దీపావళి అయ్యిన తరువాత రెండో రోజున జరుపుకొనే అన్నా చెల్లెలా పండుగ భాయ్ దూజ్ అనీ భగిని హస్త భోజనం అనీ అంటారు .
ఈ పండుగ సోదర సోదరీమణులు మధ్య ప్రేమకు గుర్తు, మరియు వారి మధ్య రక్షణ మరియు ఆప్యాయతని బంధాన్ని బలోపేతం చేయడానికి జరుపుకుంటారు. ఈ పండుగ రోజు సోదరీమణులు వారి సోదరుల నుదురు మీద ఒక పవిత్రమైన తిలకము పెడతారు. సోదరులు వారి జ్ఞాపకార్ధం బహుమతులు ఇస్తారు.భాయ్ దూజ్ పండుగ యొక్క సారాంశం ఇది సోదర మరియు సోదరీమణులు మధ్య ప్రేమ బలోపేతం చేయడానికి జరుపుకుంటారు . ఇది సోదరుడుకు సోదరి భోజనం పెడుతుంది అప్పుడు సోదరుడు బహుమతులు ఇవ్వటం జరుగుతుంది. సాంప్రదాయకంగ అన్న వివాహితులు అయిన చెల్లెలు ఇంటికి వెళ్లి ఆమె మరియు భర్త యొక్క పరిస్థితులను తెలుసుకుంటారు. వారు ఎలా వున్నారో తెలుసుకునే అవకాశం సోదరునికి ఇచ్చారు. ఈ పండుగ ద్వారా సిస్టర్స్ కూడా వారి సోదరుల దీర్ఘకాల జీవితం మరియు మంచి ఆరోగ్యానికి ప్రార్థన, మరియు శ్రేయస్సు కోరుకుంటారు. దీనికి ఒక కదా వుంది. ఆ కద ఏంటి అంటే. యముడు యమునా సోదర సోదరిమణులు. వారు కలసి పెరిగారు. యమున ఒక అందమైన యువరాజును వివాహం చేసుకొని, తన సోదరుడుకు దూరమయ్యింది. అతనిని చూడాలని ఎక్కువగా అనిపించేది . యముడు కూడా తన సోదరిని చూడాలని అనుకునేవాడు. కానీ కుదిరేది కాదు. అతనికి ఎప్పుడూ ఖాళీ దొరికేది కాదు. ఎందుకంటే ఆటను నరకానికి అధిపతి కదా అందుకే. యమునా ఎప్పుడు తన అన్నని తనని చూడటానికి రమ్మని పిలిచేది. ఇలా చెల్లి దగ్గరకు వెళ్ళటానికి కుదరటంలేదు అనుకొని. ఒకరోజు వెళ్ళటానికి ఒక రోజును నిర్ణయించుకున్నాడు. ఆమె సోదరుడు వస్తున్నాడు అతనిని చూడచ్చు అని ఆనందం పట్టలేకపోయింది. యమున అతనికి గౌరవార్ధం ఒక గొప్ప విందు భోజనం తయారు చేసింది.
ఇది దీపావళి తరువాత రెండు రోజులుకు వచ్చింది. ఆమె తన ఇల్లంతా దీపములతో అలంకరించింది. ఆమె ఎంతో ప్రేమగా అన్ని మిఠాయిలు మరియు ఆమె సోదరుడు ప్రేమించిన ఆ పదార్ధాలు సహా, గొప్ప విందు తయారుచేసింది. ఆమె భర్త, అందమైన యువరాజు, యమున కలసి ఎంతో గొప్పగా యముడుకు స్వాగతం ఇచ్చారు. అది చూసి యముడు చాలా ఆనందం పొందాడు. యముడు కూడా తన సోదరి ప్రేమ పూర్వక స్వాగతం ద్వారా సంతోషపడ్డారు. వారు చాలా కాలము తరువాత చాలా సంతోషంగా వున్నట్టు చెప్పుకున్నారు వారు. యముడు యమునతో నీకు బహుమతులు ఏమి తీసుకురాలేదు. నీకు ఏమి కావాలి అని చెల్లెలిని అడిగాడు. ఆమె నాకు ఏమి వద్దు అన్నయ్య అనింది. అప్పుడు యముడు అడుగమ్మా నేను నువ్వు ఏమి అడిగితే అది నేను తప్పక తీర్చుతాను అన్నాడు.
