అన్నమాచార్యులు వారు రచించిన మంచి పాట . ఈ పాటను మనం గొప్ప సంగీత విద్వాంసులు అయిన గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ అద్బుత గళం నుండి మనం విందాం.
చూడచిన్నదానవింతే సుద్దులు కోటానఁగోటి
యేడేడ నేరుచుకొంటివే వో కలికి
కిన్నెరమీటులలోని గిలిగింతలు , నీ
వన్నెల కనుచూపుల వలవంతలు
యెన్నరాని యిచ్చకపు టెలయింతలు
యెన్నడు నేరుచుకొంటివే వో కలికి
సారెకు నెడవాయని సరసములు , నీ
తారుకాణ సన్నల తమకములు
గారవించి బుజ్జగించే గమకములు
యేరీతి నేరుచుకొంటివే వో కలికి
కందువ శ్రీవేంకటేశు కలయికలు , నీ
యందమైన సమరతి యలయికలు
పొందుల మునుముంగిలి పొలయికలు
యెందెందు నేరుచుకొంటివే వో కలికి