Blogger Widgets

ఆదివారం, ఆగస్టు 11, 2013

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా

ఆదివారం, ఆగస్టు 11, 2013

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా

సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

శనివారం, ఆగస్టు 10, 2013

శంకరంబాడి సుందరాచారిగారి జయంతి

శనివారం, ఆగస్టు 10, 2013


తెలుగు రచయిత లలో ప్రముఖుడు  ప్రసన్న కవి,  భావకవి,  అహంభావకవి,  సుందరకవి గా పేరుపొందిన  శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించారు. సుందరాచారి మా తెలుగు తల్లికి.. గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఆ పాట నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసింది . ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.


మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 
కడుపులో బంగారు కనుచూపులో కరుణ 
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి



గల గలా గోదారి కదలి పోతుంటేను 
బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 
బంగారు పంటలే పండుతాయి 
మురిపాల ముత్యాలు దొరలుతాయి



అమరావతీ నగర అపురూప శిల్పాలు 
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు 
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక



రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తీ 
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయని కీర్తి
మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక 
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ

అనే పాటను రచించిన శంకరంబాడి సుందరాచారి గారి జయంతి నేడే ఆగష్టు 10,1914 .  సుందరాచారి, 1914 ఆగష్టు 10  తిరుపతి లో జన్మించాడు. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు.  ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
శంకరంబాడి సుందరాచారి గారి జయంతి శుభాకాంక్షలు. 

గురువారం, ఆగస్టు 08, 2013

క్విట్‌ ఇండియా ఉద్యమానికి 71 సంవత్సరాలు.

