Blogger Widgets

శనివారం, నవంబర్ 02, 2013

జ్యోతి స్వరూప దీపలక్ష్మి

శనివారం, నవంబర్ 02, 2013

దీపావళి భారతీయులకు అత్యంత విశిష్టమైన ప్రీతిపాత్రమైన పండుగ. పిల్ల పెద్ద అందరూ ఆనందోత్సవాలతో జరుపుకునే పండుగ ఈ దీపావళి.  
దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది.
తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.
దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. క్షీర సాగర మధనంలో నుండి లక్ష్మి దేవి ఈ రోజున ఉద్భవించింది అని ఒక నమ్మకం ఉంది. దీపావళి విధివిదానం .  
బలి చక్రవర్తి శ్రీలక్ష్మిని, ఇతర దేవతలను సైతం తన కారాగారంలో బంధించాడు. దీంతో విష్ణుమూర్తి వామనావతారంతో బలిచక్రవర్తి దగ్గర మూడు అడుగుల నేలను దానం అడిగి .  ఒక అడుగు భూమి మీద, రెండవ అడుగు ఆకాశంపైన వేసి మూడవ అడుగు ఎక్కడ వెయ్యను అని అడిగిన విష్ణువుకు తన తలమీద వేయమనగా విష్ణువు తన మూడవ అడుగు బాలి తలపై వేసి, బలి చక్రవర్తిని పాతాళానికి పంపించివేసి, దేవతలను విడిపిస్తాడు.  బలి చక్రవర్తిని పాతాళానికి రాజును చేసేను.   ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఏటా దీపావళి రాత్రి నాడు దీపాలపండుగ జరుపుకుంటారని ప్రతీతి. అందుకోసం ఇంటి ముందు కళ్ళాపి చల్లి, రంగవల్లులు తీర్చిదిద్ది అలంకరించిన ఇంటి ముంగిటి ద్వారాలు తెరచి శ్రీమహాలక్ష్మికి స్వాగతం పలుకుతారు. జ్ఞాన దృష్టితో చూస్తే, దీని అర్థం నరకాసుర మాయ. మనోవికారాలనే దీనికి పర్యాయంగా చెప్పవచ్చు. కామ, క్రోధ, లోభ, మోహ, అహం అనే వికారాలు నరకానికి ద్వారాలని, అవి అసుర లక్షణాలని చెబుతారు. వీటిపై విజయం సాధించడం ఎంతో కష్టం. గీతా సారంలో మాయకు మరో అర్థంగా బలిని చెప్పారు.  సత్య యుగ ఆరంభానికి ప్రతీకగా తరువాతి రోజును పెద్ద దీపావళి పర్వదినంగా నిర్వహిస్తారు. జ్ఞానికి చిహ్నంగా, ఐశ్వర్యానికి సంకేతంగా, సంపద ఆనందాలకు ప్రతీక అయిన దీపాన్ని ఆరాధిస్తూ చేసే పర్వదినమైన దీపావళి రోజున లక్ష్మీ దేవిని మహిళలు ఎంతో భక్తి శ్రద్దలతో పూజిస్తారు. నరకాసుర సంహారం జరిగినందుకు ఆనంద సూచకంగా జరుపుకునే ఈ పండుగ , మార్వాడీలకు ఈ రోజు లక్ష్మీ పూజా దినం. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని మహిళలు ఎక్కువగా నమ్ముతారు. దీప అంటే దీపం అని, ఆవళి అంటే వరుస... దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి పండగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి - రాముడు 14 ఏళ్ల వనవాసం తరవాత రావణుడిని చంపి ఆయోధ్యకు తిరిగి వస్తాడు. రాముడు రావణుడిని చంపిన రోజుని విజయదశమిగా జరుపుకుంటారు. అయోధ్యకు చేరిన రోజును దీపావళి గా జరుపుకుంటారు అని ఇంకో కధ గా వుంది.  ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు మహిళలు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 'చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్ ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్" అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం.
దీపావళి ని ఎంతో  జరుపుకోండి. 
దీపావళి శుభాకాంక్షలు 
 అందరికి దీపావళి శుభాకాంక్షలు. 