వారు దేవతలు కదా వారు స్వార్ధంగా ఏమి కోరికలు అడగరు. యమున నాకు ఒక కోరిక వుంది తీర్చుమన్నా అంది. అది ఏమిటంటే అన్నదమ్ములు కార్తీక విదియ రోజు తన సోదరి ఇంటికి వెళ్లి సోదరిచేతి వంట తింటారో వారికి అపమృత్యుదోషం కలగకుండా వరం ఇమ్మని కోరినది. యముడు తధాస్తు అన్నాడు.
కృష్ణుడు నరకాసురుడును చంపిన తరువాత తన సోదరి సుభద్రను కలవటానికి వెళ్లారు. సుభద్ర హారతి ఇచ్చి ఇంటిలోనికి స్వాగతం పలికి నుదుటిపైన ఒక తిలక్ ఉంచడం ద్వారా సంప్రదాయ విధంగా వుంచారు.
ఈ కార్తీక శుద్ధ పాడ్యమినే గోవర్ధనోద్ధరణం అనే పండుగను కూడా చేసుకుంటారు. నందగోకులము లోని యాదవులకు గోసంరక్షణం ప్రధాన వృత్తి. మరి గోవులకు అవసరమైన గ్రాసం నకు ప్రధాన ఆధారం గోవర్ధనగిరి. ఈ పర్వతం పై వున్న పశు సంభంద ఆహారం గోవులకు ఆహారంగా స్వీకరించి యాదవులకు పాడి అనుగ్రహించేవి. ఈ పర్వతం పైన ఈ గ్రాసం పెరుగుటకు జలం అవసరం, ఈ జలం వర్షం ఆధారంగా వుండేది. అందువలన యాదవులు మేఘాలకు ప్రభువైన ఇంద్రుడు తాము గోవుల్ని మేపే గోవర్ధన గిరి మీద వర్షాలు కురిపించి పంటలు పండించటానికి ప్రతి సంవత్సరం ఇంద్ర యాగం చేస్తుంటారు. కాని ఒకనోకనాడు కృష్ణుడు ఈ యాగ నిర్వాహణను అడ్డుకొన్నాడు.మనకు ప్రధాన వనరు గోవర్ధనం కనుక నాకు గోవుల్ని,బ్రాహ్మణులని,గోవర్ధనం ను అరాధి౦చుదామ్, ఇంద్ర యజ్ఞం నాకు సమ్మతం కాదు అని సర్వులకు నచ్చచెప్పి ఇంద్ర యజ్ఞ నిర్వహణ నిలుపుదల చేస్తాడు.దీనితో యాదవులందరు గోవర్ధన ప్రదక్షిణతో అచలవ్రతం చేయనారంభిస్తారు. దానితో ఇంద్రునికి కోపం వచ్చి వడగళ్ళ వర్షాన్ని కురిపిస్తాడు. ప్రజలందరు చాలా భయపడతారు. కొద్ది సేపటికే ప్రజలు అక్కడ జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడింది . దీనితో యాదవులందరు శ్రీకృష్ణుని శరణాగతి కోరటం తో స్వామీ గోవర్ధనగిరిని తన చిటికిన వ్రేలిపై ధరించి సర్వప్రజలకు,గోవులకు రక్షణ కల్పిస్తాడు. ఈ విధంగా 7 రాత్రులు 7 పగళ్ళు నిరంతర వర్షం కురుస్తున్న తనను శరణాగతి కోరిన వారికి రక్షణ కల్పిస్తాడు.తన ఆశ్రయం లో వున్న వారికి తాము ఇన్ని రోజులు వున్నాం అనే భావన రాకు౦డా యోగమాయ ద్వార వారు ఆనందసాగరం లో వుండే విధంగా అనుగ్రహిస్తాడు.ఈ విధంగా ఇంద్రుని గర్వభంగం చేస్తాడు. ప్రజలందరు గోవులను కాపాడిన వాడు కాబట్టి గోవిందుడు అని పొగడుతు తమ నివాసాలకు తిరిగి చేరుతారు.
