Blogger Widgets

ఆదివారం, అక్టోబర్ 06, 2013

రెండవరోజు అమ్మవారు గాయిత్రిదేవిగా

ఆదివారం, అక్టోబర్ 06, 2013

దసరా నవరాత్రులలో రెండవరోజు అమ్మవారు గాయిత్రిదేవిగా దర్శనం ఇస్తారు.  ఈమెనే నవదుర్గలలో బ్రహ్మచారినిగా కూడా అంటారు.  సకల వేద స్వరూపం గాయత్రి దేవి. అన్ని మంత్రాలకు మూల శక్తి ఈ మాత. ముక్త, విదుమ్ర, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంతశక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతః కాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయం సంధ్యలో సరస్వతిగాను ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈమెను ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది.
                                   ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ముఖైస్త్రీ క్షణైః 

యుక్తా మిందు నిబద్ధ రత్న మకుటాం తత్త్వార్ధ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపలాంగదాం
శంఖం చక్రమధార వింద యుగళం హసైర్వహం తీం భజే 


గాయత్రీ మాత స్తోత్రం:
నమస్తే దేవి గాయత్రీ సావిత్రీ త్రిపదేzక్షరీ |
అజరేzమరే మాతా త్రాహి మాం భవసాగరాత్ || ౧ ||
నమస్తే సూర్యసంకాశే సూర్యసావిత్రికేzమలే |
బ్రహ్మవిద్యే మహావిద్యే వేదమాతర్నమోzస్తు తే || ౨ ||
అనంతకోటిబ్రహ్మాండవ్యాపినీ బ్రహ్మచారిణీ |
నిత్యానందే మహామాయే పరేశానీ నమోzస్తు తే || ౩ ||
త్వం బ్రహ్మా త్వం హరిః సాక్షాద్రుద్రస్త్వమింద్రదేవతా |
మిత్రస్త్వం వరుణస్త్వం చ త్వమగ్నిరశ్వినౌ భగః || ౪ ||
పూషాzర్యమా మరుత్వాంశ్చ ఋషయోపి మునీశ్వరాః |
పితరో నాగయక్షాంశ్చ గంధర్వాzప్సరసాం గణాః || ౫ ||
రక్షోభూతపిశాచాశ్చ త్వమేవ పరమేశ్వరీ |
ఋగ్యజుస్సామవిద్యాశ్చ హ్యథర్వాంగిరసాని చ || ౬ ||
త్వమేవ సర్వశాస్త్రాణి త్వమేవ సర్వసంహితాః |
పురాణాని చ తంత్రాణి మహాగమమతాని చ || ౭ ||
త్వమేవ పంచభూతాని తత్త్వాని జగదీశ్వరీ |
బ్రాహ్మీ సరస్వతీ సంధ్యా తురీయా త్వం మహేశ్వరీ || ౮ ||
తత్సద్బ్రహ్మస్వరూపా త్వం కించిత్సదసదాత్మికా |
పరాత్పరేశీ గాయత్రీ నమస్తే మాతరంబికే || ౯ ||
చంద్రకళాత్మికే నిత్యే కాలరాత్రి స్వధే స్వరే |
స్వాహాకారేzగ్నివక్త్రే త్వాం నమామి జగదీశ్వరీ || ౧౦ ||
నమో నమస్తే గాయత్రీ సావిత్రీ త్వం నమామ్యహమ్ |
సరస్వతీ నమస్తుభ్యం తురీయే బ్రహ్మరూపిణీ || ౧౧ ||
అపరాధ సహస్రాణి త్వసత్కర్మశతాని చ |
మత్తో జాతాని దేవేశీ త్వం క్షమస్వ దినే దినే || ౧౨ ||

బ్రహ్మచారిణి 
నవదుర్గాలలో ఈమెను బ్రహ్మచారిణి అని అందురు.  'బ్రహ్మచారిణి' యనగా తపమాచరించు తల్లి. బ్రహ్మమునందు చరించునది.కుడి చేతియందు జపమాలను, ఎడమచేతియందు కమండలువును ధరించును. పరమేశ్వరుని పతిగా బడయుటకు తీవ్రమైన తపమొనర్చి ఉమ యని ప్రసిద్ధి వహించెను. ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము. మిక్కిలి శుభంకరము. భక్తులకును, సిద్ధులకును అనంత ఫలప్రదము. బ్రహ్మచారిణీ దేవి కృపవలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్ర సిద్ధి, విజయము ప్రాప్తించును.
గాయిత్రిదేవికి పసుపు రంగు తో చేసిన పులిహోర,  పులగము  నివేదనగా అర్పిస్తారు.

శనివారం, అక్టోబర్ 05, 2013

బాలాత్రిపురసుందరి

శనివారం, అక్టోబర్ 05, 2013

బాలాత్రిపురసుందరి:  నేటిదినమును బాలాత్రిపురసుందరి అవతారములో అమ్మవారిని పూజించవచ్చు.ఈరోజు చిన్నపిల్లలకు పసుపురాసి పూజచేసి వారిలో అమ్మవారిని చిన్నపిల్లగా చూస్తారు.  ఈ బాలాత్రిపురసుందరి దేవికి పాయసం నివేదనగా అర్పిస్తారు. 
స్తోత్రం :
కదంబవనచారిణీం మునికదంబకాదంబినీం
నితంబజిత భూధరాం సురనితంబినీసేవితాం
నవాంబురుహలోచనాం అభినవాంబుధశ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనవాసినీం కనకవల్లకీ ధారిణీం
మహార్హమణిహారిణీం ముఖసముల్లసద్వారుణీం
దయావిభవకారిణీం విశదలోచనీం చారిణీం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కదంబవనశాలయా కుచభరోల్లసన్మాలయా
కుచోపమితశైలయా గురుకృపాలసద్వేలయా
మదారుణకపోలయా మధురగీతవాచాలయా
కయాపి ఘననీలయా కవచితావయం లీలయా

