Blogger Widgets

బుధవారం, అక్టోబర్ 02, 2013

ప్రపంచ అహింసా మరియు ప్రేమైక జీవుల దినోత్సవం,

బుధవారం, అక్టోబర్ 02, 2013

నేటి విశేషము అందరికి తెలిసినదే,  మహాత్మా గాంధీ  జయంతి.
మరియు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా .  ఈరోజును ప్రపంచ అహింసా దినోత్సవ దినంగా జరుపుకుంటున్నాము.  ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారు చెప్పిన ఒక సూక్తి :
ధర్మ వర్తన లేని విద్యార్జనమ్ము, మానవత్వము లేని విజ్జ్నాన గరిమ
శ్రమము లేకుండ వచ్చెడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి
స్వార్థ పూరితమైనట్టి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభావము
న్యాయ రహితమయిన రాజకీయ పదవి, భూతలమ్మున సాంఘిక పాతకములు.
భావం:    ధర్మ వర్తన లేకుండా విద్యనభ్యసించడం, మానవత్వం లేకుండ శాస్త్ర విజ్జ్యానము ఉపయోగించడం, శ్రమపడకుండా ఉపాయంతో ధనమును అర్జించడం, నీతి పాటించకుండా వ్యాపారం చెయడం, స్వార్ధముతో సంఘసేవ చేయడం, అంతరాత్మ వద్దు అంటున్నా యితరులను హింసించి ఆనందం పొందడం,  న్యాయం లేకుండా రాజకీయాలు నడపడం- అనే ఈ యేడు సాంఘిక పాతకాలు.  ఈ పాతకాలను ఎవ్వరూ చేయకూడదు.
నీతి:  మన లోపాలు సమాజానికి శాపాలు కాకూడదు కనుక ప్రతీవారు తమ లోపాలను తొలగించుకోవాలి.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారికి హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా.  
ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. ఈయన జయంతి సంధర్బముగా హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

ప్రపంచ అహింసా దినోత్సవం లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం ( International Day of Non-Violence) గా  మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.

ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం : జంతువుల పెంపకం మనకి పౌరాణిక యుగంనుంచీ వస్తున్న అలవాటే. మనషూలతో మమేకమై, మనుషూల మనసుని అర్ధం చేసుకుంటూ అవసరాన్ని తీర్చి. మన ఆనందాన్నీ పంచడంలో జంతువులు, పక్షులు ఎంతో తోడ్పడుతున్నాయి.  మానవుడు తన మేధస్సు తో నాటినుండీ ఏ జంతువుల్ని ఏఏ అవసరాలకోసం వినియోగించుకోవాలో ఆయా జంతువుల్ని మచ్చిక చేసుకుంటూ, వినియోగించుకుంటూ వాటి పట్ల ప్రేమానురాగాల్ని కూడా పెంచుకుంటూ చివరికి వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నాడు. గుర్రాలు, గాడిదలు వంటివి రవాణాకి, ఆవులు, గేదెలు, గొర్రెలు, ఎడ్లు వంటివి వ్యాపారానికీ, వ్యవసాయానికీ వినియోగించుకుంటుండగా, ఇక కుక్కలు రక్షణకీ, కుందేళ్ళు, జింకలు, అక్వేరియంలో అందమైన చేపలను, రామచిలుకలు, మైనా, గోరింక వంటి పక్షిజాతుల్ని ఆనందానికి, వినోదానికీ పెంచుకుంటూ ఉంటారు.  
ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం సంధర్బముగా శుభాకాంక్షలు.

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ప్రపంచ శాఖాహార దినోత్సవం

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ఈరోజు ప్రపంచ శాఖాహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది.  శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్‌ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
1977 లో నార్త్ అమెరికన్‌ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్‌ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్‌ యూనియన్‌ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది.  సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. 

  1. ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
  2. ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం. 
  3. మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
  4. రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం. 
  5. తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
  6. పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి. 
ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకి వస్తాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి.  పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి. పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. అందువల్ల శాఖాహారాన్నిమాత్రమే స్వీకరించటం అన్నివిదాలా అందరికి మంచిది.  పర్యావరణానికి మంచిది అని తెలుస్తోంది.  

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

ఊరకే దొరకునా

సోమవారం, సెప్టెంబర్ 30, 2013


ప|| ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము | సారంబు దెలిసెగా జయము చేకొనుట ||

చ|| తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట |
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా | తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||

చ|| కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా | నిర్మల జ్ఞానంబు నెరవేరుట |
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా | కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||

చ|| తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా | పనిగొన్న తనచదువు ఫలియించుట |
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు | తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||

శనివారం, సెప్టెంబర్ 28, 2013

నారద/నారాయణ

శనివారం, సెప్టెంబర్ 28, 2013

              త్రిలోక సంచారి నారదుడు శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ ఒకరోజు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఇద్దరి మధ్యా సంభాషణ జరిగింది.  ఆ సంభాషణ ఏమిటి అంటే...........!
విష్ణువు :-   నారదా ! పంచ భుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:-    భూమండలం లో భూమి ఒక వంటే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎఅలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:-    అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:-    అంత పెద్ద ఆకాశం లో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:-    అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుఉపం లో తన పాదం తో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:-    భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా పూర్తి అయ్యింది.  భగవంతునికి ఎప్పుడూ భక్తుడు మీదే మనసు వుంటుంది.  నారదుడు నారయణ నారాయణ అనుకుంటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)