నరక చతుర్దశి

ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గురించి తెలుసుకుందాం.  వరాహావతారంలో మహావిష్ణువుకు భూదేవి  కుమారుడు నరకాసురుడు.  భూదేవి  శాపవశమున నరకాసురుడు శ్రీ కృష్ణుని తో సంహరించబడతాడు. నరకాసురుడు వృత్తాంతం మహాభాగవతము దశమ స్కందం ఉత్తర భాగములొ వస్తుంది. నరకాసురిడి సంహారం జరిగిన రోజు నరక చతుర్దశి జరుపుకొంటారు హిందువులు. తరువాతి రోజుని దీపావళి జరుపుకొంటారు.  ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి గా ప్రసిద్ధి పొందింది. 
కృతయుగం లో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి కి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనామహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామ గా జన్మిస్తుంది.
నరకాసురుడు ప్రాగ్-జ్యోతిషపురం అనే రాజ్యానికి రాజు. ప్రస్థుతం అది అస్సాంలోని గౌహతి ప్రాంతం. అనేక సంవత్సరాలు తపస్సులు చేసి బ్రహ్మ చేత వరాలు పొందాడు. ఆ వరగర్వంతో గర్వాంధుడై మానవుల్ని, దేవతలను, సాధువులను, తాపసులను హింసించేవాడు. కామ, క్రోధ, లోభ, మదమాత్సర్యాలకు బానిసైనాడు. గోబ్రాహ్మణులను పనికట్టుకు బాధించేవాడు. పదహారువేల మంది స్ర్తిలను చెరబట్టినాడు. దైవ దూషణ మితిమీరి చేసేవాడు. వీని దుష్టచేష్టలను భరించలేక భూదేవి మహావిష్ణువు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకుంది. వరబలం, మదబలం కలిసి ఉండే నరకుని వలన ముల్లోకాలు గడగడలాడాయ. విశ్వకర్మ కూతుర్ని బలాత్కరించాడు. ఇంద్రుడి మాత అదితి కుండలాలను హరించాడు. ఇక నరకుని బాధ భరించలేక బ్రహ్మాదిదేవతలు మహావిష్ణువును శరణు కోరారు. అపుడు మహావిష్ణువు ద్వారకలో నివసించే శ్రీకృష్ణుడు సత్యభామతో కలసి నరకుని పీడ వదిలిస్తాడని అభయం ఇచ్చాడు.
అప్పటికి నరకాసురుడు లోక కంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్యజరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు.   భూమాత ఎంత గొప్పదో కదా.  కొడుకు లోకకంతకుడు అని తెలిసి క్షమించకుండా మరణశిక్ష విధించింది.   
 ఆరోజే ఆశ్వీజమాస కృష్ణపక్ష చతుర్దశి. అదే నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది. లోక కంటకుల వినాశనానికి గుర్తుగా, లోకాలన్నీ ఆనందించేటట్టుగా బాణాసంచా కాల్చారు. నరకుణ్ణి అజ్ఞానానికి ప్రతీకగా భావించి దాన్ని దూరం చేసామని జ్ఞానానికి ప్రతీకలైన దీపాలు వెలిగించి తమను కాపాడిన దేవదేవునకు అందరూ నమస్కరించారు. ఆ నరకుని పీడ వదిలిన సందర్భంగా చతుర్ధశి తెల్లవారు జామున ‘చతుర్వత్తుల’ దీపం వెల్గించి యమధర్మరాజునుద్దేశించి తర్పణం వదలుతారు. ఈ పండుగను దక్షిణ భారతదేశంలో నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి అని మూడు రోజులు జరుపుకొంటారు. ఉత్తర భారతంలో ధనత్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమ ద్వితీయ అని ఐదు రోజులు జరుపుకొంటారు.
చతుర్దశికి ముందు రోజు బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అంటారు. ఆ రోజు రాత్రి అపమృత్యువును తప్పించుకొనేదానికి ‘యమదీపం’ పెడతారు. నూనెతో దీపాన్ని వెలిగించి పూజ చేసి గుమ్మానికెదురుగా ఇంటి బయట ఉంచి, యమధర్మరాజు దయను కోరుకోవడం అందువల్ల దీనికి యమదీపం అన్న పేరు వచ్చింది. ఈ చతుర్దశి తర్వాత వచ్చే అమావాస్య నాటి రాత్రి ఒకేఒక దీపాన్ని వెలిగించి ఒక పళ్ళెం నిండా ధాన్యాన్ని నింపి, పళ్ళెం మధ్యలో ఆ వెల్గించిన దీపాన్ని పెట్టి భూమాతను పూజిస్తారు. ఆ తరువాత ఆ దివ్వెను ఇంటిలో, బయట ఆవరణ అంతా మూల మూలనా వెలుగుపడేలా త్రిప్పి తిరిగి తెచ్చి దేవునివద్ద ఉంచుతారు. ఇలాచేయడం తమలోఉన్న అజ్ఞానాంధకారాన్ని పారద్రోలమని భగవంతునికి విన్నపం అన్నమాట. తరువాత ఆ దీపంతోనే అనేక దీపాలు వెలిగిస్తారు. ఇది కన్నడ దేశ పద్ధతి. బెంగాల్‌లో దీపావళి నాడు కాశీపూజ చేస్తారు. ఒరిస్సాలో దీపావళి నాటి రాత్రి లక్ష్మీపూజ, కులదేవతార్చన చేసి, క్రొత్త బట్టలు కట్టుకుని సన్నగా చీల్చిన చెఱుకు పుల్లలకు దూదిని చుట్టి, నువ్వుల నూనెలో ముంచి వెలిగించి ‘పితృణం మార్గదర్శనం’’ అంటూ ఆకాశం వైపు చూపిస్తారు. మార్వాడీలు దీపావళినాడు వెండి, బంగారు నాణేలతో లక్ష్మీదేవిని పూజించి ఆ రోజునే నూతన సంవత్సరాంభం చేసి, కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు.  తీపి వంటకాలను చేసి బంధుమిత్రులకు విందు చేయటం, బాణసంచా కాల్చి,  సంప్రదాయంగా చేస్తారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.  