కదంబవనమధ్యగాం కనకమండలోపస్థితాం
షడంబురుహవాసినీం సతతసిద్ధసౌదామినీం
విడంబితజపారుచిం వికచచంద్రచూడామణిం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

కుచాంచితవిపంచికాం కుటిలకుంతలాలంకృతాం
కుశేశయన వాసినీం కుటిలచిత్తవిద్వేషిణీం
మదారుణవిలోచనాం మనసిజారిసమ్మోహినీం
మతంగమునికన్యకాం మధురభాషిణీమాశ్రయే

స్మరప్రథమపుష్పిణీం రుధిరబిందునీలాంబరాం
గృహీతమధుపాత్రికాం మధువిధూర్ణనేత్రాంచలాం
ఘనస్తనభరోన్నతాం గలితచూలికాం శ్యామలాం
త్రిలోచనకుటుంబినీం త్రిపురసుందరీమాశ్రయే

సకుంకుమవిలేపనామలకచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశాం
అశేషజనమోహినీం అరుణమాల్య భూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరామ్యంబికాం

పురందరపురంధ్రికాం చికురబంధసైరంధ్రికాం
పితామహపతివ్రతాం పటుపటీరచర్చారతాం
ముకుందరమణీమణీలసదలంక్రియాకారిణీ
భజామి భువనాంబికాం సురవధూటికాచేటికాం


శైలపుత్రి: సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి, పిదప పర్వతరాజైన హిమవంతుని యింట పుత్రికయై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామము. వృషభవాహనారూఢయైన ఈ మాతకు కుడిచేతిలో త్రిశూలము, ఎడమచేతిలో కమలము విరాజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించియుండును. పార్వతి, హైమవతి అనునవియు ఆమె పేర్లే. శైలపుత్రి మహిమలు, శక్తులు అనంతములు. వాంఛితములను ప్రసాదించు తల్లి. 

అమ్మవారి పది అవతారాలు

దసరా ఒక హిందువుల ముఖ్యమైన పండుగ . ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది.

ఈ పండుగకు ఈ పది రోజులు పది అవతారాలుగా అమ్మవారిని అలంకరించుకొని పూజ చేస్తారు. రోజు ప్రతి ఇంట్లోను లలితా సహస్త్రమ్ చదువుతారు. బొమ్మలకొలువులు పెడతారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతల్తో ఘోరమైన యుద్ధమి చేసి వారిని ఓడించి ఇంద్రపదవి చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొర పెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది .త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది.    దేవినవరాత్రి పూజలు చేయుట, అనునది అనాదికాలంగా వస్తున్న శాస్త్రవిధి. "అశ్వనీ" నక్షత్రంలో కలసివచ్చిన పూర్ణిమమాసమే "ఆశ్వీయుజమాసం" అవుతుంది. ఈ మాసమందు 'దేవీనవరాత్రుల'ను శరన్నవరాత్రులని పిలుస్తూ శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు వైభవంగా చేస్తారు.

ఈ దసరా రోజులలో అమ్మవారి అవతారాలు:
నవరాత్రి ఉత్సవాలలో ఆలయాలలో పార్వతీదేవికి రోజుకు ఒక అంకరణ చేస్తారు ఇలా ఒక్కోప్రాంతంలో ఒక్కోలా నామాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో మొదటి రోజు శైల పుత్రి, రెండవ రోజున బ్రహ్మచారిణి, మూడవ నాడు చంద్రఘంటాదేవి, నాల్గవ రోజున కూష్మాండాదేవి, అయిదవ రోజున స్కందమాత, ఆరవ రోజున కాత్యాయినీ, ఏడవరోజున కాళరాత్రి, ఎనిమిదవ రోజున మహాగౌరి, తొమ్మిదవ రోజున సిద్ధిధాత్రిదేవిగా పూజిస్తారు. 
మరికొందరు మొదటి రోజున బాల త్రిపురా సుందరిగాను, రెండవరోజున గాయిత్రిమాతగా , మూడవరోజున శ్రీ లలితా త్రిపురా సుందరిదేవి, నాలగవ రోజున అన్నపూర్ణదేవిగాను , ఐదవరోజున మహాలక్ష్మీదేవిగా , ఆరవరోజున సరస్వతిదేవి, ఏడవరోజున శ్రీ దుర్గాదేవి, ఎనిమిదవరోజున మహిషాసుర మర్దినిదేవి, తొమ్మెదవరోజున శ్రీ రాజరాజేశ్వరిదేవి రూపాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనుంది. 

యస్యాం బింబిత మాత్మ తత్వమగమత్ సర్వేశ్వరాఖ్యాం శుభాం
యా విష్వగ్జగదాత్మనా పరిణతా యా నామరూపాశ్రయా 
యా మూలప్రకృతి ర్గుణ త్రయవతీ యానంత శక్తి స్స్వయం
నిత్యావృత్త నవాత్మికా జయతు సా దుర్గా నవాకారిణీ

ఎవతె యందు ప్రతిబింబించిన ఆత్మతత్వం సర్వేశ్వరుడనే శుభనామాన్ని పొందిందో, ఎవతె తనే జగదాకారంగా పరిణామం చెందిందో, ఎవతె నామరూపాలకు ఆశ్రయమో, ఎవతె మూడు గుణాలు గవ మూల ప్రకృతియో, ఎవతెయే స్వయంగా అనంత రూపాలైన శక్తియో, ఎవతె నిత్యమూ మళ్ళీ మళ్ళీ ఆవృత్తమయ్యే తొమ్మిది రూపాలు (నూతన రూపాలు) కలదియో, అట్టి నవరూపాలుగా ఉన్న దుర్గాదేవి జయుంచుగాక.

