Blogger Widgets

సోమవారం, నవంబర్ 19, 2012

కార్తీక పురాణం 6వ రోజు

సోమవారం, నవంబర్ 19, 2012

శివకేశవార్చన:
 వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.

ఆదివారం, నవంబర్ 18, 2012

కార్తీక పురాణం 5వ రోజు

ఆదివారం, నవంబర్ 18, 2012

దీపదాన మహాత్య్మం:
ఓ రాజశ్రేష్ఠుడా! ఏ మానవుడు కార్తీక మాసము నెలరోజులూ పరమేశ్వరుడిని, శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానము చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజించిన వారికి అశ్వమేధయాగము చేసినంత పుణ్యము దక్కును. అటులనే ఏ మానవుడు కార్తీక మాసమంతయూ దేవలయమునందు దీపారాధన చేయునో వానికి కైవల్యము ప్రాప్తించును.    
దీపదానుము చేయుట యెట్లనగా పైడిప్రత్తి తానే స్వయముగా తీసి, శుభ్రపరచి, వత్తులు చేయవలెను. వరిపిండితో గానీ, గోధమపిండితో గాని ప్రమిద వలే చేయవలెను. ఆ ప్రమిదలో ఆవునేతితో తడిపిన వత్తులు వేసి, దీపమును వెలిగించి దానిని బ్రాహ్మణునకు దానమియ్యవలెను. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వవలెను. ఈ ప్రకారముగా కార్తీక మాసమునందు ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిదను చేయించి, బంగారముతో వత్తిని చేయించి, ఆవునెయ్యి నిండుగా పోసి రోజూ చేస్తున్న ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవునెయ్యి పోసి దీపమును వెలిగించి ఈనెల రోజులూ దానమిచ్చిన బ్రాహ్మణునికే ఇది కూడా దానమివ్వాలి. ఇలా చేసిన యెడల సకలైశ్వర్యములు కలుగుటయేకాక మోక్షప్రాప్తి కూడా సిద్ధించును.
దీప దానము చేయువారు ఇట్లా వచింపవలెను.
శ్లో: సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సుఖావహం 

    దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమఅని స్తోత్రం చేసి దీపదానము చేయవలెను. దీని అర్థమేమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగుజేయునదియు, సకల సంపదల నిచ్చునదియు అగు ఈ దీపదానమును చేయుచున్నాను. నాకు శాంతి కలుగుగాక! అని అర్థము.

ఈ విధముగా దీపదానము చేసిన తర్వాత బ్రాహ్మణ సమారాధన చేయవలెను. శక్తిలేని యెడల పదిమంది బ్రాహ్మణులకైననూ భోజనమిడి దక్షిణ తాంబూలములను ఇవ్వవలెను. ఈ విధముగా పురుషులు గానీ, స్త్రీలు గానీ, ఏ ఒక్కరు చేసినా సిరిసంపదలు, విద్యాభివృద్ధి, ఆయుర్వృద్ధి కలిగి సంతోషముగా ఉందురు. దీని గురించి ఒక ఇతిహాసము కలదు. దానిని వివరించెదను ఆలకింపమని వశిష్టుడు జనకునితో ఇట్లు చెప్పసాగెను.