శుక్రవారం, నవంబర్ 01, 2013

"ఆంధ్రా షెల్లీ" జయంతి శుభాకాంక్షలు.

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు జయంతి నేడే తెలుగు సాహితీ ప్రియులందరికీ శుభాకాంక్షలు. 
 మావి చిగురు తినగానే కోయిల పలికేనా,   ఆకులో ఆకునై, పూవులో పూవునై, గోరింట పూచింది కొమ్మ లేకుండా, ఆరనీకుమా ఈ దీపం,  ప్రతి రాత్రి వసంత రాత్రి , పాడనా తెనుగు పాట, ఇది మల్లెల వేళయనీ,  ఎవరు నేర్పేరమ్మ... ఈ కొమ్మకు  ఈ పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి కవితా ప్రస్థానంలోనూ, తెలుగు సాహితీ చరిత్రలోనూ ఒక ముఖ్యమైన పాటలు . దేవులపల్లి కృష్ణశాస్త్రి తూర్పు గోదావరి జిల్లాపిఠాపురం దగ్గరలోని రామచంద్రపాలెం అనే గ్రామంలో ఒక పండిత కుటుంబంలో1897 నవంబరు 1న జన్మించాడు. అతని తండ్రి, పెదతండ్రి గొప్ప పండితులు. వారింట్లో నిరంతరం ఏదో సాహిత్యగోష్టి జరుగుతూ ఉండేది. కృష్ణశాస్త్రి చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. ఒకసారి ఆయన బెజవాడ నుండి బళ్ళారికి రైలులో వెళుతుండగా చుట్టూ ఉన్న పొలాల సౌందర్యానికీ, రైలు లయకూ పరవశించి "ఆకులో ఆకునై, పూవులో పూవునై" అని పలవరించారట. అది తెలుగు భావకవితా యుగంలో ఒక ముఖ్య క్షణం.   కృష్ణశాస్త్రి గారి పాటలు అన్ని అమృత గుళికలే.  ఈయన ఆధునికాంద్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిబావంతుడైన రచయిత.  భావకవిత్వపు, ప్రచారకుడు క్రుష్ణపక్షానికి వెలలేని వెన్నెల వెలుగులు అందించిన చంద్రుడు.   తెలుగుకు వెలుగులు తెచ్చి సూటిదనాన్ని, సున్నితత్వాన్ని సాహిత్యపు కమ్మని రుచిని అందించిన ఆధునిక బావకవి దేవులపల్లి వారు. శ్రీ  దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రసిద్ధ తెలుగు కవి. తెలుగు భావ కవితారంగంలో కృష్ణశాస్త్రి ఒక ప్రముఖ అధ్యాయం. చిన్న వయసునుండే రచనలు ఆరంభించాడు. 1929 లో రవీంద్రనాధ టాగూరును కలసిన తరువాత ఆయన కవిత్వంలో భావుకత వెల్లివిరిసింది. 1945లో ఆకాశవాణిలో చేరి అనేక పాటలు, నాటికలు రచించాడు.
భావ కవిగా, ‘ఆంధ్రా షెల్లీ ’గా ప్రసిద్ధులైన దేవులపల్లి వేంకట కృష్ణశాస్ర్తి గారు రచించిన మంచి దేశభక్తి గీతం  

పల్లవి :
జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్త్ర
నరనారీ హృదయనేత్రి ||| జయ జయ జయ |||


చరణం 1 :

జయ జయ సశ్యామల
సుశ్యామల చలచ్ఛేలాంచల
జయ వసంత కుసుమ లతా
చలిత లలిత చూర్ణకుంతల
జయ మదీయ హృదయశయ
లక్షారుణ పద యుగళ ||| జయ జయ జయ |||


చరణం 2 :

జయ దిశాంత గత శకుంత
దివ్యగాన పరిశోధన
జయ గాయక వైతాళిక
కల విశాల పద విహరిణి
జయ మదీయ మధుర గేయ
చుంబిత సుందర చరణ ||| జయ జయ జయ |||