గురువారం, ఆగస్టు 08, 2013

భారత దేశానికి స్వాతంత్ర్యము వచ్చి 66 సంవత్సారాలు అయ్యింది. మనకు ఈ స్వాతంత్ర్యము రావటానికి భారతీయులు చాలా కష్టపడ్డారని మనకు తెలుసు.  ఎన్నో ఉద్య్యమాలు చేసారు.  అందులో చాలా ప్రముఖమైన ఉద్యమము క్విట్‌ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్య్రోద్యమంలో అతి ప్రధాన ఘట్టం.  క్విట్‌ ఇండియా ఉద్యమం జరిగి నేటికి 71 సంవత్సరాలు పూర్తి అయ్యింది అందుకే దీనిగురించి చెప్పుకుందాం. 
ఒకదేశ ప్రజలు తమ స్వాతంత్య్రం కోసం కష్టాలు నష్టాలకు ఓర్చిఎంతవరకు  పోరాడగలరో ఎన్ని త్యాగాలు చేయగలరో 'క్విట్‌ ఇండియా ఉద్యమం ప్రపంచానికి చాటి చెప్పింది. క్రిప్స్‌ రాయబారం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు అని తెలిసి 1942 ఆగస్టు 8న కాంగ్రెస్‌ వర్కింగ్ కమిటి ముంబాయి లో  సమావేశమై స్వాతంత్య్ర పోరాటానికి చిట్టచివరిగా రూపొందించారు . ఆ ఉద్యమం తన జీవితంలో చివరిదని ఇందులో విజయమో, మరణమో తేలుతుందని మహాత్మాగాంధీజీ స్పష్టం చేసారు.   జాతిపిత మహాత్మాగాంధీ క్విట్‌ ఇండియా (ఇండియా వదిలి వెళ్లిపోండి) అనిపిలుపు నిచ్చారు. 8న ముంబాయిలో జరిగిన సదస్సులో క్విట్‌ ఇండియా తీర్మానం జరుగగా మరుసటి (ఆగస్టు 9) రోజు నుంచి పెద్ద ఎత్తున లేచింది. దేశం మొత్తం మీదా ఈ ఉద్యమం పెరిగిపోవటం తో  కాంగ్రెస్‌ ఉద్యమకారులను బ్రిటీష్‌ సైనికులు విజృంభించి చెల్లాచెదురు చేసారు. ఈ ఉద్యమం బ్రిటిష్ పాలకులకు ముచ్చెమటలు పట్టేల చేసింది.   ఈ సందర్భముగా గాంధీజీని ఆగాఖాన్‌ భవనంతో నిర్బంధించారు. ఆయనతో పాటు గాంధీగారి భార్య కాస్తురిబాయి  జైలులోనే మరణించింది.  భారత స్వాతంత్రోద్యమానికి జాతిపిత మహాత్మా గాంధీ 1916 నుండి నాయకత్వం వహించారు. సత్యం- అహింసా, సిద్దాంతాలుగా, సత్యాగ్రహం ఆయుధంగా ఆయన చెప్పిన విషయాలు యావత్‌ భారత ప్రజలకూ ఆనాటి నుండి 'గాంధీ సిద్దాంతంగా మారింది. ఆయన వ్యక్తి సత్యాగ్రహం, నిరాహారదీక్ష మొదలగు అనేక ప్రక్రియలు చేబూని వ్యక్తిగతంగా ప్రయోగాలు చేశారు. ఎన్ని చేసి ఎంత నైపుణ్యంతో బ్రిటిష్‌ పాలకులతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. బ్రిటిష్‌ పాలకులు భారతదేశ ప్రజలతోగాని, జాతీయ నాయకులతోగాని చర్చలూ, సంప్రదింపులూ కూడా జరపకుండా, ఏకపక్షంగా భారతదేశ 40కోట్ల ప్రజల్ని 1939నాడు రెండవ ప్రపంచ యుద్ద మారణ హోమంలోకి ఈడ్చారు. ఈ దుశ్చర్యతో విసిగెత్తి పోయిన బాపూజీ, 1942 ఆగస్టు 9వ తేదీన జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ కమిటి ఆమోదించిన క్విట్‌ ఇండియా (భారత్‌ చోడ్‌) డూ ఆర్‌ డై (కరో యా మరో) తీర్మానాన్ని బలపరుస్తూ, సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసంలో చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. భారతీయులకే కాక, ఎల్ల