నవరాత్రి సమారాధ్యాం నవచక్ర నివాసినీం
నవరూప ధరాం శక్తిం, నవదుర్గాముపాశ్రయే

నవరాత్రులలో ఆరాధింపదగినది, (శ్రీ చక్రం లోని) నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి, అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను.

ప్రథమాశైలపుత్రి, ద్వితీయా బ్రహ్మచారిణీ 
తృతీయాచంద్రఘంటీతి, కూష్మాండేతి చతుర్థికీ 
పంచమా స్కందమాతేతి షష్టాకాత్యాయనేతి చ
సప్తమా కాళరాత్రిచ అష్టమాచాతి భైరవీ
నవమా సర్వసిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా.

మూర్తులు వేరైనా మూలపుటమ్మ ఒకరే! అలంకారాలు వేరైనా అమ్మదయ అందరిపట్ల ఒకటే! హిందువులు అత్యంత ప్రీతిపాత్రంగా ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలలో ఈ "దసరావైభవం" ఒకటి. ఇది పదిరోజులు పండుగ అయినప్పటికి దేవిని రోజుకో అవతారంగా అలంకరించి అమ్మవారికి అర్చనలుచేసి, నవవిధ పిండివంటలతో నివేదనలుచేస్తూ విశేష పూజలతో పాటు శ్రీలలితా సహస్రనామ పారాయణ నిత్యము గావిస్తూ "శరన్నవరాత్రులు" గా వ్యవహరిస్తారు. శ్రవణానక్షత్రయుక్త 'దశమి' తిథిన విజయదశమితో ఈ దసరావైభవాలు పూర్తిచేస్తారు. దసరాకు మరోపేరు "దశహరా" అంటే! పది పాపాలను హరించేది అని అర్థం చెప్తారు. ఈ నవరాత్రులు రోజులలో రోజు  లలితా సహస్రము పట్టిస్తారు.

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

“అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” .

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

ఆంధ్రప్రదేశ్‌లో దసరా పండుగకు సాహిత్యానికి సామీప్యత వుంది. ఉపాధ్యాయులు కలసి ఈ పండుగ రోజులలో  పిల్లలచేత రంగు రంగు కాగితాలు, రంగురంగు పువ్వులుతో  చుట్టిన విల్లంబులు చేయించి బాణం చివరిభాగాన పూమడతలో బుక్కాపూలు ఉంచి వారిని వారి వారి ఇండ్లకు తీసుకొని వెళుతూ! బుక్కాలు చల్లిస్తూ అయ్యవారికి చాలు ఐదువరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు.... అంటు పాటలు పాడిస్తూ వుండే వారు.  వారు ఇచ్చే చిరుకానుకలు ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవారు. ఈ పండుగతో ఉపాధ్యాయులకు, శిష్యులకు గల అన్యోన్యతను వ్యక్తపరిచే సందడి కూడా తెలుగు నాట ఒక ప్పుడు ప్రచురంగా ఉండేది.
దసరా పండుగల సందర్భంలో భారత దేశంలోని వివిధ ప్రాంతాలలో అమలులో వున్న ఆచారాల్లో కొట్టవచ్చేటట్లు కనిపించేవి తమిళ నాడులో ఆడపిల్లల బొమ్మల కొలువు, ఆంధ్రదే శాన బడిపిల్లల విల్లంబుల ధారణ పేర్కొనదగినవి.
గిలకలు పట్టడం.  బడిపిల్లలు దసరా రోజులలో విల్లంబులు ధరించడం యుద్ధానికి కాదు, గురుదక్షిణ కొరకు. వీరి ఈ విల్లు అంబు ధరించటాన్ని గోదావరి ప్రాంతంలో గిలకలు పట్టడం అంటారు. గిలకలు పట్టి విద్యార్థులు ఇంటింటికి తిరిగి గురుదక్షిణ స్వీకరిస్తారు.   దసరా పద్యాలు సరసులైన బిడ్డల తండ్రులపై పూలబాణాలువేస్తూ తమ ఆయుధాలకు నివే దన తెమ్మంటూ, పప్పుబెల్లాలిమ్మంటూ, తమ్ము విద్యావంతులుగా చేసిన గురువులకు కట్నా లిమ్మంటూ, అదే పాటగా, అదే ఆటగా గ్రామం అంతా కలకల విరిసే చిన్న బొట్టెల సందడితో పలు పలుకులు పలుకుతూ ఉండేది. ఎక్కడ విన్నా పసిపాపల పాటలే. ఎక్కడ విన్నా జయ జయ ధ్వానాలే. ఇవి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలు విజయదశమిదాకా వినిపించేవి.  మనకు ఎన్ని పండగలో కదా! వాటిలో ఈ దసరా పండగ కొంచెం డిఫరెంట్ గా వుంటుంది .  బలే సరదాక సంతోషంగా వుంటుంది. ఎన్ని పండుగలు ఉన్నా దసరా పండుగ వస్తుందంటే చాలా సంతోషంగా వుంటుంది. ఎందుకంటే ఇప్పుడే కదా మాకు సెలవులు ఎక్కువగా వస్తాయి అందుకే.  మా అమ్మగారు వాళ్ళు ఈ దసరా పండగకి వాళ్ళ అమ్మమ్మా, ఊళ్ళకి వెళ్ళేవారట. అక్కడ ఆ ఊళ్ళల్లో దసరాలు బానే చేసేవారు. పొద్దున్నే, విల్లంబులు ధరించి దసరా పద్యాలు పాడుతూ ఉపాధ్యాయుల వెంట పిల్లలు హడావుడీ చేస్తే, పులి వేషాలు, పులి డాన్సు, హరికధలు, బుర్రకధలు, కోలాటాలతో సాయంత్రము వరకు చాలా బాగా జరిగేవిట. అలాంటి పండగ విధానం మా అమ్మకూడా చూసింది నేనే చూడలేకపోయాను.  ఎందుకంటే అలాంటివి ఇప్పుడు లేవుకదా.  అవి విన్టువుంటే బలే అనిపిస్తోంది నాకు.  మనకు దసరా సందడే తెలియదు మరి.  ఇక అప్పటి రోజుల్లో పిల్లలు పాడిన దసరా పద్యాలు మరియు  పాటలు అమ్మమ్మ నాకు రాసి ఇచ్చింది అవి మీకు కూడా share చేస్తాను చూడండి.   మీకు నాలా తెలియకపోతే తెలుసుకోండి.  
ఒకవేళ మీకు తెలుసా ఒకసారి ఆ రోజులు ను ఒకసారి గుర్తు చేసుకొని.  
అప్పటి మీ అనుభవాలు నాపోస్ట్ లో కామెంట్ రూపంలో బ్లాగ్ మిత్రులతో షేర్ చేయండి.   

