వశిష్ఠులవారు జనకునకు ఇంకనూ ఇటుల బోధించిరి. 'ఓ రాజా! కార్తీకమాసము గురించి, దాని మహత్య్మము గురించి ఎంత చెప్పినా, వినిననూ తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్రకలశములతో పూజించినవారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా ఉండును. తులసీ దళములతో గానీ బిల్వ పత్రములతో గానీ సహస్రనామ పూజ చేసినవారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమునందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించినచో కలుగు మోక్షమింతింత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనము పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు, దీపారాధనలు చేయలేని వారు ఉదమయున, సాయంకాలమున యే గుడికైననూ వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైననూ చేసినా వారి పాపములు నశించును.'
సంపత్తి గలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన, హోమాదులు, దానధర్మములు చేసినచో అశ్వమేథ యాగము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమునగాని, విష్ణాలయము నందుగాని జెండా ప్రతిష్టించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా, పెనుగాలికి ధూళిరాసులెగిరిపోయినట్లే కోటి పాములైననూ పటాపంచలైపోవును.
ఈ కార్తీక మాసములో తులసికోటవద్ద ఆవుపేడతో అలికి, వరి పిండితో శంఖు, చక్ర ఆకారములతో ముగ్గులు వేసి నువ్వులు, దాన్యము పోసి వాటిపై ప్రమిద నిండా నువ్వుల నూనె పోసి, వత్తిని వేసి వెలిగించవలెను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విధముగా చేసి, నైవేద్యము పెట్టి, కార్తీక పురాణమును చదినచో హరిహరాదులు సంతసించి కైవల్యమొసంగెదరు.
అటులనే కార్తీక మాసములో ఈశ్వరుడుని జిల్లేడు పూలతో అర్చించిన ఆరోగ్యం సిద్ధించును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి, తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనముండీ కార్తీక మాసమందు పూజాదులను చేయడో ఆ మానవడు మరు జన్మలో శునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేనివారు ఒక్క సోమవారమైననూ చేసి శివకేశవులను పూజించినా మాస ఫలము కలుగును.
కనుక 'ఓ రాజా! నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపుము' అని వశిష్ఠులవారు చెప్పెను.
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.