లుబ్ద వితంతువు స్వర్గమున కేగుట:పూర్వకాలమున ద్రవిడ దేశమునందొక ఒక గ్రామమున ఒక స్త్రీ కలదు. ఆమెకు పెళ్ళి అయిన కొద్ది కాలానికే భర్త చనిపోయెను. సంతానము గాని, ఆఖరికి బంధువులు గానీ లేరు. అందుతే ఆమె ఇతరుల ఇండ్లలో దాసి పని చేయుచూ, వారి ఇండ్లలోనే భుజించుచూ, యజమానులు సంతోషముతో ఇచ్చిన వస్తువులను ఇతరులకు హెచ్చు ధరలకు అమ్ముకొనుచూ ఆ విధముగా వచ్చిన సొమ్మును అధిక వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బు కూడబెట్టుకొనెను. దొంగలు తీసుకువచ్చిన దొంగ వస్తువులను తక్కువ ధరలకు కొని ఇతరులకు ఎక్కువ ధరలకు అమ్ముచూ కూడా ధనమును కూడబెట్టుకొనుచుండెను. ఈ విధముగా కూడ బెట్టిన ధనమును వడ్డీలకిస్తూ, శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ, తన మాటలతో వారిని మంచిచేసుకొని జీవించుచుండెను.
ఎంత సంపాదించినా ఏమి? ఆమె ఒక్క రోజు కూడా ఉపవాసము గాని, దేవుడుని మనసారా ధ్యానించుట గాని చేసి యెరుగదు. పైగా వ్రతములు చేసేవారిని, తీర్థ యాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసి, యే ఒక్క బిచ్చగానికీ పిడికెడు బియ్యము పెట్టక, తాను తినక ధనమును కూడబెట్టుచుండెడిది. అటుల కొంత కాలము జరిగెను.
ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీ రంగనాయకులను సేవించుటకు బయలుదేరి, మార్గ మధ్యమున ఈ స్త్రీ యున్న గ్రామమునకు వచ్చి ఆ దినమున అక్కడొక సత్రములో మజిలీ చేసెను. అతడా గ్రామములోని మంచిచెడ్డలను తెలుసుకొని, ఆ పిసినారి స్త్రీ సంగతి కూడా తెలుసుకొని ఆమె వద్దకు వెళ్ళి 'అమ్మా! నా హితవచనము ఆలకింపుము. నీకు కోపము వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలను ఆలకించుము. మన శరీరములు శాశ్వతము కావు. నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు, సప్తధావులతో నిర్మించబడిన ఈ శరీరములోని ప్రాణము జీవము పోగానే చర్మము, మాంసము కుళ్ళి, దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమించుచున్నావు. ఇది అజ్ఞానముతో కూడి దురాలోచన.
తల్లీ! నీవు బాగా ఆలోచించుకొనుము. అగ్నిని చూచి మిడుత దానిని దినేద్దామని భ్రమించి, దగ్గరకు వెళ్ళి భస్మమగుచున్నది. అటులనే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి, అంధకారములో బడి నశించుచున్నాడు. కాన, నా మాటలాలకించి నీవు తినక, ఇతరులకు పెట్టక, అన్యాయముగా ఆర్జించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మము చేసి పుణ్యమును సంపాదించుకొనుము. ప్రతి రోజూ శ్రీమన్నారాయణుని స్మరించి, వ్రతాదికములు చేసి మొక్షమును పొందుము. నీ పాప పరిహారార్ధముగా, వచ్చే కార్తీక మాసమంతయూ ప్రాత:కాలమున నదీ స్నానమాచరించి, దానధర్మాలు చేసి, బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములను పొందగలవు' అని ఉపదేశమిచ్చెను.

ఆ వితంతువు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనస్సు మార్చుకొని నాటి నుండి దానధర్మములు చేయుచూ కార్తీక మాసం వ్రతం ఆచరించుటచే జన్మరాహిత్యమై మోక్షమును పొందెను. కావు కార్తీక మాస వ్రతములో అంత మహాత్మ్యం ఉన్నది.

శనివారం, నవంబర్ 17, 2012

సందెకాడ బుట్టినట్టి

శనివారం, నవంబర్ 17, 2012

సందెకాడ బుట్టినట్టి చాయల పంట యెంత
చందమాయ చూడరమ్మ చందమామ పంట॥

మునుప పాలవెల్లి మొలచి పండినపంట
నినుపై దేవతలకు నిచ్చపంట
గొనకొని హరికన్ను గొనచూపులపంట
వినువీధి నెగడిన వెన్నెలల పంట॥

వలరాజు పంపున వలపు విత్తిన పంట
చలువై పున్నమనాటి జాజరపంట
కలిమి కామిని తోడ కారుకమ్మినపంట
మలయుచు తమలోని మర్రిమాని పంట॥

విరహుల గుండెలకు వెక్కసమైన పంట
పరగచుక్కలరాసి భగ్యము పంట
అరుదై తూరుపుకొండ నారగబండినపంట
యిరవై శ్రీ వేంకటేశునింటిలోని పంట॥

