Blogger Widgets

శనివారం, ఆగస్టు 10, 2013

శంకరంబాడి సుందరాచారిగారి జయంతి

శనివారం, ఆగస్టు 10, 2013


తెలుగు రచయిత లలో ప్రముఖుడు  ప్రసన్న కవి,  భావకవి,  అహంభావకవి,  సుందరకవి గా పేరుపొందిన  శంకరంబాడి సుందరాచారి కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తెలుగు ప్రజలకు, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి మల్లె పూదండ అందించారు. సుందరాచారి మా తెలుగు తల్లికి.. గీతాన్ని 1942 లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఆ పాట నచ్చక పోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.  ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసింది . ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించి గౌరవించింది.


మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

మా కన్న తల్లికి మంగళారతులు 
కడుపులో బంగారు కనుచూపులో కరుణ 
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి



గల గలా గోదారి కదలి పోతుంటేను 
బిల బిలా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను 
బంగారు పంటలే పండుతాయి 
మురిపాల ముత్యాలు దొరలుతాయి



అమరావతీ నగర అపురూప శిల్పాలు 
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తీయందనాలు 
నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాక



రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తీ 
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణ రాయని కీర్తి
మా చెవులు రింగుమని మారు మ్రోగేదాక 
నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం
జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ,జై తెలుగు తల్లీ

అనే పాటను రచించిన శంకరంబాడి సుందరాచారి గారి జయంతి నేడే ఆగష్టు 10,1914 .  సుందరాచారి, 1914 ఆగష్టు 10  తిరుపతి లో జన్మించాడు. మదనపల్లె లో ఇంటర్మీడియేటు వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. బ్రాహ్మణోచితములైన సంధ్యావందనము వంటి పనులు చేసేవాడు కాదాయన. తండ్రి మందలించగా జంధ్యాన్ని తెంపివేసాడు. తండ్రి మందలింపుకు కోపగించి, పంతానికి పోయి, ఇంటి నుండి బయటికి వెళ్ళి పోయాడు.
భుక్తి కొరకు ఎన్నో పనులు చేసాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పని చేసాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పని చేసాడు. ఆంధ్ర పత్రిక లో ప్రూఫు రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేసాడాయన.
అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు.  ఆంధ్ర పత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పని చేసాడు. నందనూరు లో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేసాడు.
భార్య అనారోగ్యం కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్ 8 న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు.
శంకరంబాడి సుందరాచారి గారి జయంతి శుభాకాంక్షలు. 

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Lahari.Com బ్లాగు వీక్షించినందులకు కృతఙ్ఞతలు అందుకోండి.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)