజ్ఞవల్క్య గురుదేవుల జన్మదిన శుభాకాంక్షలు. 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)