"ధన్వంతరి"

ఈరోజు ధన్వంతరి జయంతి.   ఈరోజును ఆయుర్వేద వైద్యులు ధన్వంతరి జయంతిని ఘనంగా జరుపుకుంటారు.  ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు. 
ధన్వంతరి అన్న పేరు మన భారతదేశ సంస్కృతీ సాంప్రదాయాలు తెలిసిన ప్రతీ ఒక్కరికి తెలుసు . ధన్వంతరి అవతారం గురించి నాలుగు రకాలుగా చెప్తారు.  ఒకటేమో భాగవతంలో క్షీరసాగర మధనం సమయంలో అమృత కలశాన్ని చేబట్టుకొని అవతరించిన శ్రీమహావిష్ణువు అవతారం. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం సూర్యభగవానుని వద్ద ఆయుర్వేదం నేర్చుకొన్న విద్యార్ధులలో ధన్వంతరి ఒక్కరు. సూర్యుని 16 మంది శిష్యులలో ఒకడు.  కాశీరాజు దేవదాసు ధన్వంతరి (అంటే "ధన్వంతరి" అన్న బిరుదు కలిగిన కాశీరాజు "దేవదాసు") ఇతడు శుశ్రుతునికి ఆయుర్వేదం, శస్త్ర చికిత్స నేర్పాడు. ఇతడు పురాణాలలో చెప్పబడిన ధన్వంతరి అవతారమన్న విశ్వాసం ఉంది.  విక్రమాదిత్యుని ఆస్థానంలో "నవరత్నాలు"గా ప్రసిద్ధులైన పండితప్రతిభామూర్తులలో ఒకడు. ఇతడే "ధన్వంతరి నిఘంటువు" అనే వైద్య పరిభాషిక పదకోశ గ్రంధాన్ని రచించాడని ఒక అభిప్రాయం కూడా వుంది.  పూర్వకాలంలో గొప్ప గొప్ప ఆయుర్వేద వైద్యులను "ధన్వంతరి" అనే బిరుదుతో సత్కరించేవారు. ధన్వన్తరి శబ్దానికి "ధనుఃశల్యం, తస్య అంతం పారం ఇయర్తి, గచ్ఛతీతి, ధన్వన్తరిః" అని వ్యుత్పత్తి  చెప్పబడింది. మనస్సు మరియు శరీరానికి బాధను కలిగించే శల్యములను అనగా దోషాలు, రోగాలు, శరీరంలోపల వికృతులు, అఘాతాలు, వ్రణాలు మొదలైన వాటిని నివారించే వానిగా చెప్పవచ్చును. పురాతనకాలం నుంచి భారతదేశంలో శస్త్ర చికిత్సా కుశలులైన వారికి "ధాన్వన్తరీయులు" అని వ్యవహరించడం వాడుకలో ఉన్నది.భాగవతం అష్టమ స్కంధంలో క్షీరసాగర మధనం సమయాన ముందుగా హాలాహలం ఉద్భవించింది. దానిని మహాదేవుడు హరించాడు. కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, పారిజాతం, అప్సరసలు అవతరించారు. లక్ష్మీదేవి  అవతరించి విష్ణువును చేరింది. తరువాత ధన్వంతరి అవతరించాడు. 
"అప్పుడు సాగర గర్భంనుండి ఒక పురుషుడు, పీనాయుత బాహు దండాలను, కంబుకంఠాన్ని, పద్మారుణ లోచనాలను, విశాల వక్షఃప్రదేశాన్ని, సుస్నిగ్ధ కేశజాలాన్ని, నీల గాత్ర తేజాన్ని కలిగి, పీతాంబరం కట్టి, మణికుండలాలు ధరించి, పుష్పమాలా సమలంకృతుడై, హస్తతలాన అమృత కలశాన్ని దాల్చినవాడు ఆవిర్భవించాడు. అతని విష్ణుదేవుని అంశాంశ వలన పుట్టినవాడని, యజ్ఞభాగ భోజనుడు, ఆయుర్వేదజ్ఞుడు, మహనీయుడని బ్రహ్మాదులు గ్రహించి అతనికి "ధన్వంతరి" అని పేరు పెట్టినారు.

My Blog Lovers

నా యూట్యూబ్ చానల్స్ ప్లీజ్ సబ్స్క్రిబ్ చేయండీ

Diabetic Challenger

DIABETIC CHALLENGER YOUTUBE CHANNEL. PLASE SUBSCRIBE MY CHANNEL...... THANK YOU VERY MUCH.

Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను

Please subscribe our channel Ammamma Tho Nenu (అమ్మమ్మ తో నేను)