గోవర్ధనోద్ధరణం
పరంధాముడు గిరిపూజా విధానం తెలిపినాడు:
“గిరి పాదభాగమును శుభ్రపఱచి గోమయముతో అలుకవలెను. రంగురంగుల ముగ్గులు వేయవలెను. పూజా ద్రవ్యములు శ్రద్ధగా సమకూర్చుకోవలెను. స్నానాది క్రియలొనర్చి భక్తితో శోడషోపచారములతో గోవర్ధనుని పూజించవలెను. అర్ఘ్యపాద్య అభిషేక అలంకరణ పుష్పపూజ దీపారాధన ప్రదక్షిణ నమస్కార స్తోత్ర నైవేద్యాది సేవలు చేసిన పిమ్మట నీరాజనమీయవలెను. విప్రసంతర్పణ గోపూజ అందరికీ అన్నదానం బాగా చేయవలెను. సాష్టాంగ ప్రణామములు చేయవలెను”.
శ్రీ కృష్ణుడు అలా పూజావిధానం తెలిపి “పూజకి వచ్చేముందు మీ కర్తవ్యాలన్నీ నిర్వహించుకుని రండి. ఇంట్లో దైవపూజ మాతాపితపూజ అన్నీ చేసుకుని రండి. వృద్ధులను బాలకులను ఆకలితో వదిలేసి రాకండి. వారికి కావలసిన ఆహారం సమకూర్చండి. ఇంటి వద్ద ఉన్న గోవులకి పశు పక్షాదులకి కుక్కలకి వేటికి కావలసిన ఆహారం వాటికిచ్చి రండి” అని చెప్పాడు.ప్రాకృతిక వనరులను నాశనం చేయడం స్వార్థబుద్ధితో ప్రకృతిని క్షోభింపచేయడం ఎన్నడూ భారతీయత కాదు. భారతీయులు ప్రకృతిని పరమాత్మ యొక్క ప్రత్యక్ష స్వరూపమని భావించి పూజిస్తారు. ఇదే శ్రీ కృష్ణుడు మనకిచ్చిన సందేశం.దానికి గుర్తుగానే ఈరోజు ఈ పండుగ చేసుకుంటారు. ఆవు పేడతో పర్వతాకారాన్ని పెట్టి దానికి పూలతో, శ్రీకృష్ణ అష్టోత్తర నామాలతో పూజ చేస్తారు. ఈరోజు గోక్రీడనమనే ఉత్సవం కూడా చేస్తారు. గోవు సర్వదేవతామయం అన్నది హిందువుల నమ్మకం. అందుకే ఈ రోజు గోవులను, దూడలను శుభ్రం చేసి పసుపు, కుంకుమలు, పువ్వుల దండలతో అలంకరించి వాటికిష్టమైన పచ్చగడ్డిని ఆహారంగా పెట్టి పూజిస్తారు.
దీపావళి భారతీయులకు అత్యంత విశిష్టమైన ప్రీతిపాత్రమైన పండుగ. పిల్ల పెద్ద అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఈ దీపావళి.
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్! అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. క్షీర సాగర మధనంలో నుండి లక్ష్మి దేవి ఈ రోజున ఉద్భవించింది అని ఒక నమ్మకం ఉంది. దీపావళి విధివిదానం .
బలి చక్రవర్తి శ్రీలక్ష్మిని, ఇతర దేవతలను సైతం తన కారాగారంలో బంధించాడు. దీంతో విష్ణుమూర్తి వామనావతారంతో బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానం అడిగి . ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంపైన వేసి మూడవ అడుగు ఎక్కడ వెయ్యను అని అడిగిన విష్ణువుకు తన తలమీద వేయమనగా విష్ణువు తన మూడవ అడుగు బాలి తలపై వేసి, బలి చక్రవర్తిని పాతాళానికి పంపించివేసి, దేవతలను విడిపిస్తాడు. బలి చక్రవర్తిని పాతాళానికి రాజును చేసేను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా దీపావళి రాత్రి నాడు దీపాలపండుగ జరుపుకుంటారని ప్రతీతి. అందుకోసం ఇంటి ముందు కళ్ళాపి చల్లి, రంగవల్లులు తీర్చిదిద్ది అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరచి శ్రీమహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు. జ్ఞాన దృష్టితో చూస్తే, దీని అర్థం నరకాసుర మాయ. మనోవికారాలనే దీనికి పర్యాయంగా చెప్పవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలని చెబుతారు. వీటిపై విజయం సాధించడం ఎంతో కష్టం. గీతా సారంలో మాయకు మరో అర్థంగా బలిని చెప్పారు. సత్య యుగ ఆరంభానికి ప్రతీకగా తరువాతి రోజును పెద్ద దీపావళి పర్వదినంగా నిర్వహిస్తారు. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి - రాముడు 14 ఏళ్ల వనవాసం తరవాత రావణుడిని చంపి ఆయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడు రావణుడిని చంపిన రోజుని విజయదశమిగా జరుపుకుంటారు. అయోధ్యకు చేరిన రోజును దీపావళి గా జరుపుకుంటారు అని ఇంకో కధ గా వుంది. ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం.