మానవాళికీ సర్వకాలాలకి వర్తించే తాత్విక సత్యాలతో పరిపక్వమైన రాజకీయ చాతుర్యాన్ని, ఎత్తుగడల్ని, రాజకీయ నైపుణ్యాన్నీ, విజ్ఞతనీ, గాంధీజీ విశ్వసించిన సిద్ధాంతాల నైతిక సూత్రాల పరిణితినీ రుజువు చేస్తున్నాయి. ప్రజాస్వామ్యంపైనా, భారత ప్రజలపైనా గాంధీజీకున్న ప్రగాఢ విశ్వాసాన్ని, నమ్మకాన్ని తదనంతర సంఘటనలు రుజువు చేసాయి. పైగా ఆయన ఇచ్చిన నినాదం 'కరో యా మరో తక్షణ కర్తవ్యంగా భారత స్వాతంత్య్ర సాధనానికి, ఆఖరి పిలుపూ, కార్యాచరణ వివరాలూ ఆ ఉపన్యాసంలో ఉన్నాయి. గాంధీజీ 'బహుశా ఇది ఆఖరిసారేమో, మనం కల్సుకోవడం అన్నపుడు ఎఐసిసి సభ్యులు బాగా  ఏడ్చేశారట. బానిసత్వంతో విసుగెత్తిపోయి, ఇంక భరించలేని ఆనాటి భారత ప్రజల యుద్ద నినాదం అది. అందుచేతనే ఆనాటి బ్రిటిష్‌ పాలకులను  ఆ ఉపన్యాసం, ఆ పోరాట నినాదం ఆయన 'డూ ఆర్‌ డై భయభ్రాంతుల్ని చేసి, ఆ ఉపన్యాసం ఇచ్చిన గంటల లోపునే గాంధీజీని ముఖ్య నాయకుల్ని ఆనాడే ఆగస్టు 9వ తేదీన అర్థరాత్రివేళ జైలుకు పంపించి నిర్భంధించారు. బ్రిటిష్‌ పార్లమెంటు చర్చల్లో గాంధీజీ ఉపన్యాసాన్ని విమర్శిస్తూ, అహింసా వాదులమని చెప్పుకొంటూ భారతదేశాన్ని హింసతో కూడిన అరాచకానికి, రక్తపాతానికి ప్రోత్సహించాడు గాంధీజీ అని ఆనాటి బ్రిటిష్‌ ప్రధాన మంత్రి సర్‌ విన్‌స్టంట్‌ చర్చిల్‌ నిందించాడు. ప్రజలకీ వార్త తెలియగానే ఉత్సాహవంతులూ, చైతన్యవంతులూ అయిన ప్రతీ భారతీయుడూ గాంధీజీ సందేశం ప్రకారం, తానే నాయకుడై యావత్తు దేశంలో బ్రిటిష్‌ పాలకులపై పోరాటాలు జరిపారు.  ఆ పోరాటంలో 5లక్షల మంది జైలు పాలైనారు. 5,000 గ్రామాలు బ్రిటిష్‌ ఊచకోతకు (ఎయిర్‌ స్ట్రాఫింగ్‌) బాంబులకు ఆహుతైనాయి).  40,000 మంది భారతమాత చరణాలపై ప్రాణాలు అర్పించారు.
  • 958 మంది దేశభక్తులకు కొరడా దెబ్బ శిక్షలు పడ్డాయి.  వేలాది గ్రమాలలో గ్రామస్వరాజ్యం స్థాపించగా, బ్రిటిష్‌ అధికారులు, తాబేదార్లూ తరిమివేయబడ్డారు. ఆగస్టు 14న పోలీసులు కాల్పులు జరిపి 76 గ్రామస్తులను కాల్చి చంపారు. 114 మందిని చావబాదారు. ఆ ప్రాంతంలో మొత్తం 60,000 మందిని అరెస్టు చేశామనీ, 940 మందిని చంపామనీ 1630 మంది క్షతగాత్రులయ్యారనీ బ్రిటీష్‌ పాలకులు ప్రకటించారు. 30 లక్షల మంది బెంగాల్‌ కరువులో మరణించారు.
  • ఎట్టకేలకు  1947 ఆగస్టు 15వ తేదీన బ్రిటిష్‌ సామ్రాజ్య పతాకం నేలకు దింపబడి భారతీయ స్వేచ్ఛా కేతనం, త్రివర్ణ పతాకం ధర్మచక్రంతో నీలాకాశాన రెపరెపలాడింది. గాంధీజీ ధర్మమా అని ఆయన నాయకత్వం వల్ల భారత ప్రజలలో స్వాతంత్య్రాపేక్ష, భయరాహిత్యం స్థిరంగా నెలకొల్ప బడ్డాయి. అందుచేతనే ఆయన ఇచ్చిన నినాదం చావోరేవో తెల్సుకొనే దృఢ నిశ్చయానికి బానిసత్వం నుండి పిరికితనం నుండి సంపూర్తిగా విడుదల చేయడానికి భారత ప్రజలను కృతనిశ్చయుల్ని చేసింది.
 క్విట్‌ ఇండియా తీర్మానం.   

