తెలుగు జాతి గౌరవం నిలబెట్టి .ప్రపంచ చరిత్రలో మన జాతీయ జండాను ఎగురేలా చేసాడు . మన త్రివర్ణపతాక రూపకర్త |
జాతీయ పతాకం రెపరెపలాడే వరకు ఒక్క తెలుగు వారే కాకుండా.. జాతియావత్తూ స్మరించుకోదగిన మహాపురుషుల్లో పింగళి వెంకయ్య ఒకరు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని భట్లపెనుమర్రు గ్రామంలో హనుమంతరాయుడు-వెంకటరత్నమ్మ దంపతులకు ఆగష్టు 2, 1878 న జన్మించారు. వెంకయ్య చిన్నప్పటి నుండే చాలా చురుకైన విద్యార్ధి. ఈయన ప్రాధమిక విద్య చల్లపల్లిలో మరియు మచిలీపట్నములోని హిందూ ఉన్నత పాఠశాలలో జరిగినది. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీని కలిసిన తెలుగు యువనేత. వీరిమధ్య ఏర్పడిన సాన్నిహిత్యం అర్ధ శతాబ్దం పాటు సాగింది. 1913 నుంచి ప్రతి కాంగ్రెస్ సమావేశానికి హాజరై నాయకులందరితోనూ జాతీయ పతాక ప్రతిష్ఠాపన గురించి చర్చలు జరిపారు. 1916లో "భారతదేశానికొక జాతీయ జెండా" అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించారు. మన తెలుగువారు తమ వారిని గౌరవించటంలో ఏనాడూ ముందంజవేయలేదు. జీవితాంతం దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పోరాడిన వెంకయ్య చివరి రోజుల్లో తిండికి కూడా మొహం వాచి నానా అగచాట్లు పడినట్లు ' త్రివేణి ' సంపాదకులు డా. భావరాజు నరసింహారావుగారు పేర్కొన్నారు. అంతిమదశలో విజయవాడలో డా. కె.ఎల్.రావు, డా.టి.విఎస్.చలపతిరావు, కాట్రగడ్డ శ్రీనివాసరావు మున్నగు పెద్దలు 15-1-1963 న వెంకయ్య గారిని సత్కరించి వారికి కొంత నిధిని అందించారు. ఆ సత్కారం తరువాత ఆరు నెలలకే 1963, జూలై 4న వెంకయ్య దివంగతుడయ్యాడు.
కన్నుమూసేముందు వారి చివరి కోరికను వెల్లడిస్తూ
" నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నాభౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక " అన్నారు. ఇది నాకు తెలిసినప్పుడు నా కళ్ళు నీళ్ళు వచ్చాయి అంటే నమ్మండి. |
జాతీయ పతాకం ఎగిరే వరకు స్మరించుకోదగిన ధన్యజీవి పింగళి వెంకయ్య. నిరాడంబరమైన, నిస్వార్థమైన జీవితం గడిపిన మహామనీషి పింగళి వెంకయ్య. ఈయన వర్ధం నేడు. ఈ మహానీయునికి నివాళు అర్పిద్దాం.