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం. వరాహావతారంలో మహావిష్ణువుకు భూదేవికుమారుడు నరకాసురుడు. భూదేవి శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు. ఆశ్వయుజ బహుళ చతుర్దశినరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించినవరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువువధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవిసత్యభామగా జన్మిస్తుంది. నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. అనేక సంవత్సరాలు తపస్సులు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఆ వరగర్వంతో గర్వాంధుడై మానవుల్ని, దేవతలను, సాధువులను, తాపసులను హింసించేవాడు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలకు బానిసైనాడు. గోబ్రాహ్మణులను పనికట్టుకు బాధించేవాడు. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు. వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. వరబలం, మదబలం కలిసి ఉండే నరకుని వలన ముల్లోకాలు గడగడలాడాయ. విశ్వకర్మ కూతుర్ని బలాత్కరించాడు. ఇంద్రుడి మాత అదితి కుండలాలను హరించాడు. ఇక నరకుని బాధ భరించలేక బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువును శరణు కోరారు. అపుడు మహావిష్ణువు ద్వారకలో నివసించే శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకుని పీడ వదిలిస్తాడని అభయం ఇచ్చాడు.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. భూమాత ఎంత గొప్పదో కదా. కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.
ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. లోక కంటకుల వినాశనానికి గుర్తుగా, లోకాలన్నీ ఆనందించేటట్టుగా బాణాసంచా కాల్చారు. నరకుణ్ణి అజ్ఞానానికి ప్రతీకగా భావించి దాన్ని దూరం చేసామని జ్ఞానానికి ప్రతీకలైన దీపాలు వెలిగించి తమను కాపాడిన దేవదేవునకు అందరూ నమస్కరించారు. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు.
చతుర్దశికి ముందు రోజు బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఆ రోజు రాత్రి అపమృత్యువును తప్పించుకొనేదానికి ‘యమదీపం’ పెడతారు. నూనెతో దీపాన్ని వెలిగించి పూజ చేసి గుమ్మానికెదురుగా ఇంటి బయట ఉంచి, యమధర్మరాజు దయను కోరుకోవడం అందువల్ల దీనికి యమదీపం అన్న పేరు వచ్చింది. ఈ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య నాటి రాత్రి ఒకేఒక దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెం నిండా ధాన్యాన్ని నింపి, పళ్ళెం మధ్యలో ఆ వెల్గించిన దీపాన్ని పెట్టి భూమాతను పూజిస్తారు. ఆ తరువాత ఆ దివ్వెను ఇంటిలో, బయట ఆవరణ అంతా మూల మూలనా వెలుగుపడేలా త్రిప్పి తిరిగి తెచ్చి దేవునివద్ద ఉంచుతారు. ఇలాచేయడం తమలోఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని భగవంతునికి విన్నపం అన్నమాట. తరువాత ఆ దీపంతోనే అనేక దీపాలు వెలిగిస్తారు. ఇది కన్నడ దేశ పద్ధతి. బెంగాల్‌లో దీపావళి నాడు కాశీపూజ చేస్తారు. ఒరిస్సాలో దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ, కులదేవతార్చన చేసి, క్రొత్త బట్టలు కట్టుకుని సన్నగా చీల్చిన చెఱుకు పుల్లలకు దూదిని చుట్టి, నువ్వుల నూనెలో ముంచి వెలిగించి ‘పితృణం మార్గదర్శనం’’ అంటూ ఆకాశం వైపు చూపిస్తారు. మార్వాడీలు దీపావళినాడు వెండి, బంగారు నాణేలతో లక్ష్మీదేవిని పూజించి ఆ రోజునే నూతన సంవత్సరాంభం చేసి, కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. తీపి వంటకాలను చేసి బంధుమిత్రులకు విందు చేయటం, బాణసంచా కాల్చి, సంప్రదాయంగా చేస్తారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.