మంగళవారం, ఆగస్టు 06, 2013

అలెగ్జాండర్ @ పెన్సిలిన్

మంగళవారం, ఆగస్టు 06, 2013

పెన్సిలిన్ ఇంజక్షన్ పేరు విననివారు ఉండరు. సర్వ రోగ నివారిణిగా పెన్సిలిన్ ను ఇప్పటికీ తిరుగేలేదు. ఇట్టి పెన్సిలిన్ ను కనుగొన్నవాడు అలెగ్జాండర్ ఫ్లెమింగ్. 1928 లో ఈ బాక్టీరియాలజిస్టు పెన్సిలిన్ కనుక్కొని లోకానికి గొప్ప ఉపకారం చేసిన వాడయ్యాడు.  

అలాంటి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జీవిత విశేషాలు గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాం.  

స్కాట్లాండ్‌లో 1881 ఆగస్టు 6న ఓ రైతు కుటుంబంలో ఎనిమిది సంతానంలో చివరివాడిగా పుట్టిన ఫ్లెమింగ్‌, ఏడేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాడు. అమ్మ పొలం పనులు చేస్తుంటే అక్కడి బడిలోచదివిన అతడు, ఆపై లండన్‌లో ఉండే పెద్దన్నయ్య దగ్గరకు వెళ్లి హైస్కూల్లో చేరాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి షిప్పింగ్‌ కంపెనీలో గుమాస్తాగా చేరాల్సి వచ్చింది. అనుకోకుండా ఆస్తి కలిసి రావడంతో తిరిగి ఇరవయ్యేళ్ల వయసులో చదువును కొనసాగించడం ప్రపంచానికెంతో మేలు చేకూర్చింది. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో వైద్యవిద్యలో చేరి చురుగ్గా చదువుతూనే రైఫిల్‌ షూటింగ్‌, ఈత, వాటర్‌పోలో క్రీడల్లో బహుమతులు పొందుతూ ఉండేవాడు. డిగ్రీ పొందాక పరిశోధనల్లో నిమగ్నమయ్యాడు. ఇరవై ఏళ్ల వయసులో తిరిగి చదువు మొదలెట్టి గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. గడ్డురోగాల నుంచి ప్రాణాలు కాపాడే మందు కనిపెట్టి మహోపకారం చేశాడు. ఆయన  1881 ఆగస్టు 6న జన్మించారు. అంటే ఈరోజు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పుట్టిన రోజు  .  ఈయన 1923లో లైసోజేమ్‌ అనే ఎంజైమును కనిపెట్టాడు.  1928లో పెన్సిలిన్‌ అనే యాంటిబయాటిక్‌ను కనిపెట్టాడు.  పెన్సిలిన్ లేదా పెనిసిలిన్ ఒక రకమైన మందు. ఇవి పెన్సిలియమ్ (Penicillium) అనే శిలీంద్రము నుండి తయారుచేయబడిన సూక్ష్మజీవి శకాలు(Antibiotic). వీటిని బాక్టీరియా కు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ లో విరివిగా ఉపయోగిస్తారు.  ప్రకృతిలో తయారైన కొన్ని పదార్ధాల సమ్మేళనాలను కూడా "పెనిసిలిన్" అని వ్యవహరిస్తారు.  మొదటి ప్రపంచ యుద్ధం మొదలవడంతో సైనికులకు చికిత్సలు చేసే బృందానికి నాయకత్వం వహించాడు. గాయాలకు సూక్ష్మజీవుల వల్ల ఇన్ఫెక్షన్‌ సోకి చాలా మంది సైనికులు చనిపోవడాన్ని గమనించిన ఫ్లెమింగ్‌, యుద్ధానంతరం బ్యాక్టీరియాపై పరిశోధనలు చేయసాగాడు. వాటిలో భాగంగా 'స్టెఫైలో కోకి' (Staphylo cocci) సూక్ష్మజీవులపై పరిశోధన చేస్తుండగా ఓ రోజున చిన్న పొరపాటు జరిగింది. ఆ బ్యాక్టీరియా ఉన్న పాత్రలను బల్లపై పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఆ మర్నాడు వచ్చి చూస్తే బయటి వాతావరణం ప్రభావం వల్ల ఓ పాత్రలో నీలిరంగులో బూజులాంటి తెట్టు (ఫంగస్‌) కట్టి ఉండడం గమనించాడు. చిత్రంగా ఆ బూజు ఆశించినంత మేరా పాత్రలో సూక్ష్మజీవులు