కార్తీక పురాణము 4వ రోజు



వనభోజన మహిమ
ఓ జనకమహారాజా! కార్తీక మాసములో స్నాన దాన పూజానంతరము శివాలమునందు గాని, విష్ణ్వాలయము నందుగానీ శ్రీ భగవద్గీత గీతా పారాయణం తప్పక చేయవలయును. అట్లు చేసిన వారి స్వర పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళుదురు. భగవద్గీత కొంతవరకు పఠించినను వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకు అందలి శ్లోకములో ఒక్క పాదమైనను కంఠస్థమొనరించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసములో పెద్ద ఉసిరి కాయలతో నిండివున్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యధోచితముగా పూచింజి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టుకిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించవలయును. వీలునుబట్టి పురాణ కాలక్షేపము చేయవలయును. ఈ విధముగా చేసిన బ్రాహ్మణపుత్రునకు నీచ జన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్టులువారు చెప్పిరి.
అది విని జనకరాజు మునివర్యా! ఈ బ్రాహ్మణ యువకునికి నీచజన్మేల కలిగెను? దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా, వశిష్టులవారు ఈ విధముగా చెప్పనారంభించిరి.  రాజా! కావేరీ తీరమందొక చిన్న గ్రామమున దేశవర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికొక పుత్రుడు కలడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నప్పటి నుండి భయభక్తులు లేక అతి గారాబముగా పెరుగుటవ వలన నీచసహవాసములు చేసి దురాచారపరుడై పెరుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడతని తండ్రి కుమారుని పిలిచి, 'బిడ్డా! నీ దురాచారములకు అంతలేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుచూ నేను నలుగురిలో తిరగలేకపోవుచున్నాను. కాన, నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి, శివ కేశవులను స్మరించి, సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన యెడల, నీవు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటుల చేయుము' అని బోధించెను.
అంతట కుమారుడు 'తండ్రీ! స్నానము చేయుట ఒంటి మురికి పోవటకే కానీ వేరు కాదు! స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించునా! దేవాలయములో దీపము వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా?' అని వ్యతిరేకార్థముతో పెడసరిగా సమాధానమిచ్చెను.  కుమారుని సమాధానము వుని తండ్రి 'ఓరి నీచుడా! కార్తీక ఫలమునంత చులకనగా చూస్తున్నావు కాన, నీవు అడవిలో రావి చెట్టు తొఱ్ఱయందు ఎలుక రూపములో బ్రతికెదువు గాక' అని కుమారునిని శపించెను.  ఆ శాపముతో కుమారుడగు శివశర్మకు జ్ఞానోదయమై, భయపడి తండ్రి పాదములపై పడి 'తండ్రీ! క్షమింపుము. అజ్ఞానాందకారములో పడి దైవమును, దైవకార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహించలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది. నాకు శాపవిమోచనము ఎపుడు, ఏ విధంగా కలుగునో తెలుపుమని' ప్రాధేయపడెను. అంతట తండ్రి 'బిడ్డా! నా శాపమును అనుభవించుచూ మూషికమువై పడివుండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహ స్థితి కలిగి ముక్తినొందుదువు' అని కుమారుడిని ఊరడించెను. వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికిపోయి, ఒక చెట్టు తొఱ్ఱలో నివసించుచూ, ఫలములను తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపమున ఉండుటచే స్నానార్థమైన నదికి వెళ్ళువారు ఆ పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణము చర్చించుకొనుచూ నదికి వెళ్ళుచుండెడివారు.  ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసములో ఒక రోజున మహర్షియగు విశ్వామిత్రులవారు శిష్యసమేతముగా కావేరీ నదీ స్నానార్థం బయలుదేరి ప్రయాణ బడలిక చేత మూషికము ఉన్న ఆ వటవృక్షము క్రిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఈ లోగా చెట్టు తొఱ్ఱలో నివసించుచున్న మూషికము తినేందుకు ఏమైనా వస్తువు దొరుకుతుందేమోనని బైటకు వచ్చి చెట్టు మొదట నక్కి యుండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకుని వీరు బాటసారులై ఉందురు. వీరివద్ద ఉన్న ధనము, అపహరించవచ్చుననే తలంపుతో వారి వద్దకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి 'మహానుభావులారా! తమరు ఎవరు? ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనస్సుకు చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన, వివరింపుడు' అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రులవారు 'ఓయీ కిరాతకమా! మేము కావేరీ నదీ స్నానముకై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించి కార్తీక పురాణము పఠించుచున్నాము. నీవును ఇచట కూర్చుని శ్రద్ధగా వినమని' చెప్పిరి.  అటుల కిరాతకుడు కార్తీకమహత్యమును శ్రద్ధగా వినుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము గుర్తుకు వచ్చినది. పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను.అటులనే ఆహారమునకై చెట్టు మొదల దాగివుండి పురాణమంతయూ విన్న ఎలుకకు కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపముపొంది 'మునివర్యా! ధన్యోస్మి. తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని' అని తన వృత్తాంతమంతయూ చెప్పి వెడలిపోయెను.
కనుక ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరు వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించవలయును.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)