దసరా పద్య మరియు పాటలు.


అనయంబు మేము విద్యాభ్యాసమునకు
అయ్యవారిని చాల ఆశ్రయించితిమి
నానాటినిని మహానవమి యేతెంచు
ఈడుజోడగువార మెల్ల బాలురము
గురునకు దక్షిణల్ కోరి యీదలచి
వెరవు తొడుత మిమ్ము వేడవచ్చితిమి
పాటించి మా ముద్దు పాటలు వినుడు
మేటి కానుకలిచ్చి మెప్పు పొందరయ్య.
 
ఘనముగా కట్నము గ్రక్కున ఇచ్చి
సెలవియ్యుడీ మాకు శీఘ్రంబుగాను
పట్టుపచ్చడమిచ్చి పది మాడలిచ్చి
గట్టి శాలువలిచ్చి కడియంబులిచ్చి
అయ్యవారికి చాలు ఐదు వరహాలు
పిల్లవాండ్లకు చాలు పప్పు బెల్లాలు
కొబ్బరి కురిడీలు కుండబెల్లంబు
ఏ దయా మీ దయా మా మీద లేదా?
ఇంతసేపుంచుట ఇది మీకు తగునా?
దసరాకు వస్తిమని విసవిసల్పడక
రేపురా మాపురా మళ్ళి రమ్మనక
చేతిలో లేదనక, ఇవ్వలేమనక
ఇప్పుడే లేదనక, అప్పివ్వరనక
ఇరుగుపొరుగువారు ఇస్తారు సుమ్మీ
శీఘ్రముగా పంపుడీ శ్రీమంతులారా!
 
జయీభవా విజయీ భవా
రాజాధిరాజ శ్రీరాజ మహారాజ
రాజ తేజోనిధి రాజ కందర్ప
రాజ కంఠీరవా రాజ మార్తాండ
రాజ రత్నాకరా రాజకుల తిలక
రాజ విద్వత్సభా రంజన మనోజ
రాజీవ ముఖ హంస లక్ష్మీ నివాస
సుజన మనోధీశ సూర్యప్రకాశ
నిఖిల లోకేశ శ్రీ నిగమ సంకాశ
ప్రకటిత రిపుభంగ పరమాత్మ రంగ
వర శిరోమాణిక్య వాణీ సద్వాక్య
పరహిత మది చిత్ర పావన చరిత్ర
ఉభయ విద్యాధుర్య ఉద్యోగధుర్య
వివిధ సద్గుణధామ విభవాభిరామ
జయీ భవా దిగ్విజయీ భవా


 “అయ్యవారికి చాలు అయిదు వరహాలు. పిల్లలకు చాలు పప్పు బెల్లాలు” . 
అని పాటలు  పాడుకుంటూ బడి పిల్లలు వాళ్ళ ఉపాద్యాయులతో వారి ఇంటికి వెళ్లి పద్యాలూ పాటలు పాడేవారు.  అప్పుడు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వారికి  పప్పు బెల్లాలు, మరమరాలు కలిపి ఇచ్చేవారు.   కొందరు వారికి గిఫ్ట్స్, బుక్స్ మొదలగున్నవి ఇచ్చేవారట.   

ఈ దసరా పండగ ఉత్సవాలలో నేటికి ఆచరించుచున్నది ఒకటి మాత్రం వుంది అది ఏమిటి అంటే అదే "శ్రీ రామ చంద్ర లీల ఉత్సవాలు" పెద్దపెద్ద రావణ కుంభకర్ణుల బొమ్మలను తయారుచేసి వాటిని ఒక విశాలమైన మైదానము వరకు దసరావేషాలు ధరించిన కళాకారులతో ఊరేగింపుగా తీసుకొని వెళ్ళి "రాక్షస పీడ వదిలందని" భావిస్తూ బాణాసంచాలతో వారి బొమ్మలను తగుల పెడతారు.  
అంతే కాదు మన ఇళ్ళల్లో ఈ పదిరోజులు బొమ్మల కొలువు పెడతారు.  పెరంటాళ్ళను పిలిచి వారికి వాయనాలు ఇస్తారు.  మరికొంతమంది లలితా సహస్త్రపారాయణ జరుపుతున్నారు.  పండగ పాటలు పాడుకోవటానికి మనకు అస్సలు సమయమె వుండటంలేదు.  కనీసం మన సంస్కృతి సాంప్రదయాలైనా తెలుసుకుంటున్నాం కదా దానికి మనం ఎంతో సంతోషించాలి.   