నాశనమై కనిపించాయి. అంటే ఆ బూజులో సూక్ష్మజీవులను చంపే పదార్థమేదో ఉందన్నమాట! దాంతో ఫ్లెమింగ్‌ దానిపై పరిశోధనలు చేసి చిన్న కుంచెలాగా ఉండే పదార్థాన్ని వేరుచేయగలిగాడు. లాటిన్‌లో పెన్సిలియమ్‌ అంటే చిన్న కుంచె అనే అర్థం ఉండడంతో దానికి 'పెన్సిలిన్‌' అని పేరు పెట్టాడు. దాన్ని 1928లో కనిపెట్టగా, మరిన్ని పరిశోధనలు చేసి ఓ మందుగా మార్చి వాడుకలోకి తీసుకు రావడానికి 17 సంవత్సరాలు పట్టింది. దీంతో యాంటీబయాటిక్‌ యుగానికి నాంది పలికినట్టయింది. వెయ్యేళ్ల కాలంలోనే అతి గొప్ప ఆవిష్కరణగా, కోట్లాది మంది ప్రాణాలకు రక్షణగా గుర్తింపు పొందింది 'పెన్సిలిన్‌'. తొలి యాంటీ బయోటిక్‌గా పేరొందిన ఆ మందును కనిపెట్టిన శాస్త్రవేత్తే అలగ్జాండర్‌ ఫ్లెమింగ్‌. వేరే ప్రయోగం చేస్తుండగా జరిగిన చిన్న పొరపాటు వల్ల ఇది బయటపడడం విశేషం. పెన్సిలిన్‌ వల్ల క్షయ, న్యూమోనియా, టైఫాయిడ్‌ లాంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధుల నుంచి మానవాళికి రక్షణ కలుగుతోంది. దీన్ని కనిపెట్టినందుకు ఫ్లెమింగ్‌ 1945లో నోబెల్‌ బహుమతిని పొందారు.  1999లో టైమ్స్‌ పత్రిక ఫ్లెమింగ్‌ను 20వ శతాబ్దంలోని 100 ప్రముఖ వ్యక్తుల్లో ఒకరిగా కీర్తించింది.  ఫ్లెమింగ్‌ పెడింగ్టన్‌లోని సెయింట్‌ మెరీస్‌ హాస్పిటలు వైద్య పాఠశాలలలో ఎంబిబిఎస్‌ చదివారు.  ఫ్లెమింగ్‌ సిప్టమర్‌ మేరియన్‌ మెకెల్రాట్‌ అనే నర్సును పెళ్లిచేసుకున్నారు.  ఫ్లెమింగ్‌ మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్‌ ఆర్మి మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌గా పనిచేశారు. యుద్ధ భూమిలో చాలా మంది సూక్ష్మజీవుల బారినపడి చనిపోవడం ఫ్లెమింగ్‌ పెన్సిలిన్‌ కనిపెట్టడానికి ప్రేరణ.  పెన్సిలిన్‌ సృష్టి ఆధునిక వైద్యశాస్త్ర గమనాన్నే మార్చివేసింది. పెన్సిలిన్‌ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రాణాలు కాపాడింది. ఇప్పటికీ కాపాడుతూనే ఉంది.  పెన్సిలిన్‌ స్కార్లెట్‌ ఫీవర్‌, న్యుమోనియా, మెనింజైటిస్‌, డిఫ్తీరియా, గొనోరియాపై బాగా పనిచేస్తుంది.  ఫ్లెమింగ్‌కు రాయల్‌ కాలేజ్‌ ఆఫ్‌ సర్జన్స్‌, ఇంగ్లాడు హంటేరియన్‌ ప్రొఫెసర్‌ షిప్‌ ఇచ్చింది.  ఫ్లెమింగ్‌ 11.3.1955న గుండెపోటుతో మరణించారు.   వైద్యశాస్త్రంలో అద్భుతమైన యాంటీబయాటిక్ మందుగా పేరుపొందిన పెన్సిలిన్ పేరు చెప్పగానే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ దాన్ని కనిపెట్టినట్టు గుర్తొస్తాడు. 1945లో వైద్యశాస్త్రానికి నోబెల్ బహుమానం ఈ పెన్సిలిన్ కనుగొన్నందుకు ఫ్లెమింగ్ తో పాటు హొవార్డ్ ఫ్లోరె, ఎర్నెస్ట్ చెయిన్ అనే మరో ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా ఇచ్చారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ వంటి శాస్త్రవేత్తను ఆదర్సవంతముగా  .   శాస్త్రవేత్త   అంటే నాకు చాలా ఇష్టం.  నాకు మంచి inspiration గా అనిపిస్తుంది.  అలెగ్జాండర్ ఫ్లెమింగ్ జయంతి శుభాకాంక్షలు 

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)