నీ ఇల్లు పాలతో, నేతితో అలుకుతానమ్మా


దసరా ముందువచ్చే అమావాస్య నాడు అనగా శ్రావణ బహుళ అమావాస్య రోజును  పోలాల అమావాస్య అని అంటారు. ఈ పండగ కు కందమొక్క మరియు బచ్చలి మొక్కకు పూజ చేస్తారుపూజలో ఒక కథ కూడా చెప్తారుఇది పెళ్ళయిన ఆడవాళ్ళుపిల్లల కలవారు వారి శ్రేయస్సు కోసం చేస్తారు.  పిల్లలు లేనివారు పిల్లలు కలగటానికి ఈ పూజ చేస్తారు.  ఈ పూజలో ఆడపిల్లు కావాలనుకునేవారు గారెలు దండ అమ్మవారికి వేస్తామని, మొగపిల్లలు కావలి అనే కోరిక కలవారు పూర్ణం బూరెలు దండ అమ్మవారికి వేస్తామని మొక్కుకుంటారుట.  ఈ పోలేరమ్మకు గౌరీదేవి పూజ చేస్తారు.  నివేదనగా నవకాయ కూర చేస్తారు, ఇంకా పప్పు తాలికలు, పాలతాలికలు, మినపకుడుములు చేసి అమ్మవారికి నేవేదిస్తారు.
ఇక కధ విషయానికి వస్తే:
"ఒక కుటుంబం లో ఏడుగురు కొడుకులుఅందరికీ పెళ్లిళ్ళు చేస్తారుఅందులోఏడో కోడలికి ఏట పిల్లాడు పుడతాడుకానీ పోలాల అమావాస్యరోజు చనిపోతాడుఅలాగా ఆరు సంవత్సరాలు జరుగుతుందిఅప్పటికే ఆమె తోడికోడళ్ళు దేప్పటం మొదలుపెడతారు - ఆమె వలన వారు పండుగ జరుపుకోలేకపోతున్నారు అని బాధ భరించలేక ఏడవ సంవత్సరం పిల్లాడు కోన ఊపిరితో ఉండగానే అతడిని ఒక చాపలో చుట్టేసిఉంచేస్తుందిఅందరూ పూజ చేసుకుంటారుఅది అయ్యాకఆమె  బాబుని భుజం మీద వేసుకుని స్మశానానికి ఏడుస్తూ వెళ్తుందిఅదిచూసిన పార్వతీపరమేశ్వరులు వృద్ధదంపతుల రూపంలో ఎదురయ్యి  "ఎవరమ్మా నీవుఎవరా బాబుఎందుకు ఏడుస్తున్నావు?" అనిఅడుగుతారుదానికి ఆమె - "ఎవరైతే ఏమిటమ్మ - మీరు ఆర్చేవారా తీర్చేవారా?" అని అడుగుతుందిదానికి వారు - "మేమే ఆర్చేవారము -తీర్చేవారము - చెప్పవమ్మాఅంటారుఆమె తన గోడు చెప్పుకుంటుందివారు ఓదార్చి అంతా శుభం కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోతారు.అప్పుడు ఆమె భుజం మీద ఉన్నా బిడ్డతో సహాఇదివరకు చనిపోయిన బిడ్డలు కూడా లేచి వచ్చేస్తారువారిని చూసిన ఆశ్చర్యంలో దంపతులను చూద్దాం అని తిరిగేసరికి వారు ఉండరుఅప్పుడు - అది పార్వతీపరమేశ్వరులు అని తెలుసుకుని ఆనందంగా ఇంటికివెళ్ళిపోతుందిఅక్కడ ఆమె తోడికోడళ్ళు ఈమె అదృష్టానికి అబ్బురపోయి క్షమార్పణ చెప్పుకుంటారుఅప్పటినుండి ఆమె ప్రతి ఏటతప్పకుండా పోలాల అమావాస్య పూజ జరుపుకుంటుంన్నారు."

 కథ విన్న తరువాత చెప్పినవారు: "పోలేరమ్మనీ ఇల్లు పాలతోనేతితో అలుకుతానునా ఇల్లు ఉచ్చతోపియ్యతో అలుకు", అంటారు.వినడానికి కొంచం వింతగా వుంటుంది.  కాని  అది వారి  పిల్లల మీద ప్రేమకు గుర్తుగా కనిపిస్తుంది  కథ అక్షింతలు చదివినవాళ్ళు,విన్నవాళ్లు తలపై వేసుకుంటారు.  తరువాత పూజలో పసుపు కొమ్ముకు దారం కట్టి  తోరం చేసి ఆ తోరాన్ని చేసి పూజ అయ్యాక ఆ పసుపుకోమ్మును చిన్నపిల్లలుకు కడతారు.  అది వారికి రక్షగా వుంటుంది అని భావిస్తారు. 

బుధవారం, అక్టోబర్ 02, 2013

ప్రపంచ అహింసా మరియు ప్రేమైక జీవుల దినోత్సవం,

బుధవారం, అక్టోబర్ 02, 2013

నేటి విశేషము అందరికి తెలిసినదే,  మహాత్మా గాంధీ  జయంతి.
మరియు భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా .  ఈరోజును ప్రపంచ అహింసా దినోత్సవ దినంగా జరుపుకుంటున్నాము.  ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం గా జరుపుకుంటున్నాం.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారు చెప్పిన ఒక సూక్తి :
ధర్మ వర్తన లేని విద్యార్జనమ్ము, మానవత్వము లేని విజ్జ్నాన గరిమ
శ్రమము లేకుండ వచ్చెడు సంపదయును, నీతి పాటింపనట్టి వాణిజ్య వృత్తి
స్వార్థ పూరితమైనట్టి సంఘసేవ, అంతరాత్మ మెచ్చని వినోదానుభావము
న్యాయ రహితమయిన రాజకీయ పదవి, భూతలమ్మున సాంఘిక పాతకములు.
భావం:    ధర్మ వర్తన లేకుండా విద్యనభ్యసించడం, మానవత్వం లేకుండ శాస్త్ర విజ్జ్యానము ఉపయోగించడం, శ్రమపడకుండా ఉపాయంతో ధనమును అర్జించడం, నీతి పాటించకుండా వ్యాపారం చెయడం, స్వార్ధముతో సంఘసేవ చేయడం, అంతరాత్మ వద్దు అంటున్నా యితరులను హింసించి ఆనందం పొందడం,  న్యాయం లేకుండా రాజకీయాలు నడపడం- అనే ఈ యేడు సాంఘిక పాతకాలు.  ఈ పాతకాలను ఎవ్వరూ చేయకూడదు.
నీతి:  మన లోపాలు సమాజానికి శాపాలు కాకూడదు కనుక ప్రతీవారు తమ లోపాలను తొలగించుకోవాలి.

గాంధిగారి జయంతి సంధర్బముగా గాంధిగారికి హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

భారత రెండవ ప్రధాని లాల్ బహదుర్ శాస్త్రి గారి పుట్టిన రోజు కూడా.  
ఈయన నినాదం "జై జవాన్ - జై కిసాన్ - జై భారత్".  శాస్తిగారు మంచి మనసుతో దేశాభివృద్ది కోసం పోరాడిన మహామనీషి, అంతేకాదు గొప్ప స్వాతంత్ర్య సమరయోదుడు,  అస్సలు గర్వంలేకుండా అందరి మనస్శులు గెలిచిన మహనీయుడు లాల్ బహదూర్ శాస్తిగారు. ఈయన జయంతి సంధర్బముగా హృదయ పూర్వక నివాళ్ళు అర్పిద్దాం.

ప్రపంచ అహింసా దినోత్సవం లేదా అంతర్జాతీయ అహింసా దినోత్సవం ( International Day of Non-Violence) గా  మహాత్మా గాంధీ పుట్టిన రోజైన అక్టోబరు 2వ తేదీని పాఠిస్తారు. ఈ రోజుని ప్రపంచ అహింసా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి జూన్ 15, 2007న అమోదించింది. గాంధీ అహింసా మార్గాన్ని అనుసరించి అనేక ఉద్యమాలను నడిపాడు సత్యాగ్రహం అంటే సత్యం కోసం జరిపే పోరాటం. అహింస మూలధర్మంగా, సహాయ నిరాకరణ మరియు ఉపవాసదీక్ష ఆయుధాలుగా చేసే ధర్మపోరాటమే ఈ సత్యాగ్రహం. గౌతమ బుద్ధుడు ప్రవచించిన "అహింసా పరమోధర్మ:" అన్న సూత్రం, యేసు క్రీస్తు అన్నట్టు, "ఒక చెంప పై కొడితే మరో చెంప చూపమన్న" ఆలోచనా ధృక్పథం దీనిలో కనిపిస్తాయి. సత్యం కోసం రాజీ లేని పోరాటమే సత్యాగ్రహం. సాంప్రదాయ పద్దతిలో జరిగే హింసాయుత లేదా అహింసాయుత పోరాటంలో ప్రత్యర్థిని ఓడించడం, లేదా ప్రత్యర్థి తన లక్ష్యాన్ని చేరుకోకుండా నిరోధించడం, లేదా ప్రత్యర్థులు ఎన్ని ఆటంకాలు కల్పించినా తాము కోరుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం అన్నవి ముఖ్యాంశాలు. కానీ సత్యాగ్రహ విధానంలో తప్పు చేసే వారిని బలవంతంగా ఆపకుండా వారిలో మార్పును తీసుకురావడం ముఖ్య లక్షణం.

ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం : జంతువుల పెంపకం మనకి పౌరాణిక యుగంనుంచీ వస్తున్న అలవాటే. మనషూలతో మమేకమై, మనుషూల మనసుని అర్ధం చేసుకుంటూ అవసరాన్ని తీర్చి. మన ఆనందాన్నీ పంచడంలో జంతువులు, పక్షులు ఎంతో తోడ్పడుతున్నాయి.  మానవుడు తన మేధస్సు తో నాటినుండీ ఏ జంతువుల్ని ఏఏ అవసరాలకోసం వినియోగించుకోవాలో ఆయా జంతువుల్ని మచ్చిక చేసుకుంటూ, వినియోగించుకుంటూ వాటి పట్ల ప్రేమానురాగాల్ని కూడా పెంచుకుంటూ చివరికి వాటిని కుటుంబ సభ్యుల్లో ఒకటిగా భావిస్తున్నాడు. గుర్రాలు, గాడిదలు వంటివి రవాణాకి, ఆవులు, గేదెలు, గొర్రెలు, ఎడ్లు వంటివి వ్యాపారానికీ, వ్యవసాయానికీ వినియోగించుకుంటుండగా, ఇక కుక్కలు రక్షణకీ, కుందేళ్ళు, జింకలు, అక్వేరియంలో అందమైన చేపలను, రామచిలుకలు, మైనా, గోరింక వంటి పక్షిజాతుల్ని ఆనందానికి, వినోదానికీ పెంచుకుంటూ ఉంటారు.  
ప్రేమైక జీవులు ( పెంపుడు జంతువుల) దినోత్సవం సంధర్బముగా శుభాకాంక్షలు.

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ప్రపంచ శాఖాహార దినోత్సవం

మంగళవారం, అక్టోబర్ 01, 2013

ఈరోజు ప్రపంచ శాఖాహార దినోత్సవంగా జరుపుకుంటున్నాము.
సంస్కృతిలో అంతర్భాగం ఆహారం. ప్రజలు తమ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణమైన ఆహారపు అలవాట్లను కలిగి ఉంటారు. ఎవరి ఆహార సంస్కృతి వాళ్లకుగొప్ప. కాబట్టి, ఫలానా ఆహారం మంచిది, ఫలానా ఆహారం చెడ్డది అన్న చర్చ అర్థంలేనిది. అయితే, వాతావరణంలో వస్తున్నమార్పు ప్రపంచాన్ని అమితంగా వేడెక్కిస్తున్న నేపథ్యంలో ఆహారాన్ని పర్యావరణ దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది.  శాకాహారము వల్ల కలిగే ప్రయోజనాల్నిఅందరకు తెలియజేయడమే దీని ముఖ్యవుద్దేశముగా కలదు. మన తీసుకునే ఆహారము వలనే మన జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చును.అనే ఉద్దేశంతో 1977 లో వరల్డ్ వెజిటేరియన్‌ డే గా ప్రకటించారు. శాకాహారము యొక్క ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయటం కోసం ఏర్పాటు అయ్యింది. పౌష్టికాహారము విషయం లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది . శాఖము, ఆహారము అనేరెండు పదముల కలయిక. శాఖము అంటే చెట్టు. చెట్టు, మొక్కల నుండి వచ్చే ఆహారము అని అర్ధము. పుట్టిన ప్రతి జీవికి జీవించడానికి అవసరమైనది ఆహారం. ఇది శాఖాహారము, మంసాహారము అనేది ఆజీవి పుట్టుక, అలవాట్లు, పరిసరాలపైన ఆధారపడి ఉంటుంది.
1977 లో నార్త్ అమెరికన్‌ సొసైటి " వరల్డ్ వెజిటేరియన్‌ డే " ను వార్షిక వేడుకగా ప్రకటించగా , 1978 లో ఇంటర్నేషనల్ వెజిటేరియన్‌ యూనియన్‌ ఆమోదాన్ని తెలిపింది. అక్టోబర్ ఒకటో తేదీన అధికారికంగా ఈ వేడుక జరుపుకోవాలని ప్రకటించినది.  సులువుగా జీర్ణమయ్యే ఆహారము బార్లి లాంటివి అనేకము ఉన్నాయి . గోధుమతో పోల్చితే బార్లి శరీరములో పేరుకు పోయిన నీటిని బయటికి పంపిస్తుంది. ఆకుకూరలు , కాయకూరలు, గింజలు, పప్పులు ఆరోగ్యానికు ఎంతో మంచిది. మాంసాహారమువల్ల ఎన్నో జీర్ణకోస వ్యాధులకు కారణమవుతుంది. శాకాహారము జీర్ణకోశవ్యాధులను నయము చేస్తుంది. అమెరికాలో ఈ మధ్య ‘సోమవారం మాంసం తినడం మానండి!’ పేరిట ఉద్యమం ప్రారంభమైంది. తద్వారా 15 శాతం మాంసం వినియోగం తగ్గుతుందని అంటున్నారు. ‘సమతుల శాకాహారం అన్ని వయసులవారికి, గర్భవతులకు, బాలింతలకు, క్రీడాకారులకు నూటికి నూరుపాళ్లూ పుష్టికరమైన ఆహారం.’ అని అమెరికన్ డైట్ అసోసియేషన్ ప్రకటించింది.   ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న భూభాగంలో 30 శాతాన్ని పశువుల పెంపకానికి వినియోగిస్తున్నారు. మాంసాహార వినియోగం 2050 నాటికి రెట్టింపయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ హెచ్చరిస్తోంది. మాంసకృత్తులను అందించడంలో శాకాహారమే అనేక విధాలుగా మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు. మాంసకృత్తులను అందించే ఆహారపదార్థాలలో ఏవి మెరుగైనవో చూస్తే ఆరు విధాలుగా శాకాహారమే మేలని తేలిందని ప్రపంచ బ్యాంక్‌కు సీనియర్ పర్యావరణ సలహాదారుగా పనిచేసిన రాబర్ట్ గుడ్‌లాండ్ అంటున్నారు. 

  1. ఖర్చులన్నీ కలిపి చూసినా గిట్టుబాటు కావడం.
  2. ట్రాన్స్ ఫ్యాట్స్, హార్మోన్లు, యాంటీబయాటిక్స్, నైట్రేట్లు, నైట్రోసమైన్స్, సోడియం ప్రిజర్వేటివ్స్ వంటి హానికారకాలు తక్కువగా ఉండటం లేదా అసలు లేకుండా ఉండటం. 
  3. మాంసకృత్తులతోపాటు పీచు వంటి ఆరోగ్యదాయక పదార్థాలు ఉండటం.
  4. రోజువారీగా వినియోగించే ఆహారంలో అవసరమయ్యే అమినో యాసిడ్లన్నీ ఉండటం. 
  5. తక్కువ భూమిని ఉపయోగించి ఎక్కువ మాంసకృత్తులను ఉత్పత్తి చేయడం.
  6. పోషకాల సాంద్రత కలిగి ఉండటం. కూరగాయలు అత్యధిక పోషకాల సాంద్రత కలిగి ఉంటాయి. అవసరమైన అమినో యాసిడ్లు పంటల ద్వారా మాత్రమే లభిస్తాయి. 
ఎకరం పొలంలో పశువులను పెంచి ఉత్పత్తి చేసే మాంసకృత్తులకన్నా. వివిధ పంటలసాగు ద్వారా అంతకు ఐదురెట్లు మాంసకృత్తులను ఉత్పత్తి చేయవచ్చు. సోయాచిక్కుళ్లలో మాంసకృత్తులు మరింత అధికంగా ఉంటాయి. రకరకాల పంటల ద్వారా వివిధ అమినో యాసిడ్లు శాకాహారులకు అందుబాటులోకి వస్తాయి. పొట్టుతీయని ధాన్యాల పొడులు, చిరుధాన్యాలు, ముడి బియ్యం ద్వారా కేలరీలు, ఖనిజాలు, విటమిన్లు, పీచుపదార్థం పుష్కలంగా లభ్యమవుతాయి.  పప్పుధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉండడమేకాక అనారోగ్యకరమైన కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. రసాయనిక వ్యవసాయం వల్ల బి12 వంటి అనేక విటమిన్లు, సూక్ష్మపోషకాలు వ్యవసాయోత్పత్తుల్లో కొరవడుతున్నాయి. పంటలను సారవంతమైన భూముల్లో పర్యావరణానికి హానిచేయని పద్ధతుల్లో పండించిన ఆహారోత్పత్తుల్లో సకల పోషకాలూ పుష్కలంగా లభిస్తాయి. మాంసకృత్తులకు శాకాహారంపై ఆధారపడటం పెరిగితే రానున్న కాలంలో వాతావరణ మార్పు వేగాన్ని తగ్గించడానికి వీలుకలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. తవుడు తీసిన తెల్ల బియ్యానికి స్వస్తిచెప్పి. పీచుపదార్థంతో పాటు, సకల పోషకాలు పుష్కలంగా ఉండే చిరుధాన్యాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎదురే ఉండదు. అందువల్ల శాఖాహారాన్నిమాత్రమే స్వీకరించటం అన్నివిదాలా అందరికి మంచిది.  పర్యావరణానికి మంచిది అని తెలుస్తోంది.  

సోమవారం, సెప్టెంబర్ 30, 2013

ఊరకే దొరకునా

సోమవారం, సెప్టెంబర్ 30, 2013


ప|| ఊరకే దొరకునా వున్నతోన్నత సుఖము | సారంబు దెలిసెగా జయము చేకొనుట ||

చ|| తలపులోని చింత దాటినప్పుదు గదా | అలరిదైవంబు ప్రత్యక్షమౌట |
కలుషంపు దుర్మదము గడచినప్పుడు గదా | తలకొన్న మోక్షంబు తనకు చేకొనుట ||

చ|| కర్మంబు కసటువో గడిగినప్పుడు గదా | నిర్మల జ్ఞానంబు నెరవేరుట |
మర్మంబు శ్రీహరి నీమరగు జొచ్చినగదా | కూర్మి దనజన్మమెక్కుడు కెక్కుడౌట ||

చ|| తనశాంత మాత్మలో దగలినప్పుడు గదా | పనిగొన్న తనచదువు ఫలియించుట |
యెనలేని శ్రీవేంకటేశ్వరుని దాస్యంబు | తనకు నబ్బినగదా దరిచేరిమనుట ||

శనివారం, సెప్టెంబర్ 28, 2013

నారద/నారాయణ

శనివారం, సెప్టెంబర్ 28, 2013

              త్రిలోక సంచారి నారదుడు శ్రీమన్నారాయణ నామస్మరణ చేస్తూ ఒకరోజు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళినప్పుడు వారి ఇద్దరి మధ్యా సంభాషణ జరిగింది.  ఆ సంభాషణ ఏమిటి అంటే...........!
విష్ణువు :-   నారదా ! పంచ భుతాలలో ఎవరు గొప్పా?
నారదుడు:- భూమి గొప్పది.
విష్ణువు:-    భూమండలం లో భూమి ఒక వంటే కదా. మూడు వంతులు నీరే కదా భూమి ఎఅలా గొప్పది.
నారదుడు:- అయితే జలం గొప్పది.
విష్ణువు:-    అంతటి జలాన్ని అగస్యుడు తాగాడు కదా.
నారదుడు:- అయితే అగస్యుడు గొప్పవాడు.
విష్ణువు:-    అంత పెద్ద ఆకాశం లో అగస్యుడు నక్షత్రమే కదా.
నారదుడు:- అయితే ఆకాశమే గొప్పది.
విష్ణువు:-    అంత ఆకాశాన్ని భగవంతుడు వామన రుఉపం లో తన పాదం తో కప్పెసాడు కదా.
నారదుడు:- అయితే భగవంతుని పాదం గొప్పది.
విష్ణువు:-    భగవంతుని పాదమే గొప్పది అయితే ,మొత్తం భగవంతుని రూపాన్నే భక్తుడు తన హృదయము లో బంధిస్తున్నాడు కదా .
నారదుడు:- అయితే భక్తుఢే గొప్పవాడు.
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఈ విధంగా పూర్తి అయ్యింది.  భగవంతునికి ఎప్పుడూ భక్తుడు మీదే మనసు వుంటుంది.  నారదుడు నారయణ నారాయణ